తెలంగాణ ఆర్టీసీ సంక్షోభానికి కారణాలు, పరిష్కారాలు ఏంటి? యూనియన్లు, ప్రభుత్వం ఏమంటున్నాయి?

బస్సు

ఫొటో సోర్స్, FB/JangaonDepot

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఆస్‌ఆర్టీసీ) ఆర్థిక సంక్షోభానికి కార్మిక సంఘాలే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తుంటే, తమ తప్పేమీ లేదని సంఘాలు చెబుతున్నాయి. ఇంతకూ ఆర్టీసీకి నష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఆర్టీసీ పరిస్థితి మెరుగుపడాలంటే ఏం చేయాలి?

ప్రస్తుతం ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో ఉంది. ఇవి ఒక్కసారిగా వచ్చినవి కావు.

టికెట్ల అమ్మకాల ద్వారా ఆర్టీసీకి రోజుకు 11 కోట్ల రూపాయల వరకు వస్తుంది. 2018-19 ఏడాదికి ఇది రూ.3,976 కోట్లు. ఇది ఏటా మారుతుంది. ఇతర మార్గాల నుంచి అంటే షాపుల అద్దెలు, ప్రకటనలు, పార్శిళ్లు లాంటి వాటి నుంచి సుమారు రూ.వెయ్యి కోట్లు వస్తుంది. అన్నీ కలిపి 2018-19లో ఆర్టీసీ స్థూల ఆదాయం రూ.4,882 కోట్లు.

ఖర్చు సంగతికి వస్తే ఆదాయం కంటే ఏటా వెయ్యి కోట్ల రూపాయల వరకు అదనపు వ్యయం ఉంటుంది. ఆర్టీసీ ఖర్చులో ఎక్కువ భాగం జీతాలు, డీజిల్, పన్నులకే పోతుంది. ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం వల్ల ఆర్టీసీ ఏటా నష్టాల బారిన పడుతోంది. 2018-19లో ఆర్టీసీ స్థూల నష్టం రూ.928 కోట్లు.

ఈ గణాంకాలకు ఆధారం- పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి బీబీసీకి ఇచ్చిన పత్రాలు.

ప్రైవేటు సంస్థలయితే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటే టికెట్ రేట్లు పెంచడం ద్వారా ఆదాయం పెంచుకుంటాయి. లేదా నష్టాలు వచ్చే మార్గాలు రద్దుచేస్తారు.

ఆర్టీసీ బస్టాండ్

ఆర్టీసీ అలా ఎందుకు చేయలేదంటే..

1. ప్రైవేటు సంస్థల్లా ఆర్టీసీ ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచడానికి ఉండదు. ప్రభుత్వ అనుమతితోనే రేట్లు పెంచాలి.

2. పలు వర్గాలకు ఆర్టీసీ ఉచితంగా, లేదా రాయితీలతో కూడిన ప్రయాణం అందిస్తుంది. ఉదాహరణకు లక్షల మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా లేదా నామమాత్రపు చార్జీలతో ప్రయాణిస్తారు. వీరికే కాకుండా వివిధ వర్గాల వారికి బస్సు ప్రయాణాల్లో రాయితీ వస్తుంది.

3. చాలా ఊళ్లకు బస్సు నడిపేప్పుడు బస్సులో తగినంత మంది ప్రయాణికులు ఉండరు. బస్సు వెళ్లే దూరం, ప్రయాణికుల సంఖ్య, ఆదాయాన్ని బట్టి చూస్తే దీనిని తిప్పడం వల్ల చాలా నష్టం వస్తుంది. కానీ ఆయా గ్రామాలకు రవాణా సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో లాభనష్టాలతో నిమిత్తం లేకుండా బస్సులు తిప్పుతుంది ఆర్టీసీ. పల్లె బస్సులకే కాదు, సిటీ బస్సులకూ నష్టాలు విపరీతంగా ఉంటాయి.

