హెచ్‌సీయూ ఎన్నికలు: ఎనిమిదేళ్ళ తరువాత ఏబీవీపీ ఎలా విజయం సాధించింది?

హెచ్‌సీయూ
ఫొటో క్యాప్షన్, హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అధ్యక్షురాలిగా ఎన్నికైన ఆర్తి నాగపాల్
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి ఎన్నికల్లో ఎనిమిదేళ్ల తర్వాత ఏబీవీపీ అధ్యక్ష స్థానాన్ని గెలుచుకుంది.

వామపక్ష, దళిత విద్యార్ధి సంఘాలను ఓడించి ఆరు యూనియన్ పోస్టులను కైవసం చేసుకుంది.

ఇంతకు ముందు ఎనిమిదేళ్లుగా వామపక్ష అనుబంధ స్టూడెంట్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా (SFI), అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ASA) యూనియన్‌లకు చెందిన విద్యార్థి నేతలు అధ్యక్ష స్థానం గెలుస్తూ వచ్చారు.

2006 నుంచి 2009 మధ్యలో జరిగిన ఎన్నికలలో ఏబీవీపీ అభ్యర్థులు కల్చరల్ సెక్రటరీగానో లేక స్పోర్ట్స్ సెక్రటరీగానో గెలవగలిగారు. కానీ ఈసారి జరిగిన ఎన్నికలలో మాత్రం మొత్తం ఆరుగురు సభ్యుల ప్యానెల్ గెలిచిందని ఏబీవీపీ హెచ్‌సీయూ యూనిట్ అధికార ప్రతినిధి ఉదయ్ చెప్పారు.

ఈ సారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగింది. ఏబీవీపీ, ఓబీసీ ఫెడరేషన్ కలిసి ఒక వైపు, యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ కింద ఎన్ఎస్‌యుఐ, ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ (MSF), స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (SIO) తదితరాలు ఒక వైపు, ఎస్ ఎఫ్ ఐ మరోవైపు పోటీ చేశాయి.

అధ్యక్ష స్థానానికి ఏబీవీపీ నుంచి పోటీ చేసిన ఆర్తి నాగపాల్‌కు 1,663 ఓట్లు, ఎస్ఎఫ్ఐ నుంచి పోటీ చేసిన ఎర్రం నవీన్ కుమార్ కు 1,329 ఓట్లు, యుడీఏ అభ్యర్థి శ్రీజకు 842 ఓట్లు వచ్చాయి.

మరోవైపు దాదాపు 150 దాక నోటా ఓట్లు నమోదయ్యాయి.

అయితే ఈ పరిణామం చూస్తుంటే విద్యార్థులు అసలు ఏమి కోరుకున్నారనేది అర్థం కావడం లేదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.

హెచ్‌సీయూ
ఫొటో క్యాప్షన్, విద్యార్థి సంఘం అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన మూడో స్థానంలో నిలిచిన శ్రీజ వాస్తవి

"సైద్ధాంతిక రాజకీయాలు, గుర్తింపు రాజకీయాలను తమతో కలుపుకొని ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా లేవు. ఎటువంటి రాజకీయ భావజాలాన్ని సమర్థించలేక పోవటం కూడా ఒక ప్రమాదకరమైన సంకేతం," అని హరగోపాల్ వ్యాఖ్యనించారు.

విద్యార్థుల సంక్షేమం గురించి మాట్లాడాం.. గెలిచాం: ఏబీవీపీ

క్యాంపస్‌లో విద్యార్థులు ఒక పారదర్శక నాయకత్వాన్ని కోరుతున్న విషయం స్పష్టం అవుతుందని ఉదయ్ తెలిపారు. "ఇంట గెలిచి రచ్చ గెలవాలి. యూనివర్సిటీ లోపల , మెస్, హాస్టల్ వంటి మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను కూడా యూడీఏ పరిష్కరించలేక పోయింది. అందువల్లనే ఈ రోజు విద్యార్థులు ఏబీవీపీని గెలిపించారు'' అని ఉదయ్ అన్నారు.

