మోదీ విజయంతో పాక్, ఇంగ్లండ్, అమెరికాల్లో సంబరాలు చేసుకున్నారా? - Fact Check

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
లోక్‌సభ ఎన్నికలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గెలవడంతో వివిధ దేశాల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నట్లు పలు వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోదీ అద్భుత విజయాన్ని సాధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అసరవమైన కనీస స్థానాల కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలిచారు.
కాంగ్రెస్ పార్టీపై వచ్చిన అవినీతి ఆరోపణలు 2014లో బీజేపీ గెలుపునకు తోడ్పడ్డాయి. కానీ, ఈ సారి గెలుపును మాత్రం మోదీ పరిపాలనకు ప్రజల అంగీకారంగా భావించాలి.
వరుసగా రెండోసారి పార్టీని పూర్తి మెజారిటీతో అధికారంలోకి తీసుకురావడం 1971 తర్వాత ఇదే తొలిసారి. బీజేపీ విజయాన్ని మోదీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఘనంగా జరుపుకుంటున్నారు.
అయితే, సోషల్ మీడియాలో లక్షలాదిగా షేర్ చేస్తున్న ఇలాంటి కొన్ని వీడియోలు మోదీ విజయానికి సంబంధించినవి కావని మా పరిశోధనలో తేలింది.

ఫొటో సోర్స్, SM Viral Posts
భారత ధనవంతుడు డబ్బులు వెదజల్లడం
ఓ ధనికుడైన భారతీయుడు మోదీ విజయం సాధించడంతో న్యూయార్క్ రోడ్డుపై లక్షల డాలర్లను వెదజల్లాడని సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి ప్రజలు గుంపుగా ఉన్న చోట డబ్బులు వెదజల్లుతున్నారు. కొంతమంది ఈ వీడియో కెనడాకు సంబంధించినది అని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Instagram/Kolhaolam
ఈ వీడియో నిజమే కానీ, మోదీ విజయాన్ని ఇలా జరుపుకుంటున్నారనేది అబద్దం. ఈ వీడియోలో డబ్బులు విసిరేస్తున్న వ్యక్తి జో కుష్. అతను మ్యూజిక్ ప్రొడ్యూసర్, వీడియో ఇంజినీర్. భారతీయ ధనికుడైతే కాదు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ప్రయత్నిస్తే మే 16న ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో దొరికింది. అంటే ఎన్నికల కంటే ముందే ఈ వీడియో సోషల్ మీడియాలో ఉంది.
జో కుష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా డబ్బులు వెదజల్లే అనేక వీడియోలో కనిపించాయి. ఫేస్‌బుక్‌లోనూ ఆయన ఇలాండి వీడియోలను షేర్ చేశారు.

ఫొటో సోర్స్, SM VIRAL POST
బలూచిస్తాన్‌లో మోదీ విజయాన్ని జరుపుకున్న ప్రజలు
పాకిస్థాన్‌కు సంబంధించిన బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ప్రజలు మోదీ విజయంతో సంబరాలు చేసుకున్నారని మరో వీడియో షేర్ అవుతోంది.
ఈ వీడియోలో కొంతమంది బీజేపీ జెండా పట్టుకొని పాటలు పాడుతూ డాన్సులు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Twitter/BJP
''పాకిస్తాన్‌లో తొలి బ్రాంచ్‌ను బీజేపీ ప్రారంభించింది. భారత్‌లోని కొందరు దేశద్రోహులు పాక్ జెండాను పట్టుకుంటున్నారు. కానీ, ఇప్పుడు ఇలాంటిది చూడటం చాలా బాగుంది'' అని ఆ వీడియోపై ఉంది. కానీ, ఈ వీడియోపై ఉన్నది నిజం కాదు.
పాక్‌లో బీజేపీ జెండాలను పట్టుకుంటున్నారని గతంలోనూ ఇదే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది నిజం కాదని అప్పుడు బీబీసీ నిరూపించింది.
మా పరిశోధనలో తేలిందేమిటంటే, ఈ వీడియో కశ్మీర్‌లోనిది. పాక్‌కు ఈ వీడియోతో సంబంధం లేదు.
అనంత్‌నాగ్ స్థానానికి బీజేపీ తరఫున నామినేషన్ వేయడానికి ఆ పార్టీ అభ్యర్థి సోఫీ యూసఫ్ వెళుతున్న సమయంలో ఆయన మద్దతుదారులు ఇలా బీజేపీ జెండాలు పట్టుకొని పాటలు పాడారు.
బీజేపీ జమ్మూ, కశ్మీర్ అధికారిక ట్విటర్‌లో 2019 మార్చి 31న ఈ వీడియో పోస్టు చేసి ఉంది.

