అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్: సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలా అయ్యారంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నటాలీ షెర్మన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రెండు దశాబ్దాల క్రితం జెఫ్ బెజోస్ భవిష్యత్తును చూడగలిగారు. మాల్స్ ప్రాధాన్యత కోల్పోతాయని, సూది నుంచి రూ.82 లక్షల విలువ చేసే 105 అంగుళాల సామ్‌సంగ్ స్మార్ట్ టీవీ వరకు ఒక క్లిక్‌తో ఆర్డర్ చేయొచ్చని గుర్తించారు.
ఆ ఆలోచన ఆధారంగానే ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు.
1994లో ఒక సెకెండ్ హాండ్ బుక్ షాపు నుంచి అమెజాన్ ఇప్పుడు అనేక రకాల సేవలను అందించే ప్రపంచ మొట్టమొదటి ట్రిలియన్ డాలర్ కంపెనీగా 2018 సెప్టెంబర్‌లో అవతరించింది.
జెఫ్ బెజోస్ గురించి మనకు తెలీని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రిక ఆయన సొంతం. ఆయన ఏరోస్పేస్ సంస్థ బ్లూ ఆరిజిన్ అంతరిక్ష యాత్ర టికెట్లు విక్రయించే ఆలోచనలో ఉంది.

ఫొటో సోర్స్, Blue Origin
అంతరిక్ష కాలనీలు
బెజోస్ ఆలోచనలు ఎలాంటివో దశాబ్దాల క్రితమే సూచనప్రాయంగా వెల్లడైంది.
బెజోస్ పుట్టిన కొన్నాళ్లకే టీనేజీ దంపతులైన అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన తల్లి జాకీతో కలిసి టెక్సాస్, ఫ్లోరిడాల్లో పెరిగారు. అతని మారు తండ్రి మైక్ బెజోస్ ఎక్సాన్ సంస్థ ఎగ్జిక్యూటివ్. క్యూబాలో కాస్ట్రో అధికారంలోకి రావడంతో మైక్ అక్కడి నుంచి పారిపోయి అమెరికా చేరుకున్నారు.
చిన్నతనంలో జెఫ్ బెజోన్ సైన్స్, ఇంజనీరింగ్‌ల పట్ల అమితాసక్తి కనపరిచేవారు. హైస్కూల్లో చదువుతుండగా చేసిన ప్రసంగంలో, అంతరిక్షంలో కాలనీలు నిర్మించాలన్నది తన లక్ష్యం అని పేర్కొన్నారు.
ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అభ్యసించారు. తర్వాత డీఈ షా హెడ్జ్ ఫండ్‌లో చేరారు. అక్కడే తన భార్య మెకంజీతో ఆయనకు పరిచయమైంది.
30 ఏళ్ల వయసులో ఇంటర్నెట్ అతి వేగంగా విస్తరిస్తున్న తీరు చూసి, ఆయన షా సంస్థకు రాజీనామా చేశారు.
2010లో ప్రిన్స్‌టన్‌లో చేసిన ప్రసంగంలో బెజోస్, అమెజాన్‌ను ప్రారంభించడం చాలా రిస్కు అని అంగీకరించారు.
''జీవితాంతం మనం అసలు ప్రయత్నించనే లేదు అని బాధపడడం కంటే ఒకసారి ప్రయత్నించి విఫలమైనా ఫర్వాలేదనుకున్నా'' అని అన్నారు బెజోస్.

ఫొటో సోర్స్, AFP/Getty
సైబర్ కామర్స్ రారాజు
తన వ్యక్తిగత సొమ్ము, కుటుంబానికి చెందిన సుమారు రూ.7 లక్షల రూపాయలతో బెజోస్ ఆడిన జూదం చాలా తొందరగానే ఫలితాన్నిచ్చింది.
1995లో అమెజాన్‌ను ప్రారంభించిన నెల లోపే అది అమెరికాలోని 50 రాష్ట్రాలు, దాదాపు 45 దేశాలలో తన లావాదేవీలు ప్రారంభించినట్లు బ్రాడ్‌స్టోన్ తన 'ద ఎవ్రీథింగ్ స్టోర్: జెఫ్ బెజోస్ అండ్ ద ఏజ్ ఆఫ్ అమెజాన్' పుస్తకంలో వెల్లడించారు.
అమెజాన్ ప్రారంభమైన మొదటి ఐదేళ్లలో దాని కస్టమర్ అకౌంట్ల సంఖ్య 1,80,000 నుంచి 1.7 కోట్లకు చేరింది. దాని అమ్మకాలు రూ.3.5 కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు చేరుకున్నాయి.
