హైదరాబాద్ యువత పబ్‌లకు ఎందుకు వెళ్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లంక సామంత్
- హోదా, బీబీసీ కోసం
"నేను ప్రతి వారాంతంలో పబ్‌కు వెళ్తాను. ఆరు రోజుల వరుసగా కాలేజీకి వెళ్లిన తరువాత, పబ్బులో వాలిపోయి సేద తీరుతాం. ఫ్రెండ్స్‌తో పాటలు వింటూ, డ్రింక్స్ తీసుకుని డాన్స్ చేస్తాం. అక్కడ పరిమితులేమీ ఉండవు. పబ్‌కి వెళ్లడం నాకు చాలా ఇష్టం."
పబ్‌కి ఎందుకు వెళ్తారన్న ప్రశ్నకు హైదరాబాద్‌లోని సాయితేజ అనే డిగ్రీ విద్యార్థి సమాధానం ఇది. అతనిలాగే ఎందరికో పబ్ ఒక రిలాక్సేషన్.
ఇంతకూ హైదరాబాద్ యువత ఎందుకు వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు?
పబ్‌లో ఏం జరుగుతుంది?
పబ్‌లో లైటింగ్, మ్యూజిక్ దగ్గర నుంచి మద్యం కోసం వాడే గ్లాసుల వరకూ ప్రతీదీ ఆకట్టుకుంటుంది. అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది. ఒక్కసారి పబ్‌లోకి అడుగుపెడితే, యువతకు అది మరో ప్రపంచమే.
నేటి తరం పబ్‌కి వెళ్లడాన్ని తప్పుగా చూడ్డం లేదు. జీవితాన్ని అనుభవించే, ప్రశాంతంగా సేదతీరే సంస్కృతిలో పబ్ ఒక భాగం అయిపోయింది.
"ఆడా, మగా తేడా లేకుండా పరిచయం లేని కొత్తవారిని కలుస్తాం. కొత్త స్నేహితులతో పరిచయాలు పెంచుకుంటాం. అక్కడుంటే టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది" అన్నాడు వర్థన్ అనే కాలేజీ విద్యార్ధి.

ఫొటో సోర్స్, Getty Images
పబ్ వేరు.. బార్ వేరు
పబ్బుల్లో యువత డీజేల మ్యూజిక్ కోసం చెవి కోసుకుంటారు. మ్యూజిక్‌కి అనుగుణంగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.
"మ్యూజిక్ పెద్ద రిలాక్సేషన్. పబ్బులకు, డీజే పార్టీలకూ వచ్చిన జనం తాగి, ఎంజాయ్ చేసి వెళ్లిపోతారు. పబ్బుల్లో 21 లోపు ఏళ్ల వారికి మద్యం అమ్మకపోవడం అనే రూల్ పక్కాగా అమలవుతుంది. పరిమితంగా ఉంటే ఏదైనా ఇబ్బంది లేకుండానే ఉంటుంది. ఇక్కడకు వచ్చే ప్రతీ ఒక్కరూ వారి పరిమితుల్లోనే ఉంటారు. కష్టమర్లు మద్యం పరిమితంగా తీసుకున్నంత వరకూ ఏ ఇబ్బందీ ఉండదు." సుదీర్ఘ కాలంగా పబ్స్‌లో డీజేగా ఉన్న అనంత్ మాటలివి.
పబ్, బార్ వాతావారణానికి అసలు సంబంధమే లేదంటారు యూత్. పబ్బులో సులువుగా కొత్తవారిని స్నేహితులుగా చేసుకుంటారు. వారితో ఏ భేషజాలూ లేకుండా కలిసిపోతారు.
"పబ్ సంస్కృతి యువతను నాశనం చేసేదయితే నాతో సహా అందరూ డ్రగ్స్‌కో, మద్యానికో బానిసలైపోవాలి. నేను, నా స్నేహితులం బానే ఉన్నాం. కేవలం కొందరే అలా తయారవుతారు. అది వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది." పబ్బులపై ఉన్న చెడు అభిప్రాయం గురించి అడిగినప్పుడు మానసి అనే అమ్మాయి చెప్పిన సమాధానం ఇది. 23 ఏళ్ల మానసి మొదటిసారి ఫ్రెండ్స్‌తో పబ్‌కి వెళ్లినపుడు అది వెంటనే ఆమెకు నచ్చేసింది. చాలా మందిలానే ఆమెకీ డీజే మ్యూజిక్ అంటే ఇష్టం.

