కరోనావైరస్‌ వ్యాక్సిన్‌‌ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...

ఎబోలా వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జస్టిన్ హార్పర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రాణాంతక కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచమంతటినీ భయపెడుతోంది. ఈ వైరస్ వల్ల వచ్చే వ్యాధికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్-19 అని పేరు కూడా పెట్టింది.

బిలియన్ల కొద్దీ వ్యాపారం జరిగే అవకాశం ఉంది కాబట్టి భారీ ఫార్మా సంస్థలు వెంటనే దీనికి వ్యాక్సిన్‌ను రూపొందించే పనిలో పడి ఉంటాయని చాలా మంది అనుకుంటుంటారు.

కానీ, వాస్తవ పరిస్థితి అలా లేదు.

అంతర్జాతీయ వ్యాక్సిన్ మార్కెట్ ఈ ఏడాది రూ. 4.29 లక్షల కోట్లకు పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే, భారీ లాభాలు ఉంటాయని కచ్చితంగా చెప్పలేం.

Presentational grey line
News image
Presentational grey line

‘‘మహమ్మారిగా మారిన వ్యాధి చికిత్సకు ఉపయోగపడే లేదా నివారించే వ్యాక్సిన్‌ను విజయవంతంగా తయారుచేయడం చాలా కష్టం. చాలా సమయం, డబ్బు ఇందుకు వెచ్చించాల్సి వస్తుంది. విజయవంతమైన సంస్థలకు కూడా పెద్దగా డబ్బులేమీ రావు. కొందరు పెట్టుబడిదారులు ఆశించినట్లుగా బిలియన్ల కొద్దైతే అసలు రావు’’ అని అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ ఇన్వెస్టర్, లోన్కార్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రాడ్ లోన్కార్ అన్నారు.

అంతర్జాతీయ వ్యాక్సిన్ రంగంలో ఫైజర్, మెర్క్, గ్లాక్సో‌స్మిత్‌క్లైన్ (జీఎస్‌కే), సనోఫి, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి భారీ సంస్థల ఆధిపత్యం నడుస్తోంది.

స్టాటిస్టా అనే డేటా అనలిసిస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం... గత ఏడాది రూ. 3.86 లక్షల కోట్ల మేర వ్యాక్సిన్ల అమ్మకాలు జరిగాయి. 2014తో పోలిస్తే ఇది రెండింతలైంది. ఇన్‌ఫ్లూయెంజా, స్వైన్ ఫ్లూ, హెపటైటిస్, ఎబోలా వ్యాధుల వ్యాప్తి పెరగడం వల్ల అమ్మకాల్లో ఇంత వృద్ధి నమోదైంది.

కరోనావైరస్, మాస్క్

ఫొటో సోర్స్, Getty Images

‘‘కరోనావైరస్ సవాలును స్వీకరించేందుకు సంస్థలు పోటీపడతాయని అందరూ అనుకుంటుంటారు. కానీ, టాప్-4 సంస్థల్లో ఏవీ పెద్దగా ఆసక్తి చూపలేదు’’ అని ఆమ్‌స్టర్‌డామ్‌లోని యూనివర్సిటీ మెడికల్ సెంటర్ గ్రోనింగెన్‌కు చెందిన డాక్టర్ ఎలెన్ టీ హోయెన్ అన్నారు.

కోవిడ్-19 ఇప్పటికే వెయ్యికిపైగా మందిని బలి తీసుకుంది. కొన్ని చిన్న సంస్థలే దీనికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.

హెచ్‌ఐవీకి ఔషధాలు రూపొందించే గిలీడ్ సంస్థ రెమ్‌డెసివిర్ అనే ఔషధాన్ని పరీక్షించనున్నట్లు ప్రకటించింది. అబ్‌వీ అనే సంస్థ రెండు హెచ్ఐవీ ఔషధాల కలయికతో రూపొందించిన కాలెట్రాను చైనాలో రోగులపై పరీక్షిస్తోంది. ఇదివరకు ఉన్న ఔషధాల ఆధారంగానే ఈ రెండు పరీక్షలు జరుగుతున్నాయి.

‘‘గిలీడ్ లేదా అబ్‌వీ లాంటి పెద్ద సంస్థ ఇదివరకున్న ఔషధాలను కొత్త వ్యాధిని నయం చేసేందుకు ఉపయోగించేలా తీసుకురావొచ్చు. కానీ, స్టాక్ మార్కెట్ కోణంలో చూస్తే, దీని వల్ల కలిగే ప్రయోజనమేమీ ఉండదు’’ అని లోన్కార్ అన్నారు.

యాంటీ వైరస్ ట్యాబ్లెట్లు

ఫొటో సోర్స్, Getty Images

స్వచ్ఛంద సంస్థలు కోవిడ్-19 ఔషధాల తయారీ దిశగా ఫార్మా సంస్థలను కదిలించే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి స్వచ్ఛంద సంస్థల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నవాటిలో కోఅలైషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇనోవేషన్స్ (సీఈపీఐ) ఒకటి.