ఫొటో సోర్స్, SM Viral Post
మోదీ విజయాన్ని లండన్ బస్సుల్లో జరుపుకోవడం
లండన్‌లోని డబుల్ డెక్కర్ బస్సు మీద మోదీ విజయానికి సంబంధించిన సందేశం ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఫొటో 50 వేలకు పైగా షేర్ అయింది. ఈ ఫొటో కింద ''లండన్‌లోని అన్ని సిటీ బస్సుల్లో ఇలా 'వెల్‌కమ్ మోదీ' అని రాశారు. ఏ దేశ ప్రధానమంత్రికీ కూడా ఈ స్థాయి గౌరవం దక్కలేదు'' అని ఉంది.

ఫొటో సోర్స్, Twitter
అయితే, మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, ప్రధాన మంత్రి మోదీ తొలి ఇంగ్లండ్ పర్యటనను పురస్కరించుకొని ఆ దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలను చుట్టివచ్చేలా కొంతమంది భారతీయులు 'మోదీ ఎక్స్‌ప్రెస్' పేరుతో ప్రత్యేకంగా బస్సుయాత్ర చేపట్టారు.

ఫొటో సోర్స్, Twitter/BJP
2015లో తొలిసారి మోదీ మూడు రోజుల పర్యటనకు ఇంగ్లండ్ వచ్చారు. ఆ ఫొటోకు మోదీ విజయానికి ఎలాంటి సంబంధం లేదు.

ఫొటో సోర్స్, youtube
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సమయంలో సంబరాలు చేసుకోవడం
ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇంగ్లండ్‌లో టీవీలలో చూసి మోదీ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారని మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కానీ, వాస్తవం ఏమిటంటే ఈ వీడియోను మార్ఫింగ్ చేశారు. ఎథీస్ట్ కృష్ణ పేరుతో ఈ వీడియోపై వాటర్‌మార్క్ ఉంది. ట్విటర్‌లో పరిశీలిస్తే అతను సుప్రసిద్ధ ఫొటో, వీడియో ఎడిటర్ అని తెలిసింది.
ఆయన టైం లైన్‌లోనూ ఇదే వీడియో పోస్టు చేసి ఉంది.
మార్చి 2019లో వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ విడుదల చేసినప్పుడు కూడా ఇదే వీడియోను షేర్ చేశారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ప్రయత్నిస్తే ఈ వీడియోను హర్ట్ న్యూస్ వెస్ట్ కంట్రీ... 2016 జూన్ 16న యూట్యూబ్‌లో పోస్టు చేసినట్లు తేలింది.
యూరో కప్ 2016 పోటీల్లో వేల్స్ మీద ఇంగ్లండ్ గెలవడంతో అస్టన్ గేట్ స్టేడియం వద్ద అభిమానులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారని ఆ వీడియో కింద ఉంది.
ఇవి కూడా చదవండి
- ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్ని?
- కొత్త వారసుల్లో గెలిచిందెవరు... ఓడిందెవరు...
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే
- చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు...
- జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్కడు రాపాక వరప్రసాద్
- మోదీ ఎన్నికల మంత్రం: ‘దేశ భద్రత - హిందుత్వ సమ్మేళనం’తో... సామాజిక, ఆర్థిక సమస్యలు బలాదూర్
- జాకీర్ మూసా: ఇండియాలో 'మోస్ట్ వాంటెడ్' మిలిటెంట్ కశ్మీర్లో కాల్చివేత
- నరేంద్ర మోదీ ఘన విజయాన్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి...
- నడిచొచ్చే నాయకులకు కలిసొచ్చే అధికారం
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









