చరిత్ర: దళితుడి హోటల్లో టీ తాగిన శివాజీ వారసుడు సాహూ మహరాజ్

గంగారాం కాంబ్లీ నుంచి టీ తీసుకొంటున్న రాజు

ఫొటో సోర్స్, BBC / SWATI PATIL RAJGOLKAR

    • రచయిత, మంజుశ్రీ పవార్
    • హోదా, చరిత్రకారులు

''ఏదో హోటల్ పెట్టావని విన్నాను, నిజమేనా''- అని గంగారాం కాంబ్లీని 'ఛత్రపతి' శివాజీ వారసుడు, రాజు రాజశ్రీ సాహూ అడిగారు. ''ఔను, రాజుగారు. సొంతంగా వ్యాపారం చేసుకొమ్మని మీరు సలహా ఇచ్చారు కదా. మీ సలహా ప్రకారం హోటల్ తెరిచాను'' అని కాంబ్లీ సమాధానమిచ్చారు. ''హోటల్‌పై నీ పేరు ఎందుకు రాయలేదు మరి'' అని సాహూ మహరాజ్ ప్రశ్నించారు.

''నా పేరెందుకు రాయాలి? ఊళ్లో ఉన్న అన్ని హోటళ్లపైన యజమానులు వారి కులం పేరు రాసుకున్నారా'' అని సాహూ మహరాజ్‌కు ఎదురు ప్రశ్న వేశారు కాంబ్లీ.

''నీ మాటా సరైనదేలే. అది సరేగానీ, నీ హోటల్లో ఇప్పటివరకు ఎంత మంది టీ తాగారు'' అంటూ సాహూ మహరాజ్‌ మరో ప్రశ్న వేశారు.

''చాలా మందే తాగారు.. ఎంత మందో తెలియదు'' అని కాంబ్లీ సమాధానమిచ్చారు.

''ఇప్పటివరకు చాలా మందిని 'మలినపరిచినట్లు' ఉన్నావు. నీ హోటల్‌ వైపు వచ్చినప్పుడు హోటల్ చూస్తాను. అక్కడే టీ తాగుతాను, చేసిపెట్టు'' అని కాంబ్లీకి సాహూ మహరాజ్‌ ఓ సందర్భంలో చెప్పారు.

సాహు మహరాజ్

ఫొటో సోర్స్, FACEBOOK / INDRAJIT SAWANT

ఫొటో క్యాప్షన్, సాహూ మహరాజ్

రాజు వద్ద పనిచేసిన కాంబ్లీ

ఈ హోటల్ పెట్టడానికి ముందు కాంబ్లీ సాహూ మహరాజ్ వద్ద పనిచేసేవారు. కాంబ్లీ దళితుడు. ఆయన హోటల్ పెట్టుకోవడానికి సాహూ మహరాజ్‌ సాయపడ్డారు.

కాంబ్లీ హోటల్‌లో టీ తాగడానికి రాజు వస్తున్నారనే వార్త కొల్హాపూర్‌(మహారాష్ట్ర) అంతటా వ్యాపించింది. కాంబ్లీ హోటల్‌లో సాహూ మహరాజ్‌ టీ తాగడాన్ని చూసేందుకు ఆయన కన్నా ముందే చాలా మంది అక్కడకు చేరుకున్నారు. తర్వాత రాజు వచ్చి హోటల్‌లో తాగారు. తన వెంట ఉన్న ఇతరులకు కూడా టీ తాగండని చెప్పారు.

సాహూ మహరాజ్ టీ తాగిన తర్వాత కాంబ్లీతో మాట్లాడుతూ- సోడా తయారీ యంత్రం తెచ్చుకోవాలని సూచించారు. దీనిని తనే కొనిపెడతానని ఆయనే చెప్పారు. సాహూ మహరాజ్ తర్వాత ఈ యంత్రాన్ని కొని కాంబ్లీకి ఇచ్చారు.

కొల్హాపూర్‌లో భావ్‌సింగ్ జీ రోడ్డులో కాంబ్లీ హోటల్‌ తెరిచి వందేళ్లు దాటింది. దీనిని తెరవడానికి, నడపడానికి ప్రేరణ ఇచ్చింది, అండగా నిలిచింది సాహూ మహరాజే.

