ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- రచయిత, ఆలమూరు సౌమ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహిళలకు 30 ఏళ్లు దాటిన తరువాత శరీరంలో అనేక మార్పులు వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత, ఎముకలు బలహీనపడడం వంటి వాటితోపాటు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు సోకే అవకాశం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన గ్లోబోకాన్ 2020 డాటా ప్రకారం, భారతదేశంలో మొత్తం క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ 13.5 శాతం కాగా, గర్భాశయ క్యాన్సర్ 9.4 శాతంగా నమోదైంది.
మహిళలలో 26.3 శాతం రొమ్ము క్యాన్సర్ బారినపడగా, 18.3 శాతం గర్భాశయ క్యాన్సర్ బాధితులు ఉన్నారు.
గత పాతికేళ్లల్లో రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని భారత్‌లో నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం (ఎన్‌సీఆర్‌పీ) చేసిన ఒక అధ్యయనం చెబుతోంది.
మహిళలలో 25 నుంచి 50 మధ్య వయసు వారు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారని, క్యాన్సర్ లక్షణాలను త్వరగా గుర్తించకపోవడం వలన మరణాల రేటు అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇదే కాకుండా, భారతదేశంలో మహిళలను పీడిస్తున్న మరొక పెద్ద సమస్య రక్తహీనత. 15 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళలలో సుమారు 50 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని ఒక అధ్యయనం చెబుతోంది.
వ్యాధి లక్షణాలను త్వరగా గుర్తించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో, 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయంచుకోవాల్సిన అయిదు పరీక్షలేమిటో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
1. మామోగ్రఫీ
చాలామంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను వ్యాధి ముదిరిన దశలో మాత్రమే గుర్తిస్తున్నారని, అందుకే మరణాల రేటు అధికంగా ఉంటోందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. వ్యాధి బాగా ముదిరిపోతే, బతికే అవకాశాలు 10 నుంచి 40 శాతం మాత్రమే ఉంటాయని హెచ్చరిస్తోంది.
బ్రెస్ట్ క్యాన్సర్‌ను రెండు పద్ధతుల ద్వారా తొలి దశల్లోనే గుర్తించవచ్చని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది.
1. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, మహిళలు ఇంటి వద్దే రొమ్ములను పరీక్షించుకునే విధానాలపై శిక్షణ, అవగాహన పెంచడం.
2. ల్యాబ్ పరీక్షల ద్వారా క్యాన్సర్ లక్షణాలను నిర్థరించడం. వీటిలో ముఖ్యమైనది మామోగ్రఫీ.
మామోగ్రాం అనేది రొమ్ములకు తీసే ఎక్స్-రే. దీని ద్వారా రొమ్ముల్లో కణుతులు ఏర్పడ్డాయో లేదో పరిశీలిస్తారు. అవి క్యాన్సర్ కారకాలైతే వెంటనే చికిత్స చేయించుకోవచ్చు.
40 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా మామోగ్రఫీ చేయించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది.
ఇది కాకుండా, మహిళలు ప్రతీ నెల పీరియడ్స్ తరువాత ఇంటివద్దే స్వయంగా రొమ్ములను పరీక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
"40 ఏళ్లు దాటిన మహిళలు రొమ్ము క్యాన్సర్ కోసం మామోగ్రాం పరీక్ష చేయించుకోవాలి. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ పరీక్ష చేయించాలి. మహిళలు ఇంటి వద్దే రొమ్ములను పరీక్షించుకోవాలి. రొమ్ములో ఏదైనా వాపు కనిపించినా లేదా రొమ్ము నుంచి నీరు కారడం లాంటివి గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి" అని ఉస్మానియా మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిభాలక్ష్మి వివరించారు.
ఊబకాయం రొమ్ము క్యాన్సర్‌కు దారి తీయవచ్చని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. రొమ్ములను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం వల్ల ముప్పును చాలావరకు నివారించవచ్చని సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
2. పాప్ స్మియర్ టెస్ట్
భారతీయ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తరువాత గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది.
గర్భాశయ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించగలిగితే, తగిన చికిత్స అందించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనికి ఉత్తమ మార్గం పాప్ స్మియర్ టెస్ట్.
సాధారణ మహిళలలో 30 ఏళ్లు దాటినవారు తప్పనిసరిగా పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి.
"గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలు సేకరించి క్యాన్సర్ లక్షణాలు లేదా క్యాన్సర్ వచ్చే ముందు కలిగే మార్పులేమైనా ఉన్నాయా అని పరీక్షిస్తారు. ఇది క్లినిక్‌లో రెండు మూడు నిముషాల్లో జరిగే తేలిక పాటి పరీక్ష. నొప్పి కలిగించని పరీక్ష కాబట్టి మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రతి మహిళా 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకూ ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి" అని గైనకాలజిస్ట్ డాక్టర్ శైలజ చందు వివరించారు.
హెచ్‌పీవీ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కూడా గర్భాశయ క్యాన్సర్ రాకుండా జాగ్రత్త వహించవచ్చని డాక్టర్ ప్రతిభాలక్ష్మి సూచిస్తున్నారు.
"యుక్త వయసు దాటే లోపే ( అంటే 9 నుంచి 25 ఏళ్లలోపు) మహిళలు గర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్‌పీవీ వాక్సీన్ తీసుకోవాలి. హెచ్‌పీవీ అనేది అసురక్షిత సెక్స్ వల్ల వ్యాప్తి చెందుతుంది కాబట్టి, దానికి దూరంగా ఉండడం మంచిది. తెల్లటి స్రావం (leucorrhoea), పొత్తి కడుపులో నొప్పి, నెలసరికి మధ్య రక్తస్రావం, మెనోపాజ్ తరవాత రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
అసంకల్పితంగా బరువు తగ్గడం, రక్త హీనత, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి" అని ఆమె వివరించారు.
ఇదే కాకుండా, కటి (పెల్విస్) భాగాన్ని పరీక్షించే స్క్రీనింగ్ టెస్టులు, హెచ్‌పీవీ టెస్ట్ చేయించుకోవడం కూడా మేలని వైద్యులు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3. కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ)
భారతదేశంలో 57 శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
మహిళలకు నెలసరిలో రక్తస్రావం అవుతుంది. ఇది కాకుండా హార్మోన్ సమస్యల వల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుంది. ఇది చిన్న సమస్య కాదని, మహిళలు దీనిపై దృష్టిపెట్టాలని వైద్యులు చెబుతున్నారు.
"రక్త హీనత ఉన్న మహిళలు గర్భం దాల్చినపుడు, బిడ్డ తక్కువ బరువుతో పుడుతుంది. కాన్పు తర్వాత చాలా నీరసపడి ఇబ్బందిపడతారు. చాలాసార్లు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణ వాయువును సరఫరా చేసే రక్తంలోని ఎర్రరక్త కణాలలోని హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. త్వరగా అలసిపోవడం, నీరసం, ఆయాసం, గుండె దడ, కాళ్ల వాపులు లాంటి సమస్యలు బాధిస్తాయి. గుండె మీద ఒత్తిడి పెరిగి, గుండె వాపు కలిగి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు" అని డాక్టర్ ప్రతిభాలక్ష్మి వివరించారు.
దీని కోసం కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరీక్షలో శరీరం నుంచి రక్తాన్ని సేకరించి ఈ కింది అంశాలు పరీక్షిస్తారు.
- ఎర్ర రక్త కణాల సంఖ్య
- తెల్ల రక్త కణాల సంఖ్య
- హిమోగ్లోబిన్ కౌంట్
- హెమటోక్రిట్ (రక్తంలో ఎర్ర రక్త కణాల శాతం)
- ప్లేట్లెట్లు
రక్తహీనతతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలనూ ఈ టెస్ట్ బయటపెడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
4. థైరాయిడ్
బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం, అలసట, డిప్రెషన్ ఇవన్నీ థైరాయిడ్ లక్షణాలే.
థైరాయిడ్ అనేది గొంతులో ఉండే ఒక గ్రంథి. ఇది టీ3, టీ4, టీహెచ్ఎస్ అనే హార్మోన్లను ఉత్పత్తిచేస్తుంది. ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే అనారోగ్యం పాలవుతారు.
థైరాయిడ్ సమస్యలు రెండు రకాలు. ఒకటి, అండర్‌యాక్టివ్ థైరాయిడ్ లేదా హైపోథైరాయిడిజం. రెండవది, ఓవర్‌యాక్టివ్ థైరాయిడ్ లేదా హైపర్‌థైరాయిడిజం.
అండర్‌యాక్టివ్ థైరాయిడ్ సమస్య ఉంటే శరీరానికి కావలసినన్ని హార్మోన్లను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయదు.
