లావోస్: ‘ప్రపంచంలో అత్యధికంగా బాంబులు పడిన దేశం ఇదే’

లావోస్

ఫొటో సోర్స్, MAG / BART VERWEIJ

లావోస్‌ను ప్రపంచంలో తటస్థ దేశంగా భావిస్తారు. కానీ వియత్నాం యుద్ధంలో దాన్ని నాశనం చేశారు.

"ప్రపంచ చరిత్రలో లావోస్ అత్యంత ఎక్కువగా బాంబు దాడులకు గురైన దేశం" అని ఆ దేశ మైన్స్ అడ్వైజరీ గ్రూప్ (ఎంఏజీ) డైరెక్టర్ పోర్టియా స్ట్రాటన్ తెలిపారు.

ఎంఏజీ ఒక ఎన్‌జీవో సంస్థ. ఇది మైన్స్ కనుగొనడం, వెలికితీయడం, ధ్వంసం చేయడం కోసం పనిచేస్తోంది. లావోస్‌లో క్లస్టర్ బాంబులు, ఇతర పేలని పేలుడు పదార్థాలను వెలికితీస్తోంది.

"1964 నుంచి 1973 వరకు దాదాపు 5,80,000 మంది సైనికులు దేశంపై 20 లక్షల టన్నుల కంటే ఎక్కువ పరిమాణంలో ఆయుధాలు ప్రయోగించారు. ఇది ప్రతి 8 నిమిషాలకు ఒకసారి ఒక విమానం బాంబుల లోడ్ భూభాగంపై జారవిడవడానికి సమానం. ఇలా 9 సంవత్సరాల పాటు 24 గంటలూ వేశారు. ఇలా క్లస్టర్ బాంబులు కనీసం 27 కోట్ల వరకు వేశారు. వీటిలో 30 శాతం పేలలేదు" అని తెలిపారు.

ఈ దాడులను అమెరికా బలగాలు చేశాయి.

వియత్నాంతో 2,000 కిలోమీటర్ల సరిహద్దు కారణంగా ఆ దేశంలో నెలకొనే అలజడి నుంచి లావోస్ తప్పించుకోవడం అసాధ్యం.

ప్రసిద్ధ హో చి మిన్ ట్రైల్ దక్షిణ వియత్నాం, ఉత్తర వియత్నం మధ్య రాకపోకలకు మార్గం. ఇది లావోస్ గుండా వెళుతుంది.

ఈ మార్గం నుంచే పది వేల మంది ఉత్తర వియత్నామీస్ సైనికులు 1960ల మధ్యకాలంలో యుద్ధం చేశారు.

లావోస్ అంతర్యుద్ధంలో (1952-1975) పాథెట్ లావో అని పిలిచే స్థానిక కమ్యూనిస్ట్ తిరుగుబాటుదారులకు ఈ ఉత్తర వియత్నామీస్ మద్దతు ఇచ్చింది.

వియత్నాం యుద్ధం నుంచి అమెరికా వైదొలిగి లావోస్‌పై బాంబు దాడులను నిలిపివేసి 50 ఏళ్లు అవుతోంది.

అయితే లావోస్‌ భూభాగంలో ఇప్పటికీ పేలని బాంబులు, గ్రెనేడ్లు ఉన్నాయి.

ఇన్నేళ్లూ ఆ దేశం ఎలా నెట్టుకొస్తుందో తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది.

లావోస్

ఫొటో సోర్స్, Getty Images

దాగి ఉన్న ముప్పు

లావోస్‌లో అంతర్యుద్ధం 1975లో ముగిసింది. దీంతో దేశం పాథెట్ లావో (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) చేతిలోకి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి ఇది ఒకే పార్టీ నియంత్రణలోని కమ్యూనిస్ట్ రాజ్యంగా ఉంది. దీంతో చాలా ఏళ్లుగా మిగిలిన ప్రపంచంతో లావోస్‌కు సంబంధాలు ఎక్కువగా లేవు.

అందుకే ఎంఏజీ వంటి మందుపాతర నిర్మూలన ఎన్‌జీవోలను 1994 వరకు దేశంలో పని చేయడానికి అనుమతించలేదు.

అప్పటికే ఈ ప్రమాదకరమైన పేలని పదార్థాల కారణంగా దాదాపు 10 వేల మంది మరణించారు. చాలా మంది వికలాంగులయ్యారు.

యుద్ధం ముగిసిన ఐదు దశాబ్ధాల తర్వాత కూడా ఈ పేలుడు పదార్థాలను నాశనం చేసే పనులు కొనసాగుతున్నాయి.

"2021లో ప్రమాదాలు పెరిగాయి. 2020లో ఇప్పటికే 63 ప్రమాదాలు జరిగాయి" అని పోర్టియా స్ట్రాటన్ చెప్పారు.

అక్కడి ఈశాన్య ప్రాంతంలోని జియెంగ్ ఖౌవాంగ్ ప్రావిన్స్‌లో చాలా ప్రమాదాలు జరిగాయి.