వీరి సంభాషణ ఏంచెబుతోంది?

సాహూ మహరాజ్, కాంబ్లీ మధ్య సాగిన సంభాషణ మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది.

అప్పట్లో కుల వ్యవస్థ చాలా బలంగా ఉండేది. సమాజాన్ని చీల్చే, మానవ జాతి సిగ్గుపడేలా చేసే విభజనలు, ఆచార వ్యవహారాలు చాలా ఉండేవి.

తన మానవతా చర్యలతో, చొరవతో ఇలాంటి వాటిని అంతం చేసేందుకు సాహూ మహరాజ్ ఎప్పుడూ ప్రయత్నిస్తుండేవారు. ఈ ప్రయత్నంలో ఆయన ప్రత్యేకత ఆయనకు ఉండేది. ఈ విషయాల్లో కొన్నిసార్లు ముక్కుసూటిగా, కొన్నిసార్లు లౌక్యంగా సాహూ మహరాజ్ వ్యవహరించేవారు. కొన్ని సార్లు తనను వ్యతిరేకించేవారిని నేరుగా సవాలు చేసేవారు. మరికొన్ని సందర్భాల్లో అలాంటి వారికి గుణపాఠం నేర్పేవారు. అయితే తనదైన హాస్యాన్ని తన చర్యల్లోకి చొప్పించేవారు.

గంగారాం కాంబ్లీ

ఫొటో సోర్స్, INDRAJTT SAWANT, KOLHAPUR

ఫొటో క్యాప్షన్, గంగారాం కాంబ్లీ

సమాజానికి సవాలు విసిరిన సాహూ మహరాజ్

'అంటరానివారి'గా ముద్రవేసిన వారిని తాకితే 'అపవిత్రం' అయిపోతామనే భావన తమను తాము అగ్రకులాలుగా చెప్పుకొనేవారిలో ఉండేది. అంటరానివారిగా సమాజంలో ముద్రపడ్డ వారిని ఆలయాల్లోకి రానిచ్చేవారు కాదు. ఇతరుల వస్తువులను తాకనిచ్చేవారు కాదు. ఎవరైనా అలా చేస్తే నేరంగా పరిగణించేవాళ్లు. ఈ పరిస్థితులున్న రోజుల్లో 'అంటరానితనం' నిర్మూలనకు సాహూ మహరాజ్ చేసిన ప్రయత్నాలు కుల వ్యవస్థను దెబ్బకొట్టడమే కాకుండా మొత్తం సమాజాన్ని సవాలు చేసేవి.

1920లో నాగ్‌పుర్‌లో జరిగిన 'అఖిల భారతీయ బహిష్కృత్ పరిషత్' సదస్సుకు సాహూ మహరాజ్ హాజరయ్యారు. అధ్యక్ష హోదాలో ఆయన పాల్గొన్నారు. సదస్సులో- 'అంటరానివాడు'గా ముద్రపడ్డ వ్యక్తి తయారుచేసిన టీని అడిగి మరీ తెప్పించుకొని తాగారు.

ఇది జరిగిన నెల రోజులకు 'తక్కువ కులాల' వారి కోసం వసతిగృహం నిర్మాణం శంకుస్థాపనకు సాహూ మహరాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వందల మంది సమక్షంలో- మరో 'అంటరానివాడి' నుంచి టీ తెప్పించుకొని తాగారు. తాస్‌గావ్‌లోనూ ఇలాగే చేశారు.

కులవ్యవస్థను, అంటరానితనాన్ని బలంగా నమ్మే సమాజం ఎదుట శివాజీ వారసుడు 'తక్కువ కులం వ్యక్తి' నుంచి టీ తీసుకొని తాగడం ఓ విప్లవాత్మక చర్య. ఇది గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అంటరానితనం నిర్మూలనకు జరిగిన పోరాటంలో సాహూ మహరాజ్ చేసిన ప్రయత్నం ఓ కీలక ఘట్టంగా నిలిచిపోయింది.

