అమెరికా, ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్‌పై దాడి చేశాయి? ఎంతకాలం ఈ యుద్ధం కొనసాగొచ్చు?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఎమిలీ అట్కిన్సన్, రఫీ బెర్గ్
- హోదా, మిడిల్ ఈస్ట్ ఎడిటర్
- చదివే సమయం: 7 నిమిషాలు
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత పశ్చిమాసియా అంతటికీ సంక్షోభం పాకింది.
ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన గొప్ప అవకాశమని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, జోర్డాన్, సౌదీ అరేబియా, సైప్రస్.. హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకలను లక్ష్యంగా చేసుకుని దాదాపు పశ్చిమాసియా అంతటా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది.
లెబనాన్‌లో ఇరాన్ మద్దతుతో కార్యకలాపాలు సాగించే షియా ముస్లిం మిలీషియా గ్రూప్ హిజ్బొల్లా కూడా ఈ ఘర్షణల్లో పాల్గొంటోంది.
లెబనాన్‌లోని తమ స్థావరాల నుంచి ఇజ్రాయెల్‌లోకి రాకెట్లను లాంచ్ చేసింది. దీనికి ప్రతిగా లెబనాన్‌లోని హిజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ కూడా దాడులు చేసింది.
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఎలా మొదలైంది? ఈ ప్రాంతంపై ఈ యుద్ధం ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎంతకాలం ఈ యుద్ధం కొనసాగనుంది?

ఇరాన్‌లో ఏం జరుగుతోంది?
ఇరాన్ మిసైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైనిక స్థావరాలను, నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్‌లు శనివారం (ఫిబ్రవరి 28న) పెద్ద ఎత్తున దాడులు చేశాయి.
1989 నుంచి ఇరాన్‌కు నాయకత్వం వహిస్తున్న అయతొల్లా అలీ ఖమేనీ ఈ దాడుల్లో మరణించారు. ఈ దాడుల తొలి దశలోనే తెహ్రాన్‌లోని ఆయన నివాస కాంపౌండ్ పూర్తిగా ధ్వంసమైంది.
ఇరాన్‌కు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, శక్తిమంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)లోని కొందరు నేతలు చనిపోయినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
వీరిలో ఇరాన్ రక్షణ మండలి కార్యదర్శి, ఐఆర్‌జీసీ కమాండర్ మేజర్ జనరల్ ఉన్నట్లు పేర్కొంది.
అమెరికా-ఇజ్రాయెల్‌లు ఇరాన్‌లో దాడులు ప్రారంభించినప్పటి నుంచి 787 మంది మరణించారని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ తెలిపింది.
అలాగే, ఇరాన్‌లోని యూఎస్‌కు చెందిన ‘హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ ఇన్ ఇరాన్’ (హెచ్‌ఆర్ఏఎన్ఏ) చెప్పిన వివరాల ప్రకారం.. 176 మంది చిన్నారులతో పాటు 742 మంది పౌరులు మరణించినట్లు తెలిసింది.
శనివారం దక్షిణ ఇరాన్‌లో ఐఆర్‌జీసీ బేస్‌కు సమీపంలోని ఒక పాఠశాలపై అమెరికా, ఇజ్రాయెల్‌లు ప్రాణాంతక దాడి చేశాయని ఇరాన్ ఆరోపించింది.
ఈ ఘటనకు సంబంధించిన రిపోర్టులను పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది. మరోవైపు ఆ ప్రాంతంలో ఎలాంటి సైనిక కార్యకలాపాల గురించి తమకు తెలియదని ఇజ్రాయెల్ తెలిపింది.
ఇరాన్‌లోని తొమ్మిది ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్‌లు దాడులు చేసినట్లు తెహ్రాన్ ఆరోపించింది.
అయితే, సమీపంలోని సైనిక స్థావరంపై దాడి చేసిన తర్వాత తెహ్రాన్‌లో ఒక ఆస్పత్రి దెబ్బతిన్నట్లు రిపోర్టులు వచ్చాయని ఇజ్రాయెల్ తెలిపింది. కానీ, ఆస్పత్రి తమ లక్ష్యం కాదని స్పష్టం చేసింది. దీనిపై స్పందన కోసం యూఎస్ సెంట్రల్ కమాండ్‌ను బీబీసీ సంప్రదించింది.