బస్సులు

ఫొటో సోర్స్, Getty Images

రోడ్డు పన్ను, ఇతర పన్నులు

వివిధ వర్గాలకు రాయితీలు ఇస్తూ, నష్టాలు వచ్చే మార్గాల్లోనూ బస్సులు నడుపుతున్నప్పటికీ డీజిల్‌పై పన్ను, రోడ్ ట్యాక్సు లాంటివన్నీ ప్రైవేటు సంస్థలతో సమానంగానే చెల్లిస్తోంది ఆర్టీసీ.

1. బండి కొంటే మోటార్ వాహనాల పన్ను (రోడ్ టాక్స్) కట్టాలి. కొన్ని కమర్షియల్ వాహనాలు కొన్నప్పుడు ఒకేసారి కాకుండా మూడు నెలలకోసారీ, ఏడాదికోసారీ పన్ను చెల్లించే విధానం ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లాగే ఆర్టీసీ కూడా ఈ పన్ను కడుతోంది.

2. డీజిల్, ఇతర విడిభాగాలు కొన్నప్పుడు పన్ను కట్టాలి. డీజిల్‌పై ఆర్టీసీ కట్టే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ఏడాదికి సుమారు రూ.600 కోట్లు.

3. వేతనాల విషయంలో ఆర్టీసీకీ ప్రైవేటు సంస్థలకూ తేడా ఉంటుంది. కార్మిక చట్టాల ప్రకారం ఆర్టీసీ ఇచ్చినట్టుగా జీతాలూ, సౌకర్యాలూ ప్రైవేటు సంస్థలు ఇవ్వవు.

బస్ భవన్

రూ.560 కోట్ల సొసైటీ సొమ్ము వాడేసుకున్న యాజమాన్యం

1. ఇప్పుడు ఆర్టీసీకి సుమారు రూ.3 వేల కోట్ల అప్పులు ఉన్నాయి.

2. ఒకటో తేదీ జీతాలు ఇవ్వడం కష్టంగా ఉంది.

3. ఆర్టీసీ కార్మికులు ఒక సొసైటీగా ఏర్పడి తమ జీతాల్లోంచి కొంత సొమ్ము పొదుపు చేసుకుంటారు. దాని నుంచి అవసరమైన వారు అప్పులు తీసుకుంటారు. దాన్ని కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అంటారు. ఆ సంస్థ దగ్గరున్న సుమారు 560 కోట్ల రూపాయలను ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకుంది.

4. ఆర్టీసీ కార్మికులకు 2017లో 'పే రివిజన్' జరిగింది. ఇప్పటివరకు కొత్త జీతాలు అమలు కాలేదు.

5. పదవీ విరమణ చేసిన కార్మికులకు పూర్తిస్థాయిలో సెటిల్మెంటు చేయలేని పరిస్థితి ఉంది.

బస్సు నడుపుతున్న డ్రైవర్

ఫొటో సోర్స్, Getty Images

ఆర్టీసీ ఎంత అడుగుతోంది? ప్రభుత్వం ఎంత ఇస్తోంది?

సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ దరఖాస్తుకు 2019 సెప్టెంబరులో ఆర్టీసీ ఎండీ కార్యాలయం ఇచ్చిన సమాధానం కింది గణాంకాలకు ఆధారం. ఏ సంవత్సరమూ ఆర్టీసీకి ఇవ్వాల్సినంత సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయలేదని ఇవి సూచిస్తున్నాయి.

వీటికి అదనంగా ప్రభుత్వం తన పూచీకత్తుపై ఆర్టీసీకి కొన్ని అప్పులు ఇప్పించింది.

వాటిని తిరిగి చెల్లించడానికి కొంత మొత్తం ఇస్తోంది. అలా ఇస్తున్న సొమ్ము (రూ.కోట్లలో)

బస్టాండ్

కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము

2019-20 పూర్తిస్థాయి బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయింపులు

  • అప్పులు కట్టడానికి ఇచ్చిన అప్పు రూ.70 కోట్లు.
  • కొత్త బస్సులు కొనడానికి రూ.140 కోట్ల అప్పు.
  • ప్రస్తుతానికి ఆర్టీసీకి సంబంధించి మొత్తం రూ.850 కోట్ల అప్పులకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంది.

