'మా చాయ్ ఇరానీ.. మేం మాత్రం పక్కా హైదరాబాదీ!'

ఫొటో సోర్స్, Sangeetham Prabhakar/bbc
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
"హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది అలసట తీర్చే ఇరానీ చాయ్, నోరూరించే బిర్యానీ. రోజుకు ఓ మూడు సార్లన్నా వన్ బై టు ఇరానీ చాయ్ పడందే పని చేయలేము" అని నెమ్మదిగా ఒక కప్పులోని చాయ్ మరో కప్పులోకి జారవిడుస్తూ... వ్యాపారి మొహమ్మద్ ఖైసర్ అంటున్నారు.
హైదరాబాద్ నడి బొడ్డున ఎర్రమంజిల్‌లోని రెడ్ రోజ్ రెస్టారెంట్‌లో సమోసా తింటూ, చాయ్ తాగుతూ బాతాకానీ కొడుతున్న చాలా మందితో నిండిపోయి ఉంది.
ఇరాన్ నుంచి వలస వచ్చి హైదరాబాద్‌ని ఇల్లుగా చేసుకున్న బొలోకి కుటుంబం మూడవ తరానికి చెందిన 18 యేళ్ల సయ్యద్ మొహమ్మద్ రజాక్ బొలోకి కౌంటర్‌లో కూర్చొని ఉన్నారు.

ఫొటో సోర్స్, Sangeetham Prabhakar/bbc
"ఈ ఇరానీ కేఫ్‌ను మా నాన్న 28 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అంతకంటే ముందు మా తాతయ్య టెహ్రాన్ నుంచి 1970లో హైదరాబాద్ వచ్చి సికింద్రాబాద్‌లో సిటీ లైట్స్ పేరుతో కేఫ్ పెట్టారు. నేను పక్కా హైదరాబాదీని. భారతీయుణ్ని. ఇరానీ వంటకాలను ఇక్కడ అందరూ ఆస్వాదిస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. ఒరిజినల్ ఇరానీ చాయ్ అందరూ చేయలేరు" అంటూ రజాక్ చెప్పుకొచ్చారు.
ఇలా ఇరానీ చాయ్ ఒకటే కాదు, ఇరాన్ నుంచి వచ్చిన సంస్కృతి ప్రభావం కూడా హైదరాబాద్‌లో కనిపిస్తుంది.
కుతుబ్ షాహీ రాజవంశీయులు ఇరాన్ నుంచి 16వ శతాబ్దంలో దిల్లీ వచ్చి, అనంతరం దక్షిణానికి వచ్చి స్థిరపడ్డారు. ఆలా పర్షియన్ భాష, సంస్కృతి, ఆహార అలవాట్ల ప్రభావం హైదరాబాద్‌లో మొదలైంది.
ఇరాన్ నుంచి వచ్చిన వారిని 'అఘా సాహెబ్' అంటూ నిజాం నవాబు గౌరవించేవారని చరిత్రకారులు చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
"మన చరిత్రను విశ్లేషిస్తే, ఒక విధంగా హైదరాబాద్ ఏర్పడిందే ఇరానీయన్లతో. ఆ కాలంలో దక్కన్ ప్రాంతానికి అవకాశాల బంగారు భూమి అన్న ఖ్యాతి ఉండేది. వేరు వేరు సంస్థానాలు, రాజ్యాలు ఉండటంతో వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పటికీ ఆ వాణిజ్య ప్రభావం హైదరాబాద్ వ్యాపారంలో కనిపిస్తుంది" అని చరిత్రకారుడు ముహమ్మద్ షఫీ ఉల్లాహ్ వివరించారు.
కుతుబ్ షాహీలు, ఆ తర్వాత నిజాం పాలనలో ఎంతోమంది ఉలేమాలు, వాస్తుశిల్పులు, ఇంజినీర్లను ఇరాన్ నుంచి హైదరాబాద్‌కు పిలిపించారు. అందుకే భాగ్యనగర నిర్మాణంలో ఆ ప్రభావం కనిపిస్తుంది.
"ఇరాన్‌లోని షిరాజ్, ఇస్ఫహాన్ నగరాలను స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్‌ను నిర్మించారు. అంతే కాదు, ఇప్పటికీ చాల మంది ఇరాన్‌తో వివాహం ద్వారా సంబంధాలు ఏర్పర్చుకుంటున్నారు" అని అల్ ఇండియా షియా మజ్లీస్ ఎ ఉలేమా వా జారెరీన్ అధ్యక్షుడు డా. సయ్యద్ నిసార్ హుస్సేన్ హైదర్ అఘా వివరించారు.

ఫొటో సోర్స్, Sangeetham Prabhakar/bbc
ఆలా 400 యేళ్ల క్రితం నుంచే హైదరాబాద్‌కు ఇరానీలు వచ్చారు.
జమాల్ డార్విష్ తాత 1919లో ఇరాన్‌లోని యజ్డ్ ప్రావిన్స్ నుంచి ముంబై వచ్చారు. ముంబైలో అప్పటికే జోహ్రాస్ట్రియన్లు ఎక్కువ మంది ఉండడంతో అక్కడ స్థిర పడ్డారు.
"హైదరాబాద్‌లో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ఇరాన్ సంస్కృతి ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో 1960లో మా కుటుంబం ఇక్కడకి వచ్చింది. అప్పటి నుంచి ఈ మహా నగరం మా ఇల్లుగా మారిపోయింది" అని వాస్తుశిల్పి జమాల్ డార్విష్ తెలిపారు.

ఫొటో సోర్స్, Sangeetham prabhakar/bbc
అలా ఇరాన్ నుంచి వచ్చి స్థిరపడిన కుటుంబాల వారసులు ఇప్పటికీ పర్షియన్ వ్యవహారశైలిని కూడా అనుకరిస్తున్నారు.
"ఇంట్లో పార్సీ భాష మాట్లాడుకుంటాం. ఇరానీ వంటకాలు సర్వసాధారణమే. ఇంటి అలంకరణలోనూ ఇరానీ ప్రభావం ఉంటుంది. కానీ మేము పక్కా హైదరాబాదీలమే" అని 23 ఎల్లా హైదర్ జోకార్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Sangeetham Prabhakar/bbc
హైదరాబాద్‌లోని సర్వి రెస్టారెంట్‌కి మూడవ తరం యజమాని హైదర్.
"భారత దేశంలో ఇరానీ వంటకం 'చీలో కబాబ్' దొరికే రెండు రెస్టారెంట్లలో సార్వి ఒకటి. అలాగే మా హలీంకి కూడా మంచి ఆదరణ ఉంది" అని హైదర్ వివరించారు.
ఇలా హైదరాబాద్‌లో ఇరానీ సంస్కృతి లోతుగా పాతుకుపోయి ఉంది.
ఇవి కూడా చూడండి:
- 'ఆరోగ్య శ్రీ' కేంద్ర ఆరోగ్య బీమా పథకంలో కలిసిపోతుందా?
- ఆ మహిళలే ఉత్తర కొరియా 'రహస్య ఆయుధాలు'!
- గో-కార్ట్ చక్రంలో జుట్టు చిక్కుకుని మహిళ మృతి
- దక్షిణాఫ్రికా కొత్త అధ్యక్షుడు... యూనియన్ లీడర్, మైనింగ్ బాస్!
- పీఎన్బీ కుంభకోణం: మోదీజీ.. నీరవ్ మీతో కలిసి ఏం చేస్తున్నారు?
- పంజాబ్ నేషనల్ బ్యాంకు: 11,360 కోట్ల కుంభకోణం అసలెలా జరిగింది!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








