పాప్ స్మియర్: లక్షలాది మహిళలను గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడే ఈ టెస్ట్ వెనుక ప్రేమ కథ మీకు తెలుసా?

గర్భాశయ క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యోని సైటోలజీ స్మియర్ టెస్ట్ .. ప్రాణాలను రక్షించే పరీక్షకు ఉదాహరణ.
    • రచయిత, లారా జోన్స్
    • హోదా, బీబీసీ సీరీస్ 'విట్‌నెస్ హిస్టరీ'

"అమెరికన్ మహిళల ఆరోగ్యానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల ఆరోగ్యానికి సహకరించే ఈ శతాబ్దపు అతిగొప్ప ఆవిష్కరణ ఇది. మన కాలంలో క్యాన్సర్‌ను నిరోధించేందుకు అత్యంత ముఖ్యమైన, ఆచరణాత్మకమైన, ఉపయోగకరమైన ఆవిష్కరణ."

1957లో అమెరికాలోని జనరల్ ఫెడరేషన్ ఆఫ్ వుమెన్స్ క్లబ్స్ ప్రత్యేక సమావేశంలో చెప్పిన మాటలవి. పాప్ స్మియర్ పరీక్షను అభివృద్ధి చేసిన డాక్టర్ జార్జ్ పాపానికోలౌ గౌరవార్థం ఏర్పాటు చేసిన సమావేశం అది. ఆయన పేరు మీదే ఈ టెస్ట్ ఉనికిలోకి వచ్చింది.

గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు చికిత్స పొందిన మహిళగా, ఈ టెస్ట్ వెనుక కథ తెలుసుకోవాలనుకున్నా.

దీని వెనుక పెద్ద కథే ఉంది. గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఉపయోగపడే పాప్ స్మియర్ టెస్ట్ ప్రపంచం అంగీకారం పొందేందుకు చాలా సమయం పట్టింది.

ఇది ఇద్దరి కథ. ఈ ఆవిష్కరణ వెనుక ఇద్దరు వ్యక్తుల కృషి ఉంది.

పాప్ స్మియర్

ఫొటో సోర్స్, COURTESY OF THE PAPANICOLAOU FAMILY

ఫొటో క్యాప్షన్, అమెరికా వెళ్లిన కొత్తల్లో జార్జ్ పాపానికోలౌ, మేరీ

డాక్టర్ జార్జ్ పాపానికోలౌ

1883లో గ్రీకు ద్వీపం యూబోయాలో జన్మించారు డాక్టర్ జార్జ్ పాపానికోలౌ. కెరీర్ తొలినాళ్లల్లో ఆయన వివిధ వృత్తులను చేపట్టారు.

ఏథెన్స్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం, సాహిత్యం, భాషలు, సంగీతాన్ని అభ్యసించిన తరువాత, ఆయన తన తండ్రి సలహాను అనుసరించి డాక్టర్ (సర్జన్) అయ్యారు.

పాపానికోలౌకు ఆర్మీలో కూడా అనుభవం ఉంది. జర్మనీలో జంతుశాస్త్రం చదువుకున్నారు. 1911లో మొనాకో ప్రిన్స్ ఆల్బర్ట్ Iతో కలిసి సముద్ర శాస్త్ర పరిశోధన యాత్రను చేపట్టారు.

ఆ తరువాత, మొదటి బాల్కన్ యుద్ధంలో పాల్గొన్నారు.

మరో ప్రపంచానికి ప్రయాణం...

మెరుగైన జీవితం కోసం 1913లో డాక్టర్ జార్జ్ పాపానికోలౌ అమెరికాకు ప్రయాణం కట్టారు. అప్పటికి ఆయన వయసు 30 ఏళ్లు.

పాపానికోలౌ, తన కలలను సాకారం చేసుకునేందుకు తండ్రి ఆశీర్వాదం పొందకుండానే గ్రీస్ నుంచి అమెరికాను పయనమయ్యారని ఆయన మనుమరాలు ఓల్గా స్టామటియో బీబీసీకి చెప్పారు. ఓల్గా తల్లి పాపానికోలౌరె చెల్లెలి వరుస.

