'మన పెద్దాపురం': 'కిలో ప్లాస్టిక్ తెస్తే... కిలో బియ్యం ఇస్తాం'

ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాలపై పెద్ద చర్చ సాగుతోంది. ప్లాస్టిక్ వినియోగంపై పలువురు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన కొందరు యువకులు కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో తమ చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు అవగాహన కల్పిస్తూనే, పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్ సేకరించే పని ప్రారంభించారు. అంతేగాకుండా ప్లాస్టిక్ సేకరించేవారిని ప్రోత్సహించేలా కిలో ప్లాస్టిక్‌కి కిలో బియ్యం అందిస్తూ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి సహా పలువురి అభినందనలు అందుకుంటున్నారు.
వీరు 'మన పెద్దాపురం' అనే పేరుతో సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
యువతలో రక్తదానం పట్ల అవగాహన పెంచే ప్రయత్నం, పచ్చదనం కోసం మొక్కలు పెంచడానికి ప్రోత్సాహం అందించడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. వాటికి మంచి స్పందన లభించడంతో తాజాగా 'ప్లాస్టిక్‌ని దూరం చేద్దాం.. ఆకలిని అరికడదాం' అనే నినాదంతో ప్రయత్నాలు ప్రారంభించారు.
అందులో భాగంగా కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు అందించే వారికి కిలో బియ్యం అందిస్తామని చెబుతున్నారు.
గాంధీ జయంతి నాడు ప్రారంభం
పెద్దాపురంతో పాటుగా రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో ఈ కార్యక్రమానికి గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీన శ్రీకారం చుట్టారు. ఏలేశ్వరం, సామర్లకోట వంటి పట్టణాల్లో కూడా వివిధ సంస్థలు ఇలాంటి ప్రయత్నమే ప్రారంభించాయి.
'మన పెద్దాపురం' గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న పెద్దిరెడ్ల నరేష్ ఈ కార్యక్రమంపై బీబీసీతో మాట్లాడారు.
''గతంలో మేము చేపట్టిన కార్యక్రమాలకు మంచి స్పందన రావడం మరిన్ని కార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా కలుగుతున్న ప్రమాదాలు తెలుసుకున్నాం. అదే సమయంలో ఆకలితో అల్లాడుతున్న వారి జాబితాలో మనదేశం 103వ స్థానంలో ఉండటం కలవరపరుస్తోంది. అందుకే ప్లాస్టిక్‌ని దూరం చేసి పర్యావరణం కాపాడాలనే కాంక్షతో పాటుగా ఆకలితో ఉన్న వారికి కడుపు నింపడానికి కిలో బియ్యం చొప్పున అందిస్తే ఉపయోగం ఉంటుందని ఆశించాం. బియ్యం ఇవ్వడానికి పలువురు దాతలు ముందుకొచ్చారు. వారు అందించిన సహాయంతో కిలో చొప్పున బియ్యం కాగితపు సంచుల్లో సిద్ధం చేశాం. చిన్నపిల్లలకు ఇతర తినుబండారాలు కూడా అందిస్తున్నాం'' అని వివరించారు.

ఒక్క రోజులోనే 200 కిలోల ప్లాస్టిక్ సేకరణ
మన పెద్దాపురం గ్రూప్ చేపట్టిన ఈ కార్యక్రమంతో పెద్దాపురం పట్టణంలోని పలువురు తమ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటుగా ఇతర అన్ని రకాల ప్లాస్టిక్‌ని అందించడానికి ముందుకొచ్చారు. దాంతో ప్రారంభం నాడే ఏకంగా 200 కిలోల వరకూ ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించారు.
ప్రస్తుతం వారానికి ఒక్క రోజు ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్టు మరో అడ్మిన్ వంగలపూడి శివ బీబీసీకి తెలిపారు.
''గతంలో మేం చాలా సేవా కార్యక్రమాలు చేశాం. కానీ ఈసారి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ అన్ని వర్గాల నుంచి వస్తున్న స్పందన ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్లాస్టిక్ ప్రమాదం గురించి ప్రజల్లో అవగాహన పెంచాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం ఇంకా అనేక ప్రాంతాల వారికి కూడా స్ఫూర్తినిస్తోంది. కొందరు వృధాగా పడేసిన ప్లాస్టిక్ ని సేకరించి బియ్యం తీసుకెళుతున్నారు. పిల్లలను కూడా ప్రోత్సహించి వారిలో ప్లాస్టిక్ మూలంగా పర్యావరణానికి కలుగుతున్న నష్టంపై చైతన్యం నింపాలనే ప్రయత్నం జరుగుతోంది'' అని వివరించారు.

