ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1984 మే 31 సాయంత్రం. మీరఠ్‌లోని నైన్ ఇన్‌ఫాంట్రీ డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ కుల్దీప్ బుల్‌బుల్ బరాడ్ భార్యతో కలిసి దిల్లీ వెళ్లే ఏర్పాట్లలో ఉన్నారు.
తర్వాత రోజు ఆయన మనీలాకు వెళ్లాలి. ఆయన అక్కడ సెలవులు గడపడానికి వెళ్తున్నారు.
ఇది వేర్పాటువాద జ్వాలల్లో పంజాబ్ రగులుతున్న సమయంలో జరిగిన ఘటన.
ఆ రాష్ట్రంలోని గురుద్వారాల్లో పంజాబ్‌ను భారత్ నుంచి వేరు చేయాలని, అంటే ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశంగా మార్చాలని ప్రసంగాలు నడుస్తున్నాయి.
ఖలిస్తాన్ సాధన కోసం భారత్‌తో సాయుధ పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని కూడా అక్కడ చెబుతున్నారు.
పంజాబ్‌లో జరుగుతున్న ఈ కార్యకలాపాలు దిల్లీలో ఉన్న అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అలాంటి సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న అగ్ర నేతలు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
అదే 'ఆపరేషన్ బ్లూ స్టార్'. మేజర్ జనరల్ బరాడ్‌కు దాని బాధ్యతలు అప్పగించారు.

ఫొటో సోర్స్, PIB
భింద్రన్‌వాలే అధీనంలో స్వర్ణదేవాలయం
మేజర్ జనరల్ కులదీప్ బరాడ్ ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఇలా వివరించారు.
"సాయంత్రం నాకు ఒక ఫోన్ వచ్చింది. తర్వాత రోజు ఒకటో తేది. ఉదయం నేను ఒక మీటింగ్ కోసం చాందీ మందిర్ చేరుకోవాలి"
"ఒకటో తేదీ సాయంత్రమే మేం మనీలా వెళ్లాల్సి ఉంది. టికెట్లు కూడా బుక్ అయ్యాయి. మా ట్రావెలర్స్ చెక్ కోసం చూస్తున్నాం. విమానం ఎక్కడానికి దిల్లీ బయల్దేరుతున్నాం".
"నేను మీరఠ్ నుంచి దిల్లీ బోర్డ్ రోడ్‌కు వెళ్లాను. అక్కడ నుంచి విమానంలో చండీగఢ్, తర్వాత వెస్ట్రన్ కమాండ్ ప్రధాన కార్యాలయం చేరుకున్నాను".
"ఆపరేషన్ బ్లూ స్టార్‌కు నేను కమాండ్ చేయాల్సుంటుందని, వీలైనంత త్వరగా అమృత్‌సర్ చేరుకోవాలని అక్కడ నాకు చెప్పారు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి".
"స్వర్ణదేవాలయం భింద్రన్‌వాలే అదుపులో ఉంది. పంజాబ్‌లో చట్టం అనేదే లేకుండాపోయింది".
"పరిస్థితిని వీలైనంత త్వరగా చక్కబెట్టాలని, లేదంటే పంజాబ్ మన చేతి నుంచి జారిపోతుందని నాకు చెప్పారు".
"నా సెలవులు రద్దు చేశారు. దాంతో వెంటనే నేను విమానంలో అమృత్‌సర్ చేరుకున్నాను".

ఫొటో సోర్స్, SATPAL DANISH
భింద్రన్‌వాలేకు కాంగ్రెస్‌తో బంధం
భింద్రన్‌వాలేను కాంగ్రెస్ వారే ప్రోత్సహించారు. అకాలీల ముందు సిక్కుల డిమాండ్ల గురించి మాట్లాడేలా ఒక వ్యక్తిని తీసుకురావాలని, వారికి లభిస్తున్న మద్దతును తగ్గించాలని భావించిన కాంగ్రెస్ అతడిని ప్రోత్సహించేది.
భింద్రన్ వాలే వివాదాస్పద అంశాలపై రెచ్చగొట్టేలా ప్రసంగించడం మొదలైంది. మెల్లమెల్లగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు.
పంజాబ్‌లో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి.
1982లో చౌక్ గురుద్వారా వదిలిన భింద్రన్‌వాలే మొదట స్వర్ణమందిరంలో గురునానక్ నివాస్, తర్వాత కొన్ని నెలలకు ఆకాల్ తఖ్త్‌లో తన అభిప్రాయాలను అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు.

