పచ్చని పంట పొలాల్లో వందలాది కార్లు పార్క్ చేస్తున్నారెందుకు?

- రచయిత, అశ్వినీ శర్మ
- హోదా, బీబీసీ కోసం, సిమ్లా నుంచి
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు సమీపంలో రహదారి వెంట అనేక చోట్ల వ్యవసాయ భూముల్లో వందలాది కొత్త కార్లు పార్కింగ్ చేసి కనిపిస్తాయి. గతంలో పచ్చని పంటచేలతో కళకళలాడిన ఈ భూములు కార్లతో నిండిపోయి కనిపిస్తున్నాయి.
మరి, రైతులు పంటలు వేసుకోకుండా భూములను కార్ల పార్కింగ్ కోసం ఎందుకిస్తున్నారు?
వందల కార్లు పార్కింగ్ చేసి ఉన్న ఈ ప్రాంతం సిమ్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ జాతీయ రహదారి వెంట భూములున్న చాలామంది రైతులు పంటలు వేయడం మానేశారు.
చాలా కాలంగా అడవి పందులు, కోతులు, దుప్పులు పంటలను నాశనం చేస్తుండటంతో ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పగలు కోతులు, రాత్రి అడవి పందులు, దుప్పుల బెడదతో పంటలు చేతికి రాకుండా పోతున్నాయి.
అయితే, కొత్త కార్లను పార్క్ చేసేందుకు మారుతీ సుజుకీ అధికారిక డీలర్ 'గోయల్ మోటార్స్' సంస్థ ఇక్కడ వ్యవసాయ భూములను లీజుకు తీసుకుంటోంది. దీంతో, చాలామంది రైతులు పంటలు వేసి నష్టపోవడం కంటే పార్కింగ్ కోసం భూములను అద్దెకు ఇవ్వడమే మేలన్న ఆలోచనకు వచ్చారు.
ఒక్క కారు పట్టే స్థలానికి నెలకు 100 రూపాయల చొప్పున రైతులకు డీలర్ అద్దె చెల్లిస్తున్నారు. ఇక్కడి భూముల్లో వందల సంఖ్యలో కార్లు పార్క్ చేస్తారు. డిమాండును బట్టి షోరూంలకు కార్లను ఇక్కడి నుంచి తరలిస్తారు.

"కోతులను చెదరగొట్టేందుకు పగటిపూట పంట చేలకు కాపలా ఉండేవాళ్లం. కానీ, రాత్రి సమయాల్లో అడవి పందులు వచ్చి చేలను నాశనం చేస్తుండేవి. దాంతో, పెట్టిన పెట్టుబడులు వచ్చేవి కాదు. కార్ల పార్కింగ్ కోసం భూమిని ఇవ్వడంతో ఆ బాధలు తప్పాయి" అని స్థానిక మహిళా రైతు కాంతాదేవి చెప్పారు.
"భూమిని ఖాళీగా వదిలేయడం కంటే, నెలకు ఎనిమిది నుంచి పది వేల రూపాయలు వస్తే మేలే కదా" అని కాంతాదేవి అంటున్నారు.
మూడేళ్ల క్రితం ఒక్క గ్రామంలో ప్రారంభమైన ఈ పార్కింగ్ విధానం ఇప్పుడు ఆరు ఊళ్ళకు విస్తరించింది.
మరో మహిళా రైతు మీనా కుమారి వాళ్లు గతంలో పప్పు ధాన్యాలు, టొమాటో, క్యాప్సికం, క్యాబేజీ, బీట్‌రూట్, మొక్క జొన్న పంటలు వేసేవారు. కానీ, కోతులు, పందులు, దుప్పుల బెడదను విసిగిపోయి 9 నెలల 100 కార్లు పట్టే స్థలాన్ని అద్దెకు ఇచ్చారు.

అడవి పందుల భయంతో అనేక మంది రైతులు పంటలు వేయాలంటేనే జంకుతున్నారు.
"వ్యవసాయాన్ని దూరం పెట్టడం మాకు ఇష్టం లేదు. కానీ, తప్పట్లేదు. ఇప్పుడు పెట్టుబడి లేకుండా ఎంతో కొంత ఆదాయం వస్తోంది" అని మీనా కుమారి చెప్పారు.
పంటలు వేయకుండా ఖాళీగా ఉన్న భూములను మాత్రమే లీజుకు తీసుకుంటున్నామని గోయల్ మోటార్స్ నిర్వాహకులు తెలిపారు. పంటలు వేయడం కంటే పార్కింగ్‌కు భూమి ఇవ్వడం ద్వారానే ఇక్కడి రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తోందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
- ఒంగోలు గిత్తల కథ: ఇక్కడ అరుదై పోయాయి.. బ్రెజిల్లో వెలిగిపోతున్నాయి
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- ‘100 మందిని చంపేసి నదిలో పడేశారు’.. సూడాన్ నరమేధం
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- టిఫనీ ట్రంప్: ఇవాంకా తెలుసు.. మరి ఈమె తెలుసా
- అంతరించిపోతున్న జీవుల్లో అనంతపురం విషపు సాలీడు
- తియానన్మెన్ స్క్వేర్ నరమేధాన్ని సమర్థించిన చైనా మంత్రి, అసలు ఆరోజు ఏం జరిగింది
- ఎంపీలకు ప్రభుత్వ కార్లు ఉండవు.. అద్దె చెల్లిస్తేనే గవర్నమెంట్ క్వార్టర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








