కరోనావైరస్: అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యుహెచ్ఓ... భారత్ సహా 17 దేశాల్లో బాధితులు

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కొత్త కరోనావైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ - WHO అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. చైనాలో మొదలైన ఈ వైరస్ వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది.
ఇప్పటికే చైనాలో కరోనావైరస్ బారినపడ్డ వారి సంఖ్య ఈ నెల 29 బుధవారం నాటికి 7,711కు చేరుకుంది. చనిపోయినవారి సంఖ్య 213 దాటింది.
"అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడానికి ప్రధాన కారణం చైనా కాదు. అది ఇతర దేశాలకు విస్తరించడం" అని డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడానమ్ గెబ్రైసిస్ అన్నారు.
ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు బలంగా లేని దేశాలకు ఈ వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


చైనా కాకుండా ఇప్పటికే ఈ వైరస్ మరో 18 దేశాలకు విస్తరించిందని, ఆ దేశాల్లో ఇప్పటివరకు 98 కేసులు నమోదయ్యాయని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. అయితే, ఇతర దేశాలలో ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల మరణాలు నమోదు కాలేదు.
అయితే, మనుషుల నుంచి మనుషులకు కరోనావైరస్ వ్యాపించిన ఘటనలు జర్మనీ, జపాన్, వియత్నాం, అమెరికా దేశాలలో ఎనిమిది దాకా నమోదయ్యాయి.
గురువారం నాడు జెనీవాలో జరిగిన సదస్సు తరువాత డాక్టర్ టెడ్రోస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, "ఈ వైరస్ ఊహించని రీతిలో మొదలై, ఊహకందని స్థాయిలో తన ప్రభావాన్ని చూపిస్తోంది" అ ని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టిబెట్లో ఒకరికి కరోనావైరస్ వల్ల ఇన్‌ఫెక్షన్ బారినపడ్డట్లు తాజాగా నిర్ధరణ అయ్యింది. దీంతో చైనా ప్రధాన భూభాగంలోని అన్ని ప్రాంతాలకు వైరస్ వ్యాపించినట్లైంది. చైనా ఇన్‌ఫెక్షన్ కేసులు, మరణాల్లో అత్యధికం హుబేయ్ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఈ రాష్ట్ర రాజధాని వుహాన్ నగరంలోనే వైరస్ మొదట బయటపడింది.
చైనా నుంచి అమెరికా, భారత్ సహా 17 దేశాలకు కరోనావైరస్ వ్యాపించింది.
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), నేపాల్, శ్రీలంక, జపాన్, వియత్నాం, కంబోడియా తదితర దేశాలకు కరోనావైరస్ వ్యాపించింది.
వైరస్ వ్యాప్తి తీవ్రతను చర్చించి, దీనిని అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలా, వద్దా అనేది నిర్ణయించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గురువారం సమావేశం నిర్వహిస్తోంది.
గత కొన్ని రోజులుగా వైరస్ వ్యాపిస్తున్న వైనం ముఖ్యంగా కొన్ని దేశాల్లో దీని వ్యాప్తి తీరు, మనుషుల నుంచి మనుషులకు ఇది సోకతుండటం తమకు ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆధనోమ్ జెబ్రీయెసస్ బుధవారం చెప్పారు. జర్మనీ, వియత్నాం, జపాన్‌లో వైరస్ వ్యాప్తి తీరుపై ఆయన ఈ వ్యాఖ్య చేశారు. చైనా వెలుపలి దేశాల్లో బాధితులు తక్కువగానే ఉన్నప్పటికీ, వారి నుంచి వైరస్ మరింత మందికి వ్యాప్తి చెందే ఆస్కారముందని ఆందోళన వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఇళ్ల నుంచే పనిచేయండి"
వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి వుహాన్‌లో ప్రజారవాణాను చైనా నిలిపివేసింది. అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తోంది. దేశంలోని అనేక ఇతర నగరాలు, ప్రాంతాల్లోనూ ప్రయాణాలపై ఆంక్షలు అమలు చేస్తోంది.
ప్రస్తుతానికి ఇళ్ల నుంచే పనిచేయాలని, సురక్షితమేనని తేలే వరకు కార్యాలయాలకు రానక్కర్లేదని వివిధ కంపెనీలు హుబేయ్ రాష్ట్రంలోని తమ ఉద్యోగులకు చెబుతున్నాయి.
చైనీస్ ఫుట్‌బాల్ అసోసియేషన్ 2020 సీజన్‌లోని అన్ని పోటీలను వాయిదా వేసింది.
వివిధ అంతర్జాతీయ విమానయాన సంస్థలు చైనాకు విమానాలను తిప్పడం ఆపేశాయి. చైనాలో టొయోటా, జనరల్ మోటార్స్, టెస్లా, గూగుల్, స్టార్‌బక్స్ సహా అనేక సంస్థలు తమ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేయడమో, కార్యకలాపాలను, ఉత్పత్తని, సేవలను నిలిపివేయడమో, దుకాణాలను మూసివేయడమో చేశాయి.