ఫొటో సోర్స్, SATPAL DANISH
‘జీసస్‌కు గడ్డం ఉంది, మీకు లేదేంటి..’
సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం పనిచేసిన జర్నలిస్ట్ సతీష్ జాకబ్‌కు చాలా సార్లు భింద్రన్‌వాలేను కలిసే అవకాశం లభించింది.
"నేను ఎప్పుడు అక్కడికి వెళ్లినా భింద్రన్‌వాలే సెక్యూరిటీ గార్డులు దూరం నుంచే 'రండి, రండి బీబీజీ రండి' అనేవారు. 'బీబీసీ' అని వాళ్లెప్పుడూ అనలేదు. 'మీరు లోపలికెళ్లండి, సాధువు మీకోసం వేచిచూస్తున్నారు' అనేవారు" అని సతీష్ తెలిపారు.
"భింద్రన్‌వాలే నాతో చాలా బాగా కలిసిపోయేవారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను మార్క్ టలీని ఆయనకు పరిచయం చేసినప్పుడు ఆయన టలీని 'మీది ఏ మతం' అని అడిగారు. దానికి ఆయన 'నేను క్రిస్టియన్‌ను' అన్నాడు".
"దాంతో భింద్రన్‌వాలే 'అయితే మీరు జీసస్ క్రైస్ట్‌ను నమ్ముతారు, జీసస్ క్రైస్ట్‌కు గడ్డం ఉంది, మీకు లేదేంటి?' అన్నారు".
"మార్క్ ఆయనతో 'ఇలాగే బాగుంటుంది' అన్నాడు. దానికి భింద్రన్‌వాలే 'నీకు తెలుసా, గడ్డం లేకుంటే, నువ్వు అమ్మాయిలా ఉన్నావ్' అన్నారు. మార్క్ నవ్వి ఊరుకున్నారు".

పొలాలకు అటువైపు పాకిస్తాన్
"భింద్రన్‌వాలేతో నేను ఒకసారి చాలా సుదీర్ఘంగా మాట్లాడాను. మేమిద్దరం అప్పుడు స్వర్ణ దేవాలయం పైన కూర్చున్నాం. అక్కడకు ఎవరూ వెళ్లేవారు కాదు. అక్కడంతా కోతులు తిరుగుతుండేవి" అని సతీష్ జాకబ్ చెప్పారు..
"నేను మాటల్లో ఆయన్ను 'ఇదంతా చేయడం చూసి మీపైన ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమో అని మీకు అనిపిస్తోందా' అని అడిగా. ఆయన 'ఏం యాక్షన్ తీసుకుంటారులే' అన్నారు".
"ఆయన నాకు అక్కడి నుంచే చేత్తో మాకు ఎదురుగా ఉన్న పొలాలు చూపించారు. 'ఏడెనిమిది కిలోమీటర్ల తర్వాత భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉంది' అన్నారు".
"భింద్రన్‌వాలే నాతో 'ఏదైనా జరిగితే, మేం వెనుక నుంచి సరిహద్దులకు చేరుకుంటాం. అక్కడ నుంచే గెరిల్లా యుద్ధం చేస్తాం' అన్నారు. ఆయన నన్ను పూర్తిగా నమ్మడం, అదంతా చెప్పడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది".
ఆయన నాతో "మీరు దీన్ని ప్రచురించకండి" అని కూడా చెప్పలేదు.
1984 జూన్ 4న భింద్రన్‌వాలే అనుచరుల పొజిషన్ గురించి తెలుసుకోడానికి ఒక అధికారిని మఫ్టీలో స్వర్ణమందిరం లోపలికి పంపించారు.
జూన్ 5న ఉదయం జనరల్ బారాడ్ 'ఆపరేషన్ బ్లూ స్టార్'లో పాల్గొనే సైనికులకు వారి ఆపరేషన్ గురించి బ్రీఫ్ చేశారు.

