కరోనావైరస్: పాకిస్తాన్‌లో పేషెంట్లకు డాక్టర్లు విషమిచ్చి చంపుతున్నారా? వైద్యుల మీద జనం ఎందుకు దాడులు చేస్తున్నారు?

జిన్నా ఆస్పత్రి

ఫొటో సోర్స్, JPMC

ఫొటో క్యాప్షన్, కరాచీలోని జిన్నా మెడికల్ సెంటర్‌లో కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు
    • రచయిత, సికందర్ కిర్మాణి
    • హోదా, బీబీసీ న్యూస్

ఇప్పటికే బలహీనంగా ఉన్న పాకిస్తాన్ ఆరోగ్య వ్యవస్థ త్వరలో మరో పెను సవాల్‌ను ఎదుర్కోబోతోందని ఆ దేశ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దేశం మొత్తం కోవిడ్‌-19 పేషంట్లమయం కాబోతోందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పాకిస్థాన్‌లో మొదట భయపడినంత స్థాయిలో మరణాలు లేవు. ఇప్పటి వరకు దేశంలో 2,000 కన్నా తక్కువ మందే మృత్యువాతపడ్డారు. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం వల్ల కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రధాన ఆసుపత్రులలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లన్నీఇప్పటికే నిండిపోయాయని డాక్టర్లు చెబుతున్నారు.

ఒక్క కరాచీ నగరాన్నే తీసుకుంటే దాదాపు కోటి 50 లక్షలమంది జనాభా ఉండగా కేవలం వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన ఆసుపత్రులలో మాత్రమే కోవిడ్‌-19 కోసం ఐసీయూలు అందుబాటులో ఉన్నాయి. ఇక లాహోర్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ''వెంటిలేటర్‌ కోసం రెండు మూడు ఆసుపత్రులకు తిరిగి మా దగ్గరికి వచ్చిన ఓ పేషెంట్‌ను మేం తిప్పి పంపించాం'' అని ఓ డాక్టర్‌ తన అనుభవాన్ని బీబీసీతో చెప్పారు. పెషావర్‌, క్వెట్టా నగరాలలో కూడా ఇదే పరిస్థితి ఉందని కొందరు డాక్టర్లు చెబుతున్నారు.

అయితే కరాచీ అధికారులు మాత్రం చాలా ఆసుపత్రులు నిండిపోయినప్పటికీ ప్రజలకు ఇంకా బెడ్స్‌ అందుబాటులోనే ఉన్నాయని చెబుతున్నారు. ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో ప్రజలకు వివరిస్తున్నామని, మరికొన్ని ఆసుపత్రులలో ఎక్కువమంది పేషెంట్లకు చికిత్స చేసేందుకు వసతులను సిద్ధం చేస్తున్నామని చెబుతున్నారు.

క్రిటికల్‌ కేసులు ఇలాగే పెరుగుతూ పోతే, మా ప్రయత్నాలన్నీ కుట్ర సిద్ధాంతాలు, అపనమ్మకాలతో వృథా అవుతాయని వాపోతున్నారు. ''చాలామంది ఇళ్ల దగ్గరే ఉండాలని అనుకుంటున్నారు. పరిస్థితి మరీ బాగాలేని వారే ఆసుపత్రులకు వస్తున్నారు'' అని క్వెట్టాకు చెందిన ప్రముఖ డాక్టర్‌ ఒకరు బీబీసీకి చెప్పారు. ‘‘అంబులెన్స్‌ దించిన కాసేపటికే కొందరు పేషెంట్లు చనిపోతున్నారు. మాకు చికిత్స చేసే అవకాశమే లభించటం లేదు'' అని ఆ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశారు.

పాకిస్తాన్ ఆస్పత్రి

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, కరాచీ జిన్నా ఆస్పత్రి మీద ఓ రోగి బంధువులు దాడి చేశారు

ఒకపక్క మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండకపోవడం, మరోవైపు చాలామంది క్వారంటైన్‌కు సంసిద్ధంగా లేకపోవడంతో వైద్యుల మీద రూమర్లు, ఆరోపణలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ సోకక పోయినా సోకిందని చెప్పినందుకు వరల్డ్ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కొందరు డాక్టర్లకు డబ్బు ఇస్తోందని కూడా ప్రచారం జరుగుతోంది.

పేరు చెప్పడానికి ఇష్టపడని కరాచీకి చెందిన వైద్యురాలు ఒకరు తన స్నేహితురాలితో జరిగిన సంభాషణను బీబీసీకి వివరించారు. వైద్య సలహా కోసం వచ్చిన ఆమె స్నేహితురాలు ''నా కొడుక్కి జ్వరం ఉంది. కానీ నేను ఆసుపత్రికి వెళ్లదలుచుకోలేదు. వాళ్లు (డాక్టర్లు) ఏ జ్వరం వచ్చినా దాన్ని కోవిడ్‌-19గా ప్రకటిస్తున్నారు. ప్రతి కేసుకు వారికి రూ. 500 ముడుతున్నాయి'' అని ఆ డాక్టర్‌తో అన్నారట.