ఫొటో సోర్స్, Getty Images
మంచి చెడుల విచక్షణ
"మా తరానికి చెందిన ఒక వంద మంది పబ్‌కు వెళ్లారనుకుందాం. ఓ ఐదు మందో, పది మందో అలా అడిక్ట్ అయిపోతున్నారు. కానీ వాళ్లను చూపించి, వందమందినీ అదే గాటన కట్టేస్తున్నారు. పబ్‌కు వెళ్లే వాళ్లందరూ పాడైపోతారు అని ఎందుకు అనుకుంటారో తెలీదు. " అన్నారు సాయితేజ.
కానీ చాలామంది తల్లితండ్రులకు తమ పిల్లలు పబ్బులకు వెళ్లడం ఇష్టం ఉండదు. పబ్‌ను వినోదంగా కాకుండా ఒక అలవాటుగా వాళ్లు చూస్తున్నారు.
"పబ్ సంస్కృతి పాడు చేస్తుందనేది కాదిక్కడ. అసలది మన సంస్కృతే కాదు. మా టైంలో పబ్బుల్లేవు. కానీ మేం కూడా మా స్నేహితులతో, కజిన్స్‌తో కలసి ఎంజాయ్ చేసాం. మందు తాగి ఒళ్లు తెలియకుండా డాన్సు చేయడమేనా ఎంజాయ్ అంటే? ఇది అమ్మాయిల్నీ, అబ్బాయిల్నీ నాశనం చేస్తుంది.'' అని ఒక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ఏది మంచో, ఏది చెడో తమకు తెలుసంటోంది ప్రస్తుత తరం.
"నాకిప్పుడు 22 ఏళ్లు. నా పరిమితులు నాకు తెలుసు. ఏది మంచో తెలుసుకునేంత విచక్షణ నాలో ఉంది. నేను స్నేహితులతో పబ్బులకు వెళ్తాను. కొత్తవారిని స్నేహితులుగా చేసుకుంటాను. పబ్బులనేవి ఒత్తిడి దూరం చేసుకునే హబ్. అంతే కానీ డ్రగ్స్‌కి కేరాఫ్ అడ్రస్ కాదు." అంటూ తన వాదన వినిపించాడు ప్రణీత్ అనే కుర్రాడు.

ఫొటో సోర్స్, Getty Images
పబ్ సంస్కృతి ఆరోగ్యానికి హానికరమా?
పబ్ కల్చర్ యువత మానసిక, శారీరక ఆరోగ్యాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందని పలువురు డాక్టర్లను ప్రశ్నించింది బీబీసీ.
''నలుగురితో కలిసిపోయే ప్రదేశంగా మొదలైన పబ్ కల్చర్ క్రమంగా మద్యానికి బానిస కావడం, అది పెద్ద తప్పేమీ కాదనుకునే పరిస్థితికి వచ్చేసింది. యువత మీద చదువులు, ఇతరత్రా ఒత్తిళ్లు కూడా పబ్ కల్చర్ పెరగడానికి ఒక కారణం,'' అని వివరించారు డాక్టర్ సమీర.
పబ్బులు రిలాక్సేషన్ హబ్స్‌గా ఉంటూనే, మద్యం వల్ల వచ్చే అనేక సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయని అంటారామె.
తోటివారి ఒత్తిడితో చాలామంది యువత మొదటిసారి మందు రుచి చూసేది పబ్బుల్లోనే. తరువాత అదే అలవాటుగా మారుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
మద్యం వల్ల వచ్చే సమస్యలన్నిటికీ పబ్బులదే బాధ్యత కాకున్నా, కాలేజీకి వెళ్లే కొత్త తరానికి మద్యం అలవాటు చేస్తున్నది మాత్రం కచ్చితంగా పబ్బులే.
"మా ఆసుపత్రికి వచ్చే రోడ్ యాక్సిడెంట్ కేసుల్లో దాదాపు ప్రతిఒక్కటీ మందు తాగి నడపడమో, లేక మందుతాగి రోడ్డుపై నడవడం వల్లనో జరుగుతున్నాయి." అన్నారు డాక్టర్ సమీర.
అయితే ఎంజాయ్ చేయడానికి పబ్బులొక్కటే దారి కాదంటున్నారు మానసిక వైద్యులు.

ఫొటో సోర్స్, Getty Images
నిజంగా పబ్బులతో ప్రశాంతత వస్తుందా?
"నిజమైన మానసిక ఆనందం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రయాణించడం, పుస్తకాలు చదవడం, ఎక్సర్‌సైజులు చేయడం వంటి వాటిలో ఉంది. అప్పుడే ఒత్తిడి తగ్గుతుంది. అంతేకానీ పబ్బులకు వెళ్తే కాదు" అన్నారు గాంధీ ఆసుపత్రిలో సైకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అజయ్.
"డీజే పార్టీలు, పబ్బులు, రేవ్ పార్టీలు యువతకు అలవాటైపోయాయి. ఎవరైనా వాటికి దూరంగా ఉంటే వారిని వింతగా చూస్తున్నారు. దీనివల్ల వారు చేజేతులా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు" అన్నారు ఆయన.
పబ్బులకు వెళ్లడం కరెక్టేనా అనే భయం కొందరికి ఉంది. కానీ స్నేహితుల ఒత్తిడితోనో, కుటుంబ సమస్యలతోనో లేక సినిమాల్లో చూసినట్టు హీరోయిజం చూపించడానికో చాలామంది పబ్బులకు వెళ్తున్నారు.
"ముందు ఒత్తిడి తగ్గించుకోవడానికో, ఎంజాయ్ కోసమో పబ్బులకు వెళతారు. క్రమంగా మద్యానికి, డ్రగ్స్‌కీ అలవాటు పడతారు.'' అన్నారు డాక్టర్ అజయ్.
యువత చెబుతున్నట్లు ఒత్తిడి లేని ప్రశాంతత నిజంగా పబ్బుల్లో దొరుకుతుందా లేకపోతే అది భ్రమా? నిజమైన వినోదమేదో వాళ్లే తేల్చుకోవాలి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