ఫొటో సోర్స్, RAVINDER SINGH ROBIN / BBC
పాకుతూ అకాల్ తఖ్త్ వైపు వెళ్లాలి
అప్పటి ఘటనల గురించి జనరల్ బరాడ్ బీబీసీతో మాట్లాడారు. "ఐదో తేదీ ఉదయం నాలుగున్నరకు ప్రతి బెటాలియన్ దగ్గరికీ వెళ్లాను. అక్కడున్న జవాన్లతో అరగంట మాట్లాడాను".
"నేను వారితో స్వర్ణ దేవాలయం లోపలికి వెళ్లేటపుడు ఒక పవిత్ర స్థలంలోకి వెళ్లి దాన్ని నాశనం చేయబోతున్నాం అని ఆలోచించకండి. మనం దానిని శుభ్రం చేయడానికి వెళ్తున్నాం అనుకోండి. కాజువాలిటీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అని చెప్పాను".
"ఒకవేళ మీలో ఎవరైనా లోపలికి వెళ్లకూడదని అనుకుంటుంటే ఫర్వాలేదు. మీరు లోపలికెళ్లాల్సిన అవసరం లేదని నేను మీ కమాండ్ ఆఫీసర్‌కు చెబుతా. మీపై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం ఉండదని కూడా చెప్పాను"

ఫొటో సోర్స్, RAVINDER SINGH ROBIN / BBC
"నేను మూడు బెటాలియన్స్‌లోకి వెళ్లాను. ఎవరూ నిలబడలేదు. నాలుగో బెటాలియన్‌లో ఒక సిక్కు ఆఫీసర్ నిలబడ్డాడు. నేను 'ఏం ఫర్వాలేదు. మీ ఫీలింగ్స్ ఇంత స్ట్రాంగ్ ఉంటే, మీరు లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు' అన్నాను".
"దాంతో అతడు నాతో 'మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను సెకండ్ లెఫ్టినెంట్ రైనా. అకాల్ తఖ్త్‌లోకి అందరికంటే ముందు వెళ్లి, భింద్రన్‌వాలేను పట్టుకోవాలనే నేను లోపలికి వెళ్లాలనుకుంటున్నా' అన్నాడు".
"వేర్పాటు వాదుల దగ్గర రాకెట్ లాంచర్లు కూడా ఉంటాయని నేను ఊహించలేదు" అని మేజర్ జనరల్ కుల్దీప్ బరాడ్ అన్నారు.
"నేను రైనా కమాండింగ్ ఆఫీసర్‌తో ఇతడి ప్లటూన్ అందరికంటే ముందు లోపలికి వెళ్తుందన్నాను. అలాగే అతడి ప్లటూన్ మొదట లోపలికెళ్లింది. కానీ లోపల నుంచి మెషిన్ గన్‌తో కాల్పులు జరపడంతో అతడి రెండు కాళ్లకూ గాయాలయ్యాయి. రక్తం కారుతోంది. 'రైనాను ఆపాలని ప్రయత్నిస్తున్నా, ఆగడం లేదని' అతడి కమాండింగ్ ఆఫీసర్ నాకు చెప్పాడు. నేను అతడిని బలవంతంగా అంబులెన్సులో ఎక్కించాలని ఆదేశించాను. తర్వాత అతడి రెండు కాళ్లూ తీసేశారు. రైనా సాహసానికి తర్వాత నేను అతడికి అశోక చక్ర ఇప్పించాను" అని బరాడ్ చెప్పారు.

