రోహింజ్యా సంక్షోభం: సరిహద్దులో మయన్మార్ సైనికులు.. బంగ్లాదేశ్ ఆగ్రహం

ఫొటో సోర్స్, AFP
బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దులో రోహింజ్యాల శిబిరానికి సమీపంలో మయన్మార్ సైనికుల కదలికలు కనిపించాయి. దీనిపై నిరసన వ్యక్తం చేసిన బంగ్లాదేశ్, సైనికులను ఉపసంహరించుకోవాలని మయన్మార్‌కు సూచించింది.
ప్రాణభయంతో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రాన్ని వీడిన రోహింజ్యాల్లో ఐదు వేల మందికి పైగా ఈ ప్రాంతంలోని శిబిరాల్లో తలదాచుకొంటున్నారు. సాంకేతికంగా చూస్తే ఈ ప్రాంతం మయన్మార్ భూభాగంలోనిదే. అయితే ఇది సరిహద్దు కంచెకు వెలుపల ఉంది.
కంచెకు కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. కంచె వెంబడి మయన్మార్ వారం కిందటి నుంచి గస్తీని ముమ్మరం చేసింది.
టోంబ్రు ప్రాంతానికి సమీపంలో రోహింజ్యాల శిబిరాలు ఉన్నాయి. గురువారం ఈ శిబిరాలకు సమీపంలో 100 నుంచి 200 మంది వరకు మయన్మార్ సైనికులు కనిపించారు. మెషిన్ గన్నులు, మోర్టార్లు కూడా అక్కడ కనిపించాయని బంగ్లాదేశ్ గార్డులు విలేఖరులతో చెప్పారు.
ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ మయన్మార్ అధికారులు లౌడ్‌స్పీకర్లలో ప్రకటనలు చేస్తున్నారని శిబిరాల్లో ఉంటున్న రోహింజ్యాల నాయకుడు దిల్ మొహమ్మద్ 'రాయిటర్స్' వార్తాసంస్థతో చెప్పారు. మయన్మార్ సైనికులు కంచె వద్దకు 14 నిచ్చెనలు తీసుకొచ్చారని, వాటి సాయంతో కంచె దాటేందుకు, తమను ఖాళీ చేయించేందుకు శిబిరాల వద్దకు రావడానికి యత్నించారని, తద్వారా తమను భయభ్రాంతులకు గురిచేశారని మొహమ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి చెప్పారు.
మయన్మార్ రాయబారిని పిలిపించిన విదేశీ వ్యవహారాలశాఖ
సరిహద్దులో మయన్మార్ సైనికుల కదలికలపై బంగ్లాదేశ్ తాత్కాలిక విదేశాంగ కార్యదర్శి తమ దేశంలోని మయన్మార్ రాయబారిని పిలిపించి, మాట్లాడారు. ఈ పరిణామం గందరగోళానికి దారితీస్తుందని, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతుందని చెప్పారు. సరిహద్దు నుంచి సైనికులను, సైనిక సామగ్రిని ఉపసంహరించుకోవాల్సిందిగా మయన్మార్ ప్రభుత్వానికి చెప్పాలని సూచించారు.
సరిహద్దులో మయన్మార్ సైనికుల కదలికలు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని బంగ్లాదేశ్ సరిహద్దు వ్యవహారాల అధికారి బ్రిగేడియర్ జనరల్ ముజిబుర్ రహ్మాన్ 'రాయిటర్స్'తో చెప్పారు. మయన్మార్‌కు నిరసన లేఖను పంపిస్తున్నామని తెలిపారు.
తమ మౌఖిక నిరసన మేరకు ఇప్పటికే మెషిన్ గన్నులు, మోర్టార్లు లాంటి ఆయుధ సామగ్రిని అక్కడి నుంచి తొలగించారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
నిరుడు ఆగస్టులో మయన్మార్ పోలీసులపై దాడులకు పాల్పడ్డ రోహింజ్యా మిలిటెంట్లు సరిహద్దులోని రోహింజ్యాల శిబిరాల్లో దాక్కొన్నారని మయన్మార్ అధికారులు ఇటీవల పేర్కొన్నారు.
గత సంవత్సరం రఖైన్ రాష్ట్రంలో మయన్మార్ ప్రభుత్వం చేపట్టిన చర్య నేపథ్యంలో అక్కడ ఉండే సుమారు ఏడు లక్షల మంది రోహింజ్యాలు ప్రాణభయంతో దేశం వీడారు. రఖైన్‌లో మిలిటెంట్ గ్రూపులే లక్ష్యంగా తాము సైనిక చర్య చేపట్టామని మయన్మార్ చెప్పింది.
అయితే రఖైన్‌లో పెద్దయెత్తన మానవ హక్కుల ఉల్లంఘనలు, హత్యలు, పౌరుల గ్రామాల దహనం జరిగినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.
మయన్మార్ చేపట్టిన చర్యను 'జాతి నిర్మూలన' చర్యగా పేర్కొంటూ ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది.
గ్రామాలు నేలమట్టం
రఖైన్‌లో రోహింజ్యాలు నివసించిన గ్రామాలను మయన్మార్ ప్రభుత్వం బుల్‌డోజర్లతో నేలమట్టం చేస్తోందని 'హ్యూమన్ రైట్స్ వాచ్' సంస్థ గత వారం విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి.
ఇలాంటి చర్యలవల్ల, అక్కడ రోహింజ్యాలపై జరిగిన అకృత్యాలకు ఆధారాలు లేకుండా పోయాయని సంస్థ చెప్పింది.
రోహింజ్యాలు ఉండి వచ్చిన ప్రాంతాల్లో విచారణ జరిపేందుకు ఐక్యరాజ్యసమితి అధికారులను మయన్మార్ అనుమతించడం లేదు.
ఇవి కూడా చదవండి:
- రోహింజ్యా వివాదంలో కిరీటం కోల్పోయిన బ్యూటీక్వీన్
- 'రోహింజ్యాలు మా దేశస్తులే కారు'
- హైదరాబాద్‌లో రోహింజ్యాలు
- భయంతో బంగారాన్ని భూమిలో దాచి పెట్టా
- #HerChoice: 'నలుగురు పిల్లల్ని కని అలసిపోయి ఆపరేషన్ చేయించుకున్నా.. భర్తకు చెప్పకుండా!'
- వేధింపుల బాధితులు ‘వన్ స్టాప్’ కేంద్రాలకు వెళ్లాలి. అక్కడెవరూ లేకపోతే ఎక్కడికెళ్లాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










