లోక్‌సభ ఎన్నికలు 2019 : బీజేపీ విమానాశ్రయాల నిర్మాణాల గురించి చెబుతున్న లెక్కల్లో నిజమెంత? -BBC Reality Check

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సమీహా నెట్టిక్కార
- హోదా, బీబీసీ ప్రతినిధి
విమానయానాన్ని మరింత ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని 2014లో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం చెబుతోంది. ప్రాంతీయ విమానయాన నెట్‌వర్కులను విస్తరించడానికి, అప్పటివరకు విమాన సేవలకు నోచుకోని ప్రాంతాలను, మహానగరాలను అనుసంధానించేందుకు ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది.
తమ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయని పాలక బీజేపీ చెబుతోంది. సేవలందించే విమానాశ్రయాల సంఖ్య బాగా పెరిగిందని అంటోంది.

మాటలు: దేశంలో సేవలందించే విమానాశ్రయాల సంఖ్య 2014లో 65గా ఉండేదని, 2019 నాటికి ఇది 102కు పెరిగిందని బీజేపీ చెబుతోంది.
2017లో దేశీయ మార్గాల్లో 10 కోట్ల మందికి పైగా ప్రజలు విమానయానం చేశారని బీజేపీ అంటోంది. ఏసీ రైలు బోగీల్లో కన్నా విమానాల్లో ఎక్కువ మంది ప్రయాణించారని, ఇలా జరగడం ఇదే తొలిసారని కూడా చెబుతోంది.
వాస్తవాలు: ప్రభుత్వం, విమానయాన అధికార యంత్రాంగం గణాంకాల ప్రకారం 2014 కన్నా ఇప్పుడు ఎక్కువ విమానాశ్రయాలు వినియోగంలో ఉన్నాయి. అయితే ఈ సంఖ్య బీజేపీ చెబుతున్నంతగా పెరగలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విమాన ప్రయాణికుల సంఖ్యలో భారీ పెరుగుదలపై బీజేపీ వాదనలో వాస్తవం ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
విమానాశ్రయాలు ఎన్ని?
దేశంలో 2014లో వినియోగంలో ఉన్న విమానాశ్రయాల సంఖ్య 65గా ఉండేదని, 2019 నాటికి ఇది 102కు పెరిగిందని బీజేపీ ఫిబ్రవరిలో ట్విటర్‌లో పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రైలు ప్రయాణికులతో పోలిస్తే విమాన ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదలనూ బీజేపీ ప్రస్తావించింది.
అదే నెలలో బీజేపీ చేసిన మరో ట్వీట్‌లో భిన్నమైన గణాంకాలు ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
2014లో 75 విమానాశ్రయాలు సేవలు అందించేవని, ఇప్పుడు వీటి సంఖ్య 100కు చేరిందని బీజేపీ ఆ ట్వీట్‌లో చెప్పింది.
రెండు అధికారిక సంస్థల వద్ద అందుబాటులో ఉన్న గణాంకాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
పౌర విమానయాన నియంత్రణ సంస్థ అయిన పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) గణాంకాల ప్రకారం-
- 2015 మార్చిలో 97 విమానాశ్రయాలు సేవలు అందించేవి. వీటిలో 65 దేశీయ విమానాశ్రయాలు. 24 అంతర్జాతీయ విమానాశ్రయాలు. ఎనిమిది కస్టమ్స్ విమానాశ్రయాలు.
- 2018 మార్చి నాటికి ఈ సంఖ్య 97 నుంచి 109కి పెరిగింది. వీటిలో 74 దేశీయ, 26 అంతర్జాతీయ, తొమ్మిది కస్టమ్స్ విమానాశ్రయాలు.

ఫొటో సోర్స్, Rajiv Srivastava
పౌర విమానయాన మౌలిక సదుపాయాల వ్యవహారాలను పర్యవేక్షించే భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ(ఏఏఐ) లెక్కల ప్రకారం చూస్తే పరిస్థితి మరోలా ఉంది.
ఏఏఐ 2013-14 నివేదిక ప్రకారం అప్పటికి 68 విమానాశ్రయాలు వినియోగంలో ఉన్నాయి.
తమ యాజమాన్యంలో, నిర్వహణలో మొత్తం 125 ఎయిర్‌పోర్టులు ఉన్నాయని ఆ తర్వాతి సంవత్సరం ఏఏఐ తెలిపింది. వీటిలో 65 మాత్రమే అప్పట్లో వినియోగంలో ఉన్నాయనే సమాచారం ఉంది.
2018 మార్చి నాటికి మొత్తం విమానాశ్రయాల సంఖ్యను ఏఏఐ 129గా పేర్కొంది. వీటిలో ఎన్ని వినియోగంలో ఉన్నాయో వెల్లడించలేదు.
2018 జులైలో ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ఒక ప్రకటన మాత్రం 101 విమానాశ్రయాలు వినియోగంలో ఉన్నాయని తెలిపింది.
వినియోగంలో ఉన్నాయని ఏఏఐ పేర్కొనే విమానాశ్రయాలనే బీజేపీ ప్రస్తావిస్తున్నట్లుగా అనుకోవచ్చు.