ఫొటో సోర్స్, RAVINDER SINGH ROBIN / BBC
పారాచ్యూట్ రెజిమెంట్
ఆపరేషన్ మొత్తం రాత్రిపూట చీకట్లో పూర్తి చేయాలని ఆ ఆపరేషన్‌కు నేతృత్వం చేస్తున్న జనరల్ సుందర్జీ, జనరల్ దయాల్, జనరల్ బరాడ్ వ్యూహం సిద్ధం చేశారు. రాత్రి పది గంటల సమయంలో నేరుగా దాడులకు దిగారు.
"పరిక్రమ దిశగా ముందుకు వెళ్లాలని నల్ల యూనిఫాం వేసుకున్న మొదటి బెటాలియన్, ప్యారాచూట్ రెజిమెంట్ కమాండోలను ఆదేశించాం. అక్కడ కుడివైపు తిరిగి వీలైనంత త్వరగా అకాల్ తఖ్త్ వైపు వెళ్లాలన్నాం. కానీ కమాండోలు ముందుకు వెళ్లగానే వారిపై రెండు వైపుల నుంచీ ఆటోమేటిక్ రైఫిళ్లతో హెవీ ఫైరింగ్ జరిగింది. దాంతో వారిపై ఎదురు కాల్పులు జరపడానికి కొంతమంది కమాండోలే మిగలారు".
"కమాండోలకు సాయం అందించడానికి లెఫ్టినెంట్ కల్నల్ ఇస్రార్ రహీమ్ ఖాన్ నాయకత్వంలో పదో బెటాలియన్ గార్డ్స్ మెట్లకు రెండు వైపులా ఉన్న మెషిన్ గన్ స్థావరాలను ధ్వంసం చేశారు. కానీ సరోవర్‌కు ఇంకో వైపు నుంచి వారిపై భీకరమైన కాల్పులు మొదలయ్యాయి".
"కల్నల్ ఇస్రార్ ఖాన్ సరోవర్ అవతలివైపు ఉన్న భవనంపై కూడా కాల్పులు జరపడానికి అనుమతి అడిగారు. కానీ మేం దానికి ఒప్పుకోలేదు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... సైన్యం అక్కడ కనిపించని శత్రువుతో పోరాటం చేస్తోంది".

ఫొటో సోర్స్, SATPAL DANISH
బలమైన ముట్టడి
"వాళ్ల ప్లానింగ్, వాళ్ల ఆయుధాలు, వాళ్లకు ఆ ప్రాంతంపై ఉన్న పట్టు గురించి తెలీగానే వాళ్లను దాటి వెళ్లడం సులభం కాదని మాకు మొదటి 45 నిమిషాల్లోనే తెలిసిపోయింది. మా కమాండోలు అకాల్ తఖ్త్ లోపల స్టన్ గ్రెనేడ్స్ విసరితే బాగుంటుందని మేం అనుకుంటున్నాం. ఆ గ్రనేడ్‌లో గ్యాస్ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం ఉండదు. వాళ్లకు తలనొప్పిగా ఉంటుంది. కళ్లలో నీళ్లొస్తాయి. సరిగా కనపడదు. ఆలోపు మా జవాన్లు లోపలికెళ్లిపోవచ్చు. కానీ ఆ గ్రెనేడ్లు లోపల విసరడానికి మాకు ఏ దారీ లేదు. ప్రతి కిటికీ, ప్రతి తలుపు దగ్గరా ఇసుక మూటలు పెట్టారు. గ్రెనేడ్లు గోడలకు తగిలి తిరిగి పరిక్రమవైపు వచ్చి పడుతున్నాయి. వాటి ప్రభావం మా జవాన్లపైనే పడుతోంది" అని బరాడ్ చెప్పారు.
"సైనికులపై అన్ని వైపుల నుంచీ ఫైరింగ్ జరుగుతోంది. అంటే ఖలిస్తాన్ వేర్పాటువాదులు నేల కింద మ్యాన్ హోల్ నుంచి కూడా బయటికొచ్చి మెషిన్ గన్లతో కాల్పులు జరిపి మళ్లీ లోపలికెళ్లిపోతున్నారు".

