‘‘విశాఖ వచ్చి వెళుతున్న ఇరాన్ నౌకను అమెరికా ముంచేస్తే మోదీ మౌనంగా ఉంటారా?’’ అంటూ విమర్శలు, ఈ ఘటనపై ఇరాన్ ఏమంది?

ఇరాన్, అమెరికా, యుద్ధనౌక, సబ్‌మెరైన్, టార్పెడో

ఫొటో సోర్స్, @IN_HQENC

ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరి 17న, తూర్పు నావికాదళం ఈ ఫోటోను పోస్ట్ చేయడం ద్వారా ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ డేనాకు స్వాగతం పలికింది.
చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్ యుద్ధనౌకను అమెరికా హిందూ మహాసముద్రంలో బుధవారం టార్పెడోతో పేల్చివేసి, ముంచేసింది.

ఈ ఘటనకు సంబంధించి దేశంలోని విపక్షాలు ప్రధాన మంత్రి మోదీపై ప్రశ్నలు సంధిస్తున్నాయి.

ఈ ఘటన మార్చి 4న జరిగింది.

అయితే, అమెరికా చేసిన ప్రకటనలో యుద్ధనౌక పేరు పేర్కొనలేదు. కానీ, తమ సాయం కోరుతూ ఇరాన్ యుద్ధ నౌక దేనా నుంచి 'డిస్ట్రెస్ కాల్' (విపత్కర సమయంలో సాయం కోరుతూ చేసే కాల్) వచ్చినట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపిన తర్వాత, అమెరికా నుంచి ఈ ప్రకటన వచ్చింది.

అమెరికా దాడిపై ఇరాన్ స్పందించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ దాడి అనంతరం, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ అమెరికాపై ఘాటుగా స్పందించారు.

ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టులో "ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో, సముద్రంలో అమెరికా నేరానికి పాల్పడింది. ఇండియన్ నేవీకి అతిథిగా, 130 మంది నావికులతో వెళ్లిన ది ఫ్రిగేట్ డేనాపై అంతర్జాతీయ సరిహద్దులో, ఎలాంటి హెచ్చరికా లేకుండా అమెరికా దాడి చేసింది. నా మాటలు రాసిపెట్టుకోండి.. అమెరికా తన చేష్టలకు భారీ మూల్యం చెల్లించక తప్పదు" అని రాశారు.

ఈ ఇరానియన్ యుద్ధనౌక ఇటీవల విశాఖపట్నంలో భారత్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 సైనిక విన్యాసాల్లో పాల్గొంది.

ఇరాన్, అమెరికా, యుద్ధనౌక, సబ్‌మెరైన్, టార్పెడో

ఫొటో సోర్స్, AP

ఫొటో క్యాప్షన్, ఈ ఇరాన్ యుద్ధనౌక ఇటీవల భారత్ నిర్వహించిన సైనిక విన్యాసాల్లో పాల్గొంది.

మోదీ ప్రభుత్వంపై వచ్చిన ప్రశ్నలేంటి?

ఇరాన్ యుద్ధనౌకపై దాడి విషయంలో దేశంలోని విపక్ష నేతలు ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో, "ఈ ఇరానియన్ నావికులు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్‌ వచ్చారు. మనం వారిని ఆహ్వానించాం. వాళ్లు మన అతిథులు. వారు తిరిగివెళ్తుండగా, అమెరికా సబ్‌మెరైన్ వారి నౌకపై దాడి చేసి, వారిని చంపేసింది" అని రాశారు.

"ఇంత జరిగినా, ప్రధాని మోదీ నుంచి కనీసం స్పందన లేదు. ఈ పిరికితనం ఆమోదయోగ్యం కాదు. ప్రధాని మోదీ ఇలా రాజీపడడం దేశాన్ని ఇబ్బందిపెడుతోంది" అని ఆమె అందులో రాశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈ ఇరాన్ ఓడకు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేస్తూ ఈ ఘటనపై స్పందించారు.