ఇప్పుడీ కష్టాలన్నిటి నుంచి బయటపడేయాలంటే ఏంచేయాలనేది ప్రశ్న. ఒక్కొక్కరూ ఒక్కో పరిష్కారం చూపుతున్నారు.

ఈ అంశంపై కొందరు కార్మిక నాయకులు, కొందరు రిటైర్డ్ అధికారులతో బీబీసీ మాట్లాడింది. వారు సూచించిన పరిష్కార మార్గాలు ఇవీ:

1. పన్నుల భారం తగ్గించడం: ప్రభుత్వానికి ఆర్టీసీ కట్టే పన్నుల నుంచి రాయితీ ఇవ్వాలి. వీలైతే పన్నులు తీసేయాలి. లేదంటే తగ్గించాలి. రోడ్డు పన్ను, డీజిల్‌పై పన్ను, విడిభాగాలపై వస్తు, సేవ పన్ను(జీఎస్‌టీ) ఏటా దాదాపు వెయ్యి కోట్ల వరకు ఉన్నాయి.

2. డీజిల్‌పై సబ్సిడీ:ఆర్టీసీ ఖర్చులో దాదాపు మూడో వంతు డీజిల్‌కే వెళ్తుంది. డీజిల్ ధర పెరిగే కొద్దీ ఆర్టీసీపై అదనపు భారం పడుతోంది. విమానాల ఇంధనంపై వ్యాట్ తక్కువగా ఉంది. రైల్వేలకు డీజిల్‌ను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరకే సరఫరా చేస్తుంది. కేరళ, తమిళనాడు ఆర్టీసీలకు డీజిల్ సబ్సిడీపై దొరుకుతోంది. ఇక్కడ కూడా అలా చేయాలి. ఆర్టీసీ ఏటా 25 కోట్ల లీటర్ల డీజిల్ వాడుతుంది. ఉదాహరణకు డీజిల్ ధర ఒక్క రూపాయి పెరిగితే ఆర్టీసీపై రూ.25 కోట్ల అదనపు భారం పడుతుంది.

3. అక్రమ రవాణా: స్టేజ్ కారియర్, అంటే స్టేజీ స్టేజీ, లేదా స్టాపు స్టాపుకూ బస్సు ఆపి ప్రయాణికులను తీసుకెళ్లే స్వేచ్ఛ ఒక్క ఆర్టీసీకే ఉంది. ప్రైవేటు సంస్థలకు, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్‌కు తీసుకెళ్లే వెసులుబాటు మాత్రమే ఉంది. ప్రైవేటు సంస్థలు దారిలో బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు నిబంధనలు అనుమతించవు. ఇవి అమలు కావడం లేదు. వీటిని కచ్చితంగా అమలు చేస్తే ఆర్టీసీకి లాభాలు పెరుగుతాయి.

బస్సులు

4. వయబులిటీ గ్యాప్ ఫండింగ్:పల్లెవెలుగు, సిటీ బస్సులు నడపడంలో నష్టాలను పూడ్చుకొనేందుకు ఆర్టీసీకి ప్రభుత్వం 'వయబిలిటీ గ్యాఫ్ ఫండింగ్' కింద నిధులు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. గతంలో హైదరాబాద్ మహానగర పాలకసంస్థ(జీహెచ్‌ఎంసీ) ద్వారా సిటీ బస్సుల నష్టాలు పూడ్చాలని నిర్ణయం తీసుకున్నా అది అమలు కాలేదు.

5. రాయితీ బకాయిలు: ముందు చెప్పినట్టు ఆర్టీసీ వివిధ వర్గాల వారికి రాయితీలు, ఉచిత ప్రయాణాలూ ఏర్పాటు చేస్తుంది. దానివల్ల అదనపు భారం సుమారు రూ. 500 కోట్లు అని అంచనా. ఆ సొమ్ము ఎప్పటికప్పుడు ఇస్తే ఆర్టీసీపై భారం ఉండదు.

