పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొండచిలువ చర్మంతో చేసిన చెప్పులు వేసుకుంటారా

ఫొటో సోర్స్, ISLAMUDDIN
- రచయిత, జుబేర్ ఖాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ప్రముఖ చెప్పుల తయారీ దారుడు నౌరుద్దీన్ చాచా పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కోసం ప్రత్యేకంగా పాము చర్మంతో చెప్పులు తయారు చేస్తున్నారు.
ఈ చెప్పులను ఆయన ఇమ్రాన్ ఖాన్‌కు ఈద్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారు.
"ఆయన సన్నిహితులు కొందరు ఇమ్రాన్ ఖాన్‌కు ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నట్లు నాకు చెప్పారు. నోమాన్ అనే ఆయన అమెరికా నుంచి ప్రత్యేకంగా పాము చర్మం పంపించాడు" అని నౌరుద్దీన్ చాచా బీబీసీతో అన్నారు.
ఆ చర్మంతో వారు ఇమ్రాన్ ఖాన్ కోసం చెప్పులు తయారు చేయించాలనుకున్నారు. నౌరుద్దీన్ చాచా చెప్పుల తయారీ ప్రారంభించారు. ఈద్‌కు ముందే ఈ చెప్పులు ఇమ్రాన్ ఖాన్‌కు బహుమతిగా అందించగలనని అనుకుంటున్నారు.
"ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. ఇవి వేసుకుంటే ఇమ్రాన్ ఖాన్‌కు వేడిగా అనిపించదు. ఆయన ఈ చెప్పులు వేసుకుని ఎంత పనిచేసినా అలసిపోరు. మా చెప్పులు ఆయనకు బాగా నచ్చుతాయనే అనుకుంటున్నాం" అని నౌరుద్దీన్ చెప్పారు.
"ఇమ్రాన్ ఖాన్ కోసం తయారు చేస్తున్న ఈ చెప్పులను, ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నాం" అని నౌరుద్దీన్ చాచా పెద్ద కొడుకు సలాముద్దీన్ బీబీసీతో అన్నారు.
"ఈ చెప్పుల డిజైన్ బయటి నుంచి చూస్తే మామూలు పెషావర్ చెప్పుల్లాగే కనిపిస్తాయి. కానీ వాటిని వేసుకుంటే మాత్రం, అవి ప్రత్యేకంగా తయారు చేసినట్లు తెలుస్తుంది".

ఫొటో సోర్స్, ISLAMUDDIN
తయారీ వ్యయం 40 వేలు
ఈ చెప్పుల తయారీ కోసం నాలుగు అడుగుల పాము చర్మం ఉపయోగిస్తున్నట్టు సలాముద్దీన్ చెప్పారు.
ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఈ చెప్పులను బహుమతిగా ఇచ్చిన తర్వాత వాటికి బ్రాండ్ నేమ్ కూడా ఇస్తామని ఆయన చెప్పారు. ఈ చెప్పుల తయారీకి కనీసం 40 వేల పాకిస్తానీ రూపాయలు ఖర్చవుతుంది.
ఇంతకు ముందు కూడా పాకిస్తాన్‌లో పాము చర్మంతో చెప్పులు తయారు చేసేవారని నౌరుద్దీన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పాము చర్మంతో చాలా వస్తువులు తయారు చేస్తున్నారు. వాటిని కొందరు చాలా ఇష్టపడి కొంటారు.
జంతువుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న కొందరు మాత్రం ఇలాంటి వస్తువులను వ్యతిరేకిస్తున్నారు. కొండచిలువ చర్మంతో చేసిన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్‌లో వేల డాలర్లు పలుకుతాయి.