రాజు ఎస్టేట్‌లోనే కాంబ్లీపై దాడి

కొల్హాపూర్‌లో బాడా ప్రాంతంలోని సాహు మహరాజ్ బంగళాలో పనిచేసిన సిబ్బందిలో గంగారాం కాంబ్లీ ఒకరు. ఆయన ప్రభుత్వ గుర్రపుశాలలో పనిచేసేవారు.

మధ్యాహ్న భోజనం తర్వాత బంగళా ప్రాంగణంలో చెట్టు కింద సిబ్బంది విశ్రాంతి తీసుకొంటుండగా వారికి ఏదో శబ్దం వినిపించింది. నీటి కొలను దగ్గర ఏదో జరిగింది. అందరూ అక్కడికి పరుగు తీశారు. వెళ్లి చూస్తే శాంతారాం అనే మరాఠా కానిస్టేబుల్, ఇతర 'అగ్రకులాల'కు చెందిన సిబ్బంది కాంబ్లీని విపరీతంగా కొడుతున్నారు. మరాఠాలకు ఉద్దేశించిన నీటిని తాకినందుకే ఆయన్ను కొడుతున్నారు. 'అంటరానివాడు' కాంబ్లీ నీటిని అపవిత్రం చేసినందుకు శాంతారాం, ఆయన సహచరులు కొరడాతో రక్తం వచ్చేట్లు కొడుతున్నారు.

ఈ ఘటన జరగడానికి ముందు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా ఎవ్వరూ అంటరానితనాన్ని పాటించకూడదంటూ సాహూ మహరాజ్ 1919లో ఒక ఉత్తర్వు జారీ చేశారు. రాజు ఉత్తర్వు ఉన్నా, ఏకంగా ఆయన ఎస్టేట్‌లోనే కాంబ్లీపై దాడి జరిగింది. అప్పుడు ఏదో పని విషయమై సాహూ మహరాజ్ దిల్లీలో ఉన్నారు. ఆయన వచ్చే వరకు కాంబ్లీ ఎదురుచూశారు. రాజు తిరిగి కొల్హాపూర్‌కు చేరుకున్నారు. కొల్హాపూర్ నగరం వెలుపల రాజు తన నివాసంలో ఉండగా, కాంబ్లీ తన కులానికి చెందిన మరికొందరిని తోడ్కొని అక్కడకు వెళ్లారు.

కొల్హాపూర్‌లోని సాహూ మహరాజ్ స్మారక చిహ్నం

ఫొటో సోర్స్, BBC / SWATI PATIL RAJGOLKAR

ఫొటో క్యాప్షన్, కొల్హాపూర్‌లోని సాహూ మహరాజ్ స్మారక చిహ్నం

ఆగ్రహోద్రిక్తుడైన రాజు

''నన్ను ఎందుకు కలవాలనుకున్నావు'' అని రాజు అడగ్గా- కాంబ్లీ పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటూ రక్తసిక్తమైన తన వీపును రాజుకు చూపించారు. జరిగింది చెప్పారు.

కాంబ్లీపై జరిగిన క్రూరమైన దాడి గురించి తెలిశాక రాజులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాడిచేసిన వారిని పిలిపించి, తన గుర్రానికి వాడే ఛర్నాకోలుతో వారిని శిక్షించారు. వారిది ఏ కులమనే విషయాన్ని ఆయన ఆలోచించలేదు. కాంబ్లీ ఎదురుగానే వారిని శిక్షించారు. కాంబ్లీని దగ్గరకు పిలిచి ఓదార్చారు. ''ఎస్టేట్‌లో పని మానేసి, సొంతంగా వ్యాపారం పెట్టుకో. నేను నీకు సాయం చేస్తా'' అని మాట ఇచ్చారు.

'ఉన్నత కులం' వ్యక్తి మాదిరి 'తక్కువ కులం' వ్యక్తి వ్యాపారం ప్రారంభించడం అప్పట్లో అసాధారణ పరిణామం. కాంబ్లీకి ఆ అవకాశాన్ని రాజు కల్పించారు.

