#BeyondFakeNews : రాజకీయాలు, ఎన్నికలపై ఫేక్ న్యూస్ ప్రభావం ఎంత ?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నవీన్ నేగి
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘భారతదేశపు జెండా ప్రపంచంలోనే అత్యుత్తమ జెండా అని ప్రకటించారు’ లేదా ‘భారతదేశపు కరెన్సీని యునెస్కో అత్యుత్తమ కరెన్సీ అని ప్రకటించింది’ అంటూ మీకు కూడా వాట్సాప్ మెసేజ్ వచ్చి ఉండొచ్చు.
సాధారణంగా, ఇలాంటి మెసేజ్‌లు వచ్చినపుడు మనం నిజానిజాలను నిర్ధారించుకోకుండానే వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసిన మనకు తెలియకుండా ఫేక్ న్యూస్ వ్యాప్తికి తోడ్పడుతుంటాం.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫేక్ న్యూస్ బెడద ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బీబీసీ చేపట్టిన ఒక పరిశోధనలో జాతీయవాదం పేరిట ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్నారని వెల్లడైంది.
#BeyondFakeNews ఫేక్ న్యూస్ ప్రాజెక్ట్ పేరిట బీబీసీ ఈ పరిశోధన నిర్వహించింది. ఫేక్ న్యూస్ వ్యాప్తికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో బీబీసీ చేపట్టిన కార్యక్రమం ఇది.
ఆ పరిశోధనలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ హ్యాండిల్ ఫాలో అవుతున్న అకౌంట్లలో 56 శాతం వెరిఫైడ్ అకౌంట్లు కాదని తేలింది.
బీబీసీ పరిశోధనలపై బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్, ''నిజమే, ఫేక్ న్యూస్ చాలా పెద్ద సమస్య. త్వరలో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఇదింకా పెద్ద సవాలు. 2019 ఎన్నికల కోసం చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నారు. వాళ్ల పని ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేయడమే'' అన్నారు.
ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ప్రతిపక్షాలు ఏ ఆరోపణలైనా చేస్తాయని, ఎలాంటి వార్తలైనా పోస్ట్ చేస్తాయని ఆయన తెలిపారు.
''కొన్నిసార్లు గోరక్షణ పేరుతో మరికొన్నిసార్లు దళితుల పేరుతో ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్నారు.'' అని ఆయన అన్నారు.
అయితే ఇలాంటి వార్తలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు, అందిరిదీ అన్నారాయన.
వాటిని నియంత్రించడం కష్టమనేది ఆయన అభిప్రాయం.

ఫొటో సోర్స్, Getty Images
నిజానికి సోషల్ మీడియా అనేది సమాచార వ్యాప్తికి అత్యంత సులభమైన, తక్కువ ఖర్చు మాధ్యమం. కానీ ఫేక్ న్యూస్ కారణంగా అది దాని విశ్వసనీయతను కోల్పోతోంది.
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో ఆ రాష్ట్రాల ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు. ఈ కారణం వల్ల రాబోయే రోజుల్లో ఫేక్ న్యూస్ మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది.
మరి దీనికి అడ్డుకట్ట వేయడానికి రాజకీయ పార్టీలు ఏం చేయబోతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది, ''ఫేక్ న్యూస్ కారణంగా అల్లర్లు తలెత్తే ప్రమాదం ఏర్పడుతోంది. వాటి కారణంగా బంద్ లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. రాబోయే కాలం మనకు పెద్ద సవాలు. ఫేక్ న్యూస్ పై దేశం, సమాజం మొత్తం సీరియస్‌గా ఆలోచించాలి. ఫేక్ న్యూస్ కోసం ప్రత్యేక అకౌంట్లను, వెబ్ సైట్లను సృష్టిస్తున్నారు. అనేక పత్రికలు కూడా ఫేక్ న్యూస్ వార్తలను ప్రచురిస్తున్నాయి.'' అన్నారు.
బీబీసీ సోమవారం భారతదేశంలోని ఏడు ప్రధాన నగరాలు.. దిల్లీ, లక్నో, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, అమృత్ సర్, పుణెలలో ఫేక్ న్యూస్‌పై అవగాహనా సదస్సులు నిర్వహించింది.
ఈ సదస్సులో రాజకీయాలు, జర్నలిజం, చిత్ర పరిశ్రమ, సోషల్ మీడియాతో సంబంధం కలిగిన అనేక మంది పాల్గొన్నారు. పాల్గొన్న వారంతా కూడా ఫేక్ న్యూస్ ఒక పెద్ద సవాలు అని అంగీకరించారు.

దిల్లీ ఐఐటీలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న నటి స్వరభాస్కర్, ''నేడు మనం దేశంలోని ప్రముఖ సంస్థలు కూడా ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్న పరిస్థితుల మధ్య ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినీ విశ్వసించలేకున్నాం. జనం పొట్టపోసుకోవడానికి పని చేసుకుంటూ జీవితం గడపాలా లేక వచ్చిన వార్తలలో ఏది తప్పు, ఏది కాదు అని చెక్ చేసుకుంటూ కూర్చోవాలా?'' అన్నారు.
చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో నటుడు ప్రకాశ్ రాజ్.. రోజురోజుకీ ఫేక్ న్యూస్ పెరిగిపోతున్నాయని అన్నారు.
బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్.. భారతదేశంలో ఫేక్ న్యూస్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. 2019లో బీబీసీ రియాలిటీ చెక్ పేరిట మరో కార్యక్రమాన్ని చేపడుతుందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









