‘బంగ్లాగా పశ్చిమ్ బెంగాల్’: ఒక రాష్ట్రం పేరును ఎలా మార్చుతారంటే..

- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ ప్రతినిధి
పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చుతూ తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పార్లమెంట్ ఆమోదం పొందితే ఇకపై అధికారికంగా పశ్చిమ బెంగాల్ పేరు బంగ్లాగా మారుతుంది.
మమతా బెనర్జీ ప్రభుత్వం గతంలో పశ్చిమ బెంగాల్ పేరును ఇంగ్లిష్‌లో బెంగాల్‌గా, హిందీలో బంగాల్‌గా, బెంగాలీలో బంగ్లాగా మారుస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
అయితే, మూడు భాషల్లో రాష్ట్రం పేరు వేర్వేరుగా ఉండటంపై కేంద్రం అభ్యంతరం తెలిపింది. రాష్ట్రం పేరు ఒకే విధంగా ఉండేలా చూడాలని సూచించింది.
దీంతో మూడు భాషల్లోనూ పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్పుచేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం తాజాగా తీర్మానం చేసింది.

ఫొటో సోర్స్, Mamathabenrjee/facebook
ఇంతకీ పేరు ఎందుకు మార్చుతున్నారు?
‘ప్రపంచానికి బెంగాల్‌గా పరిచయమున్న ప్రాంతాన్ని అధికారికంగా కూడా అలాగే పిలవాలి. సగటు బెంగాలీల కోరిక కూడా అదే’ అని ఒక సందర్భంలో మమతా బెనర్జీ పేర్కొన్నారు.
‘దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లను ఇంగ్లిష్ వర్ణమాల ప్రకారం పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్ (వెస్ట్ బెంగాల్) పేరు చివరి స్థానంలో ఉంటోంది. దీంతో ఎప్పుడైనా అన్ని రాష్ట్రాలు సమావేశమైనప్పుడు చివరిస్థానంలో పశ్చిమ బెంగాల్ నిలవాల్సి వస్తోంది. దాని వల్ల ఒక్కోసారి రాష్ట్రం తరఫున వివిధ వేదికల్లో పాల్గొంటున్నవారికి సరైన అవకాశాలు దక్కడం లేదు. పేరు మార్పు వల్ల ఈ పరిస్థితి కూడా మారుతుంది’ అని ఈ రాష్ర్ట అసెంబ్లీలో తీర్మానం ఆమోదం సమయంలో వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.
బ్రిటిష్ పాలనాకాలంలో బంగ్లా ప్రాంతాన్ని రెండుగా విభజించి ఒక ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌లో కలిపారు. దాన్ని తూర్పు బెంగాల్‌గా పిలిచారు. భారత్‌లో ఉన్న ప్రాంతం అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్ (వెస్ట్ బెంగాల్)గా స్థిరపడింది.
బ్రిటిష్ పాలన నుంచే పేర్ల మార్పు
స్వతంత్ర భారత్‌లోనే కాదు అంతకుముందు బ్రిటిష్ పాలనలోనూ రాష్ట్రాల పేర్లు మార్చారు.
భారత్, పాక్ విభజన సమయంలో పంజాబ్ ప్రాంత విభజన బ్రిటిష్ ప్రభుత్వానికి చాలా క్లిష్టంగా మారింది. రాడ్‌క్లిఫ్ కమిషన్ సూచన మేరకు ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతాన్ని వెస్ట్ పంజాబ్‌గా విభజించి పాకిస్తాన్‌లో కలిపారు.
హిందువులు, సిక్కులు అధికంగా ఉండే ప్రాంతాన్ని ఈస్ట్ పంజాబ్‌గా పేరు మార్చి భారత్‌లో ఉంచారు. రాజ్యాంగం అమలులోకి వచ్చాక ఈస్ట్ పంజాబ్ ప్రాంతాన్ని పంజాబ్‌గా మార్చారు.
నాటి యునైటెడ్ ప్రావిన్స్ నేటి ఉత్తర్ ప్రదేశ్
1947 తర్వాత కేంద్ర ప్రభుత్వం రాంపూర్, బనారస్, తెహ్రీ- గర్వాల్ సంస్థానాలను కలిపి యునైటెడ్ ప్రావిన్స్‌గా రూపొందించింది. రాజ్యాంగం అమలులోకి వచ్చాక ఆ ప్రావిన్స్‌ను ఉత్తర్ ప్రదేశ్‌గా మార్చింది.
మధ్య భారత్ నుంచి మధ్య ప్రదేశ్‌గా..
భారత ప్రభుత్వం 28 మే 1948న 25 సంస్థానాలను కలిపి ఆ ప్రాంతానికి మధ్య భారత్ అనే పేరు పెట్టింది. అయితే, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, 1956 అమలులోకి వచ్చాక ఈ ప్రాంతానికి మధ్య ప్రదేశ్‌గా పేరు పెట్టారు.