రాజు సలహా ఇచ్చిన కొన్ని రోజులకే కొల్హాపూర్‌లోని భావ్‌సింగ్ జీ రోడ్‌లో కాంబ్లీ 'సత్యసుధారక్ హోటల్' ప్రారంభించారు. ఆయన హోటల్ పరిశుభ్రంగా ఉండేది. టీ ఎంతో రుచిగా ఉండేది. హోటల్ యజమాని 'అంటరాని వ్యక్తి' అనే ఉద్దేశంతో ఇతర కులాలవారు చాలా మంది అక్కడకు వెళ్లేవారు కాదు. ఒక 'అంటరానివాడు' అందరికీ టీ అందిస్తున్నాడనే కోపం 'అగ్రకులాల' వారిలో ఉండేది. ఈ విషయం రాజుకు తెలిసింది.

సమాజం చట్టాలతోనే మారదని రాజుకు తెలుసు

సమాజం కేవలం చట్టాలతో మారదు, చేతలు, వ్యూహాలతో మారుతుంది. సమాజాన్ని మార్పు దిశగా నడిపించేందుకు ఎవరైనా చొరవ చూపి నాయకత్వం వహించాలి. రాజుకు ఈ విషయం తెలుసు. కొల్హాపూర్ వీధుల్లో గుర్రపు బగ్గీలో వెళ్లే ఆయన, కాంబ్లీ హోటల్ వద్ద ఆగేవారు. ''కాంబ్లీ, నాకు టీ ఇవ్వు'' అని బిగ్గరగా అడిగేవారు. కాంబ్లీ ఎంతో మర్యాదతో ఆయనకు టీ తీసుకొచ్చి ఇచ్చేవారు. గుర్రపు బగ్గీలో తన వెంట ఉన్న బ్రాహ్మణులు, మరాఠాలు, ఇతర అగ్రకులాల వారికి కూడా సాహూ మహరాజ్ అక్కడ టీ తాగాలని చెప్పేవారు. కాంబ్లీ హోటల్లో ఏకంగా రాజే టీ తాగుతుండటంతో ఆయన మాటకు ఎదురుచెప్పే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు.

సామాజిక మార్పు కోసం మహారాష్ట్రలో జరిగిన ఉద్యమంలో ఈ ఘటన చాలా ప్రాచుర్యం పొందింది.

రెండు మార్గాలు ఎంచుకున్న సాహూ మహరాజ్

అంటరానితనం నిర్మూలనకు సాహూ మహరాజ్ రెండు మార్గాలు ఎంచుకున్నారు: 1) చట్టపరమైన పోరాటం చేయడం. 2) బహిరంగంగా తన చర్యలతో ఈ సమస్యపై పోరాడటం.

ఒక రాజుగా ఆయన చట్టాలు చేశారు. అదే సమయంలో, కాంబ్లీ లాంటి ప్రజలకు సహృదయతతో అండగా నిలిచారు.

సాహూ మహరాజ్ కన్నుమూసిన మూడు నాలుగేళ్లకు ఆయన పేరిట స్మారక చిహ్నం నిర్మించడానికి కాంబ్లీ ఒక కమిటీ ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ 1925లో కొల్హాపూర్‌లోని నర్సరీ బాగ్‌లో సాహు మెమోరియల్‌ను నిర్మించింది. మహారాష్ట్రలోనే కాదు, భారత్‌లోనే ఆయన పేరిట నిర్మితమైన తొలి స్మారక చిహ్నం అదే. దీనిని దళితులు నిర్మించారు, కాంబ్లీ నాయకత్వంలో.

(1902లో కులం ప్రాతిపదికన రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టిన కొల్హాపూర్ సంస్థానం రాజు సాహూ మహరాజ్ జయంతి (జూన్ 26) సందర్భంగా రాసిన వ్యాసం ఇది. వ్యాసం ప్రారంభంలో రాసిన సంభాషణ భాయ్ మాధవరావ్ బాగల్ రచించిన 'శ్రీ సాహు మహరాజ్ యాంచ్య అథవాని' పుస్తకంలో వివరంగా ఉంది).

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)