డాక్టర్ వెన్లియాంగ్: కరోనావైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు మృతి

ఫొటో సోర్స్, WEIBO
- రచయిత, స్టెఫానీ హెగార్టీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనాలో పుట్టిన కరోనావైరస్ లక్షణాలను మొట్టమొదట గుర్తించినవారిలో ఒకరైన డాక్టర్ లీ వెన్లియాంగ్ గురువారం మృతిచెందారు.
వుహాన్ నగరంలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైనప్పుడు, ఆ వార్తలను అక్కడి అధికారులు కప్పిపెట్టే ప్రయత్నం చేశారు.
స్థానిక వైద్యుడైన వెన్లియాంగ్ సహచరులకు ఈ వైరస్ గురించి హెచ్చరించేందుకు ప్రయత్నించారు. సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ చేశారు. అయితే, ఈ విషయం గురించి బయటకు మాట్లాడొద్దని, మౌనంగా ఉండాలని ఆయన్ను పోలీసులు హెచ్చరించారు.
కానీ, ఆ తరువాత వెన్లియాంగ్ చైనాలో హీరో అయ్యారు. ఆయన వుహాన్ సెంట్రల్ హాస్పటల్‌లో కంటి వైద్యుడు.
ఆయనకు కూడా కరోనా వైరస్ సోకింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన గురువారం మృతి చెందారు.


వెన్లియాంగ్ కథ ఏంటి?
వుహాన్‌లోని చేపల మార్కెట్‌లో అక్రమంగా విక్రయిస్తున్న సముద్ర జీవుల నుంచి కరోనావైరస్ వ్యాపించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
వెన్లియాంగ్ పనిచేస్తున్న ఆసుపత్రిలో డిసెంబర్‌లో ఏడుగురు వైరల్ ఇన్ఫెక్షన్‌తో చేరారు.
2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ వ్యాధి తరహా లక్షణాలే వీరిలో ఉన్నట్లు వెన్లియాంగ్‌కు అనుమానం వచ్చింది. సార్స్ కూడా కరోనావైరస్ కుటుంబానికి చెందిందే.

ఫొటో సోర్స్, WEIBO
తన సహచర వైద్యులను హెచ్చరిస్తూ ఓ చాట్ గ్రూప్‌లో డిసెంబర్ 30న ఆయన సందేశం పెట్టారు. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మాస్క్‌ల్లాంటివి ధరించాలని అందులో సూచించారు.
తాజాగా వెలుగుచూసిన వైరస్ కరోనావైరస్‌ల్లో పూర్తిగా కొత్త రకానిదని అప్పటికి వెన్లియాంగ్‌కు తెలియదు.
నాలుగు రోజుల తర్వాత పబ్లిక్ సేఫ్టీ బ్యూరో అధికారులు ఆయన దగ్గరికి వచ్చి, ఓ లేఖపై సంతకం చేయమన్నారు.
'శాంతికి విఘాతం' కలిగించేలా 'అసత్యాలు' చెబుతున్నారని ఆ లేఖలో వెన్లియాంగ్‌పై ఆరోపణ మోపారు.
''మేం హెచ్చరిస్తున్నాం. ఇలాగే మొండిగా, దురుసుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు ఈ విషయం అర్థమైందా?'' అని ఆ లేఖలో ఉంది. దాని కిందే అర్థమైందని రాసి, వెన్లియాంగ్ సంతకం చేశారు.
'వదంతులు వ్యాప్తి చేస్తున్నందుకు' తాము విచారిస్తున్న ఎనిమిది మందిలో వెన్లియాంగ్ ఒకరని పోలీసులు ఇదివరకు వెల్లడించారు.

ఫొటో సోర్స్, LI WENLIANG
జనవరి చివర్లో వెన్లియాంగ్ ఆ లేఖ కాపీని చైనాలోని సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్ వీబోలో పోస్ట్ చేశారు. తనకు ఎదురైన అనుభవం గురించి రాశారు.
ఇంతలోపు స్థానిక అధికారులు వెన్లియాంగ్‌కు క్షమాపణ చెప్పారు. అయితే, అది కూడా ఆలస్యంగానే.
వైరస్ ఉన్న జంతువుల నుంచి మాత్రమే అది మనుషులకు వ్యాపిస్తుందని వుహాన్ అధికారులు మొదట బలంగా చెబుతూ వచ్చారు. వైద్యులకు కూడా జాగ్రత్తలేవీ సూచించలేదు.
పోలీసులు తనను హెచ్చరించిన వారం తర్వాత గ్లకోమా వ్యాధితో ఉన్న ఓ మహిళకు వెన్లియాంగ్ చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆమెకు కరోనావైరస్ సోకిన విషయం ఆయనకు తెలియదు.
జనవరి 10న తనకు దగ్గు మొదలైందని, మరుసటి రోజు జ్వరం వచ్చిందని వీబో పోస్ట్‌లో వెన్లియాంగ్ చెప్పారు. రెండు రోజుల అనంతరం ఆసుపత్రిలో చేరానని, తన తల్లిదండ్రులు కూడా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాల్సివచ్చిందని వివరించారు.
జనవరి 20న చైనా కరోనావైరస్ వ్యాప్తిని అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
చాలాసార్లు కరోనావైరస్ గురించి పరీక్షలు చేసినా, అది తనకు ఉన్నట్లు తేలలేదని వెన్లియాంగ్ అన్నారు.

ఫొటో సోర్స్, WEIBO
''ఈ రోజు న్యూక్లియిక్ యాసిడ్ పరీక్ష చేశారు. వైరస్ ఉన్నట్లు తేలింది. మొత్తానికి స్పష్టత వచ్చింది'' అని జనవరి 30న పోస్ట్ పెట్టారు.
ఆయన పోస్ట్‌కు వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. మద్దతు తెలుపుతూ చాలా మంది పోస్ట్‌లు పెట్టారు.
వెన్లియాంగ్ ‘హీరో’ అని ఒక యూజర్ అభినందించారు. ''ఇలాంటి ఉదంతాల వల్ల భవిష్యత్తులో అంటువ్యాధుల గురించి వైద్యులు ముందుగానే జనాలను హెచ్చరించడానికి మరింత భయపడతారు'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
''ప్రజల ఆరోగ్యానికి భద్రత ఉండే వాతావరణం రావాలంటే, వెన్లియాంగ్ లాంటి వాళ్లు ఇంకా కోట్ల మంది రావాలి'' అని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- "నాకు కరోనావైరస్ సోకలేదు.. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి"- చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యువతి
- కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- ‘నా కూతురి బొమ్మ టార్చిలైట్ నా ప్రాణాలు కాపాడింది’
- కరోనావైరస్ కన్నా వేగంగా వ్యాపిస్తున్న వదంతులు... వాటిలో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









