బిడ్డ పుట్టిన నిమిషం లోపే బొడ్డు తాడు కత్తిరిస్తే ఏమవుతుంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, భూమికా రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది నవంబర్ ప్రారంభంలో ఒక అడ్వైజరీ జారీ చేసింది.
మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ (నేషనల్ హెల్త్ మిషన్) మనోజ్ ఝలానీ తరఫున జారీ అయిన ఈ అడ్వైజరీలో బొడ్డుతాడు ముడివేసి, కత్తిరించడానికి(క్లాపింగ్) సంబంధించి కొన్ని సూచనలు చేశారు.
ఈ అడ్వైజరీని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించారు. ఇందులో ప్రసవం తర్వాత మాయ (ప్లెసెంటా)నుంచి బిడ్డ స్వయంగా బయటికి రావడం, ఆ తర్వాత క్లాంపింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.

ఫొటో సోర్స్, NATIONAL HEALTH MISSION
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వెబ్‌సైట్‌లో కార్డ్(బొడ్డుతాడు) క్లిపింగ్ గురించి అలాంటి సూచనలేవీ లేవు. కానీ డబ్ల్యుహెచ్ఓ కూడా బొడ్డుతాడు క్లాంపింగ్ కనీసం ఒక నిమిషం తర్వాతే చేయాలని చెబుతుంది.
పుట్టిన సమయంలో నవజాత శిశువు బొడ్డుతాడు(అంబిలికల్ కార్డ్)తో తల్లికి అనుసంధానమై ఉంటాడు. అది ప్లెసెంటా(దీనిని మాయ, పిండానికి పోషకాల సంచి అని కూడా అంటారు. ఇందులో బొడ్డుతాడు ఒక చివర శిశువు బొడ్డుతో కలిసి ఉంటుంది)లో ఒక భాగం.
సాధారణంగా బిడ్డను మాయ నుంచి వేరు చేయడానికి అంబిలికల్ కార్డ్‌ను ముడివేసి కత్తిరిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కార్డ్ క్లాంపింగ్ కోసం(బొడ్డుతాడు ముడివేసి కట్ చేయడానికి) ఒక నిమిషం సమయం తీసుకుంటారు. దానిని ఎర్లీ కార్డ్ క్లాంపింగ్ అంటారు.
కానీ చాలాసార్లు దానికోసం ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు. దానిని డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అంటారు.
బొడ్డుతాడును ఆలస్యంగా కత్తిరించినపుడు నవజాత శిశువు, మాయ మధ్య రక్తప్రవాహం కొనసాగుతుంటుంది. దానివల్ల బిడ్డ ఐరన్ స్థాయి పెరుగుతుంది. ఆ ప్రభావం బిడ్డ పుట్టిన తర్వాత ఆర్నెల్ల వరకూ ఉంటుంది. డబ్ల్యుహెచ్ఓ వివరాల ప్రకారం పుట్టిన తర్వాత సరైన ఆహారం దొరకడం కష్టమైన నవజాత శిశువులకు ఇది చాలా మంచిదని నిరూపితమైందని తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
తల్లీబిడ్డలకు ఆరోగ్యం
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం బొడ్డుతాడును ఒక నిమిషం తర్వాత కత్తిరించడం వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
2012లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిల్లల పుట్టుక గురించి కొన్ని సూచనలు జారీ చేసింది. వాటి ప్రకారం పుట్టిన తర్వాత బిడ్డకు వెంటిలేషన్ అవసరం లేకపోతే, బొడ్డుతాడును ఒక నిమిషం కంటే ముందు కత్తిరించకూడదు.
బిడ్డ పుట్టిన తర్వాత వెంటిలేషన్ అవసరమైతే. బొడ్డుతాడును వెంటనే కత్తిరించి శిశువుకు అవసరమైన వెంటిలేషన్ అందించాలి. అది ఆలస్యం చేయచ్చని డబ్ల్యుహెచ్ఓ సూచించలేదు.