పాపానికోలౌ సైంటిస్టు కావాలనుకున్నారు. కానీ, ఆయన తండ్రి అందుకు అంగీకరించలేదు. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడజూపాయి. దాంతో, గ్రీస్ విడిచి పెట్టి తన కలల మార్గాన్ని అనుసరించారు.

అయితే, ఆయన ఒంటరిగా ప్రయాణించలేదు. తన ప్రియమైన భార్యను వెంటబెట్టుకుని, 250 డాలర్లు జేబులో పెట్టుకుని వలసదారుడిగా అమెరికాలో అడుగుపెట్టారు.

తరువాత కాలంలో ఆయన భార్య ఆండ్రోమాచి మేరీ మావ్రోజెని ఆయనకు లేబొరెటరీ అసిస్టెంట్‌గా మారారు. ఆయన తన భార్యపైనే పరిశోధనలు చేశారు.

అమెరికాలోని న్యూయార్క్‌లో అడుగుపెట్టాక, జీవనోపాధి కోసం చేతికి దొరికిన పనల్లా చేశారు. ఒక రెస్టారెంట్లో వయొలిన్ వాయించే పని కూడా చేశారు.

చివరికి, పాపానికోలౌకు కార్నెల్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఉద్యోగం వచ్చింది.

"నేను సైన్స్ ల్యాబ్‌లో స్థానం సంపాదించగలిగాను. కొన్ని వారాలు తప్పితే, ల్యాబ్ నుంచి నేను అసలు బయటికే రాలేదు" అని 1950లలో డాక్టర్ పాపానికోలౌ చెప్పారు.

ఎట్టకేలకు, సైంటిస్ట్ అయి తన కలలను సాకారం చేసుకున్నారు పాపానికోలౌ.

ఆయన సైటోలజీలో పరిశోధన చేసేవారు. సైటోలజీ అంటే వ్యాధిని నిర్ధారించడానికి, నిరోధించడానికి చేసే కణాల అధ్యయనం.

పాపానికోలౌ, ఆయన భార్య మేరీ సైన్స్ పరిశోధనకే తమ జీవితాలను అంకితం చేశారు.

జార్జ్ పాపానికోలౌ, మేరీ

ఫొటో సోర్స్, COURTESY OF THE PAPANICOLAOU FAMILY

ఫొటో క్యాప్షన్, జార్జ్ పాపానికోలౌ, మేరీ

సైన్స్, సంగీతం..

పాపానికోలౌ దంపతులు న్యూయార్క్ తీర ప్రాంతంలో స్థిరపడ్దారు. తరువాత, ఆయన మనుమరాలు ఓల్గా స్టామటియో కుటుంబం కూడా అక్కడికి చేరుకుంది.

"మేం పక్క పక్కన ఇళ్లల్లోనే ఉండేవాళ్లం. రోజులు చాలా సరదాగా గడిచిపోయేవి" అని ఓల్గా చెప్పారు.

తన తాత పాపానికోలౌకు సంగీతం అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పారు.

"లివింగ్ రూంలో కుర్చుని ఆయన సంగీతం వాయించేవారు. మేం బుద్ధిగా కూర్చుని వినాల్సి వచ్చేది. మేం చిన్నపిల్లలం కావడంతో కుదురుగా ఉండలేకపోయేవాళ్లం. మేం బుద్ధిగా కూర్చున్నామో, అల్లరి చేస్తున్నామో చూడ్డానికి మధ్యమధ్యలో మా అమ్మమ్మ వచ్చేవారు" అని ఓల్గా చెప్పారు.

అలా, మేరీ, తన భర్తకు అన్నింటా సహకారం అందించేవారు.

"ఆమె చాలా మంచి మనిషి. భలే సరదాగా ఉండేవారు. ఏదైనా బాహాటంగా చెప్పేసేవారు. తన భర్తకు తోడునీడగా ఉండేవారు" అని ఓల్గా చెప్పారు.

గర్భాశయ క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పరిశోధనలు చేస్తూ జార్జ్ పాపానికోలౌ

దశాబ్దాలు గడిచిపోయాయి..