6. ఆస్తుల వినియోగం: ఆర్టీసీకి చాలా భూములు ఉన్నాయి. వాటిని వాణిజ్యపరంగా ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం వాటిల్లో చాలా వరకు బ్యాంకుల్లో తాకట్టులో ఉన్నాయి.

7. సరకు రవాణా:ఆర్టీసీ పాత బస్సులను గూడ్సు కోసం మలచడం సులువు. వాటిని సరకు రవాణాకు ఉపయోగించాలి.

8. విభజన: కర్నాటక తరహాలో ఆర్టీసీ విభజన.

9. నష్టాల భారం: ప్రజారవాణా ఎక్కడా ప్రభుత్వ సహకారం లేకుండా నడవదు. నష్టాలను ప్రభుత్వమే భరించాలి.

ఆర్టీసీ

'ఆర్టీసీ విలీనం'

ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్- విలీనం.

ఆర్టీసీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ. 1950 నాటి ప్రజా రవాణా సంస్థల చట్టం కింద ఇది ఏర్పడింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని టీఎస్ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

విలీనంపై పట్టుబట్టడానికి కారణాల గురించి ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నాయకుడు రాజిరెడ్డి మాట్లాడుతూ.. "మేం విసిగిపోయి ఉన్నాం. ప్రతిసారీ అడుక్కుంటున్నాం. ఆ బకాయిలు ఇవ్వండి, ఈ నిధులు ఇవ్వండి, ఉద్యోగ భద్రత ఇవ్వండని బతిమాలుతున్నాం. అందుకే విసిగిపోయి ఇలా అడుగుతున్నాం. విలీనం చేస్తే ఈ తిప్పలు మాకు ఉండవనేది మా ఉద్దేశం" అని చెప్పారు.

విలీనం ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది.

ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా ఉన్నతాధికారులు ఈ అంశంపై మాట్లాడటానికి ముందుకు రావడం లేదు.

కేసీఆర్, బస్సు

ఫొటో సోర్స్, TELANGNA I&PR/TSRTC

బకాయిలపై ప్రభుత్వం ఏమంటోంది?

విలీనం మినహా అన్ని అంశాల్లో ప్రభుత్వ వైఖరి గురించి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రకటనలు మాత్రమే వస్తున్నాయి. వాటిలో ప్రభుత్వ బకాయిల గురించిన ప్రస్తావన కంటే, ఆర్టీసీని భవిష్యత్తులో ఎలా నడపాలన్నదానిపైనే ఎక్కువ సమాచారం ఉంది.

ఆర్టీసీకి ప్రభుత్వ బకాయిలపై తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 'నమస్తే తెలంగాణ' దినపత్రికలో రాసిన ఒక వ్యాసంలో వైఖరిని ప్రకటించారు.

"ఆర్టీసీ అప్పులకు ఏటా ప్రభుత్వం రూ.250 కోట్ల వరకు వడ్డీలు కడుతోంది. 2013లో పెంచిన 44 శాతం ఫిట్‌మెంట్ భారం ఏడాదికి రూ.900 కోట్లు, 2018 జూన్‌లో ప్రకటించిన 16 శాతం మధ్యంతర భృతి భారం ప్రభుత్వమే భరిస్తోంది. మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ ఎక్కువ జీతాలూ, సౌకర్యాలూ ఉన్నాయి. 2014-19 మధ్య తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి దాదాపు రూ.4 వేల కోట్లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలా ఇవ్వలేదు. ఇంత చేసినా నష్టాలు ఎందుకు వస్తున్నాయో యూనియన్లు ఆలోచించుకోవాలి" అని మంత్రి అజయ్ రాశారు.

ప్రభుత్వ షరతులకు కార్మికులు అంగీకరిస్తారా, లేదా, అలాగే ఆర్టీసీ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం తన వంతు సాయం అందిస్తుందా, లేదా అన్నది తేలాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)