"ఈ వీడియో మోదీ పిరికితనాన్ని ఎత్తిచూపుతోంది. భారత్ ఆహ్వానం మేరకు ఇరాన్ 'మిలాన్ ఎక్సర్‌సైజ్ 2026' కోసం తన నౌకను పంపింది. ఈ ఓడ ప్రత్యేకతలను రాష్ట్రపతికి వివరించారు కూడా" అని రాశారు.

"ఈ ఓడను అమెరికా పేల్చివేసింది. ఈ ఘటనలో 100 మందికిపైగా నావికులు చనిపోయారు. మన అతిథులు చనిపోయారు, కానీ మోదీ మౌనంగా ఉన్నారు" అని ఆయన రాశారు.

ఆర్జేడీ ప్రతినిధి ప్రియాంక భారతి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

"భారత్ ఆహ్వానం మేరకు ఇరాన్ నౌక దేశంలో జరిగిన నేవీ విన్యాసాల్లో పాల్గొంది. ఆ కార్యక్రమంలో మన రాష్ట్రపతి కూడా పాల్గొన్నారు. ఆ నౌక తిరిగి వెళ్తుండగా, హిందూ మహాసముద్రంలో అమెరికా దానిపై దాడి చేసి ముంచేసింది"

"యుద్ధంకాని ఒక కార్యక్రమంలో పాల్గొని వస్తున్న యుద్ధనౌకపై, పూర్తిగా ఆయుధాలతో ఉన్న అమెరికా సబ్‌మెరైన్ దొంగచాటుగా దాడి చేసింది. దీనిపై భారత్ ఎందుకు స్పందించడం లేదు?" అని ఆమె ప్రశ్నించారు.

దీనికిముందు, హిందూ మహాసముద్రంలో 'ఐరిస్ డేనా' మునిగిపోయిందని, అందులో ఉన్న 180 మందిలో 140 మంది జాడ తెలియలేదని శ్రీలంక నౌకా దళం పేర్కొంది.

ఇరాన్, అమెరికా, యుద్ధనౌక, సబ్‌మెరైన్, టార్పెడో

ఫొటో సోర్స్, NARENDRA MODI/YT

మోదీ ప్రభుత్వ వైఖరిపై చర్చ

అదే సమయంలో, ఈ సంఘటనకు సంబంధించి మీడియాలో వస్తున్న కొన్ని కథనాలను "తప్పుదారి పట్టించేవి"గా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

"భారత నౌకా స్థావరం నుంచే ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి చేసిందని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఓ చానెల్‌లో, యూఎస్ మాజీ ఆర్మీ అధికారి కల్నల్ డగ్లస్ మెక్‌గ్రెగర్ అన్నారు. అది పూర్తిగా అబద్ధం" అని ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెకింగ్ టీం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

అయితే, ఈ విషయంలో భారత్ మౌనాన్ని చాలామంది నిపుణులు, దౌత్యవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్ ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ పోస్టును ఎక్స్‌లో షేర్ చేస్తూ, "మౌనం వహించడం దౌత్యం కాదు. భారత్‌ను ప్రతిసారీ ఇరుకునపెడుతున్నారు. భారత్ పరోక్ష మద్దతును అమెరికా విలువైనదిగా భావిస్తుందని బీజేపీ అనుకుంటున్నట్లయితే.. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాటోను మందలిస్తూ, అసలు నాటో ఎప్పుడూ అమెరికాకు సాయపడలేదన్న మాటలను గుర్తుంచుకోండి. నాటో సభ్యదేశాలు అమెరికాతో కలిసి అఫ్గానిస్తాన్‌లో పోరాడి తమ సైనికులను కోల్పోయినా అలా మాట్లాడారు" అని రాశారు.

విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్‌ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.

