స్మార్ట్‌ఫోన్లతో భూకంపాలను ముందే కనిపెట్టొచ్చా? ఈ టెక్నాలజీతో వేల మంది ప్రాణాలను కాపాడొచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టామ్ ఆగ్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
2022 అక్టోబరు 25న కాలిఫోర్నియా తీరంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. వెంటనే అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్)కు మెసేజ్‌లు వెల్లువెత్తాయి. తాము ఉండే చోట భూమి కంపించిందనే సందేశం వాటిలో ఉంది. అక్కడ ఎలాంటి ఆస్తి నష్టమూ సంభవించలేదు.
కానీ, ఈ భూకంపం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అసలు అక్కడ భారీ ప్రకంపనలు మొదలుకాక ముందే, చాలా మందికి ఫోన్‌లలో హెచ్చరికలు వచ్చాయి.
నిజానికి ఈ హెచ్చరికలే అసలు భూకంపం వస్తోందని చాలా మందికి తెలిసేలా చేశాయి.
ప్రకంపనలు వచ్చేందుకు కొన్ని సెకన్ల ముందే హెచ్చరికలు చేసే టెక్నాలజీ కోసం కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు, యూఎస్‌జీఎస్‌తో కలిసి గూగుల్ పనిచేస్తోంది.
బహుశా ఇవి కొన్ని సెకన్లే కావచ్చు. ఈ సమయంలో మనం ఏదైనా బల్ల కిందకు లేదా సురక్షిత ప్రాంతానికి వెళ్లి తలదాచుకోవచ్చు. రైళ్లు వేగం తగ్గించుకోవచ్చు. విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ లేకుండా చూసుకోవచ్చు. కార్లు కూడా సొరంగాల్లోకి వెళ్లకుండా నియంత్రించొచ్చు. భారీ భూకంపం వచ్చే ముందే చాలా ప్రాణాలు కాపాడేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉపయోగపడొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఎలా పని చేస్తుంది?
రెండు వైపుల నుంచి డేటాను ఈ టెక్నాలజీ తీసుకుంటోంది.
వీటిలో మొదటిది ప్రకంపనలను గుర్తించేందుకు ఏర్పాటుచేసిన 700 సైస్మోమీటర్ల నెట్‌వర్క్. వీటిని కాలిఫోర్నియా మొత్తంగా కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలిఫోర్నియా బెర్కెలీ యూనివర్సిటీ, యూఎస్‌జీఎస్ కలిసి ఏర్పాటుచేశాయి. అమెరికాలోని ఆరేగాన్, వాషింగ్టన్ స్టేట్‌లలో డేటాను కూడా ఈ టెక్నాలజీ (షేక్ అలెర్ట్)కి అందిస్తున్నారు.
రెండోది గూగుల్ సొంత నెట్‌వర్క్. ప్రజల దగ్గరుండే ఫోన్లను దీని కోసం గూగుల్ ఉపయోగించుకుంటోంది.
గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్లలోనూ యాక్సెలెరోమీటర్లు ఉంటాయి. ఫోన్ కొంచెం కదిలినా ఇవి వెంటనే గుర్తుపడతాయి. సాధారణంగా ఫోన్ డిస్ప్లే అటూ ఇటూ మారడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి. ఫిట్‌నెస్ ట్రాకింగ్‌లో ఎన్ని అడుగుల దూరం ప్రయాణించామో చెప్పేందుకూ ఇవి తోడ్పడతాయి.
ఈ సెన్సర్లు చాలా సున్నితమైనవి. ఇవి చిన్న సైస్మోమీటర్లలా పనిచేయగలవు.

ఫొటో సోర్స్, Getty Images
ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్
ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్(ఏఈఏఎస్)కు మన ఫోన్లు ఆటోమేటిక్‌గా డేటాను చేరవేసేందుకు గూగుల్ ఒక కొత్త సెటప్‌ను తీసుకొచ్చింది. దీనికి అనుమతి ఇస్తే, భూకంపం నుంచి మొదటగా వచ్చే ప్రైమరీ వేవ్స్(పీ) ప్రకంపనలు మన ఫోన్లు గుర్తుపట్టిన వెంటనే ఏఈఏఎస్ పంపిస్తాయి.
ఇలా కొన్ని లక్షల ఫోన్ల నుంచి వచ్చే డేటాను విశ్లేషించి ఆ ప్రాంతంలో భూకంపం వస్తుందో లేదో ఏఈఏఎస్ అంచనా వేస్తుంది.
వెంటనే ఆ ప్రాంతంలో ఉండేవారికి ముందస్తుగా భూకంప హెచ్చరికలు జారీచేసే అవకాశం ఉంటుంది.
