తెలంగాణ ఆర్టీసీ: కొనసాగుతున్న ఉద్యోగుల సమ్మె... ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం

ఆర్టీసీ సమ్మె
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో బస్సు ఆగిపోయింది. సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. డిమాండ్ల విషయంలో ఐఏఎస్ కమిటీ‌తో జరిగిన చర్చలు ఎటూ తేలకపోవడంతో సమ్మెకు వెళ్లాలని కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. కానీ, ప్రభుత్వం దీనిపై చాలా తీవ్రంగా స్పందించింది.

శనివారం సాయంత్రం 6 గంటలలోగా విధులకు రాని ఉద్యోగులు, ఇక ఉద్యోగం వదులుకున్నట్టే అని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటన చేశారు.

శుక్రవారం రాత్రి వరకూ జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు వెళ్లాలని కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదని వారు చెప్పారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడం తమ ఉద్దేశం కాదని, తాము సెప్టెంబరులోనే సమ్మె నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం దసరా వచ్చే వరకూ ఎలాంటి చర్చలు జరపలేదని, ఆ విధంగా ప్రభుత్వంమే ప్రజలను ఇబ్బందికి గురి చేసిందని సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల నాలుగు సంఘాలల జేఏసీ ఒక ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కోరింది. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలకు పాల్పడితే వారికి మద్దతుగా ఏపీలో కూడా ఆందోళనలు చేపడతామని ఏపీఎస్ఆర్టీసీ ఈయూ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు తెలిపారు.

ఆర్టీసీ సమ్మె తెలంగాణ

ఫొటో సోర్స్, Getty Images

ముఖ్యమంత్రి హెచ్చరిక

శనివారం సాయంత్రంలోపు కార్మికులు విధులకు రావాలని, లేకపోతే ఉద్యోగాలు పోతాయని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. శనివారం సాయంత్రం 6 గంటల లోపు ఆయా ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేసిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆ సమయంలోగా విధుల్లో చేరని వారిని తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, విధుల్లో చేరని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవద్దని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది.

ఆర్టీసీ సమ్మె తెలంగాణ
ఫొటో క్యాప్షన్, తెలంగాణ ఆర్టీసీ సమ్మె కారణంగా సికింద్రాబాద్ జేబీఎస్‌తో బస్సులో నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.

ఇకపై కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కార్మికులతో చర్చల కోసం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ కూడా రద్దయిపోయింది.

ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా సందీప్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది. ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగానే వ్యవహరించాలని, క్రమశిక్షణ కాపాడాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆర్టీసీ సమ్మె తెలంగాణ
ఫొటో క్యాప్షన్, తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శనివారం ఉదయం ఎంజీబీఎస్‌ ఆవరణలో రద్దీ తగ్గిపోయింది. ఫ్లాట్ ఫాంపైకి బస్సులు రాలేదు.

ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నాయకులతో పాటూ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులూ ఈ సమీక్షలో పాల్గొన్నారు. పండగల సమయంలో సమ్మెను ప్రభుత్వం తప్పు పట్టింది. చట్ట వ్యతిరేక సమ్మె చేసిన వారిని తొలగించే అధికారం ఉందని తెలిపింది.

ఆర్టీసీ యూనియన్ నాయకుల ఉచ్చులో పడి, కార్మికులు సంస్థకు నష్టం చేయవద్దని, తమ ఉద్యోగాలు తామే పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని, కార్మికుల డిమాండ్లపై ఇకపై ఎలాంటి చర్చలు ఉండవని సీఎం స్పష్టం చేశారని అధికారులు తెలిపారు.

ఆర్టీసీని కాపాడడానికి ప్రభుత్వం ఎంతో చేసిందని, కానీ కార్మికులే ఆర్టీసీని ముంచే పని చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడడం కష్టమని సీఎం అభిప్రాయపడ్డారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

ఆర్టీసీ సమ్మె తెలంగాణ
ఫొటో క్యాప్షన్, భవిష్యత్‌లో కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపదని రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు.

ఇదే విషయాన్ని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటించారు. రవాణా కమిషనరేట్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించి, విలేకర్లతో మాట్లాడారు.

‘‘సమ్మెపై నిషేధం కొనసాగుతున్న సమయంలో కార్మికులు సమ్మెకు వెళ్తున్నారు. రేపు (శనివారం) సాయంత్రం 6 గంటల్లోపు విధుల్లోకి రాని కార్మికులు వారంతట వారే విధుల్లోంచి తప్పుకున్నట్లే. అమాయక కార్మికులు యూనియన్ ముసుగులో పడొద్దు. భవిష్యత్‌లో కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు ప్రభుత్వం జరపదు. పండగ సమయంలో కార్మిక సంఘాలు బెదిరింపు సమ్మెకు వెళ్తున్నారు. రేపు ఎలాంటి సంఘటనలు జరిగినా కార్మిక సంఘాల నాయకులే బాధ్యత వహించాలి. గతంలో ఎప్పుడూ లేనన్ని నిధులు ఆర్టీసీకి ఇచ్చాం. దేశంలో అత్యధిక జీతాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక ఇదే చివరి వార్నింగ్ శనివారం ఆరు గంటల వరకూ కార్మికులకు అవకాశం’’ అని మంత్రి అజయ్ పేర్కొన్నారు.

