పంజాబ్ రైతుల మాదిరిగా.. వేరే రాష్ట్రాల రైతులు ఎందుకు ఆందోళనలు చెయ్యట్లేదు?

ఫొటో సోర్స్, NURPHOTO
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహరాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన దినేష్ భూమిని కౌలుకు తీసుకుని పత్తి పండిస్తున్నారు. తను పండిస్తున్న పంటలో 50 శాతం అమ్ముడు పోవట్లేదు. ఈ పరిస్థితికి ఆయన తీవ్రంగా విసుగు చెందారు.
"గత ఏడాది వర్షాకాలం చాలా నెలలు కొనసాగింది. ఈ ఏడాది మహమ్మారి విజృంభించింది. దీంతో కిందటి ఏడాది పండించిన పంటను పూర్తిగా అమ్మలేకపోయాను" అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
దినేష్ కులకర్ణిలాగే వేలాది పత్తి రైతులు పంట అమ్ముడు పోక అవస్థలు పడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ తక్కువగా, ధర ఎక్కువగా ఉంది.
కోవిడ్ కారణంగా ప్రభుత్వం కూడా కనీస మద్దతు ధర ఇచ్చి తన వాటాను కొనుగోలు చేయలేకపోయింది.
ఒక పక్క పత్తి రైతులు ఇలాంటి సంక్షోభంలో చిక్కుకుని ఉంటే, మరో పక్క కేంద్రం మూడు వివాదాస్పద వ్యవసాయ సవరణ చట్టాలను తీసుకొచ్చింది.
వీటిని వ్యతిరేకిస్తూ పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లలో వరి, గోధుమలు పండించే రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ సవరణ చట్టాలపట్ల వీరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, NURPHOTO
నిరసనలు ఉత్తర భారతదేశంలో మాత్రమే ఎందుకు?
దినేష్ కులకర్ణి లాంటి రైతులు పంట అమ్ముడుపోక అన్ని అవస్థలు పడుతున్నా ఎందుకు నిరసన వ్యక్తం చెయ్యట్లేదు? వీధుల్లోకి వచ్చి ఎందుకు ర్యాలీలు చెయ్యట్లేదు?
దీనికి స్పందిస్తూ.."తమ రాష్ట్రంలోని రైతులు కూడా కొత్త చట్టాలలోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తున్నారు కానీ వారు వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించకుండా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు" అని దినేష్ అంటున్నారు.
"జూన్ 5 నుంచీ మేము ప్రభుత్వంతో ఈ అంశంపై చర్చలు జరుపుతున్నాం. ప్రభుత్వం చట్టాలను ఆమోదించేసింది. మా మాటలు అంగీకరించలేదు కానీ మేము నిరాశ చెందకుండా ఇంకా ప్రయత్నిస్తున్నాం" అని దినేష్ తెలిపారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు అనుబంధంగా ఉన్న భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులైన దినేష్ కులకర్ణి...భారతదేశమంతటా రైతుల సమస్యలు ఒకేలాగ ఉన్నాయని అంగీకరించారు.
"రైతుల సమస్యలు అన్నిచోట్లా ఒకేలాగ ఉన్నాయి. ఏపీఎంసీ (వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల వద్ద కొనుగోలు చేసేది సగటున 10 శాతం మాత్రమే. మిగతా 90 శాతం రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవలసిందే" అని దినేష్ వివరించారు.
బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసేవారు (వ్యాపారులు, కంపెనీలు) రైతులను దోచుకుంటున్నారని, ఈ పరిస్థితి దేశమంతటా ఇలాగే ఉందని దినేష్ అభిప్రాయపడ్డారు.
అయితే, కొత్త వ్యవసాయ చట్టాల వలన ఉత్తర భారతదేశంలో రైతులకు ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉందని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, NURPHOTO
పంజాబ్ పరిస్థితి వేరు..
దేశం మొత్తం మీద ఏపీఎంసీ కింద కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేసేది సగటున 10 శాతం మాత్రమే కానీ పంజాబ్‌లో ఇందుకు విరుద్ధంగా 90 శాతం పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
హరియాణా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లలోనూ ఇదే పరిస్థితి. అక్కడి సారవంతమైన భూములలో పండిన పంటలో దాదాపు 90 శాతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అంటే బహిరంగ మార్కెట్లో ఈ రాష్ట్రాలకు చెందిన రైతులు అమ్మేది 10 శాతం మాత్రమే.
ఇదే కాకుండా, దేశం మొత్తంలో ఉన్న దాదాపు 6,000 ఏపిఎంసీలలో 33 శాతం పంజాబ్‌లోనే ఉన్నాయి.
కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం పంజాబ్‌లోని రైతులు తమ మొత్తం పంటను బహిరంగ మార్కెట్లో, రాష్ట్రంలోని లేదా రాష్ట్రం బయట.. ఎక్కడైనా అమ్ముకోవచ్చు.
అయితే, ఏపీఎంసీ నుంచి బయటకి వెళిపోతే ప్రైవేటు వ్యాపారులు తమని దోచేసుకుంటారని సన్నకారు రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ కారణంగా పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని రైతులు ఏపీఎంసీ బైపాస్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
ప్రతి రాష్ట్రంలోనూ భిన్నమైన వ్యవసాయ విధానాలు
కేరళలోని సీపీఐ (ఎంఎల్)కు చెందిన మాజీ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, ప్రస్తుతం అఖిల భారత కిసాన్ సభకు ఆర్థిక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలో జరుగుతున్న నిరసనల్లో పాలుపంచుకుంటున్నారు.
పంజాబ్, హరియాణాలలోని రైతులు మాత్రమే ఎందుకు ఆందోళనలు చేపడుతున్నారు? పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లోని రైతులు ఎందుకు నిరసనలు చెయ్యట్లేదనే ప్రశ్నకు కృష్ణ ప్రసాద్‌ను స్పందిస్తూ...
"హరిత విప్లవం కారణంగా వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగ ఉన్నాయి. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లలో ప్రధానంగా వరి, గోధుమలు పండిస్తారు. దేశంలో ఉన్న దాదాపు 6,000 ఏపీఎంసీలలో 2000 లకు పైగా పంజాబ్‌లోనే ఉన్నాయి. దీనివలన ఇక్కడి రైతులకు, బిహార్, మధ్య ప్రదేశ్, ఇతర రాష్ట్రాలలోని రైతులకంటే ఎక్కువ ధర లభిస్తుంది.
ఈ కొత్త చట్టాల వలన ఏపీఎంసీ ప్రైవేటుపరమైపోతుందని వీరు ఆందోళన పడుతున్నారు. అంతే కాకుండా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కూడా ప్రైవేటీకరణ చెందుతుందని కృష్ణ ప్రసాద్ తెలిపారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
చిన్న రైతులకు పెద్ద నష్టం
దేశం మొత్తంలోని వ్యవసాయదారులలో సన్నకారు రైతులు 86 శాతానికి పైగా ఉన్నారు. ప్రైవేటు వ్యాపారులు వీరిని సులభంగా దోచుకునే అవకాశం ఉంది.
దేశంలో రైతుల సగటు నెలసరి ఆదాయం రూ. 6,400. ఈ కొత్త చట్టాలను ఆమోదించడం వలన తమ ఆర్థిక భద్రత ప్రమాదంలో పడిందని, తమని కార్పొరేట్ చేతుల్లో పెట్టేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఈ చట్టాల వలన దేశంలో వ్యవసాయం, రైతుల భవిష్యత్తు అంధకారంలోకి వెళిపోయే అవకాశం ఉందని కృష్ణ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
"కాంట్రాక్ట్ ఫార్మింగ్ రైతులకు పెద్ద దెబ్బ. ఈ పద్ధతిలో బహుళజాతి కంపెనీలు ఒక గ్రామంలో లేదా ఒక ప్రాంతంలో భూములన్నిటిని కాంట్రాక్ట్ కింద తీసుకోవచ్చు. అందులో ఏ పంటలు పండించాలనేది ఏకపక్షంగా నిర్ణయించవచ్చు. ఇదే జరిగితే, అక్కడి రైతులు వెట్టి చాకిరీ చేస్తూ బాండెడ్ లేబర్‌గా మిగిలిపోతారు" అని కృష్ణ ప్రసాద్ తెలిపారు.
ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించాలని చూస్తోంది. ఈ రంగాన్ని కూడా అంబానీ-అదానీల చేతుల్లో పెట్టాలని ఆలోచిస్తోంది.
ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే కార్పొరేట్ కంపెనీలు ఉత్పత్తికి, అదనపు విలువను జోడిస్తాయి. ఆ లాభం వారి జేబుల్లోకి వెళుతుందే తప్ప సన్నకారు రైతులకు అందదు. బ్రాండెడ్ బాసుమతి బియ్యం మార్కెట్లోకి వస్తే దాని మీద వేసిన అదనపు ధర కార్పొరేట్ల జేబుల్లోకే వెళుతుందిగానీ రైతుకు పైసా లాభం రాదు.
