యూఎన్ మానవ హక్కుల కౌన్సిల్ నుంచి వైదొలగిన అమెరికా

ఫొటో సోర్స్, Reuters
ఐక్య రాజ్య సమితి మానవహక్కుల కౌన్సిల్ (యూఎన్‌హెచ్ఆర్‌సీ) నుంచి వైదొలగుతున్నట్టు అమెరికా ప్రకటించింది.
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, యూఎన్‌లో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఒక సంయుక్త పత్రికా సమావేశంలో ఈ విషయం చెప్పారు.
కాగా, మానవ హక్కుల పరిరక్షణ నుంచి అమెరికా ఇలా తప్పుకోగూడదని కౌన్సిల్ చీఫ్ జెద్ బిన్ రాద్ అల్ హుస్సేన్ అన్నారు.
"వెనెజువెలా, ఇరాన్‌లలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై తనను తాను మానవ హక్కుల కౌన్సిల్ అని చెప్పుకునే ఈ సంస్థ ఏమీ మాట్లాడలేకపోతోంది. కాంగో వంటి దేశాన్నికొత్త సభ్యురాలిగా చేర్చుకున్నప్పుడు ఇక అది మానవ హక్కుల కౌన్సిల్ అని చెప్పుకునే అర్హతనే కోల్పోతుంది" అంటూ నిక్కీ హేలీ మండిపడ్డారు.
ఈ సంస్థ మానవ హక్కులకు నష్టమే చేస్తుందని ఆమె అన్నారు.
ఈ కౌన్సిల్ రాజకీయ పక్షపాతంతో పని చేస్తోందని హేలీ అన్నారు. "కౌన్సిల్ నుంచి బయటకు వెళ్లిపోతున్నామంటే అర్థం మేం మానవ హక్కుల పట్ల మా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు కాదన్న విషయం నేను స్పష్టం చేయదలచుకున్నాను."

ఫొటో సోర్స్, Reuters
యూఎన్‌హెచ్ఆర్‌సీ "ఇజ్రాయెల్ పట్ల దురుద్దేశాలతో, వివక్షతో" వ్యవహరిస్తోందని హేలీ నిరుడు కూడా ఆరోపించారు. ఈ కౌన్సిల్‌లో భ్యత్వం విషయంలో అమెరికా పునఃసమీక్ష జరుపుతుందని ఆమె ఆనాడే వెల్లడించారు.
యూఎన్‌హెచ్ఆర్‌సీ ఉద్దేశాలపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా పలు ప్రశ్నలు లేవనెత్తారు. అది తన లక్ష్యాలపై దృఢంగా కట్టుబడి ఉండడం లేదని ఆయనన్నారు.
"యూఎన్‌హెచ్ఆర్‌సీ ఒకప్పుడు సదుద్దేశాలతో పని చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నేడు మనం నిజాయితీతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మానవ హక్కులను కాపాడడంలో ఇప్పుడది పట్టుదలతో పని చేయడం లేదు. అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే - యూఎన్ కౌన్సిల్ చాలా నిర్లజ్జగా, కపటధోరణితో వ్యవహరిస్తూ ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను పట్టించుకోవడం మానేసింది" అని ఆయన పేర్కొన్నారు.
ఈ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న ఆరు దేశాలపై మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలున్నాయని పాంపియో అన్నారు.
యూఎన్‌హెచ్ఆర్‌సీ 2006లో ఏర్పడింది. మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణల్లో చిక్కుకున్న దేశాలను సభ్యులుగా చేర్చుకోవడం కారణంగా ఈ కౌన్సిల్ పాలవుతోంది.
ప్రవాసుల పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్నందుకు ఓ వైపు ట్రంప్ ప్రభుత్వం తీవ్ర విమర్శలెదుర్కొంటున్న నేపథ్యంలో అమెరికా యూఎన్‌హెచ్ఆర్‌సీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటన చేయడం గమనార్హం.
అంతకు ముందు, డొనాల్డ్ ట్రంప్ విధానాలు "ఏకపక్షంగా" ఉన్నాయంటూ 'హ్యూమన్ రైట్స్ వాచ్' అనే మానవ హక్కుల సంస్థ విమర్శించింది.
"ఉత్తర కొరియా, సిరియా, మియన్మార్, దక్షిణ సూడాన్ వంటి దేశాల్లో యూఎన్‌హెచ్ఆర్‌సీ కీలక పాత్ర పోషించింది. కానీ ట్రంప్‌కు మాత్రం ఒక్క ఇజ్రాయెల్ బాధలు తప్ప మరేమీ పట్టవు" అని హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ కెనెథ్ రోత్ ఎద్దేవా చేశారు.

యూఎన్‌హెచ్ఆర్‌సీ - కొన్ని కీలకాంశాలు
- దీనిని ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు.
- ఇందులో 47 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. సభ్యత్వం గడువు మూడేళ్ల పాటు ఉంటుంది.
- ప్రపంచమంతటా మానవ హక్కుల సమస్యలపై నిఘా ఉంచడం ఈ కౌన్సిల్ లక్ష్యం.
- 2013లో చైనా, రష్యా, సౌదీ అరేబియా, వియత్నాం వంటి దేశాలను యూఎన్‌హెచ్ఆర్‌సీలో సభ్యత్వం ఇవ్వడంపై పలు మానవ హక్కుల సంస్థలు ధ్వజమెత్తాయి.
- ఒబామా పదవిలో ఉన్న సమయంలో అమెరికా తొలిసారి 2009లో ఈ కౌన్సిల్‌లో సభ్యురాలిగా చేరింది.

అమెరికా వాదనలు నిరాధారం: అమ్నెస్టీ
యూఎన్‌హెచ్ఆర్‌సీ నుంచి అమెరికా వైదొలగడంపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పందించింది. అమెరికా ఈ నిర్ణయానికి రావడానికి కారణాలు శూన్యమని అది ఒక ట్వీట్‌లో పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








