రూపాయి: ఈ పతనం దేనికి ఆరంభం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డెవీనా గుప్తా
- హోదా, బిజినెస్ రిపోర్టర్, బీబీసీ న్యూస్ దిల్లీ
పెట్రోలు ధరల పెరుగుదలకు నిరసనగా విపక్షాలన్నీ ఏకమై భారత్ బంద్ నిర్వహించాయి. ఇది ఇంకా ఆరంభమేనని.. ముందుంది ముసళ్ల పండగని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సెప్టెంబర్ మొదటివారంలో పెట్రోల్ ధర 25 శాతం, డీజిల్ రేటు 13 శాతం పెరిగాయి.
నిజానికి రూపాయి విలువ పతనం అంతకుమించి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
ఆసియాలో ఈ ఏడాది ఇంతవరకు దారుణంగా పతనమవుతున్న కరెన్సీ రూపాయే. డాలర్‌తో మారకం విషయంలో ఈ ఏడాది రూపాయి విలువ 13 శాతం పడిపోయింది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండడం.. నూతన మార్కెట్ ఆర్థిక వ్యవస్థల నుంచి అనేకమంది విదేశీ మదుపరులు బయటపడుతుండడం.. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం కారణంగా ఆసియాలో పెట్టుబడులకు మదుపరులు వెనక్కుతగ్గుతుండడం.. వంటివన్నీ దీనికి కారణాలే.
ఏప్రిల్, జూన్ మధ్య భారత్ ఫారెక్స్ నిల్వలు 11 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. రూపాయి పతనాన్ని ఆపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లలో అమెరికా డాలర్లను విక్రయించే ప్రయత్నం చేసింది. అయినా పరిస్థితులు చక్కబడలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఎగుమతి, దిగుమతులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది
''కరెన్సీ పతనం క్రమానుగతంగా జరుగుతుంటే పరిస్థితులను పరిశీలించుకుంటూ ఎగుమతిదారులు ఎప్పుడు ఆర్డర్లు పెట్టాలో నిర్ణయించుకుంటారు. కానీ, ఇలా ఆకస్మిక పతనం ఉన్నప్పుడు రూపాయి విలువ ఇంకా పడిపోతుందేమో అన్న ఉద్దేశంతో ఆర్డర్లు పెట్టేందుకు ఎగుమతిదారులు వేచి చూడొచ్చు'' అని యెస్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ శుభదా రావు బీబీసీతో అన్నారు.
రూపాయి బలహీనపడుతుంటే క్రూడాయిల్ వంటివి మరింత ప్రియమవుతాయని ఆమె చెప్పారు.

అంతర్జాతీయ కారణాల వల్లేనా?
భారత్ తన ముడిచమురు అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటుంది.
దేశాల మధ్య ఉద్రిక్తతలు, చమురు ఉత్పాదక దేశాలు ఉత్పత్తిలో కోత విధించుకోవడం వంటి కారణాలతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.
అయితే, 2014, 2015లో అంతర్జాతీయ ముడి చమురు ధరలు కనిష్ఠానికి పడిపోయినా కూడా దేశంలో పెట్రోలు, డీజిల్ రిటైల్ ధర మాత్రం తగ్గలేదు.
దీనికి కారణం ప్రభుత్వ విధానాలే. కేంద్ర ఎక్సయిజ్ సుంకం, వ్యాట్ వాటాయే పెట్రోలు ధరలో సుమారు 45 శాతం(దిల్లీలో), డీజిల్ ధరలో 36 శాతం(దిల్లీలో) ఉంటున్నాయి. వ్యాట్ వ్యత్యాసాల వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఈ శాతం మారొచ్చు.
ఇటీవల రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు వ్యాట్‌ను స్వల్పంగా తగ్గించి ఊరట కల్పించాయి. కానీ, మిగతా రాష్ట్రాలు, కేంద్రం వైపు నుంచి ఇలాంటి చొరవ లేదు.
''ఆర్థిక వ్యవస్థలో రెండు లక్ష్యాలు ఒకేసారి నెరవేరవు. పెట్రోలు ధరలు తగ్గించాలంటే పన్నులు తగ్గించుకోవాల్సిందే. ఇప్పటికిప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాలంటే కేంద్ర, రాష్ట్రాల పన్నులు రెండూ తగ్గాలి'' అని క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి 'బీబీసీ'తో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటి బడ్జెట్‌పై రూపాయి పోటు
ఇంధన ధరల అందుబాటులో ఉండడం విషయానికొస్తే భారత్ చాలా దేశాల వెనుకన ఉంటుంది. సగటు భారతీయ కుటుంబం తమ కుటుంబ ఆదాయంలో సగం కంటే ఎక్కువ ఇంధనానికే ఖర్చు చేస్తుందని ఇటీవల అధ్యయనం ఒకటి వెల్లడించింది. సామాన్యుడికి ఇది ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు.
డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. దీని వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది.
ఫలితంగా రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది.
ఇదే కనుక జరిగితే ప్రజలు కేవలం పెట్రోలు, డీజిల్, కూరగాయలు, ఇతర నిత్యావసరాలపైనే కాదు తాము తీసుకున్న రుణాలపైనా అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
2019 ఎన్నికలకు విపక్షాలకు ఇదే ఆయుధం
''రూపాయి విలువతో డాలర్‌తో పోల్చితే 72.32కి చేరింది... కొందరు నేతల వయసు కంటే ఇది వేగంగా పెరుగుతోంది'' అని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ట్వీట్ చేశారు.
ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ చేపట్టిన బంద్‌కు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు రావడంతో విపక్షాలు తమ బలం చూపినట్లయింది.
2013 సెప్టెంబర్‌లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రూపాయి విలువ 67కి పడిపోయింది. అప్పటికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ దాన్ని 2014 ఎన్నికలకు అస్త్రంగా మలచుకున్నారు. ''ప్రభుత్వం ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై కానీ, రూపాయి పతనంపై కానీ ప్రభుత్వానికి కొంచెం కూడా ఆందోళన లేదు. కేవలం తమ కుర్చీని కాపాడుకోవడంపైనే దృష్టి పెడుతున్నారు'' అంటూ మోదీ అప్పట్లో ఆరోపించారు.
కానీ, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వంలోని మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అంతర్జాతీయ కారణాల వల్లే ఆయిల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. కానీ, ప్రభుత్వం రూపాయి పతనంపై మాత్రం పెదవి విప్పలేదు.
''తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులున్నప్పటికీ ప్రజలు విపక్షాల బంద్‌కు మద్దతివ్వలేదు. కాంగ్రెస్, ఇతర విపక్షాలకు ఇది ఆందోళన కలిగిస్తోంది'' అంటూ రవిశంకర్ ఇటీవల పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని తెలిపారు.
కానీ, ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. మోదీనామిక్స్ 2019 ఎన్నికల్లో విపక్షాలకు ఆయుధంగా మారనుంది.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా గనిలో అద్భుతం: రెండు రాళ్లలో 100 కిలోలకుపైగా బంగారం
- ఏలియన్స్ ఉన్నాయా? లేవా?: అన్వేషణకు నాసా భారీ టెలిస్కోప్
- టీమిండియాను ఉత్సాహపరిచే అభిమాన 'సైన్యం' భారత్ ఆర్మీ
- C/o కంచరపాలెం: తెలుగు సినిమా ఎదుగుతోంది
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
- ’టాటూ లేని వారిని అంటరానివారిగా చూస్తారు’
- చరిత్రలో కనిష్ఠ స్థాయికి రూపాయి: ఈ పతనం ఎందుకు?
- లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








