‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని తర్వాత అర్థమైంది’

ఫోన్ మాట్లాడుతున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోడల్ కావాలనుకున్న ఓ అమ్మాయిని ఓ అపార్ట్‌మెంటులోకి తీసుకువెళ్లారు
    • రచయిత, లియానా హోసియా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కెల్లీ (పేరు మార్చాం) వయసు 17 ఏళ్లు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాము మోడల్స్ కోసం వెతుకుతున్నామంటూ ఆమెకు ఒకరు మెసేజ్ పెట్టారు.

సెంట్రల్ లండన్‌లో వీడియో షూట్ ఉందని, అక్కడికి రావాలని కోరారు.

ఆ వ్యక్తి చెప్పిన చిరునామాకు కెల్లీ వెళ్లారు. అక్కడ ఓ అపరిచిత వ్యక్తి ఆమెను కలిశారు.

‘‘తాను మేనేజర్‌ని అని ఆ వ్యక్తి చెప్పాడు. పై అంతస్తులో ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి నన్ను తీసుకువెళ్లాడు. అక్కడ నన్ను బలవంతం చేయబోయాడు. నాతో ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడిన వ్యక్తి ఓ అరగంట తర్వాత కండోమ్‌లతో వచ్చారు. వాళ్లు ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే నన్ను గ్యాంగ్ రేప్ చేసేందుకు ఇదంతా చేస్తున్నారని నాకు అర్థమైంది’’ అని కెల్లీ చెప్పారు.

కెల్లీ ఒక్కరికే కాదు... బ్రిటన్‌లో లాక్‌డౌన్ సమయంలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 1,200 మందికిపైగా మైనర్లు ఇలాంటి అనుభవాలే ఎదుర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదులు చేశారు.

ఇలాంటి ఘటనలను ‘ఆన్‌లైన్ గ్రూమింగ్’ నేరాలుగా పోలీసులు పిలుస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్

ఫొటో సోర్స్, Reuters

‘టాయిలెట్‌లోకి వెళ్లి గడియ పెట్టుకున్నా’

‘‘ఫోన్‌లో ఆ వ్యక్తి ఇంకొందరితో ‘ఆమె ఇక్కడే ఉంది’ అని చెప్పడం విన్నా. ఇంకొందరు మగాళ్లను పిలిపించి, నన్ను గ్యాంగ్ రేప్ చేయాలనుకుంటున్నారని అర్థమైంది’’ అని కెల్లీ చెప్పారు.

అయితే తనకు రుతుస్రావం అవుతోందని, ట్యాంపాన్ల కోసం దగ్గర్లోని ఫార్మసీకి వెళ్తానని వారితో కెల్లీ చెప్పారు.

‘‘ఎలాగోలాగా వారిని ఒప్పించి, దగ్గర్లోని ఓ కెఫె బాత్‌రూమ్‌లోకి వెళ్లాను. అక్కడ పనిచేస్తున్న ఒకామెకు నాకు జరుగుతున్నదంతా వివరించా. టాయిలెట్‌లోనే గడియ పెట్టుకుని ఉండమని ఆమె నాకు సూచించారు. పోలీసులకు ఫోన్ కూడా చేశారు’’ అని వివరించారు కెల్లీ.

బ్రిటన్‌లో లాక్‌డౌన్ సమయంలో లైంగిక వేధింపులకు గురైన చిన్నారుల చిత్రాలు, వీడియోలు చూసేందుకు ఇంటర్నెట్‌లో చాలా మంది ప్రయత్నించారని, అలాంటి 88 లక్షలకుపైగా ప్రయత్నాలను ఇతర సంస్థలతో కలిసి తాము అడ్డుకున్నామని ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ (ఐడబ్ల్యూఎఫ్) తెలిపింది.

మేరెడ్ పారీ
ఫొటో క్యాప్షన్, మేరెడ్ పారీ

కరోనా సంక్షోభ పరిస్థితులు ఆన్‌లైన్‌లో నేరాలకు పాల్పడేవారు విజృంభించే అవకాశం ఉందని, ఆన్‌లైన్ గ్రూమింగ్ నేరాలు గణనీయంగా పెరగవచ్చని నేషనల్ సొసైటీ ఫర్ ద ప్రీవెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు చిల్డ్రెన్ (ఎన్ఎస్‌పీసీసీ) హెచ్చరించింది.

‘‘మా వేదికల్లో ‘గ్రూమింగ్’కు అవకాశం లేకుండా చేస్తాం. ఇందుకోసం చిన్నారుల పరిరక్షణ నిపుణులు, భద్రతా సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. చిన్నారులకు సంబంధించి అభ్యంతరకరమైన కంటెంట్‌లో 96 శాతం వరకూ ఎవరూ రిపోర్ట్ చేయకముందే అధునాతన సాంకేతికత సాయంతో మేం తొలిగిస్తాం’’ అని ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి తెలిపారు.

ఆన్‌లైన్‌లో చిన్నారులు వేధింపుల బారిన పడకుండా కాపాడేందుకు ఇంకా చేయాల్సింది చాలా ఉందని ‘గ్రూమింగ్’ బాధితురాలు మేరెడ్ పారీ అంటున్నారు.

14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పారీ ఆన్‌లైన్ వేధింపులకు గురయ్యారు. కొందరు మాయమాటలు చెప్పి, ఆమె తన నగ్న చిత్రాలు పంపించేలా చేశారు.

ఫోన్ మాట్లాడుతున్న మహిళ

‘‘అప్పుడు నేను స్కూల్‌కు వెళ్తున్నా. ఫేస్‌బుక్‌లో కొంత మంది పెద్ద వయసు వాళ్లతో మాట్లాడటం మొదలుపెట్టా. ఒక పని తర్వాత మరొక పని... నాకు తెలియకుండానే ఉచ్చులో చిక్కుకుపోయా. లైంగిక విషయాల గురించి మాట్లాడమని, నా ఫొటోలు పంపమని వాళ్లు బలవంతం చేసేవాళ్లు. వయసుకు వచ్చిన యువతులు అలాగే చేస్తుంటారని వాళ్లు చెప్పేవాళ్లు. నేను కూడా అలాగే నడుచుకునేందుకు ప్రయత్నించేదాన్ని’’ అని పారీ చెప్పారు.

ఇదంతా జరిగి పదేళ్లవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో లైంగిక వేధింపులను రిపోర్ట్ చేసేందుకు మెరుగైన టూల్స్‌ ఉండాలని ప్రస్తుతం పారీ ప్రచారం చేస్తున్నారు.

‘‘ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు ఆ కంటెంట్... నగ్నత్వం, విద్వేష ప్రసంగం, వేధింపులు ఇలా దేని కిందకి వస్తుందన్నది ఎంచుకునే ఆప్షన్ వస్తుంది. కానీ, లైంగిక వేధింపుల ఆప్షన్ మాత్రం ఉండదు. అంటే, లైంగిక వేధింపులకు గురైతే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా అవకాశమే కల్పించలేదు’’ అని పారీ అన్నారు.

‘‘మా వేదికలపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు 35 వేల మందితో కూడిన బృందం పనిచేస్తుంది. చిన్నారుల పరిరక్షణ నిపుణులతో కలిసి పనిచేస్తూ, అవసరమైనప్పుడు నేరుగా భద్రతా సంస్థల దృష్టికి కూడా విషయాలను మావాళ్లు తీసుకువెళ్తారు’’ అని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)