‘నాకు క్యాన్సర్, ఫోర్త్ స్టేజ్.. ఎప్పుడు చనిపోతానో తెలుసు. ఇప్పుడు జీవించాలనుకుంటున్నా..’

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC
- రచయిత, రవి ప్రకాశ్
- హోదా, బీబీసీ కోసం
జీవితానికి, మరణానికి మధ్య ఒకే ఒక తేడా ఉంది. మనం జీవించి ఉన్నప్పటి అనుభవాన్ని అందరితో చెప్పుకోగలం. కానీ మరణం అనుభవం ఎవరికీ తెలియదు. అదే ఇతరులు మన మరణం తాలూకు అనుభవాన్ని చెప్పగలరు. కానీ, మన మరణం తర్వాత ఏం జరుగుతుందనే ఎవరూ చెప్పలేరు.
అవును, మరణం తర్వాతి అనుభవం ఎలా ఉంటుంది? కొన్నిసార్లు మన సమాజంలో చనిపోయిన వ్యక్తులు బతికొచ్చిన సంఘటనల గురించి వింటాం. ఒక వ్యక్తి మరణించాడని, కానీ, కొన్ని గంటల తర్వాత అతను లేచి వచ్చాడని చెబుతుంటారు. ఇలాంటి కథలు బిహార్‌లోని గ్రామాల్లో తరచూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ, బతికొచ్చిన వ్యక్తులలో ఎవరూ మరణం అనుభవాన్ని గురించి చెప్పలేదు.
మరణం అంటే అందరికీ భయం. ఎవరికీ చావాలని ఉండదు. ఎక్కువ కాలం బతకాలని అంతా కోరుకుంటారు. భారత్ వంటి దేశంలో మనిషి సగటు వయస్సు 70 సంవత్సరాలు. కానీ, 50 ఏళ్లలోపే మృత్యువు పలకరిస్తే ఎలా ఉంటుంది?

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC
ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి
నాకు ఇప్పుడు 46 ఏళ్లు. జనవరి 2021లో నాకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడానికి కొద్ది రోజుల కిందటే నేను నా 45వ పుట్టిన రోజు జరుపుకున్నాను. తేలికపాటి దగ్గు, జ్వరం వచ్చింది.
నేను డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు, కొన్ని ప్రాథమిక పరీక్షల తర్వాత, నాకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని తేల్చారు. సీటీ స్కాన్‌లోని బ్లాక్ ఫిల్మ్ మీద వెండిలాంటి మెరుపుతో కొన్ని ఆకారాలు కనిపించాయి.
నాకు వైద్య పరీక్షలు చేసిన రాంచీకి చెందిన డాక్టర్ నిశిత్ కుమార్, ఇది చివరి దశలో ఉన్న క్యాన్సర్ కావచ్చని అనుమానించారు.
అప్పటి వరకు ఇలాంటి అనుభవాలన్నీ సినిమాల్లోనే చూశాను. కానీ, ఇప్పుడు క్యాన్సర్, దాని స్టేజ్ ను నిర్ధారించడానికి అనేక పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది.
ప్రపంచంలోని ప్రమాదకరమైన వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందంటే, అతని జీవితం ప్రమాదంలో పడుతుందని చాలామంది అనుకుంటారు.
ఆ వ్యక్తి చనిపోవడం ఖాయమని, మరణం ఎప్పుడైనా రావచ్చని భావిస్తారు.
అయితే క్యాన్సర్‌కు సంబంధించి వైద్యశాస్త్రంలో నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి. అనేక కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి.
చంద్రుడు లేని రాత్రి చీకటి
క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. చాలామందికి ఇలాంటి చికిత్సలు సక్సెస్ అయ్యాయి కూడా.
కానీ, చికిత్స తర్వాత క్యాన్సర్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. మరణం విషయంలో ప్రజలు భయపడటానికి కారణం అదే.
క్యాన్సర్ చికిత్స ఖరీదైనది. క్యాన్సర్ అని నిర్ధరణ అయిన మరుసటి రోజు, నేను చికిత్స కోసం ముంబయి చేరాను. నా కళ్ల ముందు కాళరాత్రి కనిపించింది.
అక్కడి ప్రసిద్ధ టాటా మెమోరియల్ హాస్పిటల్ (TMH)లో డాక్టర్ దేవయాని నాకు కొన్ని పరీక్షలు చేయించారు. సిబ్బంది సన్నని సూదులు శరీరంలోకి గుచ్చారు.
ఆ తర్వాత కొద్ది రోజులకు బయాప్సీ సహా మరికొన్ని ముఖ్యమైన పరీక్షల తర్వాత, నా క్యాన్సర్ చివరి దశలో ఉందని అంటే ఫోర్త్ స్టేజ్‌లో ఉందని డాక్టర్ చెప్పారు.
నేను లంగ్ కార్సినోమా మెటాస్టాటిక్ అనే రకం క్యాన్సర్ రోగిని. క్యాన్సర్ కణాలు వాటి ప్రాథమిక ప్రదేశం నుండి ఇతర ప్రదేశాలకు వ్యాపించినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది.
అటువంటి పరిస్థితుల్లో చికిత్స చేసినా, అది అంత త్వరగా నయం కాదు.