జాతీయ బాలల ఆరోగ్య కార్యక్రమం జాతీయ సలహాదారు ప్రొఫెసర్ అరుణ్ కుమార్ సింగ్ కార్డ్ క్లాంపింగ్‌పై పరిశోధనలు చేశారు.
డిలేడ్ క్లాంపింగ్ మంచిదంటున్న ఆయన, ప్లెసెంటా సెల్ఫ్ డిశ్చార్జ్(మాయ నుంచి బిడ్డ సహజ పద్ధతిలో బయటికి రావడం)ను కూడా సమర్థించారు.
"ప్రాచీన ఈజిఫ్టులో ప్లెసెంటా నుంచి సహజంగా బయటికి వచ్చిన తర్వాత బొడ్డుతాడు(అంబిలికల్ కార్డ్) కత్తిరించినట్లు నిరూపించే ఎన్నో ఉదాహరణలు లభించాయి. అయితే ఆ పద్ధతి తర్వాత ఎప్పుడు, ఎందుకు మారిపోయిందో స్పష్టంగా తెలీదని" అన్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా ఎర్లీ కార్డ్ క్లాంపింగ్ చాలా వాడుకలో ఉందని, ఇప్పుడు అదే స్టాండర్డ్ అయిపోయిందని అరుణ్ భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అది సాధ్యం కాదు
కానీ ఫోర్టిస్ హాస్పిటల్ అసోసియేట్ డైరెక్టర్ మధు గోయల్ ఆ విషయం తోసిపుచ్చారు.
"అందరికీ ముందే బొడ్డుతాడు కత్తిరిస్తున్నారని చెప్పడంలో నిజం లేదు. సాధారణంగా డాక్టర్ డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ చేస్తారు. కానీ, గర్భవతి పరిస్థితి మామూలుగా లేకుంటే, బిడ్డ ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఎర్లీ కార్డ్ క్లాంపింగ్ చేస్తాం" అని తెలిపారు.
"ప్రతి ప్రెగ్నెన్సీ కేసునూ ఒకే విధంగా చూడలేం. ప్రతి కేసులో రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. చాలాసార్లు డెలివరీ సమయంలో పరిస్థితులు మారిపోతుంటాయి. అలాంటప్పుడు ఒక నిర్ధారిత నియమంతో పనులు చేయడం అనేది సాధ్యం కాదు" అన్నారు.
అయితే డిలేయ్డ్ క్లాంపింగ్ వల్ల పిల్లలకు ప్రయోజనం ఉందని ఆమె అంగీకరించారు. ఎందుకంటే దానివల్ల పిల్లల రక్తం బాగా అందుతుందని, దానివల్ల రక్తహీనత ముప్పు తక్కువగా ఉంటుందని చెప్పారు.
మేం ప్రభుత్వం అడ్వైజరీ గురించి ఆమెను అడిగినప్పుడు "దీని గురించి నేను విన్నాను. కానీ ఇది డెలివరీలో వాడుక పద్ధతి కాదు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కష్టమైన ప్రక్రియ
డాక్టర్ అరుణ్ కుమార్ సింగ్ అమెరికన్ జర్నల్ ఆఫ్ పారెంటోనాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ గర్భంలో పెరిగే బిడ్డ బయటి ప్రపంచంలో రావడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అలాంటప్పుడు ప్రతి ఒక్క విషయంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అన్నారు.
"ఈ కాలంలో ఎక్కువ డెలివరీలు(సుమారు 70 శాతం) సీ-సెక్షన్ తోనే చేస్తున్నారు. దాని ప్రకారం ఒక బిడ్డ పుట్టగానే తన శరీరక, మానసిక ఆరోగ్యం రెండింటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై, ఎందుకంటే పుట్టిన తర్వాత వెయ్యి రోజుల్లో (గర్భంలోని తొమ్మిది నెలలు, ఆ తర్వాత దాదాపు రెండేళ్లు) మనిషి మెదడు దాదాపు 90 శాతం వృద్ధి చెందుతుంది"
"అలాంటప్పుడు బిడ్డ గర్భం నుంచి బయటికి వచ్చినపుడు అతడి మెదడుపై చెడు ప్రభావం పడకుండా ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి"
"ఇప్పుడు డెలివరీ గురించి ఒక వింత గందరగోళం లాంటి స్థితి కనిపిస్తుంది. అది సహజంగా జరగాల్సి ఉన్నప్పటికీ తల్లికి ముందే ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తుంటారు. దానిని 'ఇండక్షన్ గ్యూమెంటేషన్' అంటారు" అని అరుణ్ కుమార్ సింగ్ చెప్పారు.