గినీ పింగ్స్‌పై పరిశోధనల తరువాత, 1920లలో డాక్టర్ పాపానికోలౌ మహిళల్లో కణాల మార్పులను పరిశీలించడం ప్రారంభించారు. ఇంట్లో కూడా తన పరిశోధనల్లోనే మునిగి తేలేవారు.

1928లో ఆయన పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది. అందులో భాగంగా, గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాల నమూనాలను తీసుకుని, గ్లాస్ స్లైడ్‌పై రుద్దడంతో అవి క్యాన్సర్ కణాలని బయటపడింది.

దాంతో, గర్భాశయ క్యాన్సర్‌ను నిర్థారించే పరీక్షకు పాపానికోలౌ పేరు మీదే పాప్ స్మియర్ టెస్ట్ అన్న పేరు స్థిరపడింది.

అయితే, ఆయన చేసిన ఆవిష్కరణను అమెరికాలోని వైద్య అధికారులు గుర్తించలేదు.

"నేను చూసినదాన్ని చూసేందుకు సైన్స్ ప్రపంచం పెద్దగా ఆసక్తి చూపలేదు. 'న్యూ క్యాన్సర్ డయాగ్నోసిస్' పేరుతో నేను రాసిన వ్యాసం వైద్యవృత్తిలో ఉన్నవారిని ఆకట్టుకోలేదు. ఎందుకో ఆ సమయంలో ఈ ప్రక్రియపై నా సహోద్యోగులకు నమ్మకం కలిగించలేకపోయాను" అని పాపానికోలౌ చెప్పుకున్నారు.

దాంతో, ఆయన మరింత పరిశోధన చేశారు. తను అభివృద్ధి పరచిన పరీక్షకు మరిన్ని ఆధారాలు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే, తన ఇంగ్లిష్ భాషను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించారు.

1940లలో ఆయన తన పరిశోధనలన్నీ పబ్లిష్ అయ్యాయి.

"ఈసారి అదృష్టం నన్ను వరించింది. స్మియర్ టెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని వైద్య ప్రపంచం గుర్తించింది" అని పాపానికోలౌ అన్నారు.

మేరీ

ఫొటో సోర్స్, COURTESY OF THE PAPANICOLAOU FAMILY

ఫొటో క్యాప్షన్, మేరీ

"నా ప్రియమైన భార్య"

పాపానికోలౌ పరిశోధనల్లో మేరీ ఎంతో సహకారం అందించారు,

"20 ఏళ్లకు పైగా స్మియర్ టెస్ట్‌పై ఆయన పరిశోధనలు జరిపారు" అని ఓల్గా చెప్పారు.

"నా ప్రియమైన భార్య నా పక్కనే ఉంది. నేను ఏదైనా సాధించానంటే దానికి కారణం ఆమె అందించిన సహకారమే" అని ఆయనే స్వయంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు కూడా.

"వాళ్లిద్దరూ మంచి టీం. ఆమె సహకారం లేకుండా ఆయన ఇది సాధించేవారు కాదు" అని ఓల్గా అన్నారు.

"ఆమే ఆయనకు గైడ్. ఒక్కోసారి ఆయన తీవ్ర వేదనలో కూరుకుపోయేవారు. తన పనిని ఎవరూ గుర్తించడం లేదని నిరాశ చెందేవారు. అప్పుడు ఆమే ఆయన్ను ఉత్సాహపరిచేవారు. నమ్మకాన్ని కోల్పోవద్దని, పక్కదారి పట్టవద్దని హెచ్చరించేవారు. ఇది సాధించడానికే నువ్వు పుట్టావు, నువ్వు చేయాల్సింది ఇదే అని ప్రోత్సహించేవారు. ఆయన చాలా మొహమాటస్థుడు. తనపై తనకు నమ్మకం తక్కువ. కానీ ఆయన అంకితభావం, పనిపై ఇష్టం ఆయన్ను ముందుకు నడిపించింది" అని ఓల్గా చెప్పారు.

1950లలో అమెరికాలో స్మియర్ టెస్ట్‌పై క్లినికల్ ట్రయల్స్ చేశారు. దానికి ముందు, తమ సిద్ధాంతాన్ని బలపరచడానికి పాపానికోలౌకు, మేరీకి మరింతమంది మహిళల సహకారం కావలసి వచ్చింది.

"పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోడానికి నర్సులకు తన జేబు నుంచి ఒక డాలర్ తీసి ఇచ్చేవారు" అని ఓల్గా చెప్పారు.

అలా పాప్ స్మియర్ టెస్ట్ అభివృద్ధి చెందింది.

గర్భాశయ క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతి ఏడాది మార్చిలో ప్రపంచ గర్భాశయ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఆంక్షలతో పోరాటం

అప్పట్లో యోని అనే పదం ఉచ్చరించడమే తప్పన్నట్టు భావించేవారు. 1957లో పాపానికోలౌ ఇలాంటి ఆంక్షలతో పోరాడవలసి వచ్చింది.

"కొన్ని వర్గాల్లో 'వజైనల్ స్మియర్' అనే పదాలను ప్రస్తావించడం అసభ్యంగా భావించేవారు" అని ఓల్గా చెప్పారు.

అయితే, పాపానికోలౌ దంపతులు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, జనరల్ ఫెడరేషన్ ఆఫ్ వుమెన్స్ క్లబ్స్ వంటి సంస్థలతో కలిసి పాప్ స్మియర్ పరీక్ష గురించి ప్రచారం చేశారు. వారి కృషి ఫలించింది.

వారంతా కలిసి నిషేధంలో ఉన్న అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా నయం చేయవచ్చని ప్రచారం చేశారు.

"మహిళలకు ఈ టెస్ట్ చేయించుకోవడం అవసరం. దీని గురించి విస్తృతంగా చర్చించాలి. ఈ టెస్ట్ చేయమని వారే అడగాలి. కేవలం డాక్టర్ ఒక్కరే ఈ పరీక్ష జరపలేరు. ఆయనకో పేషెంట్ కావాలి" అని పాపానికోలౌ అప్పట్లో చెప్పారు.

అలా పాప్ స్మియర్ టెస్ట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి అనేక దేశాల్లో మహిళలకు ఈ టెస్ట్ చేయడం ప్రారంభించారు.

నాలాంటి ఎంతోమంది మహిళల జీవితాలను కాపాడింది ఈ టెస్ట్. గర్భాశయ క్యాన్సర్ బారినపడకుండా, ముందే గుర్తించి తగిన చికిత్స చేయించుకునేందుకు పాప్ స్మియర్ టెస్ట్ ఎంతో ఉపయోగపడింది.

ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సాధారణంగా వచ్చే క్యాన్సర్ రకాలలో గర్భాశయ క్యాన్సర్ నాల్గవ స్థానంలో ఉంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో ఈ క్యాన్సర్ బారిన పడిన 10 మందిలో 9 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దేశాలలో గర్భాశయ క్యాన్సర్‌ను ముందే గుర్తించే పరీక్షలు విరివిగా జరపడం లేదు.

ఇప్పుడు పాప్ స్మియర్ టెస్ట్‌లో హై-రిస్క్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్‌పీవీ) స్క్రీనింగ్ కూడా ఉంది. దాదాపు అన్ని కేసుల్లో గర్భాశయ క్యాన్సర్‌కు ఇదే కారణం.

విస్తృతంగా పరీక్షలు జరుపుతూ హెచ్‌పీవీ వ్యాక్సీన్లు అందిస్తే వచ్చే శతాబ్దానికి గర్భాశయ క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

అందుకే, తన అమ్మమ్మ, తాతయ్యలు ప్రపంచానికి అందించిన కానుక పట్ల ఓల్గా స్టామటియో అంత గర్వపడుతున్నారు.

"ఇది ఎంత అద్భుతమైన విషయం! వాళ్లిద్దరూ అందమైన మనసున్నవాళ్లు. మనుషుల పట్ల ఎంతో ప్రేమ, శ్రద్ధ కలిగినవారు. వాళ్ల కుటుంబంలో భాగం కావడం నా అదృష్టం" అని ఓల్గా అంటారు.

వీడియో క్యాప్షన్, రొమ్ము క్యాన్సర్ సోకిన తర్వాత బిడ్డకు జన్మనివ్వొచ్చా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)