ఇలాంటి కుట్ర సిద్ధాంతాలు క్రమంగా పెరుగుతున్నాయి. వాటివల్ల పరిణామాలు కూడా సీరియస్‌గా మారుతున్నాయి. పేషెంట్లకే కాదు డాక్టర్ల పరిస్థితి కూడా దారుణంగా మారుతోంది. కరాచీ, పెషావర్‌, లాహోర్‌ నగరాలలో పలువురు వైద్య సిబ్బందిపై ఇవే ఆరోపణలతో దాడులు కూడా జరిగాయి.

ఒక రోగి మృతదేహాన్ని వెంటనే ఇవ్వలేదన్న ఆగ్రహంతో కరాచీలోని జిన్నా పోస్ట్‌ గ్రాడ్యుయేట్ మెడికల్‌ కాలేజీ ఐసోలేషన్‌ వార్డ్‌పై రోగి బంధువులు దాడి చేశారు. ఎవరైనా ముస్లిం వ్యక్తి మరణిస్తే ఇస్లామిక్‌ సంప్రదాయం ప్రకారం వెంటనే ఖననం చేస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. కానీ కరోనా వైరస్‌ ఉన్న రోగులకు ఇలాంటివి చేయడం ప్రమాదం.

''వైద్య సిబ్బంది ఇటు కరోనా వైరస్‌తో, అటు అజ్జానంతో పోరాడుతున్నారు '' అని డాక్టర్‌ యాహ్య తునియో బీబీసీతో అన్నారు.

రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో వార్డుల్లో భద్రతను పెంచామని లాహోర్‌లోని మేయో హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్‌ జమాల్‌ అవాన్‌ బీబీసీకి చెప్పారు. సరైన సదుపాయాలు లేకపోవడంపై పెల్లుబికిన ఆగ్రహం, ఆవేదనల మిశ్రమంగానే ఈ దాడులు జరుగుతున్నాయి.

''పేషెంట్లకు వైద్య సిబ్బంది విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేస్తున్నారని కొందరు అనుమానిస్తున్నారు'' అని ఆ డాక్టర్‌ వెల్లడించారు.

డాక్టర్ అమర ఖలీద్

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, మరో రోగి బంధువులు దాడి చేసినపుడు డాక్టర్ అమర ఖలీద్ ఆస్పత్రిలో ఉన్నారు

ఒక సంఘటనలో ఓ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్‌కు ఐసీయూలో చికిత్స అవసరమైంది. కానీ ఐసీయూ అందుబాటులో లేదని వారిని తిప్పి పంపించారు. తర్వాత కాసేపటికి ఆ పెషెంట్‌ చనిపోయారు. దీంతో ఆ రోగికి సంబంధించిన 20-30 మంది మనుషులు వచ్చి ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటన గురించి అమర ఖలీద్‌ అనే వైద్యురాలు బీబీసీకి వివరించారు. ''కరోనా వైరస్‌ నిజమైతే మరి మీకెందుకు రాలేదు'' అని వారు నినాదాలు చేస్తూ ప్రశ్నించారని ఆమె చెప్పారు.

ఆమె భర్త కూడా అదే ఆసుపత్రిలో పని చేస్తున్నారు. ఆయన్ను కొందరు వ్యక్తులు వార్డుకు లాక్కెళ్లి, ఎలాంటి సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ లేకుండానే రోగికి సీపీఆర్‌ నిర్వహించాల్సిందిగా ఒత్తిడి చేశారని ఆమె వెల్లడించారు. ‘‘ఇక్కడ భద్రత పెంచాలి. ప్రజల్లో అవకగాహన పెంచాలి. ఆసుపత్రిలోకి వచ్చే రోగుల బంధువుల సంఖ్యపై కూడా నిబంధనలు విధించాల్సి ఉంది’’ అని డాక్టర్ ఖలీద్ అన్నారు.

''అదో భయంకరమైన ఘటన. దీని తర్వాత మేం అసలు ఈ డాక్టర్‌ జాబ్‌ను వదిలేద్దామనుకున్నాం. కానీ వదిలేయలేకపోయాం. అందరూ వెళ్లిపోతే ఈ పనిని ఎవరు చేస్తారు?'' అని ఆమె పేర్కొన్నారు.

