ఇరాన్, అమెరికా దగ్గర ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయా? యుద్ధం ఎలాంటి మలుపు తిరగనుంది?

ఫొటో సోర్స్, US Navy via Getty Images
- రచయిత, జొనాథన్ బీలే
- హోదా, బీబీసీ డిఫెన్స్ కరెస్పాండెంట్
- చదివే సమయం: 5 నిమిషాలు
తమ దేశం వద్ద కీలక ఆయుధాల నిల్వలు అపరిమితంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా అంచనా వేసిన దానికంటే ఎక్కువ కాలం శత్రువును ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందని ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆయుధాల నిల్వలు, సరఫరా మాత్రమే సంక్షోభం ఫలితాన్ని నిర్ణయించలేవు. యుక్రెయిన్‌తో పోలిస్తే రష్యా సైన్యం సంఖ్య, ఆయుధాల సంఖ్య ఎక్కువ. అయినా యుద్ధంలో యుక్రెయిన్ గట్టిగా పోరాడుతోంది.
ప్రారంభం నుంచే దాడుల తీవ్రత ఎక్కువగా ఉంది. తాము తయారుచేయగలిగిన కంటే ఎక్కువగా రెండు పక్షాలూ ఆయుధాలు ఉపయోగిస్తున్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటికే 2వేలకు పైగా దాడులు చేశాయని టెల్-అవీవ్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్డడీస్(ఐఎన్ఎస్ఎస్)అంచనావేసింది.
ఇరాన్ ఇప్పటికే 571 క్షిపణులు, 1,391 డ్రోన్లు ఉపయోగించిందని ఐఎన్ఎస్ తెలిపింది. వాటిలో చాలా వాటిని మధ్యలోనే అడ్డుకున్నారు. యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే ఈ స్థాయి పోరాటాన్ని కొనసాగించడం రెండు దేశాలకూ కష్టమవుతుంది.


ఫొటో సోర్స్, U.S. Central Command via Getty Images
‘తక్కువ సంఖ్యలో ఆయుధాలు ప్రయోగిస్తున్న ఇరాన్’
ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైళ్ల సంఖ్య ఇప్పటికే తగ్గిందని పాశ్చాత్యదేశాల అధికారులు అంటున్నారు.
తొలిరోజు వందల్లో ప్రయోగిస్తే ఇప్పుడు వాటి సంఖ్య పదులకు పడిపోయిందని చెప్పారు.
యుద్ధానికి ముందు ఇరాన్ దగ్గర 2వేలకు పైగా తక్కువ శ్రేణి బాలిస్టిక్ మిసైళ్లు ఉన్నాయని అంచనా. తమ దగ్గర ఎన్ని ఆయుధాలున్నాయో కచ్చితమైన సంఖ్య ఏ దేశమూ చెప్పదు. శత్రుదేశాలు సమాచారం తెలుసుకోకుండా ఆ వివరాలు రహస్యంగా ఉంచుతారు.
పోరాటం మొదటిరోజైన శనివారంతో పోలిస్తే ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాలు 86శాతం తగ్గాయని అమెరికా టాప్ కమాండర్ జనరల్ డాన్ కేయిన్ చెప్పారు. గత 24 గంటల్లో 23శాతం తగ్గాయని అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్‌కామ్) తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
‘గగనతల యుద్ధానికి పరిమితులు’
యుద్ధానికి ముందు ఇరాన్ దగ్గర వేల సంఖ్యలో షాహెద్ డ్రోన్లు ఉన్నాయని భావించేవారు. ఇరాన్ ఈ టెక్నాలజీని రష్యాకు అందించింది. రష్యా ఈ టెక్నాలజీ ఉపయోగించి తయారుచేసిన షాహెద్ డ్రోన్లను యుక్రెయిన్‌తో యుద్ధంలో ఉపయోగిస్తోంది. అమెరికా సైతం ఈ డిజైన్‌ను అనుకరించింది.
ఇరాన్ డ్రోన్లను ఉపయోగించడం సంక్షోభం మొదటిరోజుతో పోలిస్తే 73శాతం తగ్గిందని కైనా చెప్పారు. ఎక్కువ వేగంతో యుద్ధాన్ని కొనసాగించడంలో ఇరాన్ ఇబ్బందిపడుతున్నట్టు కనిపిస్తోంది.
ఆయుధాల నిల్వలను కాపాడుకోవడానికి ఇలా తగ్గించి ఉండొచ్చు. కానీ ఉత్పత్తి కొనసాగించడం కష్టమవుతుంది.
అమెరికా, ఇజ్రాయెల్ విమానాలకు ఇరాన్‌పై పూర్తి ఆధిపత్యం ఉంది. ఇరాన్ వైమానిక రక్షణ చాలా వరకు ధ్వంసమయింది. ప్రస్తుతం ఇరాన్‌కు ప్రభావవంతమైన వైమానిక దళం లేదు. ఇరాన్ మిసైల్, డ్రోన్ లాంచర్లను, ఆయుధ నిల్వలను, వాటిని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలను ధ్వంసం చేయడం యుద్ధంలో తర్వాతిదశ అని సెంట్‌కామ్ చెప్పింది.
ఇరాన్ పోరాట సామర్థ్యాన్ని ఇప్పుడు తగ్గించడం అమెరికా, ఇజ్రాయెల్‌కు తేలిక కావొచ్చు. కానీ ఇరాన్ ఆయుధాలన్నంటినీ ధ్వంసం చేయడం కష్టం.
ఫ్రాన్స్ కన్నా మూడు రెట్లు పెద్ద దేశం ఇరాన్. ఆయుధాలను దాచుకోవచ్చు.
వైమానిక యుద్ధానికి పరిమితులున్నాయని ఇటీవల చరిత్ర తెలియచేస్తోంది. మూడేళ్లకుపైగా కాలం నుంచి తీవ్రంగా బాంబులు జార విడుస్తున్నా ఇజ్రాయెల్ ఇప్పటికీ గాజాలో హమాస్‌ను నిర్మూలించలేకపోయింది. కేవలం కొన్ని ఆయుధాలతో యెమెన్‌లో హూతీ రెబెల్స్ ఏడాదికాలంలో అమెరికా బాంబుదాడులను తట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Fatemeh Bahrami/Anadolu via Getty Images
‘అమెరికా దగ్గర ఆయుధాలు సరిపడా ఉన్నాయా?’
అమెరికాలో ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యం కలిగిన దేశం. వారి సంప్రదాయ ఆయుధ నిల్వలు ఇతర ఏ దేశం కన్నా చాలా ఎక్కువ.
కానీ అమెరికా సైన్యం ఎక్కువగా కచ్చితంగా లక్ష్యాన్ని తాకే ఆయుధాలపై ఆధారపడుతుంది. వీటి ధర ఎక్కువ. ఇవి పరిమిత సంఖ్యలో మాత్రమే తయారవుతాయి. ఈ వారం చివర్లో ట్రంప్ రక్షణ కంపెనీలతో సమావేశం ఏర్పాటుచేసి ఉత్పత్తిని పెంచాలని ఒత్తిడి చేయనున్నట్టు తెలుస్తోంది. అమెరికా వనరులపై కూడా కొంత ఒత్తిడి ఉండొచ్చనేదానికి అది ఒక సంకేతం.
దగ్గర నుంచి దాడులు చేయడానికి వెసులుబాటుఉండడం వల్ల ఇప్పుడు అమెరికాకు కొంత ఒత్తిడి తగ్గి ఉండొచ్చు.
అమెరికా ఇప్పటికే ''స్టాండ్-ఆఫ్ ఆయుధాలు'' తోమాహాక్ క్రూయిజ్ మిసైళ్లు వంటి ఖరీదైన, ధీర్ఘశ్రేణి, ఆధునిక ఆయుధాలు ఉపయోగించడం మానేసిందని కేయిన్ చెప్పారు. తక్కువ ఖరీదైన ''స్టాండ్-ఇన్''ఆయుధాలు జేడీఎఎం బాంబులు వంటివాటిని అమెరికా వైమానిక దళాలు ఉపయోగిస్తున్నాయి. వీటిని లక్ష్యంపై జారవిడవవచ్చు.
మొదట దూరం నుంచి దాడి చేసిన తర్వాత అమెరికా ఇప్పుడు తక్కువ ఖరీదైన మిసైళ్లు, బాంబులు ప్రయోగించగలదని వాషింగ్టన్‌లో ఉన్న సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్(సీఎస్ఐఎస్)కు చెందిన మాజీ మెరైన్ కల్నల్ మార్క్ కాన్కియాన్ చెప్పారు.
అమెరికా ఈ స్థాయి యుద్ధాన్ని దాదాపుగా నిరంతరం కొనసాగించగలదు. యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే లక్ష్యాల సంఖ్య తగ్గుతుంది. దాడుల వేగం క్రమంగా తగ్గుతుంది.

ఫొటో సోర్స్, Reuters
గగనతల రక్షణవ్యవస్థలు
మార్క్ కాన్షియన్ ప్రకారం అమెరికా దగ్గర వేల సంఖ్యలో జేడీఏఎం బాంబులు ఉన్నాయి – కానీ ఖరీదైన గగనతల రక్షణ వ్యవస్థలు తక్కువగా ఉన్నాయి. యుద్ధం ప్రారంభంలో ఇరాన్ ప్రతిదాడులను ఎదుర్కోవడానికి ఇవి చాలా ఉపయోగపడ్డాయి.
పేట్రియాట్ మిసైళ్లకు అమెరికా నుంచి మాత్రమే కాకుండా దాని అరబ్ మిత్రదేశాలు, యుక్రెయిన్ నుంచి హై డిమాండ్ ఉంది. ప్రతి ఇంటర్‌సెప్టర్ మిసైల్ ధర నాలుగు మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ. అమెరికా ఏటా వీటిని దాదాపు 700 తయారుచేస్తుందని భావిస్తారు. ఇరాన్ ఇప్పటికీ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించగలిగితే ఈ పరిమిత సంఖ్యలో ఉన్న నిల్వలు తగ్గిపోతాయి.
అమెరికా దగ్గర దాదాపు 1,600పేట్రియాట్ మిసైళ్లు ఉన్నాయని సీఎస్ఐఎస్ నిపుణులు కాన్‌సియాన్ అంచనా వేస్తున్నారు. అవి ఇటీవల తగ్గిపోయాయి. గగనతలం నుంచి భూమిపై దాడులను అమెరికా ''ఎక్కువ కాలం'' కొనసాగించగలదు. కానీ గగనతల రక్షణ విషయంలో పరిస్థితి కొంత అనిశ్చితిగా ఉంది.
''పేట్రియాట్స్ ఆయుధాల నిల్వలను తగ్గించాలని అధ్యక్షుడు ట్రంప్ అనుకుంటే, మేం ఇరాన్ కంటే ఎక్కువకాలం నిలబడగలం. కానీ అది పసిఫిక్ ప్రాంతంలో మరో యుద్ధప్రమాదాన్ని పెంచుతుంది'' అని ఆయన చెప్పారు.
అమెరికా రక్షణ సంస్థలను ఈ వారం ట్రంప్ కలవబోతున్నారన్న విషయం ఆయుధ నిల్వలపై కొంత ఆందోళన ఉందన్నదానికి సంకేతం. కానీ అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ ఇరాన్ తమకన్నా ఎక్కువకాలం పోరాడలేదని చెప్పారు. ఈ విషయంలో ఆయన చెప్పింది సరైనది కావొచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