ఫొటో సోర్స్, SATPAL DANISH
"వేర్పాటు వాదులకు జనరల్ షాబేగ్ సింగ్ వారికి మోకాళ్ల దగ్గర ఎలా ఫైరింగ్ చేయాలో ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే భారత జవాన్లు పాకుతూ తమ లక్ష్యం దిశగా ముందుకు వస్తారని ఆయనకు తెలుసు. కానీ కమాండోలు మామూలుగా నడుస్తూ ముందుకెళ్తున్నారు".
"సైనికులకు ఎక్కువగా కాళ్లపై బుల్లెట్లు తగిలాయి. జవాన్లు ముందుకు వెళ్లకుండా ఆగిపోగానే ఆర్మ్‌డ్ పర్సనల్ క్యారియర్ ఉపయోగించాలని జనరల్ బరాడ్ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏపీసీ అకాల్ తఖ్త్ వైపు వెళ్లగానే వాళ్లు దానిని చైనా తయారీ రాకెట్ లాంచర్‌తో పేల్చేశారు".
ఎక్కువ లైటింగ్‌తో శత్రువుపై పైచేయి
"ఏపీసీ లోపల కూర్చునే కమాండోలకు ప్రొటెక్షన్ ఉంటుంది. మేం మా జవాన్లను అకాల్ తఖ్త్‌కు వీలైనంత దగ్గరగా పంపించాలనే ప్రయత్నించాం. కానీ వాళ్ల దగ్గర రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయనే విషయం మాకు తెలీదు. వాళ్లు రాకెట్ లాంచర్ ఫైర్ చేసి ఏపీసీని పేల్చేశారు" అని జనరల్ బుల్‌బుల్ బరాడ్ చెప్పారు.
అన్నిదిక్కుల నుంచీ ఫైరింగ్ జరుగుతుండడంతో భారత జవాన్లు గందరగోళంలో పడ్డారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో జనరల్ బరాడ్ ట్యాంకులు పంపించాలని ఆర్మీని కోరాల్సి వచ్చింది.
"ట్యాంకులు ఉపయోగించాలనేది మొదటి నుంచే మీ ప్లాన్లో ఉందా"? అని నేను జనరల్ బరాడ్‌ను అడిగాను.

ఫొటో సోర్స్, SATPAL DANISH
సమాధానంగా ఆయన "అస్సలు లేదు, మేం అకాల్ తఖ్త్ దగ్గరకు కూడా వెళ్లలేకపోతుండడంతో నేను ట్యాంకులు పిలిపించాను. తెల్లారితే వేల మంది వచ్చేస్తారని, సైన్యాన్ని చుట్టుముడతారని నాకు భయంగా ఉంది. ట్యాంకుల జినాన్ బల్బ్, లేదా హాలోజిన్ బల్బ్ చాలా శక్తివంతంగా ఉంటాయి. మేం వాటితో వాళ్లకు కళ్లు కనిపించకుండా చేయాలనుకున్నాం. అలా కొన్ని క్షణాలైనా వాళ్లను అయోమయంలో ఉంచి లబ్ధి పొందాలని, వారిపై దాడి చేయాలని భావించాం" అన్నారు.
"కానీ ఆ బల్బ్ 20, 30 సెకన్లు వెలగడమే ఎక్కువ. తర్వాత వాటి ఫ్యూజ్ పోతుంది. బల్బ్ ఫ్యూజ్ పోగానే, మేం ట్యాంకులను తిరిగి తీసుకొచ్చేవాళ్లం. బల్బు వేశాక మళ్లీ తీసుకెళ్లేవాళ్లం. కానీ అలా ఏమాత్రం ఫలితం దక్కలేదు. తెల్లారబోతోంది. అకాల్ తఖ్త్‌లో ఉన్న వాళ్లు ఓటమి ఒప్పుకోవడం లేదు. దాంతో ట్యాంక్ సెకండ్రీ ఆర్మమెంట్‌తో అకాల్ తఖ్త్ పైభాగంలో ఫైర్ చేయాలని ఆదేశించాను. అలా చేస్తే పైన పడుతున్న రాళ్లకు లోపలివారు భయపడతారని, బయటికి వస్తారని అనుకున్నాను".
ఆ తర్వాత అకాల్ తఖ్త్‌ను మేం ఒక సైనిక లక్ష్యంలా భావించాం. తర్వాత రిటైర్డ్ జనరల్ జగ్జీత్ సింగ్ ఆరోడా స్వర్ణ దేవాలయానికి వచ్చినపుడు ఇండియన్ ఆర్మీ అకాల్ తఖ్త్‌పై కనీసం 80 గుండ్లు వేసిందని ఆయనకు తెలిసింది.