వాస్తవానికి పాకిస్థాన్‌‌లో కొన్ని వందల మంది డాక్టర్లు కరోనా వైరస్‌ బారినపడ్డారు. కనీసం 30 మంది వైద్య సిబ్బంది ఈ వ్యాధితో చనిపోయారు. వైద్య సిబ్బంది మొత్తానికి వైరస్‌ సోకడంతో పెషావర్‌లోని ప్రముఖ ఆసుపత్రికి చెందిన గైనకాలజీ డిపార్ట్‌మెంట్ మొత్తాన్ని తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. తన సహోద్యోగులు దాదాపు వంద మంది ఈ వ్యాధిబారిన పడ్డారని, కానీ వారెవరికీ కరోనా పేషెంట్లతో సంబంధం లేదని ఆ ఆసుపత్రికి చెందిన ఓ వైద్యుడు బీబీసీకి చెప్పారు.

వైద్యులకు రక్షణ సదుపాయలు పెరిగినా ఇంకా కొరత ఉందని, ఇప్పటికీ తాను షిఫ్టు మారిన తన సహచరుడి ఫేస్‌మాస్క్‌నే ధరించాల్సి వస్తోందని ఓ డాక్టర్‌ చెప్పారు. వైద్యులు కరోనాపై పోరాడుతున్నారని చెబుతున్నారు. కానీ తమకు వారు టెస్టు చేసుకోడానికి సౌకర్యాలు లేవు. వారిలో చాలామందికి వైరస్‌ సోకి ఉంటుంది. అలా సోకినట్లు వారికి తెలియదు.

ఒకపక్క భవిష్యత్తులో మరింత సంక్షోభం ఉంటుందని భయం వ్యక్తమవుతుండగా, లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం వైద్య సిబ్బందిలో అసహనాన్ని పెంచుతోంది.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఆస్పత్రుల్లో జనం మామూలుగా తిరుగుతుండటం డాక్టర్లకు ఆందోళన కలిగిస్తోంది

కరోనావైరస్‌ రాక ముందు కూడా ఇక్కడ వెంటిలేటర్ల కొరత ఉందని, వాటి కోసం చాలామంది అభ్యర్ధనలు చేసేవాళ్లని లాహోర్‌లోని మేయో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ రిజ్వాన్ సైగల్ బీబీసీకి చెప్పారు. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వైరస్‌ తీవ్రత పెరుగుతోంది. ''కొన్నాళ్లకు ఆసుపత్రులు కూడా చేతులెత్తేస్తాయి. ఎందుకంటే మా దగ్గర ఐసీయూలు, వెంటిలేటర్లు లేవు'' అని రిజ్వాన్‌ పేర్కొన్నారు.

అయితే ప్రధానమంత్రి ఇమ్రాన్‌‌ఖాన్‌ మాత్రం లాక్‌డౌన్ కారణంగా దేశంలో పేదల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోందని అందుకే లాక్‌డౌన్‌ తొలగిస్తున్నట్లు చెప్పారు. ''25 శాతం మంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. అంటే దాదాపు 5 కోట్ల మందికి ప్రజలకు ప్రతి రోజూ అన్నం దొరికే పరిస్థితి లేదు. మనం వూహాన్‌, యూరప్‌లలాగే లాక్‌డౌన్‌ కొనసాగిస్తే వారంతా ఏమవుతారు?'' అని టెలివిజన్‌ ప్రసంగంలో ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రజలకు సూచించారు. అయితే తన ప్రత్యర్ధులు అధికారంలో ఉన్న సింధ్‌ ప్రావిన్స్‌ లాంటి ప్రాంతాల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

''లాక్‌డౌన్‌ తొలగించాక, కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది'' అని కరాచీలోని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్‌లో పని చేస్తున్న డాక్టర్‌ యాహ్యా తునియోతో పాటు అనేక మంది వైద్య సిబ్బంది చెబుతున్నారు. ''నగరంలోనే అతి పెద్ద ఆసుపత్రిలో ఐసీయూ బెడ్లు నిండిపోయాయి. కొత్తగా వస్తున్న పేషెంట్లను వేరే ప్రాంతాలకు పంపిస్తున్నాం. కానీ అక్కడ కూడా పరిస్థితులు గొప్పగా లేవు'' అని డాక్టర్‌ యాహ్య అన్నారు.

ఇళ్లలో తమ బంధువులకు కూడా వైరస్‌ సోకుతోందని కరాచీకి చెందని ఓ మహిళా మెడికో ఆందోళన వ్యక్తం చేశారు. విధుల్లో ఎక్కువ గంటలు గడపాల్సి రావడం, అందులోనూ సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ తొడుక్కుని పని చేయడం వల్ల అలసి పోతున్నామని ఆమె చెప్పారు. వీధుల్లో తిరుగుతున్న జనాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేశారామె. ''పరిస్థితులు గుండెలను మెలిపెడుతున్నాయి. వీళ్లంతా జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతున్నారు. ఇంకా మేం లంచాలు తీసుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. ఇది దారుణం'' అన్నారామె.

''అయినా మేం ఇంకా వారి కోసం పని చేస్తూనే ఉన్నాం'' అని ఆ మహిళా మెడికో అన్నారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)