రమఫోసా: యూనియన్ లీడర్, మైనింగ్ బాస్, దక్షిణాఫ్రికా కొత్త అధ్యక్షుడు

ఫొటో సోర్స్, Reuters
దక్షిణాఫ్రికా కొత్త అధ్యక్షుడిగా సిరిల్ రమఫోసా ఎన్నికయ్యారు. అనేక వివాదాల నేపథ్యంలో జాకబ్ జుమా రాజీనామా చేసిన అనంతరం ఉపాధ్యక్షుడు రమఫోసాను కొత్త అధ్యక్షుడిగా పార్లమెంటు ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
అధ్యక్షుడిగా తన మొదటి ప్రసంగంలో 65ఏళ్ల రమఫోసా మాట్లాడుతూ జుమా నేతృత్వంలో విస్తృతంగా పెరిగిపోయిన అవినీతికి అడ్డుకట్ట వేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.
కొత్త అధ్యక్షుడు ప్రసంగిస్తున్న సమయంలో పార్లమెంటు సభ్యులు పాటపాడుతూ ఆయనకు మద్దతు తెలిపారు.
శుక్రవారం నాడు రమఫోసా జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
మరోపక్క రమఫోసా ఎన్నికపై అసంతృప్తితో ఉన్న ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ సభ్యులు పార్లమెంటు నుంచి వాకౌట్ చేశారు. ఏఎన్‌సీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం సరికాదనీ, అది ఎన్నికలకు పిలుపునిచ్చి ఉండాల్సిందనీ వారు కోరుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
కల నిజమైంది
దక్షిణాఫ్రికాలో ఏఎన్‌సీ 1994లో అధికారంలో వచ్చినప్పటి నుంచీ రమఫోసా చూపు అధ్యక్ష పీఠంపై ఉందని అంటారు. నెల్సన్ మండేలా తన వారసుడిగా రమఫోసాను ఎంపిక చేయకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉండేవారనీ, అందుకే కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా వెళ్లారనీ చెబుతారు.
చివరకు ఇన్నేళ్ల తరవాత రమఫోసా కోరిక తీరింది.
ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి ముందు ఎన్నో సవాళ్లున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై దృష్టిపెడతానని ఆయన చెబుతున్నా అదంత సులభం కాబోదు.
దక్షిణాఫ్రికాలో నిరుద్యోగుల సంఖ్య దాదాపు 30శాతంగా ఉంది. యువకుల్లో అయితే అది 40శాతంగా ఉంది. అభివృద్ధి రేటు, పెట్టుబడిదారుల నమ్మకం కూడా తక్కువగా ఉండటం రమఫోసాకు సవాలుగా మారనుంది.
కానీ ప్రజల్లో మాత్రం ఆర్థిక వ్యవస్థను రమఫోసా గాడిలో పడేస్తారనే నమ్మకం ఉంది. ఆయన అధ్యక్ష పదవి చేపట్టాక దక్షిణాఫ్రికా కరెన్సీ ‘ర్యాండ్’ విలువ కూడా బలపడింది.
రమఫోసా ప్రస్థానం
- రమఫోసా 1952లో జొహనెస్‌బర్గ్‌లో పుట్టారు.
- జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొన్నందుకు 1974, 1976లలో అరెస్టయ్యారు.
- 1982లో నేషనల్ యూనియన్ ఆఫ్ మైన్‌వర్కర్స్‌ను ప్రారంభించారు.
- 1990లో నెల్సన్ మండేలా జైలు నుంచి విడుదల కావడంలో కీలక పాత్ర పోషించిన నేషనల్ రిసెప్షన్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు.
- 1994లో ఎంపీగా, అసెంబ్లీకి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
- 1997లో రాజకీయాలకు దూరంగా పూర్తి స్థాయి వ్యాపారవేత్తగా మారారు. దేశంలో నాటి ధనిక వ్యాపారుల్లో ఆయన ఒకరు.
- 2017లో ఏఎన్‌సీ నాయకుడిగా ఎన్నికయ్యారు.
- 15 ఫిబ్రవరి 2018న దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి
- పీఎన్బీ కుంభకోణం: మోదీజీ.. నీరవ్ మీతో కలిసి ఏం చేస్తున్నారు?
- కీటోడైట్ వివాదం: అసలేంటీ డైట్? అదెంత వరకు సురక్షితం?
- డెడ్లైన్ పాలిటిక్స్: మూడు నెలలు.. మూడు గడువులు
- చెల్లెలి కోసం సోదరుడు 'విటుడి'గా మారి..
- వాలెంటైన్స్ డే స్పెషల్: వేశ్యా గృహాల్లో ప్రేమకు చోటుందా?
- పంటకు దిష్టిబొమ్మగా సన్నీ లియోని ఫొటో
- ఒక్కసారి కన్ను గీటి కోట్ల హృదయాలను దోచేసిన అమ్మాయి కథ ఇదీ!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








