ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు...

ఫొటో సోర్స్, PAvan/chiru/fb
తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్న సినీనటుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ, ఎన్నికల్లో పోటీ చేయడంలోనూ సోదరుడు చిరంజీవిని అనుసరించారు.
ఆయనలాగే పార్టీ పెట్టారు. రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే, ఈ సోదరుల పార్టీలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
2009 ఎన్నికలకు ముందు చిరంజీవి.. ప్రజారాజ్యం పేరుతో పార్టీ స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 288 స్థానాలలో పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ 18 శాసన సభ స్థానాలను గెలుచుకుంది. ఇందులో తెలంగాణ ప్రాంతం నుంచి గెలుచుకున్న రెండు సీట్లు తీసేస్తే సీమాంధ్ర లో సీట్లు 16 మాత్రమే. ఇక ఓట్ల శాతం గమనిస్తే ఉమ్మడి ఏపీలో ప్రజారాజ్యానికి 16.32% శాతం ఓట్లు పోలయ్యాయి.
చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, రాయలసీమలోని తిరుపతి నుంచి బరిలోకి దిగగా తిరుపతి నుంచి మాత్రమే నెగ్గారు. పాలకొల్లులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉషా రాణి చేతిలో పరాజయం పాలయ్యారు.
2009 ఎన్నికల తరువాత రెండేళ్లలోనే చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఆయనకు అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది.
2014 రాష్ట్ర విభజన తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఫొటో సోర్స్, janasena/fb
అన్నదారిలో తమ్ముడు
పవన్ కల్యాణ్ కూడా 2014 ఎన్నికలకు ముందు జనసేన పేరుతో పార్టీని స్థాపించారు. ప్రశ్నించేందుకే పార్టీని పెట్టానని ఆవిర్భావ సభలో ప్రకటించిన పవన్ ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చారు.
2019 ఎన్నికల్లో మాత్రం వామపక్షాలు, బీఎస్పీతో కలిసి బరిలోకి దిగారు. కూటమిలో సీట్ల పంపకం తర్వాత జనసేన 138 స్థానాల నుంచి పోటీకి దిగింది.
పోటీ చేయడంలో కూడా అన్ననే అనుసరించిన పవన్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి బరిలోకి దిగారు.
జనసేనకు అత్యధికంగా సభ్యత్వాలు నమోదైన గాజువాక నుంచి, అలాగే భీమవరం నుంచి పోటీ పడ్డారు. కానీ, రెండు చోట్ల ఓటమిపాలయ్యారు.
భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో 8,357 ఓట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక్కడ పవన్‌కు 53 వేల 005 ఓట్లు వచ్చాయి.
గాజువాకలో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డికి 51 వేల 009 వేల ఓట్లు వచ్చాయి. పవన్‌కు 42 వేల 994 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి 16753 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
పవన్ సోదరుడు నాగబాబు నర్సాపురం పార్లమెంట్ కు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన రఘురామ కృష్ణంరాజు గెలుపొందారు. ఆయన తర్వాత టీడీపీ అభ్యర్థి శివరామరాజు నిలిచారు. 2,50,289 ఓట్లు సాధించిన నాగబాబు మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ కూడా పరాజయం పాలయ్యారు. ఈ స్థానంలో వైసీపీ నుంచి బరిలోకి దిగిన ఎంవీవీ సత్యనారాయణ 4,36,906 ఓట్లు సాధించి గెలుపొందారు. తర్వాత స్థానంలో టీడీపీ అభ్యర్థి భరత్ నిలిచారు. మూడో స్థానంలో నిలిచిన లక్ష్మీనారాయణ 2,88,874 ఓట్లు సాధించిగలిగారు.
జనసేన నుంచి పోటీ చేసిన కీలక నేతలు నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ తదితరులు కూడా పరాజయడం పాలయ్యారు.
జనసేన ఈ ఎన్నికల్లో మొత్తంగా 6.78 శాతం ఓట్లను సాధించగలిగింది. ఇది ప్రజారాజ్యం పార్టీ కంటే 10 శాతం తక్కువ (చిరంజీవి పార్టీ 16.32 శాతం ఓట్లను సాధించగలిగింది).

ఫొటో సోర్స్, RAPAKA/FB
జనసేనకు ఒక్క సీటు
జనసేన ఈ ఎన్నికల్లో ఒకే ఒక శానసన స్థానాన్ని గెలుచుకుంది. ఆ పార్టీ నుంచి రాజోలు తరఫున బరిలోకి దిగిన రాపాక వరప్రసాద్ రావు స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.
ఆయనకు 50,053 ఓట్లు పోలయ్యాయి. 814 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి బానోతు రాజేశ్వరరావుపై గెలుపొందారు.
మల్కిపురం నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాపాక 2009లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరిగా జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగారు.
రాపాక విజయంలో ఎస్సీ సామాజిక వర్గంతో పాటు కాపు, క్షత్రియ సామాజిక వర్గం కూడా కీలక పాత్ర పోషించింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