రైతుకు కిలోకు రూ. 20-30 చొప్పున చెల్లిస్తారు. ఈ బియ్యాన్ని బ్రాండెడ్ కంపెనీలు మార్కెట్లోకి తీసుకొచ్చి రూ.200కు అమ్ముతాయి. లాభాలన్నీ కంపెనీకి చేరుతాయి. రైతు నష్టపోతాడు" అని కృష్ణ ప్రసాద్ వివరించారు.
అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ పద్ధతి ఇంతకుముందునుంచే ఉంది కానీ అది చాలా స్వల్ప స్థాయిలో ఉంది.

ఫొటో సోర్స్, EYESWIDEOPEN
కేరళ మోడల్ అన్నిటికన్నా ఉత్తమం
"కేరళలో ఒక 50-60 మంది రైతులు ఈ కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారుగానీ అధిక శాతం రైతులు ఈ చట్టాలను సమర్థిస్తున్నారని" కేరళకు చెందిన నారాయణ కుట్టి అనే రైతు తెలిపారు.
కేరళలో 82 శాతం రైతు సహకార సంస్థలున్నాయని, అక్కడి రైతులందరూ ఈ వ్యవస్థను ఇష్టపడతారు అని కుట్టి తెలిపారు.
కేరళ రాష్ట్ర ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం ‘కుడుంబశ్రీ’ పేరుతో ప్రారంభించిన సన్నకారు మహిళా రైతుల సహకార సంస్థ ఇందుకు ఒక మంచి ఉదాహరణ.
ఈ పథకం కింద సుమారు నాలుగు లక్షలమంది మహిళా వ్యవసాయదారులు ఉన్నారు. వీరందరినీ 14 జిల్లాల్లో 59,500 మందితో కూడిన చిన్న చిన్న గుంపులుగా విభజించారు. వీరంతా వరి, కూరగాయలు, పళ్లు పండిస్తారు. వీరు పండించే పంటలో అధిక భాగాన్ని, 4 నుంచీ 10 మంది సభ్యులు గల బృందం మార్కెట్లో లేదా ప్రభుత్వానికి విక్రయిస్తుంది.
"తమ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఫార్మింగ్ పద్ధతిలో కాకుండా సహకార సంస్థలు, కమ్యూనిటీ నెట్‌వర్క్‌ల ద్వారా సామూహిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందని, దీని వలన మంచి ఫలితాలు వస్తున్నాయని" కేరళ వ్యవసాయ మంత్రి సుశీల్ కుమార్ ఈ జూలైలో జరిగిన రాష్ట్ర వ్యవసాయ మంత్రుల సమావేశంలో తెలిపారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
రైతుల పట్ల సానుభూతా? రాజకీయాలా?
పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కొత్త చట్టాలను నిరసిస్తూ పంజాబ్ రైతులు మాత్రమే ఉద్యమాలు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని, వారి పార్టీ 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో మేమిప్పుడు తెచ్చిన కొత్త చట్టాల ప్రస్తావన ఉందని బీజేపీ అంటోంది.
"కేంద్ర వ్యవసాయ బిల్లును తిరస్కరిస్తూ పంజాబ్ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. అది రైతుల డిమాండ్లను పూర్తి చేస్తుంది. మరింకిప్పుడు ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు?" అని బీజేపీ ప్రశ్నిస్తోంది.
మహారాష్ట్ర, కేరళలకు చెందిన రైతులు దినేష్ కులకర్ణి, నారాయణ కుట్టి కూడా ఈ రైతుల ఉద్యమం వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని విశ్వసిస్తున్నారు.
అయితే, బీజేపీ, కాంగ్రెస్.. రెండు పార్టీలూ రాజకీయం చేస్తున్నాయని కృష్ణ ప్రసాద్ అంటున్నారు.
"మోదీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు అవే ప్రతిపాదనలను బీజేపీ ప్రభుత్వం ఆమోదిస్తే కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీని మాత్రమే విమర్శించి లాభం లేదు. 1991లోనే కాంగ్రెస్ వ్యవసాయరంగాన్ని ప్రైవేటీకరణ చెయ్యడం ప్రారంభించింది" అని కృష్ణ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు పెరిగాయా?
- తుపాన్లకు పేర్లను ఎవరు పెడతారు?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- GDP: ఆర్థిక సంక్షోభంలో భారతదేశం... 7.5 శాతం పడిపోయిన జీడీపీ
- GDP Meaning: జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం?
- నివర్ తుపాను తాకిడితో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తీవ్ర నష్టం
- కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరవేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏమిటి?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