చాలా పెద్ద కంపెనీలు కూడా దానిలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాయి. 1997లో అది పబ్లిక్ కంపెనీగా మారి, రూ.370 కోట్లు సమీకరించింది. దాంతో బెజోస్ 35 ఏళ్లలోపే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రయోగాలు
జెఫ్ బెజోస్ ఒక దీర్ఘకాలిక వ్యూహంతో, వినియోగదారునిపై ప్రధానంగా దృష్టి పెడుతూ, ఖర్చులను తగ్గించుకుని, ఉచిత డెలివరీలాంటి సేవలు అందిస్తూ, కిండిల్ ఈ-రీడర్ లాంటి కొత్త పరికరాలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తూ అమెజాన్‌ను ఎవరికీ అందనంత ఎత్తులకు చేర్చారు.
అయితే అమెజాన్ ప్రస్థానంలో కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి. మొదట్లో పెట్స్ డాట్ కామ్ లాంటి సైట్లలో పెట్టుబడి పెట్టడం నష్టాన్ని తెచ్చింది.
2018 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అమెజాన్ రికార్డు స్థాయిలో రూ.17 వేల కోట్ల లాభాలను నమోదు చేసింది. అమెరికాలో 2018లో మొత్తం ఆన్‌లైన్ అమ్మకాలలో దాదాపు సగం అమెజాన్ అమ్మకాలే. అలాగే మొత్తం రిటైల్ మార్కెట్ అమ్మకాలలో అమెజాన్ వాటా 5 శాతం.
2018 జూలై నాటికి అమెజాన్‌లో మొత్తం 5 లక్షల 75 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
కొత్త దారులను అన్వేషించడంలో అమెజాన్ ఎప్పుడూ ముందుంటుంది.
2017లో అది హోల్‌ఫుడ్స్ అన్న ఆన్‌లైన్ గ్రోసరీ స్టోర్‌ను కొనుగోలు చేసింది. 2018లో ఆన్‌లైన్ ఫార్మసీని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
విమర్శలూ ఉన్నాయి..
అయితే అమెజాన్‌ది గుత్తాధిపత్యం అంటూ విమర్శించే వారూ ఉన్నారు. అంతే కాకుండా పన్నులు, కార్మిక విధానాల విషయంలో కూడా అది అవలంబించే విధానాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అమెజాన్ లాబీయింగ్‌పై ఎక్కువగా ఖర్చు చేస్తోందంటూ ఓపెన్ సీక్రెట్స్ డాట్ ఓఆర్‌జీ 2014లో పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా యూఎస్ పోస్టల్ సర్వీస్ నుంచి తక్కువ ధరలకే తన ఉత్పత్తులను వినియోగదారులకు పంపేలా అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుందని, దానిపై నియంత్రణలు విధిస్తామని హెచ్చరించారు.
ఈ విమర్శల నడుమే జెఫ్ బెజోస్ ఇటీవలే తన దాతృత్వ కార్యక్రమాలను మరింత ఎక్కువ చేస్తానని తెలిపారు. అయితే అవి వ్యాపారంలో మాదిరి దీర్ఘకాలికంగా కాకుండా వెంటనే ఫలితాలు ఉండేలా చూస్తానని అన్నారు.
ఆయన కొత్త వ్యూహం ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో చూడడానికి ప్రపంచం ఎదురు చూస్తోంది.
ఇవి కూడా చదవండి:
- నిజాం నవాబూ కాదు, బిల్ గేట్సూ కాదు.. చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
- రామేశ్వరం: మందిరమైనా.. మసీదైనా.. లోపలికెళితే ఒకేలా ఉంటాయిక్కడ
- ‘బంగ్లాగా పశ్చిమ్ బెంగాల్‘: ఒక రాష్ట్రం పేరును ఎలా మార్చుతారంటే..
- కొలంబియా: కుక్కను చంపితే రూ. 50 లక్షలు.. తలకు వెల కట్టిన డ్రగ్ మాఫియా.. కుక్కకు భద్రత పెంచిన పోలీసులు
- ఎవరు ఎక్కువ ఆరోగ్యవంతులు.. మగవాళ్లా లేక ఆడవాళ్లా?
- చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? దానికి పరిష్కారమేంటి?
- డిజిటల్ ఇండియాపై మోదీ మాటల్లో వ్యత్యాసం
- BBC exclusive: ‘టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు’
- కొడుకులను దాచారని తల్లికి జైలు శిక్ష: తీర్పుపై స్పెయిన్‌లో తీవ్ర వ్యతిరేకత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









