తెలంగాణలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ: దొంగ ముఖాన్ని ఇట్టే పట్టేస్తుంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అంజయ్య తవిటి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)... తెలంగాణ పోలీసు శాఖ అమ్ముల పొదిలో కొత్తగా చేరిన అస్త్రం. అనుమానితులు అసలైన నేరస్థులా, గతంలో ఏదైనా కేసులో శిక్షకు గురయ్యారా అన్నది ఈ ముఖాలను గుర్తించే అధునాతన సాంకేతిక వ్యవస్థ ఇట్టే చెప్పేస్తుంది.
ఈ ఎఫ్.ఆర్.ఎస్ సాఫ్ట్ వేర్ అనుమానితుల ఫొటోలను, తన డేటాబేస్‌లో ఉన్న నేరగాళ్ల చిత్రాలతో పోల్చి చూస్తుందని, ఒకవేళ ఆ ఫొటోలు సరిపోలితే నేరస్థుడా కాదా అన్నది వెంటనే తెలిసిపోతుందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
తప్పిపోయిన వారిని, గుర్తుతెలియని మృతదేహాలను కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించే వీలుందని ఆయన చెప్పారు. ఇది కేసుల దర్యాప్తు కూడా వేగవంతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే సాంకేతికతను దిల్లీ పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగాత్మకంగా వినియోగించారు. వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా పిల్లల ఫొటోలు సేకరించి, ఆ సాఫ్ట్‌వేర్‌తో దిల్లీలోని అనాథ ఆశ్రమాలలో ఉంటున్న చిన్నారుల ముఖాలను పోల్చి చూశారు. అలా కేవలం నాలుగు రోజుల్లోనే 2,930 మంది అదృశ్యమైన చిన్నారులను గుర్తించారు.
అయితే, ఇలాంటి కేసుల్లో ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత ఉపయోగకరంగా ఉన్నా నేరస్థులను, అనుమానితులను గుర్తించే విషయంలో సామాన్యుల గోప్యతకు భంగం వాటిల్లుతోందంటూ పలు దేశాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ టెక్నాలజీ కొన్నిసార్లు అమాయక ప్రజలను కూడా అనుమానితులుగా చూపిస్తోందన్న వివాదాలు ఉన్నాయి.
ఇంతకీ, అసలు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? దీని మీద వ్యక్తమవుతున్న అభ్యంతరాలు ఏమిటి?

ఫొటో సోర్స్, Reuters
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ
ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కానింగ్ టెక్నాలజీ మాదిరిగానే ఈ సాంకేతికత పనిచేస్తుంది.
ఒక వ్యక్తి ఫొటోను స్కాన్ చేసినప్పుడు ముక్కు పొడవు, వెడల్పు, కళ్ల లోతు, కళ్లకు దవడలకు మధ్య దూరం.. దవడ ఎముకల ఆకృతి.. కనుపాపల మధ్య దూరం, ఇలా మొత్తం 80 నోడల్ పాయింట్లకు సంబంధించిన కొలతలను సాఫ్ట్‌వేర్ లెక్కిస్తుంది. ఆ వివరాలను 'ఫేస్ ప్రింట్' రూపంలో డేటాబేస్‌లో నిల్వ చేస్తుంది.
తర్వాత కొత్త ఫొటోలను ఆ డేటాబేస్‌లోకి అప్‌లోడ్ చేసినప్పుడు.. అప్పటికే ఆ డేటాబేస్‌లో ఉన్న పాత ఫొటోల కొలతలతో ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ పోల్చుతుంది. ఆ కొలతలు ఎంత శాతం సరిపోలుతున్నాయో చూపిస్తుంది.

'అమెరికా ప్రజాప్రతినిధులనే అనుమానిస్తోంది'
'రికగ్నిషన్' పేరుతో అమెజాన్ సంస్థ అభివృద్ధి చేసిన ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను అమెరికాలోని రెండు భద్రతా సంస్థలు వినియోగిస్తున్నాయి.