థైరాయిడ్ సమస్య లక్షణాలు నెమ్మది నెమ్మదిగా బయటపడతాయి. లక్షణాలను గమనించిన వెంటనే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ (టీఎఫ్‌టీ) చేయించుకోవాలి.
థైరాయిడ్ సమస్య స్త్రీ, పురుషులిద్దరికీ రావచ్చు కానీ, మహిళలకు వచ్చే అవకాశాలు ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.
గర్భం దాల్చడం, కాన్పు, బిడ్డకు పాలు పట్టడం, మెనోపాజ్ సమయంలో హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీని కారణంగా థైరాయిడ్ గ్రంధి ప్రభావితం అవుతుందని, 30 ఏళ్లు దాటిన తరువాత ప్రతి అయిదేళ్లకొకసారి థైరాయిడ్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఓవర్‌యాక్టివ్ థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు, మోతాదుకు మించి థైరాయిడ్ గ్రంధులు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల తీవ్ర అనారోగ్యం ఏర్పడుతుంది.
ఓవర్‌యాక్టివ్ థైరాయిడ్ లక్షణాలు.. భయం, ఆందోళన, చికాకు, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, అలసట, నీరసం, గొంతువాపు, గుండె వేగం పెరగడం, వణుకు, బరువు కోల్పోవడం.
ఓవర్‌యాక్టివ్ థైరాయిడ్ సమస్య పురుషుల్లో కన్నా మహిళలలో పది రెట్లు ఎక్కువ ఉంటుందని, సాధారణంగా 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో వస్తుందని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) చెబుతోంది.
సరైన సమయంలో థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా తీవ్ర అనారోగ్యానికి లోనుకాకుండా జాగ్రత్తపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
5. ఎముకల బలహీనత - విటమిన్ డి, కాల్షియం టెస్ట్
సాధారణంగా మహిళలలో 30 దాటిన తరువాత ఎముకలలో సాంద్రత (బోన్ డెన్సిటీ) తగ్గుతూ వస్తుంది. ఎముకలు బలహీనం అవుతుంటాయి.
ఎముకల పటుత్వానికి విటమిన్ డి, కాల్షియం సహాయపడతాయి. భారతీయ మహిళల్లో సుమారు 90 శాతం విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
40 ఏళ్లు దాటిన మహిళలు ముఖ్యంగా మెనోపాజ్ తరువాత బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపోరోసిస్) బారినపడతారు. ఈ వ్యాధి సోకితే ఎముకల పటుత్వం తగ్గి, గుల్లబారుతాయి.
ఎముకలు మరింత సున్నితంగా మారి, విరిగే ప్రమాదం అధికంగా ఉంటుంది. తుమ్మినా, దగ్గినా కూడా పక్కటెముకలు విరగడం లేదా వెన్నుపూసలో ఒక ఎముక పాక్షికంగా పతనం కావచ్చని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.
మహిళలకు ఆస్టియోపోరోసిస్ సోకే ప్రమాదం ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ప్రధానంగా, 45 ఏళ్ల కంటే ముందే మెనోపాజ్ చేరుకున్నవారికి, అండాశయాలను తొలగించినవారిలో ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.
విటమిన్ డి లోపం ఉంటే అలసట, నీరసం, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆలస్యం చేయకుండా రక్త పరీక్ష చేయించుకుని విటమిన్ డి స్థాయి ఎంత ఉందో తెలుసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
దీనితో పాటే, రక్తంలో కల్షియం స్థాయిలు పరీక్షించుకోవడం కూడా ముఖ్యమని చెబుతున్నారు.
(ఈ వ్యాసం నిర్దిష్టమైన సమస్య మీద స్థూలమైన అవగాహన కోసం మాత్రమే)
ఇవి కూడా చదవండి:
- ఇరాక్ వార్@20: సద్దాం పాలనే నయమని సర్వేలో తేల్చిన ప్రజలు
- ‘‘హిందూ మహాసముద్రంలో ఇదొక సముద్రపు శ్మశానవాటిక... కానీ శవాల లెక్క ఉండదు’’
- తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల ఫారాలు ఎందుకు మూతపడుతున్నాయి?
- 72 మంది ముస్లింలను చంపిన కేసులో ఒక్కరినీ పట్టుకోలేకపోయారా, బాధితులు ఏమన్నారు?
- సీక్రెట్ : మనం చెప్పిన అబద్ధాలే మన రహస్యాలా?