ఫొటో సోర్స్, ISLAMUDDIN
వన్యప్రాణుల చట్టం ఏం చెబుతోంది
కొండచిలువల చర్మంతో కొందరు చెప్పులు తయారు చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చిన్న పాముల చర్మం ఎందుకూ పనికిరాదు. అందుకే పెద్ద పాముల చర్మం ఉపయోగించి రకరకాల వస్తువులు తయారు చేస్తారు. అలాంటి పెద్ద పాముల్లో కొండచిలువ ఒకటి.
బీబీసీ చూపించిన పాము చర్మం ఫొటోలు చూసి, "అది కొండచిలువ చర్మమే" అని పాక్ పాలిత కశ్మీర్‌లోని బాగ్ యూనివర్సిటీలో వన్యప్రాణుల ప్రొఫెసర్ చెప్పారు.
"పాకిస్తాన్‌లో కొండచిలువలు దాదాపు అంతరించిపోయే స్థితికి చేరాయి. వాటి జనాభా చాలా తగ్గిపోయింది" అని అన్నారు.
పాకిస్తాన్‌లో భంబర్ జిల్లాలో మాత్రమే ప్రస్తుతం కొండచిలువలు ఉన్నాయి.
పాకిస్తాన్‌లో కొండచిలువల సంఖ్య తగ్గిపోవడానికి స్మగ్లింగ్, వాతావరణం కూడా కారణం అని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రయవిక్రయాలు నేరం
కొండచిలువలను దొంగిలించడం, వాటి చర్మం అమ్మడం లాంటి కేసులు ఇప్పటికీ వెలుగులోకి వస్తున్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు. ఇటీవల ఇస్లామాబాద్ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ బోర్డ్ అధికారులు రెండు కొండచిలువ చర్మాల్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ చర్మాలను విదేశాలకు స్మగ్లింగ్ చేయాలని ప్రయత్నించినట్లు అధికారులు చెప్పారు. పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ మినహా దేశవ్యాప్తంగా కొండచిలువలను రక్షిత ప్రాణుల్లో చేర్చామని చెప్పారు.
అంటే పాకిస్తాన్‌లో కొండచిలువలు, వాటి చర్మాలు అమ్మడం, కొనడంపై నిషేధం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కొండచిలువల క్రయవిక్రయాలపై నిషేధం విధించిన 'కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్‌డేంజర్డ్ స్పీసిస్'లో పాకిస్తాన్ సభ్యదేశం. కొండచిలువ చర్మం లాంటివి తీసుకోవాలంటే ఈ సంస్థ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ప్రత్యేక సందర్భాలలో మాత్రమే లభిస్తుంది.
కొండచిలువలు, వాటి చర్మంపై ఇన్ని ఆంక్షలు ఉన్నప్పుడు, పెషావర్ చెప్పుల తయారీదారుడు బహుమతిగా ఇస్తున్న ఈ కొండచిలువ చర్మం చెప్పులను అసలు ఇమ్రాన్ ఖాన్ వేసుకుంటారా అనే ప్రశ్న కూడా వస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఓటుకు రూ. 2,000 పంచారు.. దేశంలో ఒక్కో లోక్‌సభ స్థానంలో రూ. 100 కోట్ల వ్యయం’’
- పాకిస్తాన్ మిలటరీ జనరల్‌కు యావజ్జీవం, మరో ఇద్దరికి మరణ శిక్ష
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మోనా లీసాకు ప్రాణం పోశారు
- ఆస్ట్రియా ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన రహస్య వీడియో
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- మోదీ విజయంతో పాక్, అమెరికా, ఇంగ్లండ్‌లో సంబరాలు చేసుకున్నారా?
- కందుకూరి వీరేశలింగం: సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు చేసిన సంస్కర్త
- తెలంగాణలో ‘నమో’ సునామీ: టీఆర్ఎస్ గుర్తించాల్సిన పాఠాలు
- తెలుగుదేశం పార్టీ: గత వైభవాన్ని తీసుకురాగల నాయకుడెవరు
- రాహుల్ గాంధీ: కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు ఇదే ముగింపా?
- మోదీ వాగ్ధానాల విలువ రూ.100 లక్షల కోట్లు.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