ఇక్కడ భూకంప తరంగాల కంటే రేడియో తరంగాలు వేగంగా ప్రయాణిస్తాయి. దీంతో భూకంప కేంద్రంలో మొదలైన ప్రకంపనలు మన వరకూ వచ్చేలోపే ఈ స్మార్ట్‌ఫోన్ హెచ్చరికలు మనకు చేరొచ్చు.
ఈ టెక్నాలజీపై ఆండ్రాయిడ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న మార్క్ స్టోగైటిస్ మాట్లాడారు. ‘‘మేం భూకంప తరంగాలపై కాంతి వేగంతో పోటీ పడుతున్నాం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజల నుంచే డేటా
ఇక్కడ చాలావరకు డేటాకు ప్రజల ఫోన్లే ఆధారం. దీంతో ఖరీదైన సైస్మోమీటర్లు లేని ప్రాంతాల్లో భూకంప హెచ్చరికలకు ఈ టెక్నాలజీ మెరుగ్గా ఉపయోగపడే అవకాశముంది.
అంటే ప్రపంచంలోని అత్యంత నిరుపేదలు జీవించే ప్రాంతాల్లోనూ భూకంప హెచ్చరికలను మెరుగ్గా చేరవేయొచ్చు.
2022 అక్టోబరులో ఇలానే శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో జీవించే వారి ఫోన్ల నుంచి గూగుల్‌కు భూకంప హెచ్చరిక సందేశాలు వచ్చాయి. భూకంప కేంద్రం నుంచి ప్రకంపనలు వచ్చే సమయంలోనే ఈ సందేశాలు చేరాయి.
నేడు ఈ టెక్నాలజీ నిత్యం ప్రకంపనలను ఓ కంట కనిపెడుతోంది. తాజాగా 2023 ఏప్రిల్ 4న కూడా 4.5 తీవ్రతతో ట్రెస్ పీనోస్‌కు సమీపంలో ప్రకంపలను షేక్ అలర్ట్ గుర్తించింది. భూకంపానికి ముందే అక్కడుండే ప్రజలకు ఇది సంకేతాలు పంపించింది.
కాలిఫోర్నియా తీరంలో భూకంపాలు సర్వసాధారణం. రోజుకు ఇక్కడ దాదాపు 100 చిన్నచిన్న ప్రకంపనలు వస్తుంటాయి. వీటిలో చాలావరకు పెద్దగా ప్రభావం చూపించవు. అయితే, 4.0 కంటే ఎక్కువ తీవ్రతతో కూడా ఏడాదికి 15 నుంచి 20 భూకంపాలు వస్తుంటాయి.
భూకంపాలు ఎక్కువగా వచ్చే ముప్పుండే 90కిపైగా దేశాల్లో ఈ భూకంప హెచ్చరికల వ్యవస్థ నేడు అందుబాటులో ఉంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకుపైనే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు డేటా అందిస్తున్నాయి.
పరిమితులు
ఈ టెక్నాలజీకి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఫోన్లు ఉపయోగించే వారు చాలా తక్కువగా ఉంటున్నారు. మరోవైపు తీర ప్రాంతాల్లో వచ్చే భూకంపాల నుంచి కొన్ని సెకన్లలోనే సునామీలు వచ్చి పడుతుంటాయి. దీంతో స్పందించేందుకు సమయం చాలా తక్కువగా ఉంటుంది.
కొన్ని సెకన్ల ముందు హెచ్చరికలు చేసేందుకు ఇది ఉపయోగపడొచ్చు. కానీ, భూకంపం రాక ముందే దాన్ని కనిపెట్టడం మాత్రం ఎప్పటిలానే మనకు ఓ బ్రహ్మపదార్థమే.
ఇవి కూడా చదవండి
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- ఆంధ్రప్రదేశ్: “గుండెలు పిసికేసీ తలంతా అదిమినట్లు అనిపిస్తోంది. నాకు ఇంకేమి తెలియదు” అంటూ ఆ గ్రామస్థులు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు?
- అల్-అక్సా మసీదు: ఇక్కడ మేకను బలి ఇవ్వడం గురించి రెండు మతాల మధ్య ఎందుకు ఘర్షణ జరుగుతోంది
- ‘‘యుక్రెయిన్, రష్యాల యుద్ధాన్ని ఆపడానికి సాయం చేయండి’’ జిన్‌పింగ్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడి వినతి
- కేరళ ఆదివాసీ యువకుడి హత్య కేసులో 5ఏళ్ల తరువాత తీర్పు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