అయితే... ఈ సాఫ్ట్‌వేర్ 28 మంది అమెరికా కాంగ్రెస్ సభ్యులనే అనుమానితులుగా చూపిస్తోందని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్(ఏసీఎల్‌యూ) ఇటీవల ఆరోపించింది. అమెజాన్ ఈ ఆరోపణలను ఖండించింది. సెట్టింగ్స్‌లో తేడా వల్లనే అలా జరిగిందని తెలిపింది.
ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ల పనితీరులో ఖచ్చితత్వం లోపిస్తోందని అమెరికాలోని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి. అమెజాన్ సాఫ్ట్‌వేర్‌పై చైనాలోనూ ఆరోపణలు వచ్చాయి.
ఇలాంటి సాంకేతికతతో నిఘా పెట్టడం చాలా ప్రమాదకరమని కాలిఫోర్నియాకు చెందిన పౌర హక్కుల న్యాయవాది, అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ సభ్యుడు మ్యాట్ కాగ్లె అన్నారు.
"నిరసనకారులను పోలీసులు ఈ సాంకేతికతతో లక్ష్యంగా చేసుకునే అవకాశముంది. అంతేకాదు, మొత్తం ప్రజలందరి కదలికల మీద నిఘా పెడతారు. ప్రజల వ్యక్తిగత గోప్యతకు అది ప్రమాదకరం" అని కాగ్లె వ్యాఖ్యానించారు.
మనుషిని 'గొరిల్లా' అని చెప్పింది
గూగుల్ అభివృద్ధి చేసిన ఇమేజ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ 2015లో ఓ నల్లజాతి జంటను 'గొరిల్లా' లాగా గుర్తించడం వివాదానికి దారితీసింది. దాంతో గూగుల్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో అధికంగా
చైనాలో ఈ సాంకేతికతను పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనే సభలు, సమావేశాలు, వేడుకల్లో అనుమానితులను గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను అమర్చుతున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక సీసీటీవీ కెమెరాలు ఉన్న దేశం చైనా అని ఒక అంచనా. దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 17 కోట్ల సీసీ కెమెరాలు ఉండగా.. రానున్న మూడేళ్లలో మరో 40 కోట్ల కెమెరాలు అమర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాటిలో అధికశాతం కృత్రిమ మేధస్సు, ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతిక కలిగినవే ఉండనున్నాయి.

ఫొటో సోర్స్, AFP
కళ్లద్దాలలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ
నేరగాళ్లను, అనుమానితులను గుర్తించేందుకు చైనా పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత కలిగిన కళ్లద్దాలను వినియోగిస్తున్నారు. చూడ్డానికి మామూలు చలువ అద్దాల్లాగే కనిపించే ఈ కళ్ల జోళ్లు, అనుమానితులు, నేరస్థుల వివరాలు కలిగిన డేటాబేస్‌తో అనుసంధానమై ఉంటాయి.
భారీగా గుమికూడిన జనాల్లో ఉన్న అనుమానితులను సైతం ఈ అద్దాలు స్కాన్ చేసి గుర్తిస్తాయి. ఆ విషయం వెంటనే ఆ అద్దాలు ధరించిన పోలీసుకి తెలిపోతుంది.
అలా ఇప్పటికే పలువురు నిందితులను పట్టుకున్నారని స్థానిక మీడియా తెలిపింది.
సింగపూర్‌లో
సింగపూర్‌లోని చంగి విమానాశ్రయంలోనూ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.
సెక్యూరిటీ గేట్ల దగ్గర, చెక్-ఇన్ కౌంటర్ల వద్ద ఉండే కెమెరాలు ప్రయాణికుల ముఖాలను స్కాన్ చేసి, వారి పాస్‌పోర్టు వివరాలతో పోల్చి చూస్తాయి. దాంతో తనిఖీ వేగంగా పూర్తవుతోందని, గతంలో మాదిరిగా భారీ క్యూలు ఇప్పుడు కనిపించడంలేదని చంగి ఎయిర్‌పోర్ట్ గ్రూపు భద్రతా అధికారి స్టీవ్ లీ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అమాయకులను అనుమానితులుగా చూపిస్తోంది
బ్రిటన్‌లోనూ ఇలాంటి సాంకేతికను పోలీసులు వినియోగిస్తున్నారు. ఇక్కడి కెమెరాలే అటోమేటిక్‌గా వ్యక్తుల ముఖంలోని హావభావాలను, కదలికలను బట్టి 'అనుమానాస్పద' వ్యక్తులను గుర్తించి పోలీసులను అప్రమత్తం చేస్తాయి.