ఫొటో సోర్స్, Ravisankar Lingutla
ఎవరి మాట ఏమిటి?
విమానాశ్రయాలపై కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం చెప్పిన లెక్కకూ, బీజేపీ లెక్కకూ మధ్య చాలా వ్యత్యాసం ఉంది.
90 విమానాశ్రయాలు వినియోగంలో ఉన్నాయని 2014 ఫిబ్రవరిలో యూపీఏ హయాంలో ఒక మంత్రి పార్లమెంటులో ప్రకటించారు.
అదే సంవత్సరానికి సంబంధించి పౌర విమానయాన శాఖ వార్షిక నివేదిక వీటి సంఖ్యను 94గా చూపింది.
విమానయానాన్ని ప్రోత్సహించేందుకు బీజేపీ 2016లో ప్రవేశపెట్టిన పథకాన్ని పరిశీలిస్తే కూడా గణాంకాలపై సందేహాలు వస్తాయి.
2019 ఫిబ్రవరి నాటికి ఈ పథకం అమలువల్ల 38 విమానాశ్రయాలు సేవలు ప్రారంభించాయని బీజేపీ చెబుతోంది. వీటిలో కొన్ని విమానాశ్రయాలు సైనిక విమానాశ్రయాల పరిధిలో ఉంటూనే పౌర విమానాశ్రయాలుగా అప్పటికే సేవలు అందిస్తున్నాయని రికార్డులు వెల్లడిస్తున్నాయి.
నిరుడు డిసెంబరులో పార్లమెంటులో పౌర విమానయానశాఖ మంత్రి చేసిన ప్రకటన వీటన్నిటికీ భిన్నమైన దృశ్యాన్ని కళ్లకు కడుతోంది.
గత ఐదేళ్లలో కేవలం నాలుగు విమానాశ్రయాలే ప్రయాణికులకు సేవలు ప్రారంభించాయని మంత్రి తన ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, FB/Tirupati Airport - AAI
విమానాల్లో ప్రయాణించేవారు ఎంత మంది?
ఇటీవలి సంవత్సరాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మార్కెట్‌లో విమానయాన సంస్థల మధ్య తీవ్రమైన పోటీ ఉంది.
బీజేపీ చెప్పినట్లుగా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య ఇప్పటికే 10 కోట్లను దాటేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్గాల్లో 10.37 కోట్ల మంది ప్రయాణించారని నిరుడు ఫిబ్రవరిలో ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన వెల్లడిస్తోంది.
2016లో దేశీయ మార్గాల్లో దాదాపు 10 కోట్ల మంది విమానాల్లో ప్రయాణం చేశారని డీజీసీఏ గణాంకాలు చెబుతున్నాయి. తర్వాతి ఏడాది ఈ సంఖ్య 11.78 కోట్లకు పెరిగిందని వివరిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
రైలు x విమానం
భారతీయుల్లో అత్యధికులు సుదూర ప్రయాణాలకు రైలు వైపే మొగ్గు చూపుతారు. రైలు ప్రయాణం అంత సౌకర్యవంతమైనది కాకపోయినా, ఖర్చు తక్కువ కావడం దీనికి ప్రధాన కారణం.
అయితే 2017లో రైళ్లలో ఏసీ కోచ్‌లలో ప్రయాణం చేసినవారి కన్నా విమాన ప్రయాణం చేసినవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఏసీ తరగతిలో ప్రయాణం బాగా ప్రియమైనది కావడమే దీనికి కారణంగా కనిపిస్తోంది.
భారత రైల్వే వార్షిక నివేదిక 2016-17 ప్రకారం- ఆ సంవత్సర కాలంలో ఏసీ తరగతిలో ప్రయాణం చేసినవారి సంఖ్య 14.55 కోట్లు.
2017లో భారత్‌లో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో 15.84 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారని డీజీసీఏ వెల్లడించింది. ఇదో సరికొత్త రికార్డు.
2037 నాటికి భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య 52 కోట్లకు పెరుగుతుందని అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ(ఐఏటీఏ) అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో, విమానయానానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను మరింతగా కల్పించాల్సిన అవసం ఉంది.
2040 నాటికి వంద కోట్ల మంది ప్రయాణికులకు సరిపడా విమానాశ్రయాలను నిర్మిస్తామని 'విజన్ 2040'లో బీజేపీ చెబుతోంది.
అయితే, ప్రయాణికుల వృద్ధికి తగినట్లుగా త్వరితగతిన మౌలిక సదుపాయాలను కల్పించగలరా, అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోగలరా అనే సందేహాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రధాని అయ్యేందుకు ఫేస్‌బుక్ సహకరించిందా?
- బరువు పెరిగితే.. క్యాన్సర్ ముప్పు
- మన దేశానికి సెకండ్ హ్యాండ్ దుస్తులు ఎక్కడి నుంచి వస్తాయి?
- గూగుల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- 'రాక్షసుడి బంగారం' బయటకు తీసే కార్మికుల కథ
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
- బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలు భారత్‌లో ఎన్ని ఉన్నాయి? ఏఏ విమానయాన సంస్థలు వీటిని నడుపుతున్నాయి?
- ప్రపంచవ్యాప్తంగా 737 మాక్స్ 8 విమానాలను నిలిపేసిన బోయింగ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