"ఎప్పటిలాగే ఎక్కువగా ప్రభావితమయ్యింది రైతులు, పిల్లలే. ఇక్కడ పిల్లలను నేలపై ఆడుకోనివ్వడానికి భయపడే చాలా కుటుంబాలను నేను కలుసుకున్నాను" అని స్ట్రాటన్ తెలిపారు.

లావోస్

ఫొటో సోర్స్, MAG / BART VERWEIJ

దున్నుతుంటే బయటపడ్డ బాంబు

ఇక్కడ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న 61 ఏళ్ల యువా తైయాంగ్ రోజూ ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిన వ్యక్తులలో ఒకరు.

ఆయన సాధారణంగా భూమిని దున్నడం, కాల్చడం ద్వారా పంటకు సిద్ధం చేస్తారు. ఇటీవల తైయాంగ్ అలా చేస్తున్నప్పుడు ఒక పేలుడు పదార్థం దొరికింది.

ఈ బాంబులలో ఏదో ఒకటి పేలే అవకాశం ఉందని ఆందోళన పడుతూనే తన పనిని కొనసాగిస్తున్నానని ఆయన బీబీసీతో చెప్పారు.

ఆ విధంగా మరణించిన రైతులు ఆయనకు చాలా మంది తెలుసు.

600 క్లస్టర్ బాంబులు పడేసిన పరికరాలు అక్కడే వేసినందున ఆ ప్రదేశంలో ఒకటి కాదు చాలా బాంబులు ఉండే అవకాశం ఉంది.

దీంతో తైయాంగ్ అప్రమత్తమయ్యారు. భూమిని చెక్ చేయడానికి ఎంఏజీ బృందం ఆయన దగ్గరికి వెళ్లింది.

వాళ్లు అక్కడ బీఎల్‌యూ 26 అని పిలిచే టెన్నిస్ బాల్ సైజులో ఉండే క్లస్టర్ పేలుడు పదార్థాన్ని కనుగొన్నారు.

ఇది ఆ భూమిలో పని చేసే అందరికీ హెచ్చరిక లాంటిది. అక్కడి జనాభాను రక్షించడానికి ఎంఏజీ ప్రతినిధులు పాఠశాలలకు వెళ్లి పేలకుండా భూమిలో ఉన్న పేలుడు పదార్థాల గురించి విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నారు.

మొదట ఒక గ్రామంపై విమానాలు బాంబులు వేయడం, లావోస్‌పై యుద్ధం కథ, దాని ప్రభావాన్ని చూపించే యానిమేటెడ్ వీడియోను విద్యార్థులకు చూపించారు.

గోడకు పోస్టర్‌పై ఫోటోలు పెట్టి వివిధ రకాల మందుగుండు సామగ్రిని గుర్తించమని విద్యార్థులను అడిగేవారు.

ఈ సందర్భంలో పిల్లలు భూమి నుంచి ఏ వస్తువులను తాకకూడదో లేదా తీయకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

లావోస్

ఫొటో సోర్స్, MAG / BART VERWEIJ

రంగంలోకి దిగిన అమెరికా

పేలకుండా భూమిలో ఉన్న పేలుడు పదార్థాల ఉనికితో లావోస్ ఎక్కువగా గుర్తింపులోకి వచ్చింది.

"మీరు వ్యక్తిగతంగా నష్టపోయింటారు. ఆ ప్రమాదాల వల్ల ప్రభావితమైన వారు తమ భూమిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి" అని లావోస్‌లోని అమెరికా రాయబారి పీట్ బీబీసీతో చెప్పారు.

"సురక్షిత వ్యవసాయంపై దృష్టి పెట్టాలి. లావోస్‌లో ఎక్కువ భాగం ఇప్పటికీ గ్రామీణ వ్యవస్థగానే ఉంది. జనాభాలో ఎక్కువ మంది బాంబు ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మంచి పన్ను కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ ప్రభావిత ప్రాంతాల్లో రహదారి, పాఠశాల లేదా ప్రభుత్వ భవనం ఏదైనా నిర్మించే ముందు భూమిని చదును (పేలుడు పదార్థాలు లేకుండా) చేయడానికి అదనపు ఖర్చు అవుతుంది" అని అన్నారు.

గత ఏడాది అమెరికా ప్రభుత్వం లావోస్‌లో పేలకుండా భూమిలో ఉన్న పేలుడు పదార్థాలను గుర్తించి, వాటిని పారవేసేందుకు రూ.371 కోట్లను కేటాయించింది.

ఈ మొత్తంలో కొంత భాగం ఎంఏజీ వంటి ఎన్జీవోలకు పరికరాల కోసం చెల్లించడానికి ఉపయోగించారు. దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారిన ఈ పేలుడు పదార్థాలను 2030 నాటికి పూర్తిగా తొలగించాలని భావిస్తోంది.

లావోస్ ఈ పేలుడు పదార్థాల నుంచి బయటపడటానికి దాదాపు శతాబ్ధం పడుతుందని అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)