అయితే ఈ టెక్నాలజీ సామాన్య పౌరుల వ్యక్తిగత గోప్యతకు, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందంటూ పౌరహక్కుల సంస్థ బిగ్ బ్రదర్ వాచ్ తాజాగా కోర్టులో కేసు వేసింది.
ఆ కెమెరాలు అమాయకులను కూడా అనుమానాస్పద వ్యక్తులుగా చూపిస్తున్నాయని ఆ సంస్థ ఆరోపిస్తోంది.
2016, 2017లో లండన్‌లో జరిగిన నాటింగ్ హిల్ కార్నివాల్, రిమెంబరెన్స్ సండే కార్యక్రమాల సందర్భంగా భద్రతను పర్యవేక్షించేందుకు సౌత్ వేల్స్ పోలీసులు కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ కెమెరాలు 102 మందిని అనుమానితులుగా భావిస్తూ పోలీసులకు అలర్ట్ పంపాయి. కానీ.. తర్వాత అది తప్పుడు హెచ్చరిక అని తేలింది.
అలాగే.. 2017 మే నుంచి 2018 మార్చి వరకు 2,685 మందిని అనుమానించగా.. అందులో 2,451 మంది సామాన్య పౌరులని తర్వాత తేలింది. అందులో 31 మంది సామాన్య పౌరులను అనుమానిస్తూ గుర్తింపును నిరూపించుకోవాలని పోలీసులు అడిగారు.
అయితే.. ఈ ఫేషియల్ రికగ్నషన్ సాంకేతికత వల్ల కొన్ని తప్పుడు హెచ్చరికలు వస్తున్నా.. గతంతో పోల్చితే ఇప్పుడు అనుమానితులను తొందరగా గుర్తించగలుగుతున్నామని పోలీసులు అంటున్నారు. ఆ సాఫ్ట్‌వేర్ చెప్పిన వెంటనే వారిని నేరస్థులుగా పరిగణించడంలేదని, పలు కోణాల్లో వారి గురించి ఆరా తీస్తున్నామని చెబుతున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించలేదు. కానీ.. ఆ కెమెరాలతో తీసిన చిత్రాలను డేటాబేస్‌లోకి అప్‌లోడ్ చేసి పోల్చుతామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఫేస్‌బుక్ ఎలా ఉపయోగిస్తోంది?
ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను 2011 నుంచి ఫేస్‌బుక్ వినియోగిస్తోంది. మనం మన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తే అందులో ఉన్న వ్యక్తుల పేర్లను గుర్తించి వారిని ట్యాగ్ చేయాలని సలహా ఇస్తుంది.
తప్పిపోయిన వారి ఆచూకీ గుర్తించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఫేస్‌బుక్ ఫేషియల్ రికగ్నిషన్ టూల్‌ను వినియోగిస్తోంది.
అయితే.. వినియోగదారుల ప్రమేయం లేకుండానే వారి బయోమెట్రిక్ డేటాను ఫేస్‌బుక్ సేకరిస్తోందని ఆరోపిస్తూ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి కోర్టులో దావా వేశారు. గోప్యతా నిబంధనల కారణంగా యూరప్, కెనడాలో ఫేస్‌బుక్ ఈ టూల్‌ను వినియోగించడంలేదు.
