దళితులమని మమ్మల్ని హీనంగా చూస్తున్నారు: తెలంగాణలో సర్పంచి ఆవేదన

వీడియో క్యాప్షన్, 'నేను గ్రామానికి సర్పంచి, మా కుటుంబాన్ని బహిష్కరించారు'
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నిజామాబాద్ జిల్లా మెండోర మండలంలోని బుస్సాపూర్ గ్రామ సర్పంచిగా 2013లో మమత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ, ఇప్పుడు తన కుటుంబాన్ని గ్రామస్థులు వేలివేశారని ఆమె ఆరోపిస్తున్నారు.

"మా ఇంటికి పాలు సరఫరా చేయకూడదని, వేడుకలకు మమ్మల్ని పిలవొద్దని, కలవకూడదని, మాతో పాటు ప్రయాణించకూడదని గ్రామంలోని గురిడి కాపు సంఘం సభ్యులు నిర్ణయించారు" అని మమత అంటున్నారు.

బుస్సాపూర్ గ్రామంలోని 11 ఎకరాల భూమిలో దళిత కుటుంబాలు పశువులను మేపుకుంటున్నాయి.

కానీ ఈ భూమి తమదని గురిడి కాపు సంఘం సభ్యులు అంటున్నారు.

దళితుల నుంచి ఆ భూమిని తమ తాతలు కొనుగోలు చేశారని, కానీ దానికి సంబంధించిన పట్టాలు బదిలీ కాలేదని గురిడి కాపు సంఘం సభ్యులు చెబుతున్నారు.

‘‘ఈ భూమిని తమకు బదిలీ చేయాలంటూ నా భర్త మీద ఒత్తిడి తెస్తున్నారు" అని మమత తెలిపారు.

"నా భర్త మీద ఒత్తిడి తెచ్చి, తర్వాత మిగిలిన వారిని కూడా ఒప్పించాలని చూస్తున్నారు" అని అన్నారు.

మమత
ఫొటో క్యాప్షన్, 'దళితులమని మమ్మల్ని హీనంగా చూడటం చాలా బాధ కలిగిస్తోంది'- మమత

దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించారు.

దాంతో ముగ్గురు గురిడి కాపు సంఘ సభ్యులపై ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ అఫ్ అట్రాసిటీస్ చట్టం కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

అయితే, మమత చేస్తున్న బహిష్కరణ ఆరోపణల్లో నిజం లేదని ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి అన్నారు.

ఈ కేసుని విచారిస్తున్నామని పరిశీలన పూర్తయ్యాక ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఏసీపీ కె.శివకుమార్ చెప్పారు.

మమత

ఫొటో సోర్స్, MaMATHA

ఫొటో క్యాప్షన్, 2013 ఆగస్టులో గ్రామ సర్పంచిగా మమత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇలాంటివి కొత్తేం కాదు

ఇటువంటి సంఘటనలు గతంలోనూ పలు చోట్ల చోటు చేసుకున్నాయి.

నిజామాబాద్‌లోని అభంగపట్నంలో 2017 అక్టోబర్‌లో ఒక 'అగ్రకుల' నేత ఇద్దరు వ్యక్తుల్ని బురద నీటిలో దించి, కర్రతో కొడుతూ బెదిరిస్తున్న వీడియో సంచలనం సృష్టించింది.

అది జరిగి ఐదు నెలలు అవుతున్నప్పటికీ బాధితులైన రాజేశ్వర్, లక్ష్మణ్ కుటుంబాలు ఇంకా వివ‌క్ష‌ ఎదురుకుంటూనే ఉన్నాయి.

"మాకు ఇప్పటికీ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాం. పనుల కోసం ఎవరూ మమ్మల్ని పిలవట్లేదు. నా భార్య బీడీలు చుడితే వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే కాలం వెళ్లబుచ్చుతున్నాం" అని ఆవేదిన వ్యక్తం చేశారు రాజేశ్వర్.

వీడియో క్యాప్షన్, తెలంగాణలో దళిత యువకులపై దారుణం

ఇలాంటి పలు ఘటనల్లో భూముల వివాదమే కారణంగా కనపడుతుంది.

2015లో తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో 45 మాదిగ కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకుని బోయ సామాజిక వర్గానికి చెందినవారు స్మశాన వాటికగా మార్చారు.

జూన్ 2012లో ఆంధ్రప్రదేశ్‌లోని లక్ష్మీపేటలో దళితులు సాగు చేసుకుంటున్న 60 ఎకరాల భూమిపై ఆధిపత్యం కోసం కాపులు దాడి చేశారు. ఆ ఘటనలో ఐదుగురు దళితులు ప్రాణాలు కోల్పోయారు.

పెళ్లికి వచ్చాడని రూ.5,000 జరిమానా

2017 ఆగస్టులో వేములవాడ మండలానికి చెందిన సామ ఇందిరా రెడ్డి తనను రెడ్డి కులస్థులు సామాజిక బహిష్కరణ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆమె అల్లుడు గణేష్ మాట్లాడుతూ.. చంద్రయ్య అనే దళిత రైతుకు ఇందిరా రెడ్డి తన రెండు ఎకరాల భూమిని కౌలుకు ఇచ్చినప్పటి నుంచే ఈ సమస్య మొదలైందని చెప్పారు.

"ఇప్పటికీ మా అత్తయ్యని వేధిస్తున్నారు. మా ఇంట్లో వివాహానికి వచ్చారన్న కారణంతో మా బంధువుకి రూ. 5,000 జరిమానా విధించారు. ఒక దళితుడిని ఆదుకున్నందుకు ఇంత అవమానమా?" అని ప్రశ్నిస్తున్నారు గణేష్.

బుస్పాపూర్

'మార్పు అంత సులభం కాదు'

సామాజిక బహిష్కరణ అన్నది మన వ్యవస్థలో లోతుగా నాటుకుపోయి ఉన్న సమస్య. ఇందులో మార్పు రావటం అంత సులభం కాదు. సామాజిక వ్యవస్థలో మార్పు రానిదే పాలనా వ్యవస్థలో మార్పు వచ్చినా ఉపయోగం లేదని అంటున్నారు దళిత హక్కుల కోసం పోరాడే కంచె ఐల‌య్య వంటి కార్యకర్తలు.

ఇది కొత్త విషయం ఏమీ కాదు అంటూనే, ఒక దళితుడు న్యాయం కోసం చట్టాన్ని ఆశ్రయిస్తే అంటరానితనం మరింత పెరుగుతుందని బహుజన ప్రతిఘటన వేదిక కన్వీనర్ డా. సుజాత సూరేపల్లి అభిప్రాయపడుతున్నారు.

"అగ్ర కులాల వారిని, ప్రభుత్వాల‌ను కాపాడేందుకే పోలీస్ వ్యవస్థ‌ ఒక సాధనంగా మారింది. చేదు నిజం ఏమిటంటే ఒక దళితుడు చట్టాన్ని ఆశ్రయించినప్పుడు, అలాగే ఊరుకుంటే అలాంటి కేసులు పెరుగుతాయన్న ఆలోచనతో అతడిని బహిష్కరిస్తారు. అలాగే తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కూడా అతనితో ఉంటే తమకు వచ్చే పనులు కూడా పోయి అగ్ర కులాల నుంచి సమస్యలు ఎదురవుతాయన్న భయంతో వారూ బాధితులను దూరం పెట్టడం చాలా సంఘటనల్లో చూశాం" అని ఆమె వివరించారు.

ఇవి కూడా చూడండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.