భారత్, నార్వే తదితర దేశాలతో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, వెల్‌కమ్ ట్రస్ట్ వంటి సంస్థలు కలిసి సీఈపీఐని స్థాపించాయి. ఇనోవియో ఫార్మాసూటికల్స్, మోడర్నా సంస్థల వ్యాక్సిన్ అభివృద్ధి కార్యక్రమాలకు సీఈపీఐ చేయూతను అందిస్తోంది.

కోవిడ్-19కు ఔషధాన్ని తయారుచేసేందుకు సీఈపీఐకి తమ సాంకేతికతను అందుబాటులో ఉంచేందుకు భారీ సంస్థల్లో ఒకటైన జీఎస్‌కే అంగీకారం తెలిపింది.

అమ్మకాలను అనుమతించడం కన్నా ముందు వ్యాక్సిన్లను సుదీర్ఘంగా పరిక్షించాల్సి ఉంటుంది. వేల మందిపై పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

2002, 2003ల్లో సార్స్ వ్యాప్తి చెందింది. అయితే దానికి వ్యాక్సిన్ కూడా తయారు కాకముందే ఆ వ్యాధి వెళ్లిపోయింది. ఇప్పటికీ సార్స్ నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో లేదు.

ఎబోలా‌కు తొలి వ్యాక్సిన్‌ను మ్రెక్ తయారుచేసింది. 2015లో పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో దాన్ని అందించారు. అప్పటికి అది లైసెన్స్ లేని ఔషధమే. కానీ, అవసరం రీత్యా అక్కడి ప్రభుత్వం దాన్ని అనుమతించింది. అమెరికాలో గత ఏడాదే దానికి అనుమతి లభించింది.

జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన మరో ఎబోలా వ్యాక్సిన్ 2019లో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అందుబాటులోకి వచ్చింది.

‘‘నేను ఔషధ సంస్థల కోసం పనిచేయను. వాటి అభిమానిని కాదు. కానీ ఎబోలా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు వాళ్లు చాలా డబ్బు ఖర్చు చేశారు. ఇందులో మరో ప్రశ్నకు తావు లేదు’’ అని రోనాల్డ్ క్లెయిన్ అన్నారు. 2014-15లో అమెరికా ఎబోలా రెస్పాన్స్ కోఆర్డినేటర్‌గా ఆయన పనిచేశారు.

కరోనావైరస్ మందు

ఫొటో సోర్స్, Valery Matytsin

దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది కాబట్టే, అనుమతుల కోసం కొన్నేళ్లపాటు వ్యాక్సిన్లు వేచిచూడాల్సి వస్తోంది. ఔషధానికి అనుమతి లభించిన తర్వాత కూడా ఇలా జాప్యం జరగొచ్చు.

2009-10ల్లో స్వైన్ ఫ్లూ వ్యాపించినప్పుడు గ్లాక్సో‌స్మిత్‌క్లైన్ తయారు చేసిన పాండెమ్రిక్స్ వ్యాక్సిన్‌ను 60 లక్షల మందికి ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ఆ వ్యాక్సిన్ అమ్మకాలను ఉపసంహరించుకున్నారు. దాని వల్ల కొందరికి నార్కెలెప్సీ (అతినిద్ర) సమస్య వస్తున్నట్లు తెలిసింది.

‘‘కోవిడ్-19కి వ్యాక్సిన్ తయారుచేస్తామని పెద్ద సంస్థలేవీ ప్రకటించకపోవడం తీవ్ర అసహనం కలిగిస్తోంది. నైపుణ్యం ఉండి కూడా అలా మిన్నకుండిపోకూడదు. అవసరం ఉన్నప్పుడు రంగంలోకి దిగాలి’’ అని యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్‌ఫెక్టియస్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంటోనీ ఫాకీ అన్నారు.

కోవిడ్-19కు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం ఇంకో ఏడాదైనా సమయం పట్టొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అది కూడా ఏదైనా పెద్ద సంస్థ రంగంలోకి దిగితేనేనని అన్నారు.

18 నెలల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ రావొచ్చని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది.

ఇది వరకు ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు ఫార్మా సంస్థలు స్పందించి వ్యాక్సిన్లు రూపొందించినా... అవి అందుబాటులోకి వచ్చేలోపే సంక్షోభాలు సమసిపోయాయి. పరిశోధన, అభివృద్ధి కోసం చేసిన వ్యయాలు సంస్థలకు భారంగా మిగిలాయి.

‘‘దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా చాలా సంస్థలు, పెట్టుబడిదారులు ఇందులోకి దిగడం లేదు’’ అని లాన్కార్ అన్నారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)