గూగుల్‌లో ఉద్యోగానికి XYZ ఫార్ములా

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తమ కంపెనీలో చేరేందుకు లక్షలాది అప్లికేషన్లను పొందుతున్న గూగుల్
    • రచయిత, క్రిస్టినా జే.ఆర్గాజ్
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

మీరు గూగుల్‌లో పనిచేయాలనుకుంటున్నారా? మీరు ఒక్కరే కాదు, ఈ అమెరికా టెక్నాలజీ కంపెనీలో పనిచేసేందుకు ఏడాదికి లక్షలాది జాబ్ అప్లికేషన్లు వస్తుంటాయి.

దీని ఎంపిక ప్రక్రియలు చాలా సమగ్రమైనవిగా ఉంటాయి. కానీ, తన ఉద్యోగులతో ఎలా వ్యవహరించాలి, తమ కంపెనీలో భాగమైన వారికి ఎలాంటి ప్రయోజనాలు అందించాలనే విషయాలపై ఈ కంపెనీకి పూర్తి అవగాహన ఉంటుంది.

జాబ్ మార్కెట్లో చాలా మంది ఈ కంపెనీలో ఉద్యోగం కోసం పోటీ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఇతరులతో పోలిస్తే మీ సామర్థ్యాన్ని మీరు రిక్రూటర్లకు తెలియజేయడం ఎంతో అవసరం.

అదెలా అంటే, ఇంటర్వ్యూకి వెళ్లే ముందే, హ్యుమన్ రిసోర్సెస్ టీమ్ దృష్టిని మీ రెజ్యూమె ఆకర్షించాల్సి ఉంటుంది.

గూగుల్ రిక్రూటర్లు వాడుతోన్న XYZ ఫార్ములాను మీరు అనుసరిస్తే, కంపెనీలో మీరు జాయినయ్యే అవకాశాలు మెరుగుపడతాయి.

ఈ రెజ్యూమె రైటింగ్ టెక్నిక్ ద్వారా మీ వృత్తి జీవితంలో మీరు సాధించిన విజయాలను తేలికగా రిక్రూటర్లకు చూపించవచ్చు. అంతేకాక, మీ రెజ్యూమె మరింత ప్రభావతంగా మార్చుకోవచ్చు.

తేలికగా చదివేలా, రెండు పేజీల కంటే ఎక్కువ లేకుండా మీరు పనిచేసిన కంపెనీల్లో ఎలాంటి మార్పును తీసుకొచ్చారో రిక్రూటర్లు తెలుసుకునేలా ఇది ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ నుంచి తొలుత చేరిన కంపెనీ వరకు క్రోనోలాజీ ఆర్డర్‌లో మీ ఉద్యోగ అనుభవ వివరాలను పొందుపర్చాల్సి ఉందని నిపుణులు సూచించారు.

దీని ద్వారా మీ వృత్తిపరమైన జీవితంలో సాధించిన పురోగతిని రిక్రూటర్లకు తెలియజేయవచ్చని చెప్పారు.

ఉద్యోగి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మీకు పదేపదే చెప్పే సూచన: ‘‘మీ రెజ్యూమె నిర్దిష్టంగా, క్లుప్తంగా ఉండాలి’’

XYZ ఫార్ములా అంటే ఏమిటి?

‘‘మీరు పనిచేసిన లేదా నిర్వహించిన ప్రాజెక్ట్‌ల గురించి ప్రత్యేకంగా, నిర్దిష్టంగా తెలియజేయాలి. అనుమానమున్నప్పుడు, XYZ విధానానికి కట్టుబడి ఉండాలి’’ అని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.

ఈ విధానం ఇలా పనిచేస్తుంది:

ఎక్స్= సాధించిన విజయం లేదా పొందిన ఫలితానికి సంబంధించి ఉండాలి. మీరేం పొందారు?

వై= ఫలితాన్ని మీరెలా అంచనావేయగలుగుతున్నారు లేదా విజయం సాధించడంలో అదెలా ఉపయోగపడిందో తెలపాలి. ప్రభావమెంత?

జెడ్= లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు అనుసరించిన విధానాలేంటో మీరు వివరించాల్సి ఉంటుంది. మీరెలా చేశారు?

ఫలితాలపైనే ఇది దృష్టిపెట్టడంతో ఈ ఫార్ములా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

దీంతో మీరు సాధించిన విజయాలు, మీ విజయాన్ని మీరెలా అంచనావేశారు, దీని కోసం మీరు ఎలాంటి విధానాలను అనుసరించారు వంటివి రెజ్యూమె ద్వారా రిక్రూటర్లకు తెలుస్తాయి.

ఉద్యోగులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అభ్యర్థుల నైపుణ్యాలను, అనుభవాలను తెలియజేస్తోన్న రెజ్యూమెకు ప్రాధాన్యత ఇస్తోన్న రిక్రూటర్లు

రిక్రూటింగ్ టీమ్‌కు ఈ సమాచారం ఎంతో కీలకం. ఎందుకంటే మీ నైపుణ్యాలను, అనుభవాలను అర్థం చేసుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

ఈ విషయాలపై గూగుల్ రిక్రూటర్లు తమ సొంత యూట్యూబ్ వీడియోల్లో కూడా ఉదాహరణలతో వివరిస్తున్నారు.

ఉదాహరణకు, డెవలపర్ ఈవెంట్‌లో పాల్గొన్న ఒక అభ్యర్థి ఈ వివరాలను తెలియజేయాలనుకున్నప్పుడు ఈ కింద విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.