ఐఫోన్‌లో ఫేస్ ఐడీ
గతేడాది నవంబర్‌లో విడుదలైన ఐఫోన్ 10లో ఫేస్ ఐడీ అనే కొత్త ఫీచర్ ఉంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో అది పనిచేస్తుంది. ఫోన్ ఫ్రంట్ కెమెరాకు మన ముఖాన్ని చూపిస్తే ఫోన్ అన్‌లాక్ అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
'సెకన్ల వ్యవధిలో చెప్పేస్తుంది'
ఇప్పటికే పాతనేరస్తుల ఫొటోలు, తప్పిపోయిన వారి ఫొటోలు, దేశవ్యాప్తంగా ఉన్న మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల ఫొటోలను డేటాబేస్‌లో తెలంగాణ పోలీసులు పొందుపరుస్తున్నారు.
ఎవరైనా అనుమానిత వ్యక్తి తారసపడితే అతని ఫొటోను 'టీఎస్‌కాప్' మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే.. డేటాబేస్‌లోని ఫొటోలతో సాఫ్ట్‌వేర్ పోల్చిచూస్తుంది. దాంతో కొన్ని సెకన్లలోనే అతడు పాతనేరస్తుడైనా, అదృశ్యమైన వ్యక్తి అయినా తెలిసిపోతుందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
అలా గుర్తు తెలియని శవాల వివరాలనూ తెలుసుకునే వీలుంటుందని ఆయన అన్నారు. నేరాలతో సంబంధం లేనివారిని కాపాడేందుకు కూడా ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు.
అయితే అనుమానితుల గుర్తింపు పేరుతో పోలీసులు అమాయకుల ఫొటోలను ఆ డేటాబేస్‌లో నిల్వ చేసే ప్రమాదం ఉందని, దాంతో అన్యాయంగా అనుమానితులంటూ సామాన్యులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటూ బ్రిటన్, అమెరికాలో పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కానీ.. తాము అలా సామాన్యుల ఫొటోలను డేటాబేస్‌లో నిల్వచేయబోమని తెలంగాణ డీజీపీ తెలిపారు.
"ఒకవేళ మేము పోల్చి చూసే వ్యక్తి ఫొటోలు డేటాబేస్‌లోని చిత్రాలతో సరిపోలకుంటే వెంటనే అతని ఫొటో డిలీట్ అయిపోతుంది. సాధారణ పౌరుల ఫొటోలను స్టోర్ చేయబోము" అని డీజీపీ అన్నారు.
ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌తో పోల్చి చూసినప్పుడు 90 శాతం ఫొటో సరిపోయినంత మాత్రాన అనుమానితులను నేరస్థుడిగా నిర్ధారించలేమని, ఇది కేవలం ఒక 'క్లూ'గా మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు.
కోర్టులో సాక్ష్యంగా దీన్ని చూపలేమని పేర్కొన్నారు. ఈ సాంకేతికత ద్వారా గుర్తించిన నిందితుల చార్జిషీట్ దాఖలులో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఆధారాలుగా పేర్కొనలేమని డీజీపీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- జెఫ్ బెజోస్: సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యారిలా
- BBC Special: విశాఖ రైల్వే జోన్ వస్తుందా, రాదా? వస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
- మీ ఫోన్లో మీకు తెలీకుండానే ఆధార్ ఫోన్ నంబర్ సేవ్ అయి ఉందా... ఒక్కసారి చూసుకోండి
- BBC SPECIAL: చైనాలో బాహుబలి, దంగల్ సినిమాలు ఎందుకంత హిట్టయ్యాయంటే...
- కరణ్ థాపర్: ‘మోదీ ముఖంలో కోపం, అడ్వాణీ కళ్లలో నీళ్లు, భుట్టో చూపులో ప్రేమ.. అన్నీ చూశా’
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- మాజీ గర్ల్ ఫ్రెండ్, మాజీ బాయ్ ఫ్రెండ్ : బంధాలపై గతాల నీలినీడలు
- అదిగదిగో 5జీ: ఈ 5జీ వస్తే ఎలా ఉంటుంది?
- BBC Special: చైనా పెళ్లిళ్ల సంతలో ‘మిగిలిపోయిన అమ్మాయిలు’
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








