Apple Iphone XS: మొదటిసారిగా ఐ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ - ఐ వాచ్‌లో ECG

యాపిల్

ఫొటో సోర్స్, Getty Images

గతేడాది మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్ టెన్‌కు అదనపు ఫీచర్లు జోడిస్తూ.. ఐఫోన్ టెన్ ఎస్, ఐఫోన్ టెన్ ఎస్ మ్యాక్స్, ఐఫోన్ టెన్ ఆర్ పేర్లతో మూడు కొత్త మోడళ్లను విడుదల చేసింది యాపిల్. వీటిలో రెండు ఐఫోన్ ఎక్స్ కంటే పెద్ద తెరలు కలిగి ఉన్నాయి.

ఐఫోన్ టెన్ ఎస్ 5.8 అంగుళాలు, ఐఫోన్ టెన్ ఎస్ మ్యాక్స్ 6.5 అంగుళాలు, ఐఫోన్ టెన్ ఆర్ 6.1 అంగుళాల తెరలు కలిగి ఉన్నాయి.

ఈ ఫోన్లతో పాటు, ECG, ఫాల్- డిటెక్షన్ అనే సరికొత్త ఫీచర్‌‌తో కొత్త స్మార్ట్‌వాచీని కూడా అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో యాపిల్ ఆవిష్కరించింది.

స్క్రీన్ సైజు ఇలా పెరిగింది!

ఫోన్లు

ఇప్పటివరకు మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్లలో అత్యంత ఖరీదైనదిగా ఐఫోన్ టెన్ ఎస్ మ్యాక్స్ నిలవనుంది. యాపిల్ వెల్లడించిన వివరాల మేరకు.. అమెరికాలో దీని ధర అంతర్గత మెమొరీ సామర్థ్యాన్ని బట్టి 1,099 డాలర్ల (రూ.72,022) నుంచి 1,449 డాలర్ల (రూ.97,256) వరకు ఉంది.

64జీబీ, 256జీబీ, 512జీబీల వేరియంట్లలో టెన్ ఎస్ మ్యాక్స్ దొరుకుతుంది. వీటి ధర 1,099 డాలర్లు, 1,249 డాలర్లు, 1,449 డాలర్లుగా ఉంది.

టెన్ ఎస్ మోడల్ ధర మ్యాక్స్ కంటే 100 డాలర్లు తక్కువ ఉంటుంది.

యాపిల్

ఫొటో సోర్స్, APple

నిజానికి గతంలో వచ్చిన ఐఫోన్ 8 ప్లస్‌, ఇప్పుడు విడుదల చేసిన టెన్ ఎస్ మ్యాక్స్ పరిమాణం సమానమే.

కానీ, టెన్ ఎస్ మ్యాక్స్‌ తెర పెద్దదిగా ఉంటుంది. అందుకు కారణం, ఈ ఫోన్ ముందుభాగంలో ఖాళీ స్థలం తక్కువగా ఉండటమే.

టెన్ ఎస్, టెన్ ఎస్ మ్యాక్స్ ఫోన్లు అత్యాధునిక ఓఎల్‌ఈడీ (ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్) డిస్‌ప్లే కలిగి ఉన్నాయి.

ఈ తరహా తెరలను ప్రస్తుతం అత్యంత ఖరీదైన మోడళ్లలోనే వినియోగిస్తున్నారు.

యాపిల్ ఫోన్

ఫొటో సోర్స్, APple

ఫొటో క్యాప్షన్, ఆరు రంగుల్లో ఐఫోన్ టెన్ ఆర్ లభిస్తుంది.

ఆరు రంగుల్లో టెన్ఆర్ మోడల్

ఐఫోన్ టెన్ ఆర్ కూడా పెద్ద స్క్రీన్ కలిగి ఉంది. అయితే, అది ఎల్‌సీడీ తెర. ఈ ఫోన్‌ ఫ్రేమ్‌ను స్టీల్‌తో కాకుండా అల్యూమినియంతో తయారు చేశారు. అందువల్ల దీనిపై తొందరగా గాట్లు, చారలు పడే అవకాశం ఉంటుంది.

టెన్ ఆర్ మోడల్ 6 రంగుల్లో లభిస్తుంది.

వేరువేరు వేరియంట్లలో ఫోన్లు దొరుకుతున్నందున వినియోగదారులు తమకు నచ్చింది ఎంచుకునే అవకాశం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

"గతంలో ఒక ఓఎస్ నుంచి మరో ఓఎస్‌కు మారేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆండ్రాయిడ్ అయినా, ఐఓఎస్ అయినా ఒకసారి వాడినవారు మళ్లీ అదే ఓఎస్ ఉన్న ఫోన్లవైపే చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఐఫోన్‌ వాడిన వారు మళ్లీ ఐఫోనే తీసుకుంటున్నారు. కొత్త మోడల్ ఫోన్ కొనే ముందు తెర గురించి ఆలోచిస్తున్నారు" అని విశ్లేషకులు చెబుతున్నారు.

