యువత మనోగతంపై ఐరాస సర్వే

ఫొటో సోర్స్, Getty Images
విద్య, కుటుంబ జీవితం, ఇంటర్నెట్ - ఇలాంటి అంశాలపై బాలలు, యువత ఆలోచనలు ఏమిటి? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కోసం తల్లిదండ్రులే కాదు, ఐక్యరాజ్యసమితి కూడా ప్రయత్నిస్తోంది. వీరి ఆలోచనలు ఏమిటో తెలుసుకొనేందుకు ఐరాస ఏడాదికి నాలుగుసార్లు అంతర్జాతీయ పోల్ నిర్వహించనుంది.
బాలలు, యువత అభిప్రాయాలను, ఆలోచనలను ప్రభుత్వాలు, ఐరాస లాంటి సంస్థలు తెలుసుకోవాల్సినంతగా తెలుసుకోవడం లేదని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం డైరెక్టర్ జనరల్ మైకేల్ మూలర్ చెప్పారు. ''నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. 15 ఏళ్లవారు, 65 ఏళ్లవారు ఒకేలా ఆలోచించరు. యువత ఏం కోరుకుంటోందో మా తరం ఊహించలేదు'' అన్నారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు లాంటి హామీలను, కార్యక్రమాలను బాలలు, యువత ఆలోచనలకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజం నిర్ణయించాల్సి ఉందని ఆయన చెప్పారు. వారి ఆలోచనలను పరిగణనలోకి తీసుకోని విధానాలతో అభివృద్ధి సాధ్యం కాదన్నారు.
ప్రపంచవ్యాప్తంగా బాలలు, యువతీయువకులు వారి జీవితాల గురించి, వారి కలల గురించి, వారి ఆకాంక్షల గురించి ఏమనుకుంటున్నారో వారినే క్రమం తప్పకుండా అడిగి తెలుసుకొంటే కచ్చితమైన సమాచారం దొరుకుతుందని మూలర్ వివరించారు.

చదువును ఆస్వాదించని 63 శాతం మంది
'యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ యూత్ పోల్'గా పిలిచే ఈ సర్వేలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల్లో 10 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 25 వేల మందికి పైగా బాలలు, యువతీయువకులను ప్రశ్నించనున్నారు.
ఈ పోల్ నేపథ్యంలో యూఎన్ గ్లోబల్ సస్టైనబిలిటీ ఇండెక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్నాహక పోల్ ఒకటి చేపట్టారు. ఈ పోల్‌లో ప్రస్తుతానికి వెల్లడైన సమాచారం ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా 63 శాతం మంది పాఠశాల జీవితాన్నిగాని, విశ్వవిద్యాలయ జీవితాన్నిగాని ఆస్వాదించడం లేదు.
విద్య విషయంలో అమెరికా, బ్రిటన్ విద్యార్థులు అత్యధిక అసంతృప్తితో ఉన్నారు. అమెరికాలో 71 శాతం మంది, బ్రిటన్‌లో 70 శాతం మంది అసంతృప్తి వ్యక్తంచేశారు. మెక్సికో విద్యార్థుల్లో 49 శాతం మంది, న్యూజిలాండ్‌లో 44 శాతం మంది విద్యాభ్యాసాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు.

కుటుంబంతో గడపడం ఇష్టమేనా?
కుటుంబంతో బంధం, కుటుంబ సభ్యులతో గడపడంపై యువత ఆలోచనల్లో ఖండాల మధ్య వ్యత్యాసం కనిపించింది. యూరోపియన్లు, అమెరికన్లతో పోలిస్తే ఆఫ్రికా, ఆసియా యువత కుటుంబంతో గడపడంపై ఎక్కువ సానుకూలంగా స్పందించారు. బ్రిటన్‌లో 32 శాతం మంది యువత కుటుంబంతో సమయం గడపడంపై అయిష్టత వ్యక్తంచేశారు. ఆగ్నేయాసియా దేశమైన వియత్నాంలో మాత్రం 69 శాతం మంది కుటుంబంతో గడపడాన్ని ఆస్వాదిస్తామని చెప్పారు.
ఆయా కార్యక్రమాలపై ఎంత డబ్బు వెచ్చిస్తున్నారనే అంశానికే పరిమితం కాకుండా, అసలు వాటి ప్రభావం ఎంతనే అంశాన్ని నిర్దిష్టంగా మదింపు చేసేందుకు ఈ పోల్ ఉపయోగపడుతుందని దీనిని రూపొందించిన ప్రొఫెసర్ డాన్ కాసినో చెప్పారు. ఆయన అమెరికాలోని ఫార్లేగ్ డికిన్సన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లలకు మొహమాటం ఉండదు
పిల్లలకు ఏ మాత్రం మొహమాటం ఉండదని, వారికి అనిపించింది కుండబద్దలు కొట్టినట్లు చెబుతారని ప్రొఫెసర్ కాసినో ప్రస్తావించారు. పెద్దవారి కంటే చిన్నవారు ఎక్కువ నిజాయతీగా ఉంటారని, వారిచ్చే సమాచారంపై ఎక్కువగా ఆధారపడొచ్చని తెలిపారు.
ఐరాస సర్వేతో ప్రతి మూడు లేదా ఆరు నెలలకోసారి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుస్తాయని, తదనుగుణంగా విధానాలు, కార్యక్రమాల్లో ప్రభుత్వాలు సకాలంలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుంటుందని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