''అలాగని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులు బయట జరిగే రాజకీయాలలో ఆసక్తిగా లేరని కాదు.. మేము విద్యార్థులను 'స్టూడెంట్ దర్బార్' ద్వారా క్యాంపస్ లోపల జరిగే రాజకీయాలతో పాటు బయట జరిగే రాజకీయాలను కూడా చర్చించే ఒక వేదికను ఏర్పాటు చేస్తాం. విద్యార్థి సంఘంగా విద్యార్థులకు అధికారం ఇవ్వాలనేదే మా వాదన. అదే దిశగా మా కార్యక్రమాలుంటాయి," అని ఉదయ్ వివరించారు.

గత సంవత్సరంలో హెచ్‌సీయూ తీసుకున్న నిర్ణయాల గురించి ఎవరూ మాట్లాడకపోవడం కూడా కొంత యూడీఏ మీద వ్యతిరేకత పెంచిందనీ అంటున్నారు కొందరు విద్యార్థులు. ఉదాహరణకి విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కి కేవలం శుక్రవారం మధ్యాహ్నం మాత్రం రావాలని, బయట నుండి భోజనం ఆర్డర్ చేయకూడదని, విద్యార్థులు కేవలం అడ్మినిస్ట్రేషన్ వారు చూపించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌కి దూరంగా ఉన్న ఒక చోటే నిరసనలు తెలపాలని... ఇలా పలు ఆదేశాలు విద్యార్థులలో కలకలం సృష్టించాయి.

"ఇటు వంటి నిర్ణయాలు కేవలం విద్యార్థులను నిస్సహాయులను చేశాయి. ఇది మారాలి. అధికారం విద్యార్థులకు ఇవ్వాలి. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో అందరు విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలి. మేము దృష్టిపెట్టాల్సిన ముఖ్యమైన అంశం ఇదే," అని కొత్తగా ఎన్నికైన అధ్యక్షురాలు ఆర్తి నాగపాల్ అన్నారు.

హెచ్‌సీయూ

అంతర్గత కుమ్ములాట మూలానే హిందుత్వ విద్యార్ధి సంఘానికి గెలిచే అవకాశం వచ్చింది: యూడీఏ అధ్యక్ష అభ్యర్థి శ్రీజ

వామపక్ష విద్యార్ధి సంఘాలు, దళిత విద్యార్థి సంఘాలు, ముస్లిం విద్యార్ధి సంఘాలు అందరూ ఒక్క తాటి పైన వచ్చి అలయన్స్ ఫర్ సోషల్ జస్టిస్ అని కూటమి ఏర్పాటు చేసుకున్నారు. గత రెండు సంవత్సరాలు ఈ అలయన్స్ కిందనే యూనియన్ ఏర్పాటు చేశారు. కానీ వామపక్ష విద్యార్ధి సంఘం ఎస్ఎఫ్ఐ కి ఉన్న 'ఇస్లామోఫోబియా' మూలానే తాము ఓడిపోయాం... అని శ్రీజ ఆరోపించారు.

"ప్రతి విద్యార్ధి సంఘానికి ఒక భావజాలం ఉంటుంది. యూనివర్సిటీలో విద్యార్ధి రాజకీయాలు ఒక అట్టడుగు వర్గాల విద్యార్థుల హక్కుల కోసం పోరాడే వేదికగా ఉండాలనేది ముఖ్య ఉదేశం. కానీ ఇప్పుడు అలా అన్ని వర్గాలు ఒక్క తాటిపై లేనందునే ఇవాళ ఏబీవీపీ గెలిచింది. కేరళ లో జరిగే రాజకీయాలను ఇక్కడ యూనివర్సిటీ లోపల జరిగే రాజకీయాలకు లింక్ పెట్టడం సరి కాదు. అయినప్పటికీ మేము మా పోరాటం ఆపేది లేదు. మా తప్పుల నుంచి మేము నేర్చుకున్నాం. యూనివర్సిటీ యాజమాన్యం తమ ఎజెండాను ఏబీవీపీ ద్వారా అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ మేము వెనక్కి తగ్గేది లేదు. ఇప్పటికైనా అందరూ ఒక తాటి పైకి వచ్చి ఐకమత్యం తో హిందుత్వ రాజకీయాలను ఎదిరించాలి," అన్నారు శ్రీజ.

ఈ అంశంపై మాట్లాడేందుకు ఎస్ ఎఫ్ ఐ సభ్యులు అందుబాటులో లేరు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)