సింగపూర్‌ - అమెరికాల మధ్య ఏకధాటిగా 19 గంటలు ప్రయాణించనున్న విమానం

సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం

ఫొటో సోర్స్, SIA

ఒక్క చోట కూడా ఆగకుండా అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమాన సర్వీస్‌ సింగపూర్, అమెరికాల మధ్య గురువారం నుంచి మళ్లీ ప్రారంభమవుతోంది.

సింగపూర్ ఎయిర్‌లైన్స్ గతంలో ఈ సర్వీస్ అందించేంది. ఖర్చెక్కువ కావడంతో ఐదేళ్ల కిందట నిలిపివేసింది.

తాజాగా పునఃప్రారంభమవుతున్న ఈ విమాన సర్వీస్ 15,000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని సుమారు 19 గంటల్లో ఎక్కడా ఆగకుండా చేరుకుంటుంది.

ఇంతకుముందు ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటస్ ఎయిర్‌లైన్స్ ఆ దేశంలోని పెర్త్ నుంచి బ్రిటన్‌లోని లండన్‌కు 17 గంటల పాటు నాన్‌స్టాప్‌గా ప్రయాణించే విమాన సర్వీస్‌ను ప్రారంభించింది.

ఆ తరువాత ఖతార్‌కు చెందిన విమానయాన సంస్థ ఒకటి అక్కడి దోహా నగరం నుంచి న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ మధ్య 17.30 గంటల పాటు ఆగకుండా ప్రయాణించే విమాన సర్వీస్ ప్రారంభించింది.

సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో బిజినెస్ క్లాస్ సీట్లు

ఫొటో సోర్స్, SIA

ఫొటో క్యాప్షన్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో బిజినెస్ క్లాస్ సీట్లు

ఆదరణ ఎలా ఉంది?

ఈ నాన్‌స్టాప్ విమానం వల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుంది కాబట్టి ఆదరణ ఉంటుందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.

చాంగి విమానాశ్రయం నుంచి నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణించే ఇందులో బిజినెస్ క్లాస్ సీట్లన్నీ ఇప్పటికే నిండిపోయాయి, కానీ, ప్రీమియం ఎకానమీ సీట్లలో కొన్ని ఇంకా మిగిలాయని సింగపూర్ ఎయిర్‌లైన్స్ 'బీబీసీ'కి తెలిపింది.

కాగా, ఈ విమానంలో ఎకానమీ క్లాస్ లేదు. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించేవారికి రెండు సార్లు భోజనం పెడతారు. అది కూడా వారు కోరుకున్న సమయంలో అందిస్తారు. పడుకునేందుకు బెడ్ కూడా ఉంటుంది.

ప్రీమియం ఎకానమీ క్లాస్‌లో మూడు సార్లు భోజనం పెడతారు. అయితే, ప్రయాణికులు కోరుకున్నప్పుడు కాకుండా నిర్ణీత సమయం ప్రకారం ఇది అందిస్తారు.

ఈ ప్రయాణానికి ఉద్దేశించిన సరికొత్త విమానంలో 161 మందిని తీసుకెళ్లడానికి సీట్లుంటాయి. ఇందులో 67 బిజినెస్ క్లాస్ కాగా 94 ప్రీమియం ఎకానమీ క్లాస్‌వి.

ఆర్థికంగా కీలకమైన రెండు నగరాల మధ్య విమాన సర్వీస్ కావడంతో ఎక్కువగా వ్యాపార రంగానికి చెందిన ప్రయాణికులే ఉంటారు.

ఏ మార్గంలోనైనా కొత్తగా నాన్‌స్టాప్ విమానాన్ని ప్రారంభిస్తే ప్రయాణికుల సంఖ్య సగటున మూడు రెట్లు పెరిగినట్లు గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది.

పెర్త్, లండన్ మధ్య తిరిగే క్వాంటస్ ఎయిర్‌లైన్స్ విమానం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పెర్త్ - లండన్ మధ్య తిరిగే క్వాంటస్ ఎయిర్‌లైన్స్ విమానం

ఏ మార్గంలో వెళ్తుంది?

గురువారం ప్రారంభమైన ఈ సర్వీసును నార్త్ పసిఫిక్ మార్గంలో గమ్యాన్ని చేరుస్తున్నారు. ఈ మార్గంలో ఇది 15,341 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

మొత్తం ప్రయాణానికి 18 గంటల 25 నిమిషాలు పడుతుందని అంచనా. ఏ350-900 యూఎల్ఆర్ రకం విమానాన్ని వినియోగిస్తున్నారు. 20 గంటల పాటు నాన్‌స్టాప్‌గా ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది.

అయితే, వాతావరణ సంబంధిత పరిణామాల కారణంగా ప్రయాణ మార్గం, దూరం, చేరుకునే సమయంలో చిన్నపాటి మార్పులు చోటుచేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

చాంగి, నెవార్క్‌ల మధ్య సింగపూర్ ఎయిర్‌లైన్స్ 2004లోనే నాన్‌స్టాప్ విమానాలను నడిపింది. అనంతరం 2013లో ఆ సర్వీసులను నిలిపివేసింది.

అప్పట్లో ఏ340-500 రకం విమానాన్ని తిప్పేవారు. ఇంధన వినియోగం అధికంగా ఉండడంతో ఖర్చెక్కువై సర్వీను రద్దు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)