ఇరాన్‌లో ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా పూర్తిగా తీసేశారు. తమ గగనతలాన్ని మూసేశారు.
ఇరాన్ సైన్యం ప్రతిదాడులను కొనసాగిస్తోంది.
ఇరాన్ రాజధాని, మరికొన్ని ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్‌లు ఆదివారం మరిన్ని దాడులు చేశాయి. ఇరాన్ నావల్ హెడ్ క్వార్టర్స్ దెబ్బతిన్నట్లు ట్రంప్ తెలిపారు.
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో 11 ఇరాన్ నౌకలను ముంచేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తెలిపింది. ఆ ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన నౌకలేమీ మిగలలేదని చెప్పింది.

ఫొటో సోర్స్, Airbus
అమెరికా, ఇజ్రాయెల్‌లు ఎందుకు ఇరాన్‌పై దాడి చేశాయి?
ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు పొందకుండా చూసుకోవడమే తమ ఆపరేషన్ లక్ష్యమని ట్రంప్ అన్నారు.
''మేం వారి క్షిపణులను ధ్వంసం చేయాలనుకుంటున్నాం. వారి క్షిపణి పరిశ్రమను నేలమట్టం చేస్తాం. అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది'' అని శనివారం ఉదయం ట్రూత్ సోషల్‌లో పోస్టు చేసిన ఎనిమిది నిమిషాల వీడియోలో ట్రంప్ చెప్పారు.
''ఆయుధాలు వదిలేస్తే క్షమాభిక్ష కల్పిస్తామని, లేదంటే కచ్చితంగా మరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని ఇరాన్ భద్రతాదళాలను ట్రంప్ హెచ్చరించారు.
దేశంలోని మతపరమైన పాలనా వ్యవస్థను కూల్చివేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇరాన్ ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు.
''మేం దాడులు చేయడం ఆపేసిన వెంటనే మీ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోండి. అప్పుడు ప్రభుత్వం మీదవుతుంది. తరతరాలుగా ఇది మీకు లభించే ఏకైక అవకాశం కావొచ్చు''అని ట్రంప్ ప్రకటించారు.
అణ్వాయుధ ప్రొగ్రామ్‌పై సరికొత్త ఒప్పందానికి రాకపోతే, సైనిక చర్యలకు దిగుతామని ట్రంప్ కొన్ని వారాల పాటు బెదిరింపులకు పాల్పడిన తర్వాత.. ఎపిక్ ప్యూరీ పేరుతో ఈ సైనిక చర్యను చేపట్టారు.
తమ అణ్వాయుధ కార్యక్రమాలు పూర్తిగా శాంతియుతమైనవని ఇరాన్ పదేపదే స్పష్టం చేస్తూ వచ్చింది.
‘ఇరాన్‌లోని టెర్రరిస్ట్ పాలన’ వల్ల ఎదురయ్యే అస్థిత్వ ముప్పును తొలగించేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు ఈ ఆపరేషన్‌ను ప్రారంభించాయని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
''ప్రపంచంలో అత్యంత బలమైన నేత డోనల్డ్ ట్రంప్. అమెరికాకు ఏది మంచిదని తాను భావిస్తారో అది చేస్తారు'' అని ఫాక్స్ న్యూస్‌తో నెతన్యాహు చెప్పారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ''రెచ్చగొట్టేవి, చట్టవిరుద్ధమైనవి, అక్రమమైనవి'' అని ఇరాన్ ఆరోపించింది. ఆ దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం పశ్చిమాసిలో విస్తృతమైన దాడులు నిర్వహించింది.

ఇరాన్ ఎలా స్పందించింది?
ఇజ్రాయెల్‌పై.. అమెరికాతో సంబంధం ఉన్న పలు పశ్చిమాసియా దేశాలపై, సైప్రస్‌లోని బ్రిటిష్ సైనిక స్థావరంపై, ఇరాన్ తీర ప్రాంతంలోని నౌకలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది.
