#గమ్యం: డిగ్రీలు లేకుండా ఇంటర్నెట్‌లో డబ్బు సంపాదించడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇంటర్నెట్ అనేది పెద్ద ప్రపంచం. రోజురోజుకీ విస్తరిస్తున్న ఇంటర్నెట్ ఇప్పుడు ఎన్నో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.
మరీ ముఖ్యంగా మొబైల్ ఇంటర్నెట్ వచ్చేశాక దీని పరిధి మరింత విస్తృతమైంది.
ఎన్నో మంచీ చెడులకు వేదికైన ఈ ఇంటర్నెట్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కల్పించే సాధనంగా మారింది.
పెద్ద పెద్ద చదువులు లేవని, పేరున్న సంస్థల్లో చదివిన అనుభవం లేదని, మంచిమంచి కోర్సులు పూర్తి చేసిన ధ్రువపత్రాలు లేవని దిగులు పడాల్సిన పనిలేదు.
అవేమీ లేకుండానే ఇంటర్నెట్ ఆధారితంగా పలు కెరీర్‌లు నిర్మించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో అవకాశాల గని.
ఈ అవకాశాల ప్రపంచంలో ఎలాంటి కెరీర్‌లు ఉన్నాయో careers360.comకి చెందిన కెరీర్ నిపుణులు ప్రభ 'బీబీసీ తెలుగు' పాఠకులకు వివరిస్తున్నారు.
ఇంటర్నెట్ ఆధారిత కెరీర్ అవకాశాలు
సెర్చి ఇవాల్యుయేటర్: గూగుల్ వంటి వెబ్ బ్రౌజర్లకు సేవలందించే ఉద్యోగం ఇది.
యూజర్లు సెర్చి ఇంజిన్‌లో నిర్దిష్ట పదాలు, వాక్యాలు ఉపయోగించి వెతికినప్పుడు కచ్చితంగా దానికి సంబంధించిన సమాచారమే చూపిస్తుందా లేదా.. ప్రాధాన్యం వంటివన్నీ నిత్యం సరిచూసే పని ఇది.
కంటెంట్ రైటర్: భాషతో సంబంధం లేకుండా మనకు వచ్చిన భాషలో, నచ్చిన రంగానికి సంబంధించిన కంటెంట్ సొంతంగా కానీ, ఇతర వెబ్‌సైట్లకు అందించడం కానీ చేయొచ్చు. రాసే విషయం, శైలి, కచ్చితత్వం వంటి ఆధారంగా డిమాండ్ ఉంటుంది.
ట్రాన్స్‌లేషన్ ఇంటర్‌ప్రిటేషన్: ఒక భాష నుంచి మరో భాషకు అనువాదం చేసే పని.
ఆన్‌లైన్ వేదికగా ఇలాంటి పని అప్పగించే సంస్థలున్నాయి.
వాటిలో నమోదు చేసుకుని ఏ భాష నుంచి ఏ భాషకు అనువాదం చేయగలం, ఎలాంటి అంశాలు.. అంటే సాహిత్యమా, వైద్యానికి సంబంధించిందా, న్యాయ శాస్ర్తానివా.. ఇలా ఏ రంగానికి సంబంధించిన పుస్తకాలు, పత్రాలు అనువాదం చేయగలమో వివరిస్తే అలాంటి అనువాద పనులు లభిస్తాయి.
ఒప్పందం చేసుకున్న ధర ప్రకారం చెల్లింపులుంటాయి. చక్కగా అనువాదం చేసేవారికి డిమాండ్ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
రీసెర్చి: అనేక సంస్థలు మార్కెట్ పరిస్థితులను కానీ, వినియోగదారులకు సంబంధించిన అంశాలను కానీ అధ్యయనం చేస్తాయి.
తమ వద్ద ఉన్న సమాచారాన్ని సరిచూసుకోవడం కూడా అందులో భాగం.
దీనికోసం వివిధ టూల్స్ ఉపయోగిస్తుంటారు. వీటికోసం వ్యక్తులను నియమించుకుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎస్‌ఈఓ కన్సల్టెంట్, అనలిస్ట్: సెర్చి ఇంజిన్ ఆప్టిమైజేషన్(ఎస్‌ఈఓ) అనేది బ్రౌజర్లకు సంబంధించింది.