యాపిల్

ఫొటో సోర్స్, APple

స్పీడ్ పెంచే స్మార్ట్ ప్రాసెసర్

తాజా ఫోన్లలో 'ఏ12 బయోనిక్' అనే సరికొత్త చిప్‌ (ప్రాసెసర్) అమర్చినట్టు యాపిల్ తెలిపింది. ఈ సంస్థ వాడిన తొలి 7- నానోమీటర్ ట్రాన్సిస్టర్ సాంకేతికతతో అభివృద్ధి చేసిన స్మార్ట్‌ఫోన్ చిప్ ఇదే. దీనివల్ల ఫోన్ వేగం పెరగడంతో పాటు, బ్యాటరీ బ్యాకప్ కూడా మెరుగవుతుంది.

అందుకే, గతేడాది వచ్చిన ఐఫోన్‌ టెన్‌తో పోల్చితే తాజా ఎక్స్‌ఎస్ ఫోన్‌ బ్యాటరీ బ్యాకప్ 30 నిమిషాలు పెరుగుతుందని యాపిల్ చెబుతోంది. చైనా మొబైల్ తయారీ సంస్థ హువాయి కూడా 7- నానోమీటర్ టెక్నాలజీతో మొబైల్ చిప్‌ను అభివృద్ధి చేసినట్టు ఇటీవల ప్రకటించింది.

ఈ మూడు ఫోన్లలోనూ ఫేస్ ఐడీ ఫీచర్ మరింత వేగంగా పనిచేస్తుందని యాపిల్ తెలిపింది. ఫేస్ ఐడీ (ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత) ద్వారా వినియోగదారుడు ముఖాన్ని చూపిస్తే ఫోన్‌ తెరుచుకుంటుంది.

ఈ ఏడాది మార్చిలో హువాయి విడుదల చేసిన 'పీ20 ప్రో' ఫోన్‌కు మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి. అలాగే యాపిల్ కూడా మూడు రేర్ కెమెరాలు కలిగిన ఫోన్‌ను తీసుకొస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ, అది నిజం కాలేదు. ఐఫోన్ టెన్ ఎస్, టెన్ ఎస్ మ్యాక్స్‌లు రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు కలిగి ఉన్నాయి. టెన్ ఆర్‌కి ఒకే కెమెరా ఉంది.

యాపిల్

ఫొటో సోర్స్, APple

ఫొటో క్యాప్షన్, ఈ ఫోన్లలో ఫొటోల బ్యాగ్రౌండ్‌ని బ్లర్ చేసేందుకు కొత్త టూల్‌ను తీసుకొచ్చింది యాపిల్.

డ్యుయల్ సిమ్ సదుపాయం

టెన్ ఎస్, టెన్ ఎస్ మ్యాక్స్ ఫోన్లలో రెండు సిమ్‌లు వేసుకునే వెసులుబాటు ఉంది. అంతేకాదు, సిమ్ కార్డు లేకుండానే, క్యూఆర్ కోడ్‌తో పనిచేసే ఎలక్ట్రానిక్ సిమ్‌ (eSIM)తో కూడా ఈ ఫోన్లు పనిచేస్తాయి. ఇంతకు ముందు గూగుల్ పిక్సెల్ 2 ఫోన్‌లో eSIM సదుపాయం ఉంది.

అయితే, చైనా విపణిలో అమ్మే ఐఫోన్లలో మాత్రం తప్పనిసరిగా సిమ్ కార్డులు వాడాల్సిందే.

యాపిల్ వాచీ

ఫొటో సోర్స్, APple

స్మార్ట్‌వాచీలో ఈసీజీ

సిరీస్ 4 స్మార్ట్‌వాచీని కూడా యాపిల్ ఆవిష్కరించింది. గతంలో విడుదల చేసిన వాచీల్లో చుట్టూ అంచుల వెంట ఖాళీ స్థలం ఉంటుంది. ఈ వాచీలో మాత్రం అంచులదాకా తెర విస్తరించి ఉంటుంది.

అందుకే పాత మోడళ్లతో పోల్చితే పరిమాణంలో 2 మి.మీ మాత్రమే పెరిగినా... ఈ వాచీలో డిస్‌ప్లే మాత్రం 30 శాతం పెరిగిందని యాపిల్ తెలిపింది. తెర పెద్దది కావడం వల్ల ఒకేసారి ఎక్కువ సమాచారం చూసుకునే వీలుంటుంది.

పాత వాచీల కంటే ఇది కాస్త నాజూకుగా (పలుచగా) ఉంది.

ఈసీజీ (ఎలక్ట్రోకార్డియోగ్రామ్) ద్వారా హృదయ స్పందనను కూడా ఈ వాచీ తెలియజేస్తుంది. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు గుర్తించి అలర్ట్ చేస్తుంది. అందుకోసం ఈ వాచీలో కొత్తగా సెన్సర్లు అమర్చారు.

యాపిల్ వాచీ

ఫొటో సోర్స్, Reuters

ఈ వాచీ ధరించిన వ్యక్తి కిందపడిపోయినప్పుడు గుర్తించి అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అలర్ట్ పంపే ఫీచర్‌ను కూడా యాపిల్ ప్రవేశపెట్టింది.

40మి.మీ, 44 మి.మీ వేరియంట్లలో ఈ వాచీ లభిస్తుంది.

అయితే, ఆశించిన స్థాయిలో ఫోన్‌ని, స్మార్ట్‌వాచీని మెరుగుపరచలేదన్న విమర్శలు యాపిల్‌కి ఎదురయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషణ సంస్థ సీసీఎస్ ఇన్‌సైట్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)