"మన మిలాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇరాన్ నౌకను ఆహ్వానించకపోయివుంటే, అది అక్కడ ఉండేది కాదు. ఆ కార్యక్రమాన్ని మనమే నిర్వహించాం. ఈ కార్యక్రమం ప్రోటోకాల్స్ ప్రకారం, నౌక ఆయుధాలతో రాకూడదు. అంటే, ఈ ఇరానియన్ నౌకలో ఆయుధాలు లేవని, నిరాయుధంగా ఉందని అర్థమవుతోంది. ఇరాన్ నౌకాదళం మన రాష్ట్రపతి ముందు కవాతు కూడా చేశారు. ఈ కార్యక్రమంలో ఇరాన్ నౌక పాల్గొంటున్నట్లు అమెరికాకు తెలుసు. కాబట్టి ప్లాన్ ప్రకారమే అమెరికా సబ్‌మెరైన్ దాడి చేసింది" అని ఆయన ఆ పోస్టులో రాశారు.

భారత్‌కు సంబంధించిన సున్నితమైన అంశాలను అమెరికా విస్మరిస్తోందని కన్వల్ సిబల్ ఆరోపించారు.

"అమెరికా చేసిన ఈ దాడికి భారత్ రాజకీయంగా లేదా సైనికపరంగా బాధ్యత వహించాల్సిన అవసరం లేకపోయినా.. మానవతాపరమైన, నైతిక బాధ్యత భారత్‌పై ఉంటుంది" అని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్, అమెరికా, యుద్ధనౌక, సబ్‌మెరైన్, టార్పెడో

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్ యుద్ధనౌకను టార్పెడోతో ముంచేసినట్లు యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ తెలిపారు.

ఈ దాడి ఎలా జరిగింది?

హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా టార్పెడోతో దాడి చేసి ముంచివేసినట్లు యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ తెలిపారు.

నౌకలను నాశనం చేసేందుకు సబ్‌మెరైన్ల నుంచి టార్పెడోలను ప్రయోగిస్తారు. అయితే, మునిగిపోయిన ఇరాన్ నౌక పేరు ఆయన పేర్కొనలేదు.

దీనికి ముందు, ఐరిస్ డేనా హిందూ మహాసముద్రంలో మునిగిపోయిందని.. అందులో ఉన్న 180 మందిలో 140 మంది గల్లంతైనట్లు శ్రీలంక నేవీ తెలిపింది.

శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఎయిర్ వైస్ మార్షల్ సంపత్ తుయకొంత బీబీసీ సింహాళతో మాట్లాడుతూ, హిందూ మహాసముద్రంలో ఇరానియన్ నౌక మునిగిపోయిన ఘటనలో 80 మంది మృతదేహాలను గుర్తించినట్లు చెప్పారు.

అంతర్జాతీయ జలాల్లో సురక్షితంగా ఉందని భావించిన ఇరాన్ యుద్ధనౌకను అమెరికా ముంచేసింది అని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ అన్నారు.

"టార్పెడో దానిని ముంచేసింది" అని ఆయన పేర్కొన్నారు.

ఇరానియన్ నౌక ఐరిస్ డేనా నుంచి బుధవారం ఉదయం డిస్ట్రెస్ కాల్ వచ్చిన తర్వాత, 32 మందిని రక్షించినట్లు శ్రీలంక నేవీ ధ్రువీకరించింది.

"ఈ ఘటన శ్రీలంక జలాలకు అవతల జరిగింది, కానీ మా సెర్చ్, రెస్క్యూ జోన్ పరిధిలోనే ఉంది కాబట్టి, అంతర్జాతీయ బాధ్యత రీత్యా చర్యలు చేపట్టాం" అని శ్రీలంక నౌకాదళ అధికార ప్రతినిధి బుద్ధిక సంపత్ బీబీసీ ప్రతినిధి యోగితా లిమాయేతో అన్నారు.

"నీళ్లలో తేలియాడుతున్న వ్యక్తులను మేం గుర్తించి, రక్షించాం. వారు ఇరానియన్ ఓడకు చెందినవారని ఆ తర్వాత దర్యాప్తులో తేలింది" అని ఆయన అన్నారు.

ఆయన తెలిసిన వివరాల ప్రకారం, ఓడలో 180 మంది ఉన్నట్లు ఆ నౌకకు సంబంధించిన పత్రాల ద్వారా తెలుస్తోంది. కానీ గల్లంతైన వారి సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)