చిన్న వ్యాపారం చేసుకునే నరేష్, ప్రైవేటు ఉద్యోగం చేసుకునే వంగలపూడి శివ వంటి యువకుల చొరవకు పట్టణంలో అనేక మంది చేదోడుగా నిలుస్తున్నారు. తమ వృత్తి, ఉద్యోగం చేసుకోగా మిగిలిన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు.
వారిలో యువతతో పాటుగా పలువురు పెద్ద వయసు వారు కూడా ఉండడం విశేషం. ఈ ఉత్సాహం చూస్తుంటే ప్లాస్టిక్ రహితంగా పెద్దాపురం పట్టణం రూపొందించగలమనే ధీమా కలుగుతోందని మన పెద్దాపురం గ్రూప్ సభ్యులు చెబుతున్నారు.

ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రయత్నాలకు ప్రభుత్వ సహకారం
ప్రస్తుతం 'మన పెద్దాపురం' గ్రూప్ సభ్యులు సేకరిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మునిసిపాలిటీకి అందిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు పెట్టడంతో మునిసిపల్ అధికారులు కూడా ప్లాస్టిక్ వాడకంపై చర్యలు తీసుకుంటున్నారు.
వ్యాపారులతో పాటు వినియోగదారులు కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలకు పూనుకుటున్నారు.
అదే క్రమంలో సోషల్ మీడియా గ్రూప్ యువత అందిస్తున్న తోడ్పాటుకి మునిసిపల్ కమిషనర్ జి శేఖర్ అభినందనలు చెబుతున్నారు.
''పట్టణంలో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో ఉన్నాం. దానికి యువత అందిస్తున్న సహకారం ఉపయోగకరంగా ఉంది. వారు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైక్లింగ్‌కి ఉపయోగపడవు. అయినప్పటికీ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలనే లక్ష్యంతో వారు చేస్తున్న ప్రయత్నానికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో వారు అందించిన ప్లాస్టిక్ చెత్తను రీసైక్లింగ్ కేంద్రానికి పంపించాము. భవిష్యత్తులో కూడా స్వచ్ఛందంగా వారు చేస్తున్న కృషికి ప్రభుత్వం తరుపున తోడ్పాటు అందిస్తాం'' అని కమిషనర్ జి.శేఖర్ పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
శుభపరిణామం: మంత్రి అభినందనలు
మన పెద్దాపురం గ్రూప్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా అభినందించారు. ''ఇలాంటి ప్రయత్నాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పరిరక్షణ కృషికి తోడ్పాటు అందించడం శుభపరిణామం'' అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
''ప్లాస్టిక్ వ్యర్థాలకు బియ్యం అందించడం ద్వారా పెద్దాపురం యువత మార్పునకు శ్రీకారం చుట్టారు. యువతలో వస్తున్న ఈ చైతన్యం ఆహ్వానించదగ్గది'' అని ఆయన ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- చైనా, తైవాన్‌ల మధ్య ‘వికీపీడియా’ యుద్ధం
- ఒక యువతి ఆత్మాహుతి, ఇరాన్ దిగివచ్చేలా చేసింది
- సిరియాలో కుర్దు సేనలకు అమెరికా వెన్నుపోటు పొడిచిందా
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
- కశ్మీర్: ఎల్వోసీ వద్ద ‘ఆజాది మార్చ్’ను అడ్డుకున్న పాకిస్తాన్ సైన్యం
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