"ఆక్సిటోసిన్ ఒక సహజ హార్మోన్. బిడ్డ పుట్టే సమయంలో దాని నుంచి మద్దతు లభిస్తుంది. కానీ సహజ పద్ధతుల్లలో తల్లికి అనుకూలమైన పరిస్థితి లభించినప్పుడే ఇది శరీరం నుంచి స్రవిస్తుంది".

ఫొటో సోర్స్, Getty Images
డాక్టర్ సలహా ముఖ్యం
బిడ్డ పుట్టిన దాదాపు ఐదు నిమిషాల తర్వాత ప్లెసంటా స్వయంగా బయటికి వచ్చేస్తుంది. అక్కడ నుంచే బిడ్డకు పోషకాలు, ఆక్సిజన్ అందుతాయి. కానీ బిడ్డ గర్భం నుంచి బయటికి వచ్చినపుడు తను గాలి నుంచి ఆక్సిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. శిశువు ఊపిరితిత్తులు పనిచేయడానికి కనీసం ఒక నిమిషం పడుతుంది. ఒకసారి బిడ్డ ఆ మార్పుకు అలవాటు పడితే, తను ప్లెసెంటా నుంచి కూడా బయటికి వచ్చేస్తాడు.
డాక్టర్ సింగ్ ఉద్దేశం ప్రకారం డెలివరీ తర్వాత బిడ్డ ప్లెసెంటా బయటకు వచ్చేవరకూ వేచిచూడాలి. ఆ తర్వాత బొడ్డుతాడు కత్తిరించాల్సి ఉంటుంది.
బిడ్డ పుట్టిన వెంటనే కార్డ్ క్లాంపింగ్ చేస్తే, దానివల్ల బిడ్డ హార్ట్ బీట్ పెరిగిపోతుందని ఆయన చెబుతున్నారు.
అయితే ఈ ఫార్ములా బిడ్డపై అమలు చేయలేమని సింగ్ చెప్పారు. ఎందుకంటే "ప్రతి బిడ్డ బర్త్ కండిషన్ వేరువేరుగా ఉంటుంది. డెలివరీ పూర్తిగా నార్మల్ అయితే, ఎలాంటి సమస్యా లేకపోతే, ఈ పద్ధతిని పాటించవచ్చు. కానీ, ఏవైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు డాక్టర్ సలహా ప్రకారమే ముందుకు వెళ్లాలి" అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- గర్భస్థ శిశువుల చేతుల్లో తొండల మాదిరి కండరాలు... పుట్టిన తరువాత ఏమై పోతున్నాయి...
- 'మన పెద్దాపురం': 'కిలో ప్లాస్టిక్ తెస్తే... కిలో బియ్యం ఇస్తాం'
- కశ్మీర్లో అక్టోబర్ 31 నుంచి ఎలాంటి మార్పులు రానున్నాయి..
- నిరాధారమైన ప్రభుత్వ వ్యతిరేక వార్తలపై కేసులు పెట్టేందుకు అనుమతిస్తూ జీవో జారీ
- ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ హతం - డోనల్డ్ ట్రంప్
- ఇస్లామిక్ స్టేట్ ప్రస్తుతం ఏ దేశంలో విస్తరిస్తోంది?
- ‘అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది’ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకారం
- చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం కొత్త స్పేస్‌సూట్ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
- అమెరికాలో 15 రాష్ట్రాలను వణికిస్తున్న చేప
- అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు అలెక్సీ లియోనోవ్ కన్నుమూత.. ఆ నడకలో జరిగిన ప్రమాదం ఏంటంటే..
- ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








