చనిపోయాడని చెప్పారు.. కానీ పదేళ్ల తర్వాత తిరిగొచ్చాడు

- రచయిత, గురు ప్రీత్ కౌర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలోని ఓ కుటుంబానికి చెందిన ఆరేళ్ల వయసున్న బాలుడు పదేళ్ల క్రితం పారిపోయాడు. మళ్లీ ఇప్పుడు ఆ బాలుడు తమ తల్లిదండ్రులను కలుసుకున్నాడు.
పదేళ్ల తరువాత అల్వార్‌లోని హమీదా, సలీం కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఆరేళ్ల వయసులో పారిపోయిన వారి కుమారుడు మళ్లీ ఇంటికొచ్చాడు.
సలీం, హమీదాల కుమారుడు హసన్. ఆరేళ్ల వయసులో హసన్‌ను దిల్లీలోని ఓ మదర్సాలో చేర్పించారు. కానీ అమ్మని వదిలి ఉండలేని హసన్, ఒక రోజు అక్కడి నుంచి పారిపోయాడు.
ఆ తరువాత ఓ ఎన్‌జీఓ ఆ బాలుడిని చేరదీసింది. ఇప్పుడు అతడికి 16 ఏళ్లు.
హార్ట్ ఎటాక్ వచ్చినట్లు అనిపించింది
‘‘నేను ఓసారి బస్సులో ప్రయాణిస్తుండగా కిటికీలో నుంచి ఆ మదర్సాను, పక్కనున్న అడవిని చూశా. తరువాత తెలిసిన ఓ అన్న గూగుల్‌లో దాని గురించి వెతికాడు. ఇద్దరం మదర్సాకు వెళ్లాం. మా అమ్మ ఇప్పటికీ మదర్సాకు వచ్చి వెళ్తోందని వాళ్లు చెప్పారు. అమ్మానాన్నలను చూడగానే నేను గుర్తుపట్టా. ఇప్పుడు నా కుటుంబం నాకు దొరికింది. జీవితంలో నాకు కావలసినవన్నీ దొరికాయి’’ అని హసన్ సంతోషం వ్యక్తం చేశాడు.
నా బిడ్డ తిరిగొచ్చాడన్న వార్త వినగానే ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చినట్లు అనిపించిందని హమీదా అన్నారు. బైక్‌పై వస్తుంటే శరీరమంతా వణికిందని, ఆ విషయాన్ని నమ్మలేకపోయానంటూ సలీం భావోద్వేగానికి లోనయ్యారు.

కాళ్లూ చేతులూ ఆడలేదు
‘‘వాడు కనిపించట్లేదని తెలియగానే నాకు కాళ్లూ చేతులూ ఆడలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశా. వాళ్లు రోజూ పిలిచేవారు. సాయంత్రం దాకా కూర్చోబెట్టేవారు. కానీ ఎలాంటి సమాచారం ఇచ్చేవారు కాదు. చాలా రోజులు అలానే గడిచిపోయాయి. రోజూ స్టేషన్‌కు వెళ్లిరావడానికి డబ్బులు లేక, కొన్నాళ్లకు వెళ్లడం మానేశా’’ అని హమీదా చెప్పారు.

సవతి తండ్రివి కదా అన్నారు
నేను సవతి తండ్రినని, అందుకే బిడ్డ కోసం వెతకట్లేదని మా బంధువులు అనుకునేవారని సలీం అన్నారు. కానీ, మేం ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపామో మాకు మాత్రమే తెలుసని ఆయన చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