ఇంటర్నెట్‌లో ఉన్న లక్షలాది వెబ్‌సైట్లలో మీరు పనిచేసే లేదా, మీరు సేవలందించే వెబ్‌సైట్‌లోని సమాచారం సెర్చిలో మొదట్లో వచ్చేలా చేయగలగడం ప్రధానం.
అందుకోసం ఆ సమాచారంలో ఉన్న అంశాలను, పదాలను విశ్లేషించుకుని యూజర్లు ఎలా సెర్చి చేస్తారన్నది కూడా అంచనా వేయగలగాలి. దీనికోసం సునిశిత పరిశీలన, ప్రాధాన్యాలు తెలియడం, ట్రెండ్ పసిగట్టడం వంటివన్నీ అవసరం.
బ్లాగింగ్: ఆసక్తి, అభిరుచిని బట్టి బ్లాగు రూపొందించుకుని అందులో రాయడం. వీక్షకులకు నచ్చేలా రాయడమే ఇందులో విజయ రహస్యం.
ఆకట్టుకునేలా రాస్తూ ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుంటే సొంతంగా ఆ బ్లాగులో ప్రకటనల ద్వారా ఆర్జించవచ్చు. లేదంటే ఇతర వెబ్‌సైట్లకు బ్లాగర్‌గా సేవలందించొచ్చు.
సోషల్ మీడియా కన్సల్టెంట్: సోషల్ మీడియాలో అప్‌డేటెడ్‌గా ఉండాలి. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లలో ఉన్న ఫీచర్లు అన్నిటినీ ఉపయోగించుకుని యూజర్లకు రీచవడమే ఇందులోని సూత్రం.
ఇందుకోసం అలాంటి సైట్లు ఎప్పటికప్పుడు చేసే మార్పులను కూడా వెంటవెంటనే తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా పనిచేయగలగాలి.
సంస్థలు, వ్యక్తులు, ప్రముఖులను దీని ద్వారా ప్రమోట్ చేయడం, మార్కెట్ చేయడం, ఇమేజ్ బిల్డ్ చేయడం, ఇమేజ్ ప్రొటెక్ట్ చేయడం వంటివన్నీ ఇందులోకి వస్తాయి.

ఫొటో సోర్స్, Anil Kumar
వెబ్‌సైట్ డిజైనర్, డెవలపర్: ప్రతి వెబ్‌సైట్‌కు ఒక డిజైనర్, డెవలపర్ ఉంటారు. ఆ సైట్ ఆకట్టుకునేలా కనిపించడం, యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం.. అందులోని అంశాలను, విభాగాలను సులభంగా యాక్సెస్ చేసుకునేలా సైట్‌ను రూపొందించడం కీలకం. ఈ పనిలో క్రియేటివిటీ చూపేవారికి డిమాండ్ ఉంటుంది.
వర్చువల్ అసిస్టెంట్: వయసుతో, చదువుతో అవసరం లేని కెరీర్ ఇది. సంస్థలు, వ్యక్తుల తరఫున పనిచేయడమే ఈ కెరీర్. చిన్నస్థాయిలో అయితే దీనికోసం ప్రత్యేకంగా ఆఫీస్ అనేది కూడా అవసరం ఉండదు.
కస్టమర్ సపోర్ట్, అపాయింటుమెంట్స్ మేనేజ్ చేయడం, ఫిర్యాదుల పరిష్కారం వంటి అనేక అంశాలకు సంబంధించి వర్చువల్ అసిస్టెంట్లు సేవలందిస్తారు.
డాటా జర్నలిస్ట్: భారత్‌లోని మీడియాలో ప్రత్యేకించి డాటా జర్నలిస్టు అన్న హోదా ఎక్కువగా కనిపించకపోయినా ప్రతి మీడియా సంస్థలోనూ ఇలాంటి పనిచేసేవారుంటారు.
ఏదైనా అంశానికి సంబంధించి సమాచారాన్ని ప్రోది చేయడం, దాన్ని అర్థవంతంగా ప్రజెంట్ చేయడం వీరి పని. వివిధ సోర్సుల నుంచి కచ్చితమైన డాటాను వేగంగా సేకరించడంలో నైపుణ్యం చూపితే రాణిస్తారు.
ఇవే కాకుండా డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ఆర్కిటెక్ట్ వంటి అనేక రకాల కెరీర్స్ ఇంటర్నెట్ ఆధారంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










