2018లో పెరిగిన విమాన ప్రమాద మరణాలు.. ఒక్క ఏడాదే 556 మంది చనిపోయారు

విమానం

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, ఇప్పటికీ అత్యంత సురక్షితమైన ప్రయాణ మార్గం విమానయానమేనని నిపుణులు చెప్తున్నారు

విమాన ప్రమాదాల్లో మరణాల సంఖ్య 2017తో పోలిస్తే గత ఏడాదిలో గణనీయంగా పెరిగాయి. అయినప్పటికీ.. విమానయానంలో సురక్షితమైన సంవత్సరాల్లో 2018 తొమ్మిదో స్థానంలో ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి.

గత ఏడాది విమాన ప్రమాదాల్లో 556 మంది చనిపోయారని ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ (ఏఎస్ఎన్) పేర్కొంది. 2017లో విమాన ప్రమాదాల మృతుల సంఖ్య 44 మంది మాత్రమేనని చెప్పింది.

అక్టోబర్ నెలలో ఇండొనేసియాలో కుప్పకూలిన లయన్ ఎయిర్ విమానం దుర్ఘటనలో 189 మంది చనిపోయారు. ఏడాదిలో అదే అతి పెద్ద విమాన ప్రమాదం.

అయితే.. 2017 సంవత్సరం వాణిజ్య విమానయాన సంస్థల చరిత్రలో అత్యంత సురక్షితమైన సంవత్సరంగా నమోదైంది. ఆ ఏడాది ప్రయాణికుల విమానం ఒక్కటి కూడా కూలినట్లు నమోదు కాలేదు.

‘భారీ పురోగతి’

2018లో మొత్తం 15 ప్రాణాంతక విమాన ప్రమాదాలు జరిగాయని నెదర్లాండ్స్‌లోని ఏఎస్ఎన్ తెలిపింది. అందులో అత్యంత భారీ దుర్ఘటనలు:

ఇండొనేసియాలో కూలిన లయన్ ఎయిర్ విమానం.. బోయింగ్ 737 మాక్స్ విమానం జకార్తా నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే జావా సముద్రంలో కూలిపోయింది. ఆ విమానం గాలిలోకి ఎగిరేందుకు అనువుగా లేదని భావించారు.

జూలై నెలలో క్యూబాలో ఓ విమాన ప్రమాదంలో 122 మంది చనిపోయారు. ఆ విమానం కూలిపోవటానికి కారణం మానవ తప్పిదమని ఆరోపణలు వచ్చాయి.

ఫిబ్రవరి నెలలో ఇరాన్‌లో జాగ్రోస్ పర్వతాల్లో ఒక విమానం కూలిపోవటంతో 66 మంది చనిపోయారు.

మార్చిలో నేపాల్ ఖట్మాండూ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న విమానం కూలిపోయి 51 మంది చనిపోయారు.

అయితే.. మొత్తంగా చూస్తే గత 20 ఏళ్లుగా పరిస్థితి సాధారణంగా మెరుగుపడుతోంది.

‘‘ప్రమాదాల రేటు పదేళ్ల కిందటి స్థాయిలోనే ఉన్నట్లయితే.. గత ఏడాది 39 ప్రాణాంతక ప్రమాదాలు జరిగి ఉండేవి’’ అని ఏఎస్ఎన్ సీఈఓ హారో రాంటర్ పేర్కొన్నారు.

‘‘2000 సంవత్సరపు ప్రమాద రేటును బట్టి చూస్తే 2018లో 64 దారుణ ప్రమాదాలు జరిగివుండేవి. దీనినిబట్టి గత రెండు దశాబ్దాల్లో భద్రత విషయంలో భారీ పురోగతి సాధించినట్లు తెలుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.

అయితే.. గత ఐదేళ్లలో జరిగిన 25 భారీ ప్రమాదాల్లో 10 ప్రమాదాలు నియంత్రణ కోల్పోవటం వల్ల (ఎల్ఓసీ) జరిగినవేనని ఏఎస్ఎన్ పేర్కొంది. ఈ ఎల్ఓసీ ప్రమాదాలు ఇప్పుడు భద్రత విషయంలో విమానయాన పరిశ్రమ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అని అభివర్ణించింది.

విమానం తన ప్రయాణ గతి నుంచి అనుకోకుండా దారిమళ్లటాన్ని ఎల్ఓసీగా పరిగణిస్తారు. యాంత్రిక వైఫల్యం, మానవ చర్యలు, లేదా పర్యావరణ సమస్యల వల్ల ఇలా జరగవచ్చు. అటువంటి ప్రమాదాల నుంచి బయటపడటం దాదాపుగా అసాధ్యమని ఏఎస్ఎన్ చెప్తోంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)