జేబు దొంగ కూతురికి అర్ధరాత్రి వెళ్లి పాలిచ్చిన మహిళా పోలీసు

ఫొటో సోర్స్, Priyanka
సమయం అర్ధరాత్రి ఒంటి గంట. అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఆయన్నుంచి ఫోన్ వచ్చింది.
ఫోన్లో వెనుక ఎవరో పాప గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఎవరు పాప ఏడుస్తున్నారని అడిగాను.
అప్పుడాయన నెలన్నర వయసున్న ఆ పాపను ఎవరో రోడ్డుపై వదిలేశారు.. ఒకతను పోలీసు స్టేషన్‌కి తెచ్చాడు అని చెప్పారు.
పాప అంతలా గుక్కపెట్టి ఏడుస్తోంటే.. ఒక తల్లిగా ఆ బాధ నాకు అర్థమైంది. ఏదో తెలియని బాధ.. ఆ పాపకు ఏమవుతుందో అన్న ఆందోళన.
దీంతో మరొకటి ఆలోచించకుండా ఎనిమిది నెలల వయసున్న మా బాబును మా అమ్మకు అప్పజెప్పి.. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని బేగంపేట నుంచి అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాను.
అప్పటికీ ఆ పాప గట్టిగా కళ్లు మూసుకుని గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంది. మరోపక్క మంచి దుస్తులు లేకపోవడంతో చలికి వణుకుతూ ఉంది. ఆ పసికందు పడుతున్న బాధను చూసి నాకే ఏడుపు వచ్చింది.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ పాపకు చనుబాలు పట్టాను. దాదాపు 40 నిమిషాల పాటు చన్ను వదల్లేదు.
కడుపారా పాలు తాగాక నెమ్మదిగా కళ్లు తెరిచింది. అప్పుడు హమ్మయ్య అనిపించి. తర్వాత ఆ పాపను మెటర్నిటీ ఆస్పతికి అప్పగించి నేను ఇంటికి తిరిగెళ్లాను.
ఇవీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న పాపకు పాలు పట్టిన పోలీసు కానిస్టేబుల్ ప్రియాంక... బీబీసీ తెలుగు ప్రతినిధి బొల్లంపల్లి వేణుగోపాల్‌కి చెప్పిన మాటలు.

ఫొటో సోర్స్, Priyanka
అసలేం జరిగింది?
అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ రవీంద్ర. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..
డిసెంబరు 30న రాత్రి 11.30 గంటల సమయంలో స్టేషన్‌కి ఎవరో యువకుడు నెలన్నర వయసున్న పాపను తీసుకొచ్చాడు.
బుర్ఖా ధరించి మద్యం తాగి ఉన్న ఓ మహిళ అతనికి ఈ పాపను అప్పజెప్పి నీళ్లుతాగి వస్తానని చెప్పింది. అయితే ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో ఆ పాప ఏడవడం మొదలుపెట్టింది.
యాకత్‌పురాకు చెందిన ఆ యువకుడు పాపను ఇంటికి తీసుళ్లి ప్యాకెట్ పాలు తాగించేందుకు ప్రయత్నం చేశారు. కానీ, నెలన్నర వయసున్న పాప కావడంతో తాగలేదు. పైగా ఏడుపూ ఆపలేదు.
దీంతో వాళ్లు ఆ పాపను అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా పోలీసులు ఎంత ఓదార్చినా ఆ పాప ఏడుపు ఆపలేదు.
ఇంతలో రవీంద్ర ఇంటికి ఫోన్ చేయగా.. ఆయన భార్య పాప ఏడుపు విని.. అర్ధరాత్రి స్టేషన్‌కు వచ్చి పాలిచ్చి వెళ్లారు.
ఆమె బేగంపేట మహిళ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Ani
ఆ పాప తండ్రి ‘జేబు దొంగతనం’ కేసులో నిందితుడు
పోలీసు స్టేషన్‌లో ప్రియాంక పాలు పట్టిన తర్వాత పాపను ఉస్మానియా ఆస్పత్రిలోని మెటర్నిటీ వార్డుకు తరలించినట్లు రవీంద్ర బీబీసీ తెలుగుకు తెలిపారు.
తర్వాత ఆ పాప తల్లిదండ్రుల గురించి ఆరా తీయగా.. పాప తండ్రి జేబు దొంగతనం కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న ఫిరోజ్ ఖాన్‌గా తేలిందన్నారు.
పాపను యువకుడికి ఇచ్చిన తల్లి.. తన భర్త కోసం చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చినపుడు ఈ విషయం తెలిసిందని రవీంద్ర తెలిపారు.
చివరకు పాప తల్లిదండ్రులను పిలిచి.. విచారించగా వాళ్లు ఉస్మానియా సమీపంలో ఓ షెడ్డులో ఉంటున్నట్లు తెలిసిందన్నారు.
వారిని మందలించి ఇకనుంచి ప్రతి రోజూ ఉదయం.. సాయంత్రం పోలీసు స్టేషన్లో చూపించాలన్న షరతుతో వాళ్లకు ఆ పాపను అప్పజెప్పామని వివరించారు.
ప్రియాంక బీబీసీతో మాట్లాడుతూ.. ఇటీవలే తనకు యాక్సిడెంట్ కావడంతో సెలవు తీసుకొని ఇంట్లో ఉంటున్నానని పాప ఏడుపు వినడంతో చలించి పోయానని వివరించారు.
''నేనే 8 నెలల బాబు తల్లిని కదా. ఆ పాప బాధ ఏంటో నాకు తెలిసింది. నెలన్నర పాపకు ఫీడింగ్ ముఖ్యం. నేను వచ్చి ఇస్తానని పోలీసులకు చెప్పి వెంటనే వెళ్లి పాలిచ్చాను'' అని వివరించారు.
పాలుపట్టినపుడు ఆ పాప ఎంత ఆకలితో ఉందో తెలిసిందని.. ఆమె తల్లి కూడా చాలాసేపటి వరకూ పాలు ఇవ్వలేదని చెప్పారు.
ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులు కూడా ధ్రువీకరించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ప్రెస్ మీట్‌లో రవీంద్ర, ప్రియాంకలను అభినందించారు.
ఇవి కూడా చదవండి:
- ఈ పోలీసు అధికారి ఎందుకు హీరో అయ్యారు?
- పుట్టిన మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు ఇవ్వకపోతే ఏమవుతుందంటే..
- అమ్మ పాలు... బాటిల్ రూ.250
- ప్రసవం తర్వాత మహిళల కుంగుబాటు లక్షణాలేంటి? ఎలా బయటపడాలి?
- ప్రపంచ ఆరోగ్య దినం: మీరు 1990 తర్వాత పుట్టారా?
- చర్చనీయాంశమైన 'పాలిచ్చే తల్లి' ఫొటో!
- మన 'హీరో నంబర్ 1' ఏమైపోయాడు?
- ఈ అమ్మాయి జీతం కోటి రూపాయలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