ఫొటో సోర్స్, AFP
వుహాన్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, దక్షిణ కొరియా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇతర దేశాలు వందల సంఖ్యలో తమ పౌరులను వెనక్కు రప్పించేందుకు చర్యలు చేపట్టాయి.
ఆస్ట్రేలియా ఇలా రప్పించిన తమ పౌరులను ప్రధాన భూభాగానికి రెండు వేల కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉండే క్రిస్మస్ ఐలాండ్‌లో ప్రత్యేకంగా పరిశీలనలో ఉంచేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇన్‌ఫెక్షన్ లక్షణాలేంటి?
కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్‌ను నయం చేసే నిర్దిష్టమైన చికిత్సగాని, టీకాగాని లేవు. అయితే వైరస్ సోకిన చాలా మందిలో తక్కువ స్థాయిలో ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తాయి. దాని నుంచి వారు బయటపడతారు.
వైరస్ సోకిన వారికి ముందుగా జలుబు వస్తుంది. ఆపై జ్వరం, దగ్గు, ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆపై చికిత్స అందకపోతే తీవ్రమైన న్యుమోనియాకు దారితీయడం, మూత్రపిండాలు లాంటి కీలక అవయవాలు విఫలమై ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది.
చలికాలంలో ఈ వైరస్ తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉంటాయి. ఇది సోకిన వాళ్లు తుమ్మినా, దగ్గినా వారి ద్వారా వైరస్ ఇతరుల శ్వాసకోశ నాళంలోకి ప్రవేశించడం ద్వారా వ్యాప్తి చెందుతోంది.
వృద్ధులకు, ముందే అనారోగ్యమున్నవారికి ఈ వైరస్ ముప్పు ఎక్కువ.

నావెల్ కరోనావైరస్(2019-ఎన్‌సీవోవీ)
లాటిన్‌లో 'కరోనా' అంటే కిరీటం అని అర్థం. కరోనావైరస్‌ను మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో ఉండటంతో దీనికి ఈ పేరు పెట్టారు.
ఈ వైరస్‌ను డబ్ల్యూహెచ్‌వో ప్రస్తుతానికి నావెల్ కరోనా వైరస్(2019-ఎన్‌సీవోవీ) అని వ్యవహరిస్తోంది.
ఇది కరోనావైరస్‌ల కుటుంబానికి చెందినది. గతంలో ఈ వైరస్‌లు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) అనే శ్వాసకోస వ్యాధులకు కారణమయ్యాయి. అప్పట్లో సార్స్ బాధితుల్లో 9 శాతం మంది, మెర్స్ బాధితుల్లో ఇంచుమించు 35 శాతం మంది చనిపోయారు.
ఈ వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు, ఇది గబ్బిలాల్లో కనిపించే కరోనావైరస్, పాములో ఉన్న వైరస్‌తో కలసి కొత్తగా పుట్టిందని పరిశోధకులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్: 'దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- కరోనా వైరస్: చైనాలో మరో నగరానికి రాకపోకలు నిలిపివేత
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- బిడ్డ పుట్టిన నిమిషం లోపే బొడ్డు తాడు కత్తిరిస్తే ఏమవుతుంది
- క్రికెట్ పోటీల్లోకి మరో కొత్త దేశం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నైజీరియా జట్టు
- ఎక్కడివాళ్లు అక్కడే... వైరస్ భయంతో చైనా నగరంలో రైళ్లు, విమానాలు బంద్
- సంగీతం వింటూ వ్యాయామం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందా?
- బంగారం, ప్లాటినం కంటే ఈ లోహం ఖరీదైంది.. దీనికి ఎందుకింత డిమాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