ఆర్టీసీ సమ్మె తెలంగాణ
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వం నియమించిన కమిటీ స్పష్టమైన హామీ ఇవ్వలేదనీ, అందుకే సమ్మెకు వెళ్తున్నామని కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి తెలిపారు.

సమ్మె చేయక తప్పలేదు: కార్మికులు

ప్రభుత్వం నియమించిన కమిటీ స్పష్టమైన హామీ ఇవ్వలేదనీ, అందుకే సమ్మెకు దిగాల్సి వచ్చిందని, ఆర్టీసీని బతికించేందుకే సమ్మె చేస్తున్నామని కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి చెప్పారు.

‘‘మంత్రి తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేరు. మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. అప్పుడాయన కాంగ్రెస్‌లో ఉన్నారు. తనది కార్మిక కుటుంబం అని మాట్లాడి ఇప్పుడు కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న చర్యలను ఖండిస్తున్నాం. భయపడేది లేదు. రేపు (శనివారం) సాయంత్రంలోపు ఏ కార్మికుడూ జాయిన్ కాడు. ఎవరి ఉద్యోగమూ తీసే అధికారం మంత్రికి లేదు. దమ్ముంటే ముందు నా ఉద్యోగం తీయ్’’ అంటూ అశ్వత్థామ రెడ్డి బీబీసీతో అన్నారు.

‘‘తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజా రవాణాను కాపాడుకోవడానికి రేపు మొదటి డ్యూటీ నుంచే నిరవధిక సమ్మె జరుగుతుంది. ముఖ్యమంత్రి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నోటీసు ఇచ్చి 36 రోజులు అయినా రవాణా మంత్రి పరిష్కారానికి కృషి చేయలేదు. అద్దె బస్సులకు నోటీసులు వేస్తామనడంలోనే ప్రభుత్వ కుటిల బుద్ధి తెలుస్తోంది’’ అని జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ సమ్మె తెలంగాణ

యూనియన్ నేతల భవిష్య కార్యాచరణ

  • టీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీలో ఒక్క కొత్త బస్సూ పెరగలేదనీ, ఆర్టీసీని కాపాడుకోవడానికే ఈ సమ్మె అనీ యూనియన్ నాయకులు చెప్పారు. వారు తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.
  • అక్టోబరు 6వ తేదీ ఉదయం 8 గంటలకు అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి సంఘాల మద్దతు కోరుతూ వారిని కలసి వినతిపత్రం ఇవ్వడం.
  • 11 గంటలకు ట్రేడ్ యూనియన్ల రౌండ్ టేబుల్ సమావేశం.
  • సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలోని అన్ని డిపోల దగ్గరా కార్మికుల కుటుంబ సభ్యులతో కలసి బతుకమ్మ.
  • 7వ తేదీ 8 గంటలకు గన్ పార్క్ అమరవీరుల దగ్గర నివాళులు.
  • 10 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష.
ఆర్టీసీ సమ్మె తెలంగాణ
ఫొటో క్యాప్షన్, సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ తెలిపారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

సమ్మె సందర్భంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లపై దృష్టి పెట్టంది. 3 నుంచి 4 వేల ప్రైవేటు బస్సులను తక్షణం అద్దెకు తీసుకోవడం, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి ఉద్యోగం, వెంటనే శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోవడం, 6 నుంచి 7 వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వడం వంటి అవకాశాలు పరిశీలిస్తోంది ప్రభుత్వం. దీనిపై ఆదివారం మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు అధికారులు.

ఈ ఏర్పాట్ల గురించి వివరిస్తూ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ, ‘‘శనివారం నుంచి 7 వేల బస్సులు అందుబాటులో ఉంటాయి. కనీస అర్హతలు ఉన్న వారిని నియమించి వారి ద్వారా బస్సులు నడుపుతాం. 1500 స్కూలు బస్సులు నడుపుతాం. స్కూళ్లకు సెలవులు కావడంతో బస్సులు, డ్రైవర్లు అందుబాటులో ఉన్నారు. ఆన్‌లైన్‌లో అనుమతులు ఇచ్చి ప్రైవేటు బస్సులు కూడా నడుపుతాం. ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు పిలిపిస్తున్నాం. ఏపీ సర్వీసుల సంఖ్య రెట్టింపు చేశారు. ప్రతి బస్సుకూ పోలీసు బందోబస్తు ఉంటుంది. ఏ ఘటనలూ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం’’ అని చెప్పారు.

ఆర్టీసీ సమ్మె తెలంగాణ
ఫొటో క్యాప్షన్, తెలంగాణ ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో సమీప ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు.

‘సీఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. ముఖ్యమంత్రి కార్మికులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనీ, కార్మికుల న్యాయమైన హక్కులను కాలరాసే విధంగా పాశవికంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఉత్తమ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

ఉద్యోగులు, ప్రజలు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. పండుగ సందర్భంగా ప్రజల ఇబ్బందులకు ముఖ్యమంత్రే కారణమని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)