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC
మిగిలిన జీవితం
క్యాన్సర్ నాలుగో దశను ఫైనల్ లేదా అడ్వాన్స్‌డ్ స్టేజ్ అని అంటారు. ఆ స్థితిలోనే వైద్యులు రోగికి పాలియేటివ్ కేర్ చికిత్స చేస్తారు.
అయితే, వ్యాధి నయం కాని స్టేజ్ లో ఉన్నప్పుడు చేసే చికిత్సలు రోగిని అంతగా బాధ పెట్టవు. రోగి జీవితాన్ని మరి కొంతకాలం పొడిగించగలం. అది రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా కావచ్చు.
అటువంటి పరిస్థితుల్లో, రోగి అడిగితే, డాక్టర్ అతని సగటు జీవిత కాలం కూడా చెబుతారు. తద్వారా వారు ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉంటుంది.
క్యాన్సర్ పేషెంట్ ఒకపక్క మరణ భయంతోనే, తన మిగిలిన జీవితం గురించి ఆలోచించే సమయం అది. నా దృష్టిలో ఇది గొప్ప అవకాశం. ఎందుకంటే ముందు ముందు ఏం జరగబోతోందో మనకు తెలుసు.
ఈ పరిస్థితిని నేను గత ఏడాదిన్నరగా అనుభవిస్తున్నాను. టీఎంహెచ్ వద్ద వైద్యులు నేను ఎప్పటికీ కోలుకోలేనని చెప్పారు. నేను జీవించగలిగేది వేళ్ల మీద లెక్కించదగిన నెలలు, సంవత్సరాలు మాత్రమేనని అన్నారు.
కానీ, నాకు అనేక రకాల చికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. అవి నేను కోలుకునేలా చేస్తున్నాయి.
కీమోథెరపీ, టార్గెటెడ్ ట్రీట్ మెంట్
డాక్టర్ దేవయాని దగ్గర చికిత్స పొందిన తర్వాత, మెడికల్ బోర్డు నన్ను స్పెషలిస్ట్ డాక్టర్ కుమార్ ప్రభాస్ బృందం వద్దకు పంపింది.
నేను ఫిబ్రవరి 2021 నుండి కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీని తీసుకుంటున్నాను. ప్రతి 21వ రోజు, ప్రతి మూడు నెలలకు ఒకసారి కీమోథెరపీ చేయవలసి ఉంటుంది. అంటే ప్రతి నాలుగు సెషన్‌ల కీమోథెరపీ తర్వాత నాకు పరీక్షలు చేసి, తదుపరి మూడు నెలలకు మందుల షెడ్యూల్ చేస్తుంది.
నేను ముంబయి నుండి రాంచీకి తిరిగి వచ్చిన ప్రతిసారీ, మళ్లీ ముంబయి ట్రిప్ కి ప్లాన్ చేయడం ప్రారంభిస్తాను. ముంబయిలోని ఆసుపత్రి ప్రతి మూడు నెలలకు నా చికిత్స లీజ్ ను పెంచుతోంది. నేను ఈ ఒప్పందాన్ని వీలైనంత కాలం పొడిగించాలనుకుంటున్నాను. మరికొన్ని సంవత్సరాలు ఇలాగే వెళ్లాలనుకుంటున్నాను. ఈ కాలంలో నా జీవితంలో నాకు ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించగలనన్న ఆలోచనలో ఉన్నాను.
ఇప్పటి వరకు నేను సంతోషంగానే ఉన్నాననిపిస్తోంది.

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC
కుటుంబం మద్దతు
మరణం అనే భయంతో నేను నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నా జీవితం అనే డిక్షనరీ నుంచి భయం అనే పదాన్ని తొలగించి, నా శేష జీవితాన్ని మరింత ఆనందంగా, చిరస్మరణీయంగా మార్చుకునే మార్గాన్ని ఎంచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నా భార్య సంగీత, కొడుకు ప్రతీక్, నా స్నేహితులందరికీ కూడా నా కృతజ్ఞతలు. వారు నా జీవన ప్రయాణంలో సహచరులు. అంతేకాదు, నేను ఏ మార్గంలో వెళ్లినా వారి నుంచి నాకు మద్ధతు ఉంటుంది.
ఇటీవల చికిత్స కోసం ముంబయి వెళ్లాం. 20 కీమోథెరపీలు, ఏడాదిన్నరపాటు టార్గెటెడ్ థెరపీ తర్వాత ఇది నా ఐదవ ఫాలో అప్ చెకప్.
సీటీ స్కాన్‌కు, ఓపీడీకి మధ్య నాలుగు రాత్రులు, ఐదు రోజుల సమయం ఉంది. ఈ రోజుల్లో క్యాన్సర్ బాధలకు దూరంగా గోవాలో గడపాలని అనుకున్నాను.