తమిళనాడుగా మారిన మద్రాసు రాష్ట్రం
స్వాతంత్ర్యం అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు ప్రావిన్స్‌గా మార్చారు. ఆ తర్వాత అన్నాదురై ప్రభుత్వం 1969లో మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చుతూ కేంద్రానికి తీర్మానం పంపారు.
ఆ తీర్మానానికి పార్లమెంట్ ఆమోదం తెలపడంతో రాష్ట్రం పేరు తమిళనాడుగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తరాఖండ్‌గా ఉత్తరాంచల్
ఉత్తరాంచల్ ప్రాంతాన్ని పురాణాల్లో ఉత్తరాఖండ్‌గా పిలిచేవారు.
ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఉత్తర్ ప్రదేశ్ నుంచి విడదీసిన భాగానికి ఉత్తరాంచల్ రాష్ట్రంగా పేరు పెట్టింది. కానీ, స్థానిక ప్రజలు తమ రాష్ట్రానికి ఉత్తరాఖండ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
దీంతో రాష్ట్రం పేరును ఉత్తరాఖండ్‌గా మారుస్తూ డిసెంబర్ 2007 జనవరి 1 రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒరిస్సా నుంచి ఒడిశాగా..
ఒరిస్సా ప్రభుత్వం రాష్ట్రం పేరుతో పాటు భాష పేరును మార్చాలని నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది.
ఒరిస్సా ( పేరు మార్పు) బిల్లుతో పాటు రాజ్యాంగంలోని 113వ సరవణకు రాష్ట్రపతి అంగీకరించడంతో 2010లో ఒరిస్సా పేరు ఒడిశాగా, ఒరిస్సా భాషను ఒడియాగా మారుస్తూ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రం పేరును మార్చాలంటే ఏం చేయాలి?
రాష్ట్రం పేరు మార్చే ప్రక్రియను ఆ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టవచ్చు. అయితే, దీనికి కేంద్రం ఆమోదం తప్పనిసరిగా ఉండాలి.
అలాగే, ఆర్టికల్ 3 ప్రకారం ఏ రాష్ట్రం పేరునైనా ఆ రాష్ట్రం నుంచి ప్రతిపాదన రాకున్నా, ఆ రాష్ట్ర ఆమోదం లేకున్నా మార్చేందుకు పార్లమెంటుకు అధికారం ఉంది.
- రాష్ట్రం పేరు మార్చాలంటే మొదట పేరు మార్పుపై ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.
- అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును రూపొందించి మళ్లీ ఆ రాష్ట్ర అసెంబ్లీకి పంపుతుంది.
- అప్పుడు రాష్ట్రపతి విధించిన కాలపరిమితిలోపు బిల్లుపై శాసన సభ తన అభిప్రాయాలను చెప్పాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత బిల్లును రాష్ట్రపతి పార్లమెంట్‌కు పంపుతారు. అక్కడ ఆమోదం పొందాక మళ్లీ రాష్ట్రపతి తన ఆమోద ముద్ర వేస్తారు.
- ఆ తర్వాత రాష్ట్రం పేరు మారినట్లు ఒక గెజిట్ రూపంలో కేంద్రం ప్రకటిస్తుంది.
ఆధారం: (భారత రాజ్యాంగం, TheMadras State (Alteration of Name) Act, 1968, The Uttaranchal (Alteration of Name) Act, 2006, The Orissa (Alteration of Name) Bill, 2010)
ఇవికూడా చదవండి.
- హైదరాబాద్‌లో రోహింజ్యాల ఫుట్‌బాల్ జట్టు ఇదీ
- సంజయ్ గాంధీకి చరిత్ర అన్యాయం చేసిందా?
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- తమిళ విద్యార్థులను ఆకట్టుకున్న ఈ టీచర్ తెలుగాయనే
- 'మూగ' ఇందిర 'ఉక్కు మహిళ'గా ఎలా మారారు?
- #గమ్యం: పైలట్ కావాలని అనుకుంటున్నారా..
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








