దండి మార్చ్: గాంధీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో నడిచిన తెలుగు వ్యక్తి ఎవరు?

ఫొటో సోర్స్, Pramodkumar kapoor
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ తెలుగు
ఉప్పు తయారీపై బ్రిటిష్ ప్రభుత్వం పన్ను విధించడాన్ని నిరసిస్తూ ఇదే రోజున అంటే 1930 మార్చి 12న మహాత్మా గాంధీ 'దండి మార్చ్'కు పిలుపు నిచ్చారు. ఈ ఉద్యమం జరిగి 90 ఏళ్లు.
భారత స్వాతంత్ర ఉద్యమంలో దండి మార్చ్ కీలక ఘట్టం.
గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి దండి వరకు ర్యాలీగా వెళ్లి బ్రిటిష్ శాసనాలను ఉల్లంఘిస్తూ ఉప్పు తయారు చేయడమే ఈ ఉద్యమం ఉద్దేశం. అందుకే దీన్ని శాసనోల్లంఘన ఉద్యమంగానూ పిలుస్తారు.
గాంధీ పిలుపు మేరకు దేశమంతా వివిధ ప్రాంతాల్లో ఉద్యమకారులు ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు.
మరి ఈ ఉద్యమంలో తెలుగువారి పాత్ర ఏమిటి..? తెలుగు నాట ఈ ఉద్యమం ఎలాంటి ప్రభావం చూపించిందో తెలుసుకుందాం.
దండి మార్చ్‌లో మహాత్ముడితో పాటు 78 మంది అనుచరులు పాల్గొన్నారు. http://www.gandhiashramsevagram.org ప్రకారం ఆంధ్ర ప్రాంతం నుంచి దండి మార్చిలో గాంధీతో పాటు నడిచిన ఏకైక తెలుగు వ్యక్తి ఎర్నేని సుబ్రమణ్యం. తర్వాత కాలంలో ఆయన గాంధీ సిద్ధాంతాలతో కొమరవోలులో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు.
నెల్లూరులో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించిన దండు నారాయణరాజును నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో ఆయన అక్కడే మరణించారు.

ఫొటో సోర్స్, wikipedia
- ఉప్పు సత్యాగ్రహం సమయంలోనే 'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి ''వీర గంధము తెచ్చినారము వీరులెవ్వరొ తెల్పుడి'' అనే గేయకవితను రాశారు.
- మాక్సిం గోర్కీ రాసిన రష్యన్ నవల 'ది మదర్'ను 'అమ్మ' పేరుతో తెలుగులోకి అనువదించిన క్రొవ్విడి లింగరాజు ఈ ఉద్యమ సమయంలోనే దేశ ద్రోహం నేరంపై జైలుకెళ్లారు.
- బ్రహ్మాజోశ్యుల సుబ్రమణ్యం సీతానగర ఆశ్రమాన్ని స్థాపించారు. దీన్నే 'ఆంధ్రా దండి'గా పిలుస్తారు.
- ఉప్పు సత్యాగ్రహం సందర్భంలోనే కేంద్ర శాసన సభకు రామదాసు పంతులు, శాసన మండలి సభ్యత్వానికి స్వామి వెంకటాచలం రాజీనామాలు చేశారు.
- ఉప్పు చట్టాలను ఉల్లఘించి బులుసు సాంబమూర్తి, ఉన్నవ లక్ష్మీనారాయణ ( మాలపల్లి నవల రచయిత), ఖాసా సుబ్బారావు లాఠీ దెబ్బలు తిన్నారు.

ఫొటో సోర్స్, wikipedia
- టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసులోని తన నివాసం వేదవనంలో సత్యాగ్రహ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- విశాఖపట్నంలో తెన్నేటి విశ్వనాథం, మచిలీపట్నంలో అయ్యదేవర కాళేశ్వరరావు, రాయల సీమ పరిధిలో కల్లూరి సుబ్బారావు ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు.
- నెల్లూరులోని మైపాడు బీచ్‌లో బెజవాడ గోపాలరెడ్డి ఉప్పు తయారు చేసి ప్రజలకు అమ్మారు.
ఇవి కూడా చదవండి:
- ‘ట్రంప్‌కి ఆ ప్రమాదాలు తెలుసు’
- తమిళనాడు అడవిలో మంటలు.. చిక్కుకుపోయిన 50 మంది విద్యార్థులు
- మరణంతో మెదడు పోరాడుతుందా? చనిపోయే ముందు ఏం జరుగుతుంది?
- సోషల్ మీడియా: వైరల్‌గా మారిన మోదీ వీడియో!
- తెలంగాణ: మళ్లీ ‘మిలియన్ మార్చ్’ వేడి.. ఎందుకు?
- పుతిన్‌ను సవాల్ చేస్తున్న మహిళా జర్నలిస్టు!
- #గమ్యం: డిగ్రీలు, ధ్రువపత్రాలు లేకుండా సంపాదన అందించే 10 కెరీర్స్!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








