కొడుకులను దాచారని తల్లికి జైలు శిక్ష: తీర్పుపై స్పెయిన్‌లో తీవ్ర వ్యతిరేకత

తల్లికి జైలు శిక్ష

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పిల్లలను తిరిగి తీసుకువచ్చిన రివస్

ఇద్దరు కొడుకులను తండ్రికి అప్పగించకుండా దాచిపెట్టారనే ఆరోపణలతో ఒక తల్లికి స్పెయిన్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

ఆమె ఆరేళ్ల పాటు పిల్లల కస్టడీ హక్కులను కూడా ఉల్లంఘించారని భావించిన కోర్టు.. న్యాయపరమైన ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది.

ఇటలీకి చెందిన ఫ్రాన్సిస్కో అరుర్కీ, జువానా రివస్ భార్యాభర్తలు. వారికి 12, 4 ఏళ్ల వయసులో ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నారు.

పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనే విషయంపై అరుర్కీ, జునానా మధ్య చాలా కాలంగా న్యాయ పోరాటం జరుగుతోంది.

ఇద్దరు కొడుకులను తండ్రికి అప్పగించాల్సిన సమయంలో వారిని తీసుకుని 2016లో జునానా హఠాత్తుగా స్పెయిన్ వెళ్లిపోయారు.

ఆమె తిరిగి స్వదేశం వెళ్లకుండా.. తన భర్త మీద గృహహింస ఆరోపణలు చేస్తూ స్పెయిన్‌ దక్షిణాది నగరం గ్రానడలోని కోర్టులో కేసు వేశారు.

అయితే ఆ ఆరోపణలకు ఆధారాలు లేవని, పిల్లలను వారి తండ్రికి అప్పగించాలని కోర్టు ఆమెను ఆదేశించింది.

పిల్లలను తండ్రికి దూరం చేయడం చట్టవిరుద్ధమని, ఆ పిల్లలను ఆమె అపహరించారని కోర్టు తీర్పు ఇచ్చింది.

కానీ, పిల్లలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో పారిపోయి రావడాన్ని అపహరణగా భావించవద్దని ఆమె గత ఏడాదే కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

తల్లికి జైలు శిక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వేధింపుల ఆరోపణలను ఖండించిన అర్కురి

తండ్రి ఏమంటున్నారు?

జువానా రివస్‌ను హింసించారన్న కేసులో ఫ్రాన్సిస్కో అర్కురీ 2009లో శిక్ష అనుభవించారు. ఆ తర్వాత కొన్నాళ్లు ప్రశాంతంగా ఉన్నారు. వారికి రెండో కొడుకు పుట్టాడు.

కానీ 2016లో తన కుటుంబాన్ని కలవాలని స్పెయిన్ వచ్చిన జువానా పిల్లలతోపాటూ ఇక్కడే ఉండిపోయారు. అర్కురీపై గృహ హింస కేసు పెట్టారు. తనను, తన పిల్లలను భర్త హింసించాడని ఆరోపించారు.

జువానా చేసిన ఆరోపణలను అర్కురీ ఖండించారు.

తాజాగా కోర్టు తీర్పుతో పోలీసుల ముందు లొంగిపోయిన జువానా, పిల్లలను వారి తండ్రి కస్టడీకి అప్పగించారు.

జువానా రివస్ తరఫు లాయర్ కోర్టు తీర్పును న్యాయవ్యవస్థ వైఫల్యంగా వర్ణించారు. ఆమె న్యాయ పోరాటం కొనసాగుతుందన్నారు.

ఈ కేసుపై స్పందించిన స్పెయిన్ ఉప ప్రధాని కామెరూన్ కాల్వో శిక్షను ధ్రువీకరించేవరకూ ఆమెను జైలుకు పంపించడం ఉండదని తెలిపారు.

తల్లికి జైలు శిక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జువానాకు మద్దతుగా మహిళా సంఘాల ఆందోళన

జువానాకు పెరుగుతున్న మద్దతు

జువానా, ఆమె పిల్లల కేసులో స్పెయిన్ కోర్టు తీర్పుపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.

ఆమె తన ఇద్దరు పిల్లలతో కనిపించకుండా ఉన్న సమయంలో JuanaEstáEnMiCasa(జువానా మా ఇంట్లో ఉంది) అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ అయ్యాయి.

ఆ దేశంలోని విపక్షాలు, మహిళా సంఘాలు కూడా జువానాకు మద్దతు పలుకుతున్నాయి.

స్పెయిన్ రాజకీయ పార్టీలు ఈ తీర్పును అనాగరికంగా వర్ణించాయి. దేశం మారినా, న్యాయవ్యవస్థ మాత్రం ఇంకా కాలంచెల్లిన విధానాలు పాటిస్తోందని విమర్శించాయి.

స్పెయిన్ మీడియాతో మాట్లాడిన మహిళా సంఘాలు కోర్టు తీర్పులో న్యాయం లేదన్నాయి. జువానాపై జరిగిన హింసను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించాయి.

స్పెయిన్‌లోని కొన్ని సంఘాలు జువానాకు మద్దతుగా పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇది ప్రస్తుతం దేశంలో లింగ హింస వ్యతిరేక ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)