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC
శరీరమంతా గాయాలు
ఈ విషయాన్ని నా భార్యకు చెప్పి, సీటీ స్కాన్ తర్వాత ఆస్పత్రి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లాం. కొన్ని గంటల తర్వాత మేము గోవాలో ఉన్నాము. ఎందుకో తెలుసా? ఎందుకంటే, క్యాన్సర్ భయాన్ని ఆందోళనగా మార్చడానికి నేను వ్యతిరేకిని. మరణం అనే నిజం నుంచి దాక్కోవడానికి నేను వ్యతిరేకం. మనం పుట్టిన మరుక్షణమే చనిపోవాలని నిర్ణయించి ఉంటుంది. అలాంటప్పుడు మనకు తప్పని విషయానికి ఎందుకు భయపడాలి? ఈ భయాన్ని గాలికి వదిలేయడానికి నేను గోవా వెళ్లాను.
టార్గెటెడ్ థెరపీ దుష్ప్రభావాల కారణంగా నా శరీరమంతా లెక్కలేనన్ని పుండ్లు ఉన్నాయని నాకు తెలుసు. విపరీతమైన నొప్పి ఉంటుంది. కానీ ఈ బాధ నన్ను ముంచెత్తడం నాకు ఇష్టం లేదు.
మేం నాలుగు రాత్రులు గోవాలో సరదాగా గడిపాం. సకాలంలో మందులు వేసుకోవాలన్నది తప్ప, నేను క్యాన్సర్ గురించి ఆలోచించిందే లేదు. చర్చిలు, గుళ్లు, బీచ్ లకు వెళ్లాం. రాత్రులు ఎక్కువ సేపు సముద్ర తీరంలో గడిపాం. డిస్కోలకు వెళ్లాం. కావాలనుకున్నది తిన్నాం.

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC
మృత్యువు నవ్వుతూ వస్తే...
ముంబయికి తిరిగొచ్చాక ఓపీడీలో ఉన్న డాక్టర్‌తో ఏం మాట్లాడాలా అని నవ్వుతూ ప్లాన్ చేసుకున్నాను.
గోవాలోని అరేబియా సముద్రపు నీలి అలల మీదుగా మేం పారాసైలింగ్ (సముద్రం వల్ల పారాసైలింగ్ అని పిలుస్తాము. వేరే చోట్ల పారాగ్లైడింగ్ అంటారు.) వెళ్ళబోతుంటే నా భార్య అడిగింది "మీరు పైనే గాలి పీల్చుకోవడం మానేస్తే? అది జరగొచ్చు. ఎందుకంటే మీకున్నది ఊపిరితిత్తుల క్యాన్సర్'' అన్నదామె.
నా సమాధానం ఏమిటంటే, "మరణం నవ్వుతూ వస్తే, అది మంచి మరణం కాదు. నేనేమీ చనిపోను, నాకేమీ జరగదు" అన్నాను.
నవ్వుతూ పారాసైలింగ్ చేశాం. ఇప్పుడు మేము కొండలు కోనలు తిరగాలని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే, మరణం అనుభవం ఎలా ఉంటుందో తెలియదు. తెలిసింది జీవితానుభవం మాత్రమే. ఈ అనుభవం కథను ప్రతి ఒక్కరూ వినాలని నేను కోరుకుంటున్నాము. తద్వారా ఎవరికి మరణం భయంగా మారదు.
ఫ్రెండ్స్... మీరు క్యాన్సర్‌తో కూడా ఇలా జీవించవచ్చు
ఇవి కూడా చదవండి:
- ఫాక్లాండ్ దీవులు: అర్జెంటీనా, బ్రిటన్ల మధ్య వివాదంపై బీజేపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారు?
- జహంగీర్‌పురి హింస: కేజ్రీవాల్ మౌనం ఎందుకు కలకలం రేపుతోంది?
- తెలంగాణ ఉద్యోగాల నోటిఫికేషన్లు: ప్రిపేర్ అవుదామంటే పుస్తకాలు ఎందుకు దొరకడం లేదు?
- బందరు పోర్టు కల ఎప్పటికి సాకారమవుతుంది... పనులు ఎందుకు ముందుకు కదలడం లేదు?
- దళిత వధూవరులను గుడిలోకి రాకుండా ఆపిన పూజారి అరెస్ట్... అసలేమిటీ వివాదం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