టెల్ అవీవ్, ఇతర ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని, సైనిక స్థావరాలను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్‌జీసీ తెలిపింది. బీట్ షెమేష్‌లోని ఒక నివాస ప్రాంతంపై క్షిపణి దాడి జరగడంతో తొమ్మిది మంది మరణించారు.
సైప్రస్‌లోని బ్రిటిష్ అక్రోటిరి స్థావరంపై డ్రోన్ దాడి జరిగినట్లు యూకే రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడీ) ధ్రువీకరించింది. ఈ దాడిలో ఎవరూ మరణించలేదు, గాయపడలేదు.
అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, యూఏఈ, కువైట్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది ఇరాన్.
ఇదే సమయంలో ఒమన్, సౌదీపై కూడా ఇరాన్ దాడులు చేసింది.
దుబయ్, దోహా, మనామా వంటి నగరాలతోపాటు గల్ఫ్ వ్యాప్తంగా సోమవారం మరిన్ని దాడులు జరిగాయి. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై, హిందూ మహాసముద్రంలోని నౌకలపై దాడులు జరిపేందుకు 15 క్రూయిజ్ క్షిపణులను వాడినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది.
దుబయ్‌లోని హోటళ్లతో పాటు పౌరులు నివసించే పలు ప్రాంతాలు, సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి.
గల్ఫ్ ప్రాంతాల్లో ఇరాన్ దాడులను ఖండిస్తూ అమెరికా, అరబ్ మిత్ర దేశాలు సంయుక్తంగా ఒక ప్రకటనను విడుదల చేశాయి. ఈ ప్రకటనలో.. 'పౌరులను, దాడులతో సంబంధం లేని దేశాలను లక్ష్యంగా చేసుకోవడం నిర్లక్ష్యపూరిత ప్రవర్తన'' అని పేర్కొన్నాయి.
కువైట్‌లో మూడు అమెరికా యుద్ధ విమానాలు కూలిపోవడానికి 'ఫ్రెండ్లీ ఫైర్'' కారణమని అమెరికా చెప్పింది. ఈ ఘటనలో పైలట్లు క్షేమంగా బయటపడ్డారు.
సోమవారం వరకు ఈ సైనిక చర్యలో ఆరుగురు అమెరికా సైనిక సిబ్బంది చనిపోయినట్లు అమెరికా సైన్యం ధ్రువీకరించింది.
సోమవారం ఉదయం నాటికి 18 మంది యూఎస్ సైనికులు గాయాల పాలయ్యారని సెంట్‌కామ్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా ఎంబసీపై మంగళవారం తెల్లవారుజామున రెండు డ్రోన్లతో దాడి జరిగినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల ఈ భవనం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిపింది.
బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంకు, గాజా, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యూఏఈ, యెమెన్ నుంచి అమెరికా పౌరులంతా వెంటనే తిరిగి వచ్చేయాలని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ సోమవారం కోరింది.

ఎకానమీపై, ఇంధన ధరలపై ఈ యుద్ధం ఎలాంటి ప్రభావం చూపుతుంది?
పశ్చిమాసియాలో అస్థిరత్వం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం మొదలైంది. ముఖ్యంగా.. గల్ఫ్‌లోని కీలకమైన ఎనర్జీ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకోవడం వల్ల మరింత ప్రభావం పడుతుంది.
ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఎల్‌ఎన్‌జీ కేంద్రాన్ని మూసివేసినట్లు ఖతార్ ప్రభుత్వ ఇంధన సంస్థ తెలిపింది. దీనివల్ల, గ్యాస్ ధరలు 50 శాతం పెరిగాయి.
సౌదీ అరేబియాలోనని రస్ తనూరా వద్ద ఆరామ్‌కో సంస్థకు చెందిన చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి జరగడంతో ఈ రిఫైనరీని మూసివేసినట్లు ఆ దేశ ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది.