ఫొటో సోర్స్, SATPAL DANISH
మరణం ధ్రువీకరణ
"జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే, జనరల్ షాబేగ్ సింగ్ మరణించారని మీకు ఎప్పుడు తెలిసింది"? అని నేను జనరల్ బరాడ్‌ను అడిగాను.
"సుమారు 30, 40 మంది పరుగులు తీస్తూ బయటికి వచ్చారు. మాకు ఏదో జరిగిందని అనిపించింది. ఫైరింగ్ కూడా ఆగిపోయింది. తర్వాత మేం మా జవాన్లతో లోపలికెళ్లి చూడమని చెప్పాం. అప్పుడే మాకు వాళ్లు చనిపోయినట్లు తెలిసింది. కానీ తర్వాత రోజు వాళ్లు ఆ రోజు రాత్రి సురక్షితంగా పాకిస్తాన్ చేరుకున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. భింద్రన్‌వాలే తమ దగ్గరున్నాడని, జూన్ 30న ఆయన్ను టీవీలో చూపిస్తామని పాకిస్తాన్ టీవీలో ప్రకటించిందని చెప్పుకున్నారు".
"నాకు సమాచార, ప్రసార శాఖ మంత్రి హెచ్‌కెఎల్ భగత్, విదేశాంగ కార్యదర్శి రసగోత్రా ఫోన్ చేశారు. 'వాళ్లు చనిపోయారని మీరంటున్నారు. కానీ పాకిస్తాన్ వాళ్లు బతికున్నారని చెబుతోందే' అన్నారు. 'వాళ్లను మేం గుర్తించాం. మృతదేహాలను వారి కుటుంబాలకు కూడా అప్పగించాం. భింద్రన్‌వాలే అనుచరులు ఆయనకు పాదాభివందనం చేశారు. ఆయన చనిపోయారు. పాకిస్తాన్ వాళ్ల గురించి నోటికొచ్చినట్టు చెబుతుందిలే" అన్నాను.

ఫొటో సోర్స్, SATPAL DANISH
"ఈ మొత్తం ఆపరేషన్లో భారత సైన్యం 83 మంది సైనికులను కోల్పోయింది. మరో 248 మంది జవాన్లు గాయపడ్డారు. వీరు కాకుండా మరో 492 మంది మరణించినట్లు ధ్రువీకరించారు. 1592 మందిని అదుపులోకి తీసుకున్నాం" అని బరాడ్ చెప్పారు..
ఈ ఘటనతో భారత్ మాత్రమే కాదు ప్రపంచమంతా సిక్కు సమాజం అంటే భయపడింది. ఇది కచ్చితంగా భారత సైన్యం విజయమే, కానీ దీనిని చాలా పెద్ద రాజకీయ ఓటమిగా కూడా భావిస్తారు.
'ఆపరేషన్ బ్లూ స్టార్' టైమింగ్, వ్యూహం, అమలు గురించి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు. చివరికి ఈ ఘటనకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లించాల్సివచ్చింది.
ఇవి కూడా చదవండి:
- నాసా: అంతరిక్ష కేంద్రం సందర్శించేందుకు పర్యాటకులను అనుమతి
- సిక్కుల ఊచకోత: 3 రోజుల్లో 3 వేల మంది హత్య
- ప్రమాదమని తెలుసు.. కానీ ఆకలే వారిని ఇరాక్‌కు వెళ్లేలా చేసింది!
- కెనడా ప్రధాని పర్యటనకు భారత్ ప్రాధాన్యం ఇవ్వడం లేదా?
- 1984 సిక్కుల ఊచకోత, 2002 గుజరాత్ మారణకాండ: న్యాయం కోసం ఎదురుచూపులు
- ఫ్యాక్ట్ చెక్: బీరు దొరకట్లేదని కేసీఆర్‌కు బ్యాలెట్ బాక్సు ద్వారా లేఖ నిజమేనా?
- మహేంద్ర సింగ్ ధోని ఆ కీపింగ్ గ్లవ్స్ వాడకూడదన్న ఐసీసీ.. అవే కొనసాగిస్తాడన్న బీసీసీఐ
- ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్: కొత్త ట్రెండ్.. ఉపవాసాలు చేసి బరువు తగ్గుతున్నారు
- అభిప్రాయం: ఇది విలీనం కాదు టోకు ఫిరాయింపు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