గూగుల్ చెబుతున్న ప్రకారం మీ రెజ్యూమె‌లో ఈ ఈవెంట్‌ వివరాలను మెరుగైన, సరైన రీతిలో ఎలా వివరించాలో చూద్దాం..

గుడ్: ‘‘హ్యాక్‌థాన్‌లో నేను రెండో స్థానంలో వచ్చాను’’

బెస్ట్: ‘‘50 టీమ్‌లు పాల్గొన్న హ్యాక్‌థాన్‌లో నేను రెండో స్థానంలో వచ్చాను’’

మచ్ బెటర్(మరింత మెరుగైన రీతిలో) : ‘‘మొబైల్ క్యాలెండర్లను సింక్రొనైజ్ చేసే యాప్‌ను అభివృద్ధి చేసే హ్యాక్‌థాన్‌లో నేను రెండో స్థానంలో వచ్చాను. 50 టీమ్‌లు పాల్గొన్న ఈ ఈవెంట్‌లో ఇద్దరు కొలీగ్స్‌తో కలిసి నేను ఈ హ్యాక్‌థాన్‌లో పాలుపంచుకున్నాను.’’

ఉద్యోగ అభ్యర్థులు

ఫొటో సోర్స్, Getty Images

మీ రెజ్యూమెలో ఎక్స్‌వైజెడ్ ఫార్ములా ఎలా వాడాలో తెలుపుతున్న గూగుల్:

నిర్దిష్టంగా ఉండాలి- ‘‘వెబ్‌సైట్ ట్రాఫిక్ పెరిగింది’’ అని మాత్రమే చెప్పకూడదు. ఎంత ట్రాఫిక్ పెరిగింది, దానెలా అంచనా వేశారో తెలియజేయాలి.

గణాంకాలు వాడాలి- గణాంకాల రూపంలో మీరు సాధించిన విజయాలను తెలిపితే, మీ రెజ్యూమె మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

స్పష్టంగా, క్లుప్తంగా ఉండాలి- మీ పనులను తెలియజేసే విధంగా బలమైన క్రియాపదాలను వాడాలి. సంక్లిష్టంగా ఉండకూడదు.

కీవర్డ్స్ వాడకం- అవసరమైనప్పుడు, మీరు దరఖాస్తు చేస్తోన్న ఉద్యోగానికి సంబంధించిన కీవర్డ్స్‌ను వాడొచ్చు.

ముందు చేసిన ఉద్యోగాలపై పలు ప్రశ్నలు..

తమ కంపెనీలో ఖాళీలకు అప్లికేషన్లను తీసుకునే ముందు ఈ టెక్నాలజీ దిగ్గజం మరికొన్ని ప్రశ్నలను కూడా వేస్తుంటుంది. దీని ద్వారా అభ్యర్థుల గురించి మరింత తెలుసుకుంటుంది.

మీరు మీ కెరీర్‌ను ఏ స్థాయిలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

మీరు అనుసరించే ప్రతిదాన్ని తేలిక చేసేలా మీరు నేర్చుకున్న ఒక విషయం ఏంటి?

ఒక్కరి వల్లనేనా లేదా టీమ్‌వర్క్‌ ఫలితంగానా మీరు ఈ విజయాలను సాధించారు?

మిమ్మల్ని ఎక్కువ సంతోషపరిచిన విషయం: పనిలోని సమస్యలను పరిష్కరించడం లేదా డిబేట్లలో పాల్గొనడం?

మీరు పనిచేసిన వాటిల్లో మీకు ఎక్కువ పేరు తెచ్చిన ఉద్యోగమేది? ఎందుకు?

మీరు పనిచేసిన కంపెనీల్లో బెస్ట్ టీమ్ గురించి వివరించండి. ఆ అనుభవం మిమ్మల్ని ప్రత్యేకంగా ఎలా నిలబెట్టింది?

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గూగుల్

జాబ్ వివరాల్లో కంపెనీలు పేర్కొన్న వివరాలను తెలుసుకుని, ఎక్కడ, ఎప్పుడు, ఎలా తమ నైపుణ్యాలను వాడగలమో ఉదాహరణల ద్వారా తెలియజేసేందుకు సిద్ధంగా ఉండాలి.

మీ సమాధానాలను సిద్ధం చేసుకునేటప్పుడు, స్పష్టంగా, క్లుప్తంగా ఉండాలి.

మీరు సాధించిన విజయాలకు చెందిన ఈ చిన్నచిన్న అంశాలు, ముందు కంపెనీల్లో అనుభవాలు మీ విలువను తెలియజేస్తాయి.

ఒకవేళ మిమ్మల్ని నియమించుకుంటే కొత్త ఉద్యోగంలో మీకెలాంటి ఆఫర్ ఇవ్వొచ్చో వీటి ద్వారా రిక్రూటర్లు నిర్ణయిస్తారు.

‘‘ఎందుకు విజ్యులైజేషన్ విధానం? మీ జీవితం, అనుభవాలు, విజయాలు, వైఫల్యాల ఫలితమే మీ నైపుణ్యాలు, ఆసక్తులు, లక్ష్యాలు,’’ అని గూగుల్ తెలిపింది.

‘‘మీ నైపుణ్యాలకు అనుగుణంగా మిమ్మల్ని మేం నియమిస్తే, మాకు నిపుణుడైన ఉద్యోగి దొరకవచ్చు. కానీ, మీ నైపుణ్యాలు, మీ ఆసక్తులు, వివిధ అంశాల్లో మీకున్న అనుభవాలు, దృష్టివిధానాలకు అనుగుణంగా రిక్రూట్ చేసుకుంటే, మాకు గూగ్లర్ దొరుకుతారు. అదే మాకు కావాల్సింది’’ అని గూగుల్ రిక్రూటర్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)