‘స్మోకింగ్ మానేస్తే, ఊపిరితిత్తులు వాటికవే బాగవుతాయి..’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గల్లాగర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ధూమపానం (స్మోకింగ్) వల్ల జరిగిన నష్టాన్ని సొంతంగా సరిచేసుకునే సామర్థ్యం ఊపిరితిత్తులకు ఉందని పరిశోధకులు అంటున్నారు. కానీ, ధూమపానం మానేసినప్పుడే అది సాధ్యపడుతుందని చెబుతున్నారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీసే కణాల పరివర్తనాలు శాశ్వతమని.. ధూమపానం మానేసిన తర్వాత కూడా అవి అలాగే ఉంటాయని పరిశోధకులు భావించారు.
కానీ, నేచర్ మ్యాగజీన్‌లో ప్రచురిచితమైన అధ్యయన ఫలితాలు దీనికి భిన్నంగా ఉన్నాయి.


నష్టం నుంచి తప్పించుకున్న కొన్ని కణాలు.. ఊపిరితిత్తులను మళ్లీ బాగుచేయగలవని ఆ అధ్యయనం పేర్కొంది.
40 ఏళ్లపాటు రోజుకు పది సిగరెట్లు తాగి మానేసినవారిలోనూ ఈ లక్షణం కనిపించిందని తెలిపింది.
పొగాకు ఉత్పత్తుల్లో ఉండే వేల రసాయనాలు ఊపిరితిత్తుల్లోని కణాల్లో డీఎన్ఏకు నష్టం చేసి, దానిలో పరివర్తనాలకు కారణమవుతాయి. దీంతో నెమ్మదిగా ఆ కణాలు క్యాన్సర్ కణాలుగా మారతాయి.
ధూమపానం అలవాటు ఉన్నవారిలో క్యాన్సర్ రాకముందు కూడా ఇది పెద్ద స్థాయిలో జరుగుతున్నట్లు అధ్యయనంలో తెలింది.

ఫొటో సోర్స్, Getty Images
ధూమపానం అలవాటు ఉన్నవారి శ్వాసనాళాల్లోని కణాల్లో చాలా వరకూ పొగాకు ఉత్పత్తుల కారణంగా పరివర్తనానికి లోనవుతున్నాయి. దాదాపు పది వేల వరకూ జన్యుపరమైన మార్పులు వాటిలో వస్తున్నాయి.
''వీటిని మినీ టైమ్ బాంబులు అనుకోవచ్చు. క్యాన్సర్‌గా మారే అవకాశం కోసం ఇవి వేచి ఉంటాయి'' అని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన పరిశోధకుడు డాక్టర్ కేట్ గోవర్స్ అన్నారు.
అయితే, దుష్ప్రభావం పడకుండా తప్పించుకుంటున్న కణాలు కూడా స్వల్ప పరిమాణంలో ఉంటున్నాయి.
ధూమపానం వల్ల జరిగే జన్యుపరమైన నష్టం నుంచి ఈ కణాలు ఎలా బయటపడుతున్నాయన్న విషయంపై స్పష్టత లేదు.
కానీ, ధూమపానం మానేసిన తర్వాత ఇవి పెరిగి, ఊపిరితిత్తుల్లో పాడైపోయిన కణాలను భర్తీ చేస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ధూమపానం మానేసిన వారిలో 40 శాతం వరకూ కణాలు, అసలు ఆ అలవాటు లేనివారిలో ఉన్నట్లుగానే ఉంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
''మాకు ఇది పూర్తిగా ఆశ్చర్యం కలిగింది. శ్వాసనాళాల్లో పొరలను ఈ కణాలు బాగు చేస్తున్నాయి. 40 ఏళ్లు ధూమపానం చేసి మానేసినవారిలోనూ కొత్త కణాల పుట్టుకకు ఇవి కారణమవుతుండటం గొప్ప విషయం'' అని సాంగెర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ పీటర్ క్యాంప్‌బెల్ అన్నారు.
ఊపిరితిత్తులు ఎంత వరకూ బాగుపడుతున్నాయనేది పరిశోధకులు ఇంకా గుర్తించాల్సి ఉంది.
వారు ఈ అధ్యయనంలో ప్రధాన శ్వాస నాళాలపైనే దృష్టి పెట్టారు. గాలిలోని ఆక్సిజన్‌ను గ్రహించే వాయుకోశాల్లాంటి భాగాలను పరిశీలించలేదు.
ధూమపానం మానేసిన రోజు నుంచే ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని ఇదివరకు చాలా అధ్యయనాల్లో తేలింది.
''పొగాకు వల్ల కలిగే నష్టాన్ని ఆపడంతోపాటు, జరిగిన నష్టాన్ని పూడ్చుకునే అవకాశం కూడా ఉంది. ధూమపానం మానే దిశగా జనాలను ప్రోత్సహించే విషయం ఇది'' అని క్యాన్సర్ రీసెర్చ్ యూకే పరిశోధన సంస్థకు చెందిన డాక్టర్ రేచల్ ఓరిట్ అన్నారు.

ఇవి కూడా చదవండి.
- ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది
- అప్పుడే పుట్టిన చిన్నారికి కరోనావైరస్
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- ‘మోదీ.. అదే మీ ఆఖరి తప్పు అవుతుంది’: ఇమ్రాన్ ఖాన్
- కరోనావైరస్: వుహాన్ వాసులకు భోజనం ఎలా అందుతోంది
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- "నాకు కరోనావైరస్ సోకలేదు.. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి"- చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యువతి
- హాజీపూర్ హత్యల కేసులో దోషికి ఉరి శిక్ష: ‘ముందు ఊపిరాడకుండా చేస్తాడు.. చనిపోయాక రేప్ చేస్తాడు’
- కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతోందా... ఆ సంస్థ ప్రతినిధి బీబీసీతో ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