హార్ముజ్ జలసంధి మీదుగా నౌకలను వెళ్లకుండా చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ప్రపంచంలోని చమురు, గ్యాస్‌లో 20 శాతం ఈ జలసంధి మీదుగానే సరఫరా అవుతుంది.
గ్యాస్, ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్‌లో బ్యారెల్ ముడి చమురు ధర సోమవారం 82 డాలర్లను తాకింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ( ఎల్ఎన్‌జీ) ధరలు 30శాతం పెరిగాయి.
హార్ముజ్ జలసంధి సమీపంలో ఈ వారం కనీసం మూడు నౌకలపై దాడి జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
ఖమేనీ వారసుడిని ఎలా ఎంపికచేస్తారు?
ఇజ్రాయెల్, అమెరికా దాడిలో అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి(ఇంటెరిమ్ లీడర్‌షిప్ కౌన్సిల్) ఏర్పడింది.
ఈ త్రిసభ్య మండలిలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఘోలం-హుస్సేన్ మొహ్సని-ఎజాయ్, గార్డియన్ కౌన్సిల్ సభ్యుడు అలీ రజా అరాఫీ ఉన్నారు.
గార్డియన్ కౌన్సిల్ సభ్యుడైన అలీ రజా అరాఫీ తాత్కాలిక నాయకత్వ మండలిలో జ్యూరిస్ట్‌గా ఎంపికయ్యారు.
ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం, సుప్రీం లీడర్ మరణిస్తే, రాజీనామా చేస్తే లేదా పదవీచ్యుతులైనా తాత్కాలిక నాయకత్వ మండలి ఏర్పడుతుంది.
ఇందులో అధ్యక్షుడు, న్యాయవ్యవస్థ చీఫ్, గార్డియన్ కౌన్సిల్ సభ్యులలో ఒకరు ఉంటారు.
నాయకుడి వారసుడిని నియమించడం నిపుణుల సభ బాధ్యత. ఈ సభలో 88 సీట్లు ఉన్నాయి. (ఏ సభ్యుడైనా మరణిస్తే ఆ స్థానం తదుపరి సాధారణ ఎన్నికల వరకు ఖాళీగానే ఉంటుంది).
నాయకత్వ స్థానం ఖాళీ అయితే ఈ సభ వీలైనంత త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Reuters
ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగవచ్చు?
ఇరాన్‌పై ఈ వారమంతా లేదా అవసరమైనంత కాలం దాడులు కొనసాగుతాయని ట్రంప్ శనివారం చెప్పారు. కానీ, మరింత కాలం కొనసాగించే సామర్థ్యం ఉందన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇదే స్థాయిలో దాడులను నాలుగు నుంచి ఐదు వారాల పాటు చేపట్టగలవని ఆదివారం న్యూయార్క్ టైమ్స్‌కు అమెరికా అధ్యక్షుడు చెప్పారు.
''ప్రారంభం నుంచి నాలుగు నుంచి ఐదు వారాలు మేం అంచనా వేశాం. కానీ, అంతకంటే ఎక్కువ కాలం కూడా చేపట్టే సామర్థ్యం ఉంది'' అని వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ ట్రంప్ తెలిపారు.
ఈ అంచనాల కంటే అమెరికా ఇప్పటికే చాలా ముందుందని చెప్పారు.
ఇదే సమయంలో, అవసరమైనంత కాలం ఈ ఆపరేషన్ సాగుతుందని నెతన్యాహు శనివారం తెలిపారు.
పశ్చిమాసియా ప్రాంతాలకు ప్రయాణించే వారు, తమ గమ్యస్థానానికి సంబంధించిన ప్రయాణ సూచనలను ముందుగానే వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవాలని ఫారిన్, కామన్‌వెల్త్, డెవలప్‌మెంట్ ఆఫీసు (ఎఫ్‌సీడీఓ) తెలిపింది.
ఈ ప్రాంతానికి రాకపోకలు సాగించే వేలాది విమానాలు గ్రౌండ్‌కే పరిమితమయ్యాయి. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలకు కలుగుతోన్న అత్యంత తీవ్రమైన అంతరాయాల్లో ఇదొకటి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














