డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే... ఆ అమ్మాయి పియానో వాయించింది

ఫొటో సోర్స్, Javed Khan
- రచయిత, శురేహ్ నియాజీ
- హోదా, భోపాల్ నుంచి బీబీసీ కోసం
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఒక ప్రత్యేక పద్ధతిలో 9 ఏళ్ల బాలికకు ఆపరేషన్ చేశారు. ఈ సర్జరీ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ తొలగించారు. అదంతా జరుగుతున్న సమయంలో ఆ బాలిక పియానో వాయిస్తూనే ఉంది.
ఈ ఆపరేషన్‌ను శుక్రవారం గ్వాలియర్‌లోని బిర్లా ఆస్పత్రిలో డాక్టర్ అభిషేక్ చౌహాన్ చేశారు.
ఆపరేషన్ చేసి తలలో ఉన్న ట్యూమర్ తొలగించామని, ప్రస్తుతం బాలిక పూర్తిగా ఆరోగ్యంగా ఉందని ఆస్పత్రి వారు చెప్పారు.
మురైనా జిల్లాలోని బాన్‌మోర్‌లో ఉంటున్న సౌమ్యకు మూర్ఛ వస్తుండేది. గత రెండేళ్లుగా ఆమె ఫిట్స్ రాకుండా నాలుగు మందులు వేసుకునేది. కానీ, అవి వాడినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
దాదాపు ఏడాది తర్వాత, ఆ బాలికకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తెలిసింది. ఆమె కుటుంబం ఆపరేషన్ చేయించడానికి వెనకాడింది. ఎందుకంటే, ఆ ఆపరేషన్ చేయడం కష్టమే కాదు, ప్రమాదకరం కూడా. పొరపాటు జరిగితే, బాలిక ప్రాణాలకే ప్రమాదం వస్తుందని వారు భయపడ్డారు.

ఫొటో సోర్స్, Javed Khan
ఇటీవల ఆమె కుటుంబ సభ్యులు బాలిక మెదడుకు మరోసారి స్కాన్ తీయించారు. ఆ రిపోర్టుల్లో ట్యూమర్ అంతకు ముందు కంటే నాలుగు రెట్లు పెద్దదైనట్టు తెలిసింది.
మొదట, ఏదైనా పెద్ద నగరంలో బాలికకు సర్జరీ చేయించాలని ఆమె కుటుంబం అనుకుంది. కానీ, పెద్ద ఆస్పత్రుల్లో ఆ సర్జరీ ఖర్చు గ్వాలియర్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. దాంతో వారు, బాలికకు గ్వాలియర్‌లోనే ఆపరేషన్ చేయించాలని నిర్ణయించారు.
బాలికకు ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్ అభిషేక్ చౌహాన్ బీబీసీతో మాట్లాడారు.
"ఇది చాలా కష్టమైన ఆపరేషన్. ఇందులో చిన్న పొరపాటు జరిగినా బాలిక ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. దానితోపాటూ మరికొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి" అన్నారు.
బిర్లా ఆస్పత్రి వివరాల ప్రకారం ప్రపంచంలో ఇంత చిన్న వయసులో ఉన్న వారికి ఇలాంటి ఆపరేషన్ చేయడం, అది జరుగుతున్న సమయంలో, రోగి ఏదైనా వాయిస్తూ ఉండడం ఇది రెండోసారి.

ఫొటో సోర్స్, Javed Khan
"ఈ ఆపరేషన్ 'అవేక్ క్రెనోటమీ' పద్ధతిలో చేశాం. ఒక్కోసారి బ్రెయిన్ ట్యూమర్, మెదడులో మన శరీరంలో అత్యంత ముఖ్యమైన పనులను నియంత్రించే భాగాలకు చాలా దగ్గరగా ఉంటుంది. సర్జరీ చేసి ట్యూమర్ తీసివేసే సమయంలో, అదనంగా కొన్ని మిల్లీమీటర్ల భాగాన్ని తొలగించినా, మెదడులో ఆ భాగం నియంత్రించే పనిని ఇక ఎప్పటికీ చేయలేం" అని డాక్టర్ అభిషేక్ చెప్పారు.
"అవేక్ క్రేనోటమీ' పద్ధతిలో రోగి స్పృహలోనే ఉంటారు. సర్జరీ చేసే భాగానికి మాత్రమే అనస్తీషియా ఇస్తారు. న్యూరోసర్జన్ ట్యూమర్ తొలగించే సమయంలో రోగితో రకరకాల పనులు చేయిస్తారు. అంటే, సర్జరీలో మేం ఉపయోగించే పరికరాలను మెదడులో తాకించినపుడు, ఆ భాగం ఏ పనిని నియంత్రిస్తుందో, ఆ కార్యకలాపాలు ఆగిపోతాయి. సర్జన్ వెంటనే అది తెలుసుకుని, అప్రమత్తం అవుతారు" అని డాక్టర్ అభిషేక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Javed Khan
ఇంటర్‌నెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటివరకూ ప్రపంచంలో ఇంత చిన్న వయసు పిల్లలకు, ఇలాంటి ఆపరేషన్ ఒకేసారి జరిగింది. దానిని బెంగళూరులో చేశారు. చిన్న పిల్లలకు ఇలాంటి ఆపరేషన్ చేయడం చాలా కష్టం.
సర్జరీ తర్వాత బాలిక ఇప్పుడు పూర్తిగా మామూలుగా ఉందని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశామని డాక్టర్ అభిషేక్ చెప్పారు.
సౌమ్య మామయ్య సూరజ్ సింగ్ బాలిక గురించి బీబీసీతో మాట్లాడారు. ఆపరేషన్ తర్వాత తమ కుటుబం సంతోషంగా ఉందన్నారు.
"పాప ట్యూమర్ పెద్దదవుతూ వచ్చింది. తను ఒక్కసారి మందులు వేసుకోకపోయినా మూర్ఛ వస్తుండేది. కానీ, ఇప్పుడు సర్జరీ తర్వాత తన ఆరోగ్యం బాగుంది" అన్నారు.
సౌమ్య నాలుగో తరగతి చదువుతోంది. తను ఇకమీదట మిగతా పిల్లల్లాగే ఉంటుందని ఆమె కుటుంబం ఆశిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- తేనెలో కల్తీ: ‘చైనీస్ సుగర్ సిరప్‌లను కలిపి, అమ్మేస్తున్నారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








