రైతుల ఛలో దిల్లీ: ఎలా వెళతారు? ఎక్కడ ధర్నా చేస్తారు?

సంస్కరణల పేరుతో కేంద్రం తెచ్చిన మూడు రైతు చట్టాలను వ్యవసాయదారులు వ్యతిరేకిస్తున్నారు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సంస్కరణల పేరుతో కేంద్రం తెచ్చిన మూడు రైతు చట్టాలను వ్యవసాయదారులు వ్యతిరేకిస్తున్నారు
    • రచయిత, ప్రవీణ్‌ సింగ్‌
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు చట్టాలకు నిరసనగా పంజాబ్, హరియాణ, ఉత్తర్‌ప్రదేశ్‌ రైతులు నవంబర్ 26- 27 తేదీలలో 'ఛలో దిల్లీ' పేరుతో రాజధాని నగరంలో ఆందోళనకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

ముందుగా నిర్ణయించిన ప్రకారమే నవంబర్‌ 26, 27 తేదీల్లో దిల్లీలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని, ఇందులో ఎలాంటి మార్పు లేదని అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) స్పష్టం చేసింది.

దిల్లీకి రాక ముందే పోలీసులు తమను అడ్డుకుంటారని రైతు సంఘాలు భావిస్తున్నాయి. అదే జరిగితే ఎక్కడ అడ్డకుంటే అక్కడే కూర్చుని నిరసన తెలపాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.

నిరసన తెలిపేందుకు దిల్లీకి బయలుదేరిన రైతులను హరియాణా పోలీసులు అరెస్టు చేస్తున్నారని 'స్వరాజ్‌ ఇండియా' పార్టీ రైతుల విభాగం 'జై కిసాన్ ఆందోళన్'‌ హరియాణ శాఖ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రాజీవ్ గోదారా బీబీసీతో అన్నారు.

నిరసన తెలపడానికి వేలాది ట్రాక్టర్లలో లక్షలమంది రైతులు దిల్లీకి వస్తారని అంచనా వేస్తున్నారు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నిరసన తెలపడానికి వేలాది ట్రాక్టర్లలో లక్షలమంది రైతులు దిల్లీకి వస్తారని అంచనా వేస్తున్నారు

రైతు సంఘాల నిర్ణయం

రైతులను రాష్ట్రం దాటి వెళ్లనివ్వవద్దని హరియాణా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని గోదారా ఆరోపించారు. “ రైతులను ఎక్కడ ఆపితే, అక్కడే కూర్చుని నిరసన తెలపాలని నిర్ణయించాం’’ అని ఆయన వెల్లడించారు.

పంజాబ్‌ నుంచి ఒకటిన్నర లేదా రెండు లక్షలమంది రైతులు దిల్లీకి వస్తారని, హరియాణ, యూపీ, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు దిల్లీకి వస్తారని గోదారా చెప్పారు.

పంజాబ్‌లోని ప్రతి జిల్లా నుంచి సుమారు 150 నుంచి 200 ట్రాక్టర్లలో దిల్లీకి బయలుదేరుతారని భారతీయ కిసాన్‌ యూనియన్ లఖోవాల్ వర్గం రాష్ట్ర కార్యదర్శి గుర్వీందర్ సింగ్‌ కుంకాలం చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చిన ఛలో దిల్లీ పిలుపును పోలీసులు అడ్డుకుంటున్నారు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చిన ఛలో దిల్లీ పిలుపును పోలీసులు అడ్డుకుంటున్నారు

హరియాణ –దిల్లీ సరిహద్దుల్లో..

“ పంజాబ్‌లోని చాలా జిల్లాల నుంచి రైతులు ఇప్పటికే దిల్లీకి బయలుదేరారు. హర్యానా, దిల్లీ సరిహద్దుల్లో ఎక్కడైనా రైతులను నిలిపేస్తే వారు అక్కడే నిరసన తెలుపుతారు’’ అని గుర్వీందర్‌ సింగ్‌ బీబీసీతో అన్నారు.

దిల్లీలో నిరసనకు ప్రభుత్వం, పోలీసులు అనుమతించలేదని గుర్వీందర్‌ సింగ్‌ వెల్లడించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్)కు అనుబంధంగా పని చేసే భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఈ ఆందోళనలో పాల్గొనడం లేదు.

“ దిల్లీలో జరపబోయే నిరసన ప్రదర్శన గురించి మాకు సమాచారం ఇవ్వలేదు. మేం ఇందులో పాల్గొనడం లేదు” అని భారతీయ కిసాన్‌ సింగ్‌ హరియాణ రాష్ట్రప్రధాన కార్యదర్శి వీరేంద్ర సింగ్‌ బడ్‌ఖల్సా బీబీసీతో అన్నారు.

అయినా బిల్లులపై రైతుల అభ్యంతరాలకు తాము మద్దతిస్తామని ఆయన అన్నారు.

రైతుల ఆందోళన

ఫొటో సోర్స్, ANI

పంజాబ్‌లో రైలు సర్వీసులకు అంతరాయం

"హరియాణాలో అనేకమంది రైతు నాయకులను అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి" అని వీరేంద్ర సింగ్ బడ్‌ఖల్సా చెప్పారు. ఈ చట్టాలకు నిరసనగా రెండు రాష్ట్రాలలో ఇప్పటికే అనేక ఆందోళనలు జరిగాయి.

కేంద్రం ప్రకటించిన చట్టాలను తమ ప్రభుత్వం అంగీకరించదని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రకటించినా రైతుల ఆగ్రహం ఆగలేదు. రైతులు రైల్వే ట్రాక్‌లపై నిరసనలు తెలపడంతో పలు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది.

దిల్లీలో భద్రత కట్టుదిట్టం

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ రైతులు పట్టుబట్టడం, ఆందోళనకు దిగడం సంచలనం రేపుతోంది. దిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వ బలగాలు తమ ఆందోళనను అణచి వేయడానికి సిద్ధంగా ఉన్నాయని రైతు సంఘాల నాయకులు అంటున్నారు.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వేలాది ట్రాక్టర్లు, వాహనాలలో రైతులు దిల్లీవైపుకు బయలుదేరారు. అనేక వాహనాలను ఆపుతున్నారని, ఆఖరికి రేషన్‌ను తీసుకెళ్లే ట్రక్కులను కూడా నిలిపేస్తున్నారని, నాయకులను రాత్రికి రాత్రే అరెస